Thursday, March 10, 2011

అంతర్మధనం.. శృతి మనోగతం...

వసంతం కన్నా హేమంతాన్ని ఎక్కువగా ఇష్టపడే ఒక మామూలు తెలుగమ్మాయిని. దేవుడి కన్నా ఎక్కువగా మనుషుల్ని, మానవత్వాన్ని నమ్మే ఆడపిల్లని. సముద్ర గర్జనలన్నా, సెలయేటి గలగలలన్నా, అరవిరిసిన విరజాజులన్నా, చలి తెరల్లో మంచు పువ్వులన్నా, మొత్తంగా చాలా బ్యాలన్స్డ్‌గా సాగిపోయే ఈ సృష్టి అన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా నలుగురిలో ఎంత కలివిడిగా ఉన్నా నాలోకంలో నేనుండడం చాలా చాలా ఇష్టం .

అలాంటి నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి ఒక బంధంలో అడుగు పెట్టి జీవితంలోని కొత్త రంగుల్ని చూస్తానని. మరీ సినిమాల్లో చూపించినట్లుగా మనసు జారిపోయి, పువ్వులు రాలిపోయి, ఉరుములు మెరుపులు రావడం జరగలేదు కానీ తను ప్రపోజ్ చేసిన రోజు మాత్రం ఇతనే నా సోల్‌మేట్ అనిపించింది. చాలా సూటిగా అడిగాడు, "నన్ను పెళ్లి చేసుకుంటావా..? నువ్వు లేకపోతే బ్రతకలేను, చనిపోతాను ఇలా చెప్పడం నాకు రాదు. కానీ నువ్వుంటే నా జీవితం చాలా బాగుంటుంది. అంతే సంతోషంగా నిన్ను చూసుకోగలనన్న నమ్మకం నాకుంది. నిర్ణయం నీదే." మనసులో ఇష్టమైతే ఉంది కానీ, ఎందుకో మెదడు సందేహించింది. అందులోనూ అమ్మా నాన్నకి చెప్పకుండా ఇంత పెద్ద విషయంలో నేనొక్కదన్నే నిర్ణయం తీస్కోలేను. ఆదికి అదే విషయం చెప్పాను. "నాకు నువ్వేంటో తెలుసు. కానీ, అమ్మా నాన్నకి విషయం చెబుతాను. వాళ్లకి అభ్యంతరం లేకపోతేనే మన పెళ్లి." సరే అని సంతోషంగానే అన్నాడు కానీ, తన మనసులోని ఆందోళన బయట పడిపోతూనే ఉంది.

అమ్మా నాన్నతో మా విషయం మాట్లాడడానికి ఊరు వెళ్తున్న రోజు, వాళ్లు ఒప్పుకుంటారో లేదో అన్న భయంతో చాలా ఏడ్చాడు ఆది. ఏమీ చెప్పలేని సందిగ్ధంలో నేనుండగా, "అయినా ఏమీ కాదులే. వాళ్లు ఒప్పుకుంటారు. ఇంక వరస్ట్ కేస్‌లో ఒప్పుకోకపోతే, ఆది అండ్ శృతి విల్ బి గుడ్ ఫ్రెండ్స్" ఒకవైపు ఈ మాటలు చెబుతూనే ఏడుస్తున్నాడు. ఆది ఆలోచనలతోనే ఇంటికి వెళ్లాను.

