Friday, August 20, 2010

అందమె వ్వాఆ..నందం..

మనం ఎప్పుడైనా ఒక అందమైన వస్తువుని చూసినప్పుడో.. అందమైన దృశ్యాన్ని చూసినప్పుడో.. అందమైన అబ్బాయిని/అమ్మాయిని చూసినప్పుడో.. ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోతాం. అలా ఏదైనా అందంగా కనిపించినప్పుడు కనీసం ఒక్క క్షణమైనా చూడకుండా ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. అంతెందుకు, ఉన్నంతలో అందంగా కనబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందమంటే అంత ఇష్టం. ఆ అందానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాం అంటే అందంగా ఉంటే జీవతం అంతా ఆనందంగా ఉండిపోగలం అన్నంతగా (డవుటా..? ఈ పాట వినండి "అందమె ఆనందం.. ఆనందమె జీవిత మకరందం..") తలా తోక లేని ఈ ఉపోద్ఘాతం ఏంటా అని చూస్తున్నారా.? మరదే.. చెప్పేది calm గా వింటానంటేనే చెప్తాను. లేదంటే కచ్చే.. హహ్హ.. అదీ అలా రండి దారికి.
నేను డిగ్రీ చివరి సంవత్సరం లో ఉన్నప్పుడు అనుకుంటా.. నా ఒకానొక నేస్తం బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటే, నేను కూడా తోకలా తన వెంట వెళ్లాను. నేను ఒక చిన్న పల్లెటూరి నుండి రావటం వలన , హైదరాబాదు కి వచ్చి మూడు సంవత్సరాలు అయినా చదువు మీద(??) ఇతరత్రా విషయాల మీద ( అంటే చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్పడం, ఏదో కొంచెం సంగీతం పట్ల కూడా అవగాహన కలిగించుకుందాం అన్న సదుద్దేశంతో వయొలిన్ పాఠాలు నేర్చుకోవడం, తెలుగు నవలలు కథలు చదువుకోవడం లాంటివన్నమాట.) ధ్యాస పెట్టడం వలన అప్పటి వరకూ బ్యూటీ పార్లర్ ముందున్న మొదటి మెట్టు  మీద కూడా అడుగు పెట్టలేదు. కానీ నా దురదృష్టమో అదృష్టమో.. ఆరోజు.. అందమంటే ఎంత బాధో నాకు తెలిసి రావాల్సిన రోజు.. అలా నా నేస్తంతో బ్యూటీ పార్లర్ కి వెళ్లాను. సరే వెళ్లాను, కానీ ఎంచక్కా తన పని తను కానిస్తూ ఉంటే, ఒక మూల కూర్చుని చూస్తూ ఆనందించవచ్చు కదా. ఉహు.. అలాక్కాదు. నాకు కూడా ఫేషియల్ చేసెయ్యమని ఆర్డర్ ఇచ్చేశాను. "ఏ ఫేషియల్?" అన్నది ఆ పార్లర్ హెడ్ ప్రశ్న. నా నేస్తం మాత్రం ఏదో చెప్పేసింది. నాకు వినిపించలేదు. మరి తెలియదు అంటే పరువు పోతుంది కదా. అందుకనే చాలా తెలివిగా "ఏమేమి ఉన్నాయి?" అని నా బాణాన్ని సంధించాను. నార్మల్,******,గోల్డ్. అయ్యబాబోయ్.. ఇదేంటి?? చిత్రగుప్తుడు తప్పుల చిట్టా చదివినట్లు చదువుతుంది అని అనుకునేలోగా ఒక పేరు మాత్రం నన్నాకర్షించింది. ఫ్రూట్ ఫేషియల్. మళ్లీ ఎక్కడ మర్చిపోతానో అని ఠక్కున చెప్పేశా.. సరే పేరు చెప్పేశాం. మరి తరువాత సంగతి? మెళ్లో గొలుసు, చెవుల జూకాలు తీసెయ్యమని చెప్పింది. సరే పాపం అని తీసేశా. ఎంచక్కా ఒక పెద్ద ఈజీ చెయిర్ మీద కూర్చోబెట్టింది. జుట్టంతా పైకి కట్టేసింది. ఆహా ఎంత గొప్ప మర్యాద అనేస్కున్నాను మనసులో. ఇక మొదలు పెట్టింది ఫేషియల్ ప్రహసనం. నన్ను మాత్రం కళ్లు మూసుకో అని చెప్పి నాకు మొదటి సారి జరిగే ఆ మహత్కార్యాన్ని నేను చూస్కోకుండా చేసింది. పోనీలే పాపం అని ఈ విషయంలో కూడా కళ్లు మూసేస్కోని త్యాగం చేసేశాను. ఏదో నీళ్ల లాంటి ద్రావకంతో మొహమంతా కాటన్ తో క్లీన్ చేసింది. (దీన్నే Cleansing అంటారని నాకు తరువాత తెలిసింది..:) )  ఎంచక్కా తను అలా సుతారంగా కాటన్ తో తుడుస్తూ ఉంటే.. ఆహా నా మనసు ఎక్కడెక్కడికో ఎగిరిపోయింది. ఆ తరువాత ఏదో పదార్దం తో మసాజ్ చెయ్యడం మొదలెట్టింది. నాకు ఆ క్షణంలో "అనుభవించు రాజా.." పాట