Tuesday, January 25, 2011

నా పేరు అపర్ణ కాదు..

విశాలమైన, అన్ని వసతులు కలిగిన తరగతి గది (హైలీ సోఫిస్టికేటెడ్ ని ఎలా తెనుగీకరించాలి..?) అంటే, రెండు ప్రొజెక్టర్లు, రెండు పెద్ద పెద్ద స్క్రీన్లు, మంచి లైటింగ్ సిస్టం (నిద్ర పోడానికి అనువుగా), ఒక్కో వరుస ఒక్కో మెట్టుపై ఉండేలా ఫిక్స్డ్ టేబుల్స్ .. చెయిర్స్.. ఇంచు మించుగా మంచి సినిమా హాల్‌లో లాగా. ఇక ఏ.సి. గురించి వేరేగా చేప్పేదేముంది..?

ఆదివారం, మధ్యాహ్నం భోజనం తరువాత సెషన్. క్లాస్‌లోకి రాగానే అందరి పేర్లు, వివరాలు అడిగి తెలుసుకుని ఏదో టాపిక్ చెప్పడం మొదలెట్టారు, సాధారణంగా అర్థ గంట క్లాస్‌కి ప్రెపేర్ అయి వచ్చి దాన్నే రెండు గంటలు చెప్పడానికి ప్రయత్నించే ఆ ప్రొఫెసర్ (ఈయన గురించి మీకు బోలెడన్ని చాడీలు చెప్పాలి.) అలా జూం చేస్తే పై నుండి (అంటే చివరి నుండి) రెండో వరుసలో కూర్చున్న ఒక అమ్మాయి, కుర్చున్నట్లుగా నటిస్తూ నిద్రిస్తున్న అమ్మాయి. నిద్రల యందు తరగతి గదిలో నిద్ర వేరయా అన్నట్లుగా, కలల లోకంలో అలా అలా తేలిపోతూ ఉంది.

మధ్యలో ఎవరో అపర్ణా అని పిలిచినట్లుగా అనిపించి చప్పున కళ్లు తెరిచి చూసింది. ఎవరా ఆ నిద్ర పోయేది అని చూస్తున్నారా...? హిహ్హిహ్హి అది నేనే.. అప్పటి వరకూ బాగా నిద్రలో ఉన్నానేమో, అసలు ఆ పిలుపు కలలోనా ఇలలోనా అన్నది అర్థం కాలేదు;) అలా ప్రొఫెసర్ పిలిస్తే పలకనప్పుడు కనీసం పక్క జనాలైనా మన వంక చూస్తారు కదా అని అటు పక్క ఇటు పక్క కింద పైనా అన్నీ దిక్కులూ చూసాను. ఎవరూ నావైపు చూడటం లేదు. పోనీ మన నిద్ర సంగతి తెలిసి పోయి పిలిచారేమో ఆయన అనుకుంటే, అసలు ఏ మాత్రం కనిపించడానికి అవకాశం లేకుండా చాలా పకడ్బందీ గా పడుకున్నానన్న విషయం గుర్తొచ్చి నా నిద్రాత్మ కసిరింది.

ఇదంతా భ్రమే అని ఘాట్టిగా ఫిక్స్ అయిపోయి(ఈ మధ్య భ్రమలు ఎక్కువైపోయాయిలే) మళ్లీ కలల లోకం లోకి పారిపోదామా అనుకునేంతలో మళ్లీ అదే స్వరం.."Is there anybody named Aparna" అంటూ.. బాబోయ్.. అప్పుడర్థమయింది. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఒక సబ్జెక్ట్ చెప్పి మళ్లీ ఇప్పుడు వచ్చారు మా క్లాస్‌కి ఆ ప్రొఫెసర్. ఎనభై మందిలో నా పేరు+నేను గుర్తుండడం అన్నది నిజంగా కష్టం (బోల్డంత చదివేసి, చక చకా సమాధానాలు చెబితే తప్ప) కాబట్టి నేనే అపర్ణ అన్న విషయం ఆయనకి తెలియదు. ఒక అర్థ గంట ముందే చెప్పాము అందరి పేర్లు కానీ, అంత మందిలో నేను ఏం పేరు చెప్పానో కూడా గుర్తుండడం కష్టమే ఆయనకి.