నేను మా అమ్మా నాన్నలకి పుట్టడం నాకు ఎంత అదృష్టమో చెప్పలేను. అసలు విషయాన్ని చెప్పలేక మధన పడుతుంటే, అమ్మ పసిగట్టి నాన్న దగ్గరికి తీస్కెళ్లింది. "నాన్నా, చిన్నప్పటి నుండి మీరిద్దరూ నన్నెలా పెంచారో నాకు తెలుసు. నేను అంతే ఉన్నతంగా పెరిగానని అనుకుంటున్నాను. నాకు ఒక ప్రపోజల్ వచ్చింది. నేను తనకి ఏమీ చెప్పలేదు. మీరు ఒకసారి మాట్లాడగలితే బాగుంటుంది తనతో" ఎలా చెప్పగలిగానో, అసలు అర్థవంతంగా చెప్పానో లేదో కూడా తెలీదు. గుండెలో భయం, గొంతులో తడబాటు, కళ్లల్లో బెరుకు. అమ్మలో కాస్త కంగారు కనిపించింది కానీ, నాన్న మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. "నేను ఒక్కటే చెప్పగలను శృతి, నీ నిర్ణయం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నీకు అతను నచ్చాడా..?" ఉన్నట్టుండి ఏడుపొచ్చేసింది. అదే స్వరంతో చెప్పాను. "ఆది చాలా మంచి అబ్బాయి నాన్న. కానీ నువ్వొకసారి మాట్లాడి నిర్ణయం తీసుకో." అమ్మ మాత్రం కాస్త భయపడి అడిగింది, "కులం ఏంటి?" అని. నా సమాధానం పెదవి దాటేలోగానే "ఇష్టపడిన తరువాత కులాల్ని చూస్తే ఏమొస్తుంది..?" తిరిగి నాన్న ప్రశ్న అమ్మకి. ఆ క్షణంలో మాత్రం అనిపించింది, వాళ్లకి నేను పుట్టడం నా అదృష్టం కాదు, నాకు వాళ్లు ఈ జన్మలో దొరికిన అరుదైన వరం అని.

అనుకున్నట్లుగానే ఒకరోజు ఆది వాళ్ల అక్క, అర్చన గారింటికి వెళ్లాము, అమ్మా, నాన్న, పెద్దమ్మ, పెదనాన్న, నేను. మొదట కాస్త భయమేసింది కానీ, ఆది వాళ్ల అక్కతో మాట్లాడిన తరువాత మనసు కాస్త స్థిమిత పడింది. అర్చన గారు నాకు చాలా నచ్చారు. కాబోయే అత్తమ్మతో మాత్రం అంతగా మాట్లాడలేదు ఆరోజు. అమ్మతో మాట్లాడుతూ ఉంటే విన్నాను."నాకు నా కూతురు ఎంతో కోడలు అంతే. అర్చనకి కూడా అక్క చెల్లెళ్లు లేరు. పిల్లలందరూ సంతోషంగా ఉండడమే కదా కావల్సింది. దేవుడు చల్లగా చూడాలని కోరుకుందాం" ఎందుకో అత్తమ్మ మాటలతో అమ్మ కూడా టెన్షన్ ఫ్రీగా అనిపించింది. మొత్తానికి పెళ్లి అయిపోయింది.

కొత్తలో ఎవరికైనా ఇలాగే అనిపిస్తుందేమో తెలీదు కానీ, నాకు మాత్రం నా జీవితం పూల పాన్పు లాగా అనిపించింది. నన్ను ఇష్టపడి ప్రేమగా చూసుకునే భర్త, మా సంతోషమే కోరుకునే అత్తయ్య, మంచికి చెడుకి మాలో కలిసిపోయే అర్చన వదిన. ఆది వాళ్ల అమ్మని, అత్తయ్య అని కాకుండా అత్తమ్మ అని పిలవడం కూడా నాకు భలే నచ్చుతుంది.
అత్తయ్యలో అమ్మని, అత్తయ్యని అమ్మలా చూసుకుంటున్న భావన కలుగుతుంది నాకు. పెళ్లి తరువాత ఆది, నేను ఎక్కడికీ వెళ్లలేదని వదిన "ఎక్కడికైనా వెళ్లొచ్చు కదా ఆది, ఈరోజులు మళ్లీ రావు" అన్నది. కానీ, మా రొటీన్ జీవితాల్లో హనీమూన్ ఎక్కడ కుదురుతుంది..? అనుకోకుండా ఆది వాళ్ల కొలీగ్స్‌తో చిన్న ట్రిప్‌కి వెళ్లాము. నిజంగా నా జీవితంలో మరచిపోలేని రోజులు. అంత బాగా ఎంజాయ్ చేశాం. ఇన్ని రోజులకన్నా ఆది నాకు కొత్తగా కనిపించాడు వాళ్ల కొలీగ్స్‌తో ఉన్నప్పుడు. భలే నచ్చాడు. వాళ్లంతా కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. అద్భుతం కన్నా పెద్ద పదం ఏదైనా ఉంటే వాడాలని ఉంది ఆ ట్రిప్ గురించి.

'జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు, కాలానికి కన్ను కుట్టడం' ఇలాంటి వైరాగ్య/వేదాంత వాక్యాలకి నాకు ఇంతకు ముందు అర్థం తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఇంకా బాగా చెప్పాలంటే ట్రిప్ నుండి వచ్చిన తరువాత తెలియడం మొదలు పెట్టింది మా అత్తమ్మ రూపంలో. ఉన్నట్టుండి ఒకరోజు నిద్రలేచేసరికి, నువ్వెక్కడున్నావో అర్థం కాక, ఒక పెద్ద పులుల గుంపు నీమీద పడి నిన్ను చిత్రవధ చేస్తుంటే ఎలా ఉంటుంది..? నాకు అనుభవంలోకి వచ్చింది ఒక ఉదయం. మా అత్తమ్మ, వదిన ఒకరి తరువాత ఒకరు నన్ను తిట్టడం చూసిన తరువాత, వాళ్ల మాటలు విన్న తరువాత. ఎందుకు తిడుతున్నారో తెలీదు, అసలేమైందో తెలీదు. ఆది, వదినని తిట్టాడు(ట) దేనికో. అది నా కారణంగా అని అత్తమ్మ మొదలు పెట్టిన సుప్రభాతం అది. దానికి ముగింపు, వదిన ఫోన్ కాల్. విషయం మొత్తం అర్థం అయింది. ఇన్నిరోజులూ అత్తమ్మ చూపించింది ప్రేమ కాదు, నటన అన్న నిజాన్ని జీర్ణించుకోలేక మనసు ఉక్కిరి బిక్కిరి అయింది. ఇంకా నవ్వొచ్చే విషయమేంటంటే, ఏ రోజైనా ఆది నేను బైటికి వెళ్తే ఖచ్చితంగా రెండు విషయాల్లో ఏదో ఒకటి జరుగుతుంది. మా అత్తమ్మకి ఒంట్లో బాగోక పోవడం లేదా ఇంట్లో పెద్ద గొడవ జరగడం. ఇంత చిన్న ఈక్వేషన్ ఆదికి ఎందుకు అర్థం కాదో నిజంగా నాకు అర్థం కాదు.

నాకు మాత్రం ఇల్లు ఒక నాటక రంగస్థలం లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆదికి ఈ విషయం చెబితే, "పిచ్చిగా మాట్లాడకు. అసలేంటి నీ ఉద్ధేశ్యం? అమ్మకి నా మీదున్నది కూడా ప్రేమ కాదంటావా..?" అరుపులతో కలిసిన మాటలు వచ్చాయి ఆది నుండి. "అది కాదు ఆది. ఒక్కసారి నా బాధ అర్థం చేసుకోడానికి ప్రయత్నించు ప్లీజ్.."
"చూడు శృతి, అమ్మ చాలా కష్ట పడింది. నీకు ఇంతకు ముందే చెప్పాను ఈ విషయం. ఇకపై అమ్మని సుఖపెట్టడం నా బాధ్యత". నాకు విరక్తితో కూడిన నవ్వొచ్చింది. నిజంగా ఈ ప్రపంచంలో కష్టపడని మనిషి ఉంటాడా..? ఎవరి జీవితపు రెండు పుటల్ని స్పృశించినా, వాటి వెనుక టన్నుల కొద్దీ కష్టాల కావ్యాలు ఉంటాయి. అయినా ఇక వాదించడం అనవసరం అని తెలిసింది. రోజు రోజుకీ నాలో సహనం కూడా తగ్గుతూ వచ్చింది.