గుర్తు రావడం ఇప్పటికీ గుర్తుంది:) అలా అలా స్వర్గలోకపుటంచులదాకా వెళ్లాను. అదిగో అప్పుడే మసాజ్ చెయ్యడం ఆపేసి మళ్లీ కాటన్ తో తుడిచేసింది. మరేమో అప్పుడు నాకు చాలా కోపమొచ్చేసింది. ఎందుకంటారేమిటి..? అలా స్వర్గాన్ని ఆశ చూపించి చివరి నిమిషంలో ఇలా లెఫ్ట్ లెగ్ పట్టుకుని లాగెయ్యడం ఏమైనా బాగుందా..? అప్పుడు మొదలయింది నా మొహానికి ఏదో వేడిగా తగలడం. ఆ వేడి కొంచెం కొంచెం గా ఎక్కువ అవుతూ ఉంది. (కళ్లు మూస్కున్నాను కదా నాకు అక్కడ ఏం జరుగుతుంది అని తెలియదు. అది స్టీం అట. తరువాత తెలిసింది). బాబోయ్ అది చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. ఆపవే బాబూ అని మనసులోనే అభ్యర్ధిస్తూ నా ముఖ కవళికలతోనే ఆ బ్యూటీషియన్ కి  చెబుతూనే ఉన్నాను. అప్పుడే Koktail jiuce అనుకోని ఒక లీటరు ఆముదం తాగినట్లుగా పెట్టాను నా మొహం. అయినా అర్థం చేస్కోదే..!  బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది , కాస్త తప్పించవే ఆ వేడిని అనుకుని నా మొహాన్ని అటు ఇటు తిప్పడం మొదలెట్టాను. అప్పటికీ కరుణించదే..  అలా బరువుగా భారంగా మంటగా చాలా సుదీర్ఘ ఘడియలు గడిచిన పిదప, ఆ దేవుడు నా మొర ఆలకించి ఆ బ్యూటీషియన్ చెవిలో నా గోడును వేసినట్లున్నాడు. ఆపేసింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నానా. అంతలోనే మళ్లీ ఏమైందో.. దేనితోనో నా ముక్కుని గిల్లడం మొదలెట్టింది (removing black/whiteheads అట.). బాబోయ్.. ఈ సారి ఆముదం ఒక్కటే కాదు అన్ని రకాల నూనెలు, కూల్ అండ్ హాట్ డ్రింకులు ఇంకా ప్రపంచంలో ఎన్ని రకాల ద్రావకాలు ఉన్నాయో అన్నీ కలిపి కడుపులో పోసినట్లుగా పెట్టాను మొహం. కళ్లు మూసుకోవడం వల్ల ఆ పరికరం ఏంటో చూడలేకపోయాను కానీ, ఆ క్షణానికి మాత్రం మళ్లీ ఆ శివయ్యే నాకు శతృవులా కనిపించాడు, తన త్రిశూలాన్ని ఈ బ్యూటీషియన్ చేతికి ఇచ్చి. ముక్కంతా నొప్పి, మంట. ఎన్ని రకాల హావభావాలు ప్రదర్శించినా పట్టించుకోదే..! అదిగో.. సరిగ్గా అప్పుడే.. అప్పుడే అర్థమైంది. అసలు అందం కోసం ఎంత బాధ పడతామో.. అందంగా కనిపించడం కోసం ఎంత బాధ పడతామో.. నాకు తెలిసినంత వరకూ అందంగా ఉన్న తర్వాత కూడా ఎదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. అసలు అందమంటేనే బాధ అన్న విషయం అప్పుడే అర్థమైంది.. ఇక లాభం లేదని మనసులో బోల్డన్ని తిట్లు తిట్టేస్కున్నాను. ఓయీ పాపాత్మురాలా. దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట దుర్మదాంధురాలా... ఎంతో సున్నిత సుకుమారమైన ఈ యువరాణివారి ముక్కుని ఇవ్విధమ్ముగా హింసించెదవా..! రేపు సూర్యోదయం కల్లా నీ ముక్కు మీద వెయ్యి కాదు కాదు లక్ష black/whiteheads వచ్చి గంట సేపు నిన్ను ఇలాగే కూర్చోబెట్టి ఇదే త్రిశూలంతో నీ ముక్కుని మరో బ్యూటీషియన్ హింసించు గాక. హ్హ. అసలు నా ఈ తిట్లన్నీ వింటే నన్ను ఇంకో గంట అలాగే కూర్చోబెట్టేదేమో.. :( అసలే అందరికీ అందమంటే ప్రాణం. లక్ష blackheads రావాలి అని మొక్కుకున్నాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా..! అలా ఎంతో కష్టపడిన తరువాత ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అదృష్టం, ఈ సారి నా చేత ఇంకేమీ తాగించలేదు. మళ్లీ మసాజ్ మొదలు పెట్టింది. తెలుసు కదా, మళ్లీ స్వర్గలోకపుటంచుల దాకా వెళ్లొచ్చాను. ఆ తరువాత ఏదో ఫేస్ ప్యాక్ అని ఒక 20 నిమిషాలు కూర్చోబెట్టి ఫేషియల్ అన్న బృహత్కార్యాన్ని పూర్తి చేసింది.