కాబట్టి ఇప్పుడు తెలిసొచ్చిన విషయమేమనగా, ఆయనకి నేనే అపర్ణ అన్న విషయమే గుర్తు లేదు, ఇంక నేను పడుకున్నాను అన్న విషయం ఎలా తెలుస్తుంది..? అసలు అక్కడ ఒక వ్యక్తి కుర్చున్నట్లు ఆయనకి కింద నుండి కనిపించదు గాక కనిపించదు. అంత బాగా సెట్ చేసుకున్నాను మరి మన ప్లేస్‌ని;)  ఫాస్ట్ ఫాస్ట్ గా ఇవన్నీ ఆలోచించుకునే లోపే మరో సారి వినిపించింది.."So there is no Aparna in this class, is it? "  అని.. ఇక నా బుర్ర పాదరసం లా పని చేసింది. మొదటి రెండు సార్లు పలకకుండా మూడో సారి పలికెతే.. హమ్మ బాబోయ్.. తెలిసిపోతుంది. పైగా ఆయన ఏం టాపిక్ చెబుతున్నారో కూడా తెలీదు. అందులో ఏమైనా అడిగి, మన తెల్ల మొహం సమాధానంగా కనిపిస్తే.. ఇక నా తలని, మొహాన్ని ఎక్కడ పెట్టుకునేదీ..? ఎందుకైనా మంచిదని పక్కన అబ్బాయిని అడిగాను."Is he calling me..?" "yes, he is putting some questions to everybody. don't worry, he didn't realise that you are here" అని చెప్పాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చేసుకున్నాను.కానీ, అంత మంచి నిద్ర దూరంగా వెళ్లి ఆకాశంలో కూర్చుంది :( సరేలే ఏదో ఒకటి వినడానికి ప్రయత్నిస్తున్నాను.

ఏమైందో మాస్టారుకి, ఉన్నట్టుండి లాస్ట్‌కి వచ్చారు. అక్కడ ppt లో రాసింది నోట్ చేసుకోండి అని అందరి దగ్గరా ఆగి మరీ చెబుతున్నారు. ముందే చెప్పాను కదా, అర్థ గంట చెప్పాల్సిన దాన్ని రెండు గంటలు చెప్పాలంటే ఇలాంటి మార్గాలు తప్పనిసరి. అప్పుడు భయం మొదలయింది. కొంపతీసి నా దగ్గరికి వచ్చి నీ పేరు అపర్ణే కదూ అని అడుగుతారేమో అని. "చి చి నా పేరు అపర్ణ కాదు, అర్చన" చెప్పేద్దాం అని డిసైడ్ అయిపోయాను;) కానీ నా చేత ఒక అబద్దం ఆడించకుండా బ్రతికించిన ప్రొఫెసర్ గారూ.. ధన్యవాదాలు:)))

నాకు వచ్చిన ఒక ఫన్నీ S.M.S.
If all the Musicians of this world join together and make a sweet Melody to Facilitate Sleep. They still can't win against our lecturers and class books :)

Tuesday, January 18, 2011

కొవ్వు దాతా సుఖీభవ..!!

ఇంకేంటి..? టైటిల్ చూసాక అర్థం అయిపోయింది కదా. రండి, వరుసలో నిలబడండి. అదిగో ఎవరో లైన్ తప్పుతున్నారక్కడ.. అద్గదీ అలా రండి క్యూలో.. హ్మ్.. అన్నల్లారా అక్కల్లారా.. ఇందు మూలంగా యావన్మంది బ్లాగ్‌మహాజనులకు తెలియజేయునదేమనగా.., మీరందరూ తమ తమ బ్లడ్ గ్రూప్ ఏది అని కూడా ఆలోచించకుండా వీలైనంత మంది తమకు వీలైనంత కొవ్వుని దానం చేయ ప్రార్థన. బదులుగా, కాసింత కృతఙ్ఞత, మరి కాస్త ఆప్యాయత తీసుకెళ్ల మనవి. అంతే కాకుండా నా సంకల్పంతో మొదలైన ఈ కార్యక్రమం సజావుగా సాగితే " దానాల్లో కెల్లా కొవ్వు దానం మహాదానం" అని స్లోగన్ మన జాతీయ స్లోగన్ గా ఆమోదింపజేసి, దానికి తగిన హోదాని కల్పించేలా చేస్తానని మనవి చేసుకుంటున్నాను.

ఆహా.. "కొవ్వుదానం" ఎంత గొప్ప పదం. వినడానికే చాలా హాయిగా ఉంది. మరీ నన్ను విచిత్రంగా చూడకండి. కాస్త కొవ్వు పెంచుకోడానికి నేను పడే అష్ట కష్టాలూ చూస్తే మీకే అర్థమవుతుంది నేనెంత సముచితంగా ఆలోచిస్తున్నానో. మరే.. రోజుకొక ఉడకబెట్టిన కోడి గు డ్డూ, ఆలుగ డ్డా, పాలు, పళ్లు, ఇవి కాక మామూలుగా తీసుకునే మూడు పూట్ల భోజనం, వాటి మధ్యలో అలా అలా కడుపులో కాస్త అవీ ఇవీ పడేస్తూ.. ఇంకా వీలైనప్పుడు మొలకలు కూడా..