ఆరోజు మాత్రం మంగమ్మ శపథం , భీష్మ ప్రతిఙ్ఞ లాంటివి ఎన్నెన్నో చేసేస్కున్నాను మళ్లీ బ్యూటీ పార్లర్ తలుపులు తట్టొద్దని (జుట్టు కత్తిరించుకోడానికి తప్ప). ఆ తరువాత ఈరోజు వరకూ వెళ్లలేదు ( ఒక రెండు సార్లు వెళ్లాను- ఫేషియల్ కే.. ;) హిహ్హి)
సో.. తోటి బ్లాగర్లారా..! అర్థం అయింది కదా, ఇక్కడ మీరు నన్ను కాక ఆ బ్యూటీషియన్ ని సపోర్ట్ చేస్తే, ఆ శాపం మీకు కూడా వర్తిస్తుంది. హహ్హహ్హా..
P.S.: టైటిల్ లేదా ఇంకే విషయంలోనైనా, ఏదైనా సలహా ఉంటే ఇటు పడేసి మీరు శాప విముక్తి పొందొచ్చు..:):)

Monday, August 9, 2010

నా పిచ్చి గీతలు..

అంటే.. నేను గీసిన బొమ్మలన్న మాట. ఇవి కూడా ఇప్పుడు గీసినవి కాదు లెండి. నా డిగ్రీ రోజుల్లో.. చెప్పాను కదా, నన్ను నేను కోల్పోయాను అని. ఈ విషయంలో కూడా..

ఎలా ఉంది.? ఇప్పుడు ఇంకో చిత్రం.. :))
చాలా బాగుంది  కదూ!! కానీ ఇక్కడో తిరకాసు ఉంది మరి. కింద చూడండి.
ఇంకా పూర్తవ్వలేదు.. :( ఎప్పుడో నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో మొదలు పెట్టాను. డిగ్రీ అయిపోయి 3 సంవత్సరాలు అయింది.. ఇంకా ఆచిత్రం అదే దశలో ఉంది.:( చూసినప్పుడల్లా బాధగా ఉంటుంది. పోనీ అలా అని దాన్ని పూర్తి చేద్దాం అంటే పెన్సిల్ రాదు. కష్టపడి పెన్సిల్ వచ్చినా చెయ్యి రాదు.పొరపాటున ఆ చెయ్యి గీసేస్తాను అని మారాం చేసినా, మనసు మాత్రం ఖచ్చితంగా రాదండీ.. ఎక్కడ ఆ చిత్రాన్ని పాడు చేసేస్తానో అని చచ్చేంత భయం. అందుకే దాన్ని పూర్తి చెయ్యాలంటే ధైర్యం రావట్లేదు :(

అందుకే అంటారేమో.. ఎంత, పులి గడ్డి తినడం మొదలెడితే మాత్రం,  కోతి కొబ్బరి చిప్ప తినడం మానేస్తుందా అని. (ఇక్కడ మీకొక చిన్న మనవి. దయచేసి, ఈ వాక్యం అర్థం కానీ, ఇక్కడ సందర్భానికి , ఈ వాక్యానికి సంబంధం కానీ నన్ను అడగొద్దు. అది దైవ రహస్యం...)

Monday, August 2, 2010

తిండి.. ' తిప్పలు '..

ఇంటి తలుపు తెరవగానే ఘుమఘుమలు.. ఇంట్లో పంచభక్ష్య పరవాన్నాలు.. సూప్ లు, సలాడ్లు, పళ్లు, స్వీట్లు ఇంకా తినదగిన ఎన్నో రకాల వంటకాలు... మీకు నోరు ఊరుతుంది కదూ!! కానీ ఇవన్నీ పడని వాళ్లు ఎవరైనా ఉంటారా..? (ఆరోగ్య రీత్యా తినకూడని వాళ్లు మినహాయింపు.). తినాల్సిన టైం అయితే చాలు, అబ్బా అర గంట ముందే కదా తిన్నది ( ఇక్కడ అర గంట అంటే ఓ నాలుగైదు లేదా ఆరు గంటలు వేసేస్కోండి.. ), మళ్లీ తినాలా అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటారా..? విందు భోజనాలకి వెళ్లినప్పుడు అక్కడ వాళ్లు పెట్టే రకరకాల వంటలను చూసి (నిజానికి చూడకుండానే) ఈ సారి ఏ సాకు చెప్పి తప్పించుకోవాలా అని తలకిందులుగా తపస్సు చేసినంత పని చేసేవాళ్లు ఉంటారని మీకు తెలుసా..? కడుపులో ఆకలి ఉంటుంది, చేతిలో కంచం, అందులో అన్నం with పప్పు, కూర మరియు పెరుగు కూడా భేషుగ్గా ఉంటాయి. కానీ, అతి కష్టం మీద ఆరు ముద్దలు పట్టించి ఏడో ముద్దకి ఆపసోపాలు పడే వాళ్లని చూశారా..? ఆ కంచం లో అప్పుడే ఒక నాలుగైదు కోళ్లు breakdance చేసి వెళ్లినట్లుగా ఉండటం చూశారా..?