అయినా నాకు తెలియక అడుగుతాను.. అసలు కష్టం అంటే మీకు తెలుసా.. రోజుకి నాలుగు పూటలు తిన్నా అసలు తిన్నదంతా ఎటు పోతుందో అర్థం కాక వెర్రి మొహం వేసుకోవడం ఎలా ఉంటుందో మీకు తెలుసా.. లావు అవ్వాలి లావు అవ్వాలి అని కంకణం కట్టుకుంటున్న సమయంలో, కనిపించిన వాళ్లంతా ఏంటమ్మా డైటింగ్ చేస్తున్నావా అని అడిగితే ఆ క్షణం ఎవరిని దేనికి తిట్టుకోవాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా.. మామూలుగా సలహాలు తీసుకోడం అలవాటు లేకపోయినా ఈ విషయంలో మాత్రం కనిపించిన వాళ్లు నోటికొచ్చిన సలహా ఉచితంగా సహృదయంతో పారేసినా, ఏమోలే ఏ పుట్టలో ఏ పాముందో అని ప్రతి సలహానీ ఏరుకుంటున్న క్షణం ఎలా ఉంటుందో తెలుసా.. అసలు ఇదంతా కాదు. అలా దొరికిన ప్రతి సలహానీ ఫాలో అయిపోయి, దొరికిన చెత్త అంతా తిని, అయినా లాభం లేక, దొరికిన సలహా తప్పో, ఇచ్చిన మనిషి తప్పో, తిన్న శరీరం తప్పో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా..

హ్మ్.. అదీ నా బాధ. అసలు ఈ "తినడం" అనే పని ఉంది చూసారూ.. అబ్బో.. చాలా కష్టం సుమా.. నాకైతే ఒక మహత్తరమైన ఆలోచన ఉండేది నేను హాస్టల్‌లో చదివే రోజుల్లో.. ఇలా కష్టపడి రోజుకి రెండు రకాల కూరలు, అన్నం, అల్పాహారం, స్నాక్స్.. ఇలా ఇన్ని తినే బదులు, మన కడుపుకే ఒక తలుపు పెట్టేసుకుని, మనకి అవసరమైనప్పుడు అలా కాస్త భోజనం, తలుపు తీసేసి అందులో వేసేసి... భలే ఉంటుంది కదా.. జీర్ణం ఎలా అవుతుంది లాంటి ప్రశ్నలు అడగొద్దు. అప్పట్లో నాకున్న బ్రెయిన్‌కి ఇది చాలా గొప్ప ఆలోచన.. మనకి ఎప్పుడైనా రుచికరంగా తినాలి అనిపించినప్పుడు అంటే హాస్టల్ నుండి ఇంటికెళ్లినప్పుడన్న మాట, ఎంచక్కా మామూలు పద్ధతిలో తినగలిగేలాగా .

ఇది తిండి విషయంలో ఉన్న మహత్తరమైన ఆలోచన అయితే ఫ్యాట్ విషయంలో ఇంకో బృహత్తరమైన ఆలోచన ఉంది. "కొవ్వుదాన శిబిరం.. కొన్ని టెంట్లు.. వందల కొద్దీ కొవ్వు డోనార్లు.. నాలాంటి కొన్ని అభాగ్యపు యాక్సెప్టర్లు..ఒక వైపు డోనార్ బెడ్డు, మరో వైపు యాక్సెప్టరు బెడ్డు. మధ్యలో ఒక ఫ్యాట్ కంటెయినర్, దాన్ని తగిలించడానికి ఒక హోల్డర్. డోనార్ నుండి యాక్సెప్టర్ కి కొవ్వు రవాణా.." అసలా చిత్రం ఊహించుకుంటుంటేనే మనసు ఉర్రూతలూగుతూ ఉంది. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ, నాకు దొరికే స్నేహితులంతా కూడా నాలాగే ఉంటారు, ఎవరో ఒకరిద్దరు తప్ప; చూసి చూసి స్నేహం చేస్తున్నానేమో అని నాకే అనుమానం వచ్చేలాగా..హ్మ్.. ఏం చేస్తాం.. అంతా దైవలీల మరి. పెళ్లిళ్లు స్వర్గాల్లో నిశ్చయమయినట్లుగా స్నేహాలు కూడా అక్కడే రూపు దిద్దుకుంటాయేమో. ఒక్క నేస్తం మాత్రం ఉంటుంది కాస్త లావుగా. నాకు కాస్త కొవ్వుని ప్రసాదించి పుణ్యం కట్టుకోవే అంటే.."అబ్బ చా.. ఎంత కష్ట పడితే ఇంత అయ్యాను. అప్పణంగా ఇచ్చెయ్యమంటే ఎలా ఇస్తాను..?" అంటుంది..

ఓహ్.. ఏదేదో చెప్పేస్తూ విషయాన్ని పక్క దారి పట్టించేస్తున్నాను. అసలు విషయం ఏమిటంటే, మీలో ఎవరెవరు కొవ్వు దానానికి సిద్ధంగా ఉన్నారు చేతులెత్తండి.. ముఖ్య గమనిక, ఉన్న రెండు చేతులూ కాళ్లు కూడా ఎత్తినా సరే, ఒక్క తలకి ఒకటే ఓటు.. హిహ్హిహ్హీ.. అక్కడెవరో రెండు చేతులు ఎత్తేస్తున్నారు మరి..