అసలు ఏంటి ఇదంతా అని ఆలోచించకండి.. పైన అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక సమాధానం ఉంది. అవన్నీ నా గురించి ఉద్భవించిన ప్రశ్నలే.. ఇంకా చెప్పాలంటే అలా చేసేది నేనే.. హిహ్హీహ్హీ.. :) మరదే.. మరీ నన్నలా చూడకండి.. నేను ఇక బ్లాగడం మానేస్తాను మీరలా చూస్తే.
చిన్నప్పుడు మా అమ్మ ఒక కథ చెప్పింది. ఈ మానవ జన్మలని సృష్టించిన మొదట్లో.. శివుడు నంది కి చెప్పాడంట, "నువ్వు భూ మండలానికి వెళ్లి అక్కడ మనుషులు అనబడు ప్రాణులకి ఈ విధంగా చెప్పు : రోజూ తలస్నానం, వారానికి ఒకరోజు భోజనం" మరి మన నంది గారేమో, అన్ని లోకాలని చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా దాటుకుంటూ, అన్ని వింతలు విశేషాలని తన్మయత్వంతో చూసుకుంటూ  వచ్చి అసలు విషయాన్ని మర్చిపోయి, శివుడు చెప్పిన ఆ రెండు ముక్కల్నీ అటు ఇటు గా ఇటు అటు గా మార్చి చెప్పిందట. అంటే, వారానికి ఒకరోజు తలస్నానం మరియు ప్రతి రోజూ భోజనం.. (మరి రోజుకు మూడు సార్లు ఎందుకు తింటున్నాం అని మాత్రం నన్ను అడగకండేం..నాకు కూడా తెలియదు) అలా నా జీవితం తారు మారు అయ్యిందండీ..  ఆ మహాపరాధానికి గాను, నంది గారికి శివుడు గారు " ప్రతి రోజూ భోజనం అంటే ఎక్కడి నుండి వస్తుంది..? నువ్వెళ్లి పొలాల్ని దున్ని సాగు చెయ్యడంలో రైతన్నలకి సాయం చెయ్యి పో" అని శెలవిచ్చారట. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. కానీ నా గురించి ఎవ్వరూ పట్టించుకోరేం..?  రోజూ మూడు పూటలు తినడం అంటే ఎంత కష్టం మీరే చెప్పండి.. నాకు ఇంత అన్యాయం చేసిన ఆ శివుడు ( చేసింది నందే గానీ, శివుడి ఆఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదండీ.. అందుకని, ఆ మహాపరాధానికి కారకుడు ఆ శివయ్యే అని మొర పెట్టుకుంటున్నాను యువర్ ఆనర్..) పోనీలే పాపం రోజూ ఏం తింటుంది ఈ ఒక్క పూటకు తినకులే అమ్మా అని ఎవరి బుర్రలో అయినా బుద్ధి పుట్టించాడా అంటే అదీ లేదు. ఎంత సేపూ తిను అని అరిచే వాళ్లే గానీ ఈ రోజుకి వద్దులే అనే వాళ్లు ఒక్కళ్లు కూడా లేకపోవడంతో నా చిన్ని మనసు ఎం...తో... గాయపడి పోయి బయటకొచ్చిన రక్తం కాస్తా కన్నీళ్ల రూపంలో ఆ నలుగురినీ మారుస్తుందనుకుంటే.. అది కూడా నా అత్యాశే అయింది.:( ఎంతో సత్కారణం గల నా ఏడుపుని కించ పరిచి పగిలిన నా గుండె ని ముక్కలు ముక్కలు గా చేసేశారు.
అలా భారమైన నా గుండె కి ఎడారిలో ఒయాసిస్సు  లాగా.. చలికాలం లో వేణ్ణీళ్ల లాగా.. ఇంకా చెప్పాలంటే నడి రాతిరిలో టార్చి లైట్ లాగా.. నాకు ఒక నేస్తం దొరికింది.  అవి, నా నేస్తం నేను ఒకే హాస్టల్ ఒకే రూం లో ఆడుతూ పాడుతూ ఉండే రోజులు. చాలా విషయాల్లో మా అభిప్రాయాలు కలిసేవి. ముఖ్యంగా తిండి తినేటప్పుడు తిప్పలు పడే విషయంలో..అందరూ మా అన్యోన్యతను చూసి కుళ్లుకుని మమ్మల్ని తిట్టే వాళ్లు, అన్నం సరిగ్గా తినట్లేదన్న వంకతో.. అయితే మాత్రం, అంత చిన్న విషయం కూడా మాకు అర్థం కాకుండా ఎలా ఉంటుంది..? మేము మాత్రం మాకు ఇలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చినా ఎంత మంది మమ్మల్ని వారించినా.. అన్నం తినడం అనే కార్యక్రమాన్ని మినిమం గంటన్నర కూడా లేకుండా పూర్తి చెయ్యలేదెప్పుడూ.. అలా ఎంతో ఆనందంగా గడిచిపోయే రోజుల్లో ప్రశాంతంగా ఉన్న సముద్రంలో సునామీ వచ్చినట్లుగా నా జీవితం లో కూడా ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన నా జీవితంలో నాకు నచ్చని(అప్పుడు నచ్చని) ఎన్నో మార్పులను తెచ్చింది. ఇప్పుడు ఆ సంఘటన మీకు చెప్తాను. దయచేసి మీరు కన్నీరు కార్చొద్దు నాకోసం.
మరేమో నాకు ఇంకో నేస్తం ఉండేది. నాకు పూర్తి విరుద్ధమైన నేస్తం. అప్పట్లో ఎన్నో సార్లు అనుకునే వాళ్లం , అసలు మన ఇద్దరికీ ఎలా సఖ్యత కుదిరిందబ్బా అని.. కానీ ఇది కూడా శివయ్య పనే అని తర్వాత తెలిసింది. నన్ను లావు చెయ్యడమే తన జీవిత పరమావధి గా పెద్ద కంకణం కట్టేస్కుని వాళ్ల ఇంట్లోనే ఉండమని చెప్పేసింది. అంటే నాకు అప్పటికి ఆ కంకణం సంగతి సరిగ్గా తెలియక నేను కూడా చాలా ఆనంద పడి పోయి వెంటనే పెట్టె బేడా సర్దుకుని వెళ్లిపోయాను.  చూస్తే ఏముంది, ఆంటీ నర్సు, అంకుల్ నర్సెస్ కో-ఆర్డినేటర్.. అంతా ఆరోగ్య మయం.. అది తిను , ఇది తిను.. అప్పుడు అర్థం అయింది, కంకణం నా నేస్తం మాత్రమే కట్టుకోలేదు, ఆంటీ, అంకుల్ కూడా చాలా బలంగా కట్టేస్కున్నారని. ఇంకేముందీ, వాళ్లందరి బలమైన కంకణ బలం ముందు నా బలహీనమైన్ సంకల్ప బలం చాలా చిన్నదైపోయింది. అంతే కాదు చాలా చాలా దారుణంగా ఓడిపోయింది..:(  ఆ కంకణాలను చూసి మా అమ్మ నాన్న మాత్రం ఎంతో సంతోషపడిపోయారు. నేను మాత్రం అలా ఓడిపోయిన బాధతో అన్నీ తినేస్తూ కాలం గడిపేశాను. అలా నన్ను మార్చే క్రమంలో ఒకరోజు జరిగిన చిన్న సంఘటన ఇంకా నా మదిలో పదిలంగా ఉంది. ఒకరోజు రాత్రి నేను అన్నం తినకుండా నిద్ర పోతూ ఉంటే, ఆంటీ వచ్చి లెగమ్మా కొంచెం అన్నం తిని పడుకో అని బ్రతిమిలాడుతూ ఉన్నారు. నేనేమో ఊర్మిళా దేవి తోబుట్టువులా నిద్రపోతూనే ఉన్నాను. పాపం పిలిచీ పిలిచీ విసిగిపోయిన ఆంటీ "నేను నా కూతురిని కూడా ఎప్పుడూ ఇంతగా బ్రతిమిలాడలేదు. లేమ్మా.. తిని పడుకో" అన్నారు. అంతే, చటుక్కున లేసి తినేసి పడుకున్నాను.:) 

ఆ తర్వాత నా డిగ్రీ అయిపోవడం, ఉద్యోగం వచ్చేయడం, ఇల్లు మారిపోవడం చక చకా జరిగి పోయాయి. కానీ ఇప్పటికీ కలుస్తూ ఉంటాను ఆంటీ, అంకుల్ ని. ఎప్పుడు ఫోన్ చేసినా ఒకటే ప్రశ్న, ఎమైనా లావు అయ్యావా అని. కలిసినప్పుడు మాత్రం, ఇక నువ్వు లావు అవ్వవులే అన్న నమ్మకమైన చూపు.:(  ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తూ ఉంటుంది. కానీ, నిజానికి ఇప్పుడు నేను చాలా health conscious అయ్యాను అంటే అది మాత్రం ఆంటీ, అంకుల్ వల్లనే.. నేస్తం..నాకు అటువంటి మంచి ఆంటీ, అంకుల్ ని ఇచ్చినందుకు నీకు నా ధన్యవాదాలు.:)