ఆది, నేను ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. అందులో కూడా ప్రైవసీ ఉండదు. ఆదికి నాకు మధ్యలో అడ్డుగోడలా ఎప్పుడూ అత్తమ్మ ఉంటుంది. తన తాపత్రయమంతా, ఆదికి నేను తగిన మేట్ కాదు అని తెలియజేయాలని. అందుకు తన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే వీలు దొరికినప్పుడలా "ఏరి కోరి చేసుకున్నావు కదా.. అనుభవించు" అని అంటూ ఉంటుంది. కానీ తనకి తెలియదు, నేనిలా మారడానికి కారణం తన ప్రవర్తన అని. నేనేం చేసినా అది తనకి తెలియాలి, తన పర్మిషన్ తీసుకుని చెయ్యాలి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, తనని అడగకుండా నేను ఏది చేసినా అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని రూపు రేఖలు సమూలంగా మార్చేసి, తనకి అనుగుణంగా మలుచుకోగల సమర్ధురాలు. ఎవరు చేసిన పని అయినా సరే, ఫలితం బాగుంటే అది తనే చేసినట్లు ఏమాత్రం తడుముకోకుండా దండోరా కూడా వేయించగలదు. ఏంటో, ప్రపంచంలో ఎన్నో అందాలు,ఆనందాలు, విజయాలు, మనకోసం ఎదురు చూస్తూ ఉంటే, మనుషులు మాత్రం ఇక్కడ ఇలా వంటింట్లో తిట్టుకుంటూ కూర్చోడం నాకు భలే వింతగా ఉంటుంది.

ఈ మధ్య నాకు ఆది మీద ప్రేమ కన్నా, అత్తమ్మ మీద నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ అయిపోయాయి. ఇంటినుండి ఎప్పుడెప్పుడు బయట పడదామా అనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజూ. నాకు తెలుసు, అత్తమ్మ ఇలా ప్రవర్తించడానికి కారణం తనకి సరైన వ్యాపకం లేకపోవడం. "ఈ వయసులో అమ్మ ఏం చేస్తుంది..? తననలా ఉండనివ్వు ప్రశాంతంగా" అన్న ఆది మాటలు విని ఇక మరి నోరు తెరవలేదు నేను.ఆది(వాళ్ల అమ్మ) కోసం చాలా విషయాల్లో రాజీ పడ్డాను. ఒకరోజు ఏదో నవల చదువుతున్న నా దగ్గరికి వచ్చి, "ఏంటిది.. ఇలాంటివి చదివితే అమ్మకి నచ్చదు. ఇంకెప్పుడూ చదవకు" అన్నాడు. మరోసారి, ఆఫీసులో మొదలు పెట్టిన ఒక స్వఛ్చంద సేవా సంస్థకి నెలకి కొంత డబ్బు ఇస్తా అంటే "ముందు మనం మంచిగా సెటిల్ అయిన తరువాత ఇవన్నీ. అయినా అమ్మకి తెలిస్తే ఊరుకోదు" అన్నాడు ఆది. పోనీలే, వాళ్లు పెరిగిన పరిస్థితి అలాంటిది కదా అని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను. కానీ, ఇలా నా జీవితపు ప్రతి అడుగులో అడ్డు తగులుతూ ఉంటే, చివరికి "నేను, నాది" అనుకునే విధంగా ఏదీ మిగలదేమో అని భయమేస్తుంది.

రోజులు గడుస్తున్న కొద్దీ జీవితం మరీ నిస్సారమైపోయిన భావన కలుగుతుంది. పెళ్లికి ముందు ఆదితో గడిపిన రోజులకి వెళ్లిపోవాలని ఉంది. నాకోసం ఎంత తపన పడ్డాడు. అదేంటో మరి, ఇప్పుడు తన కళ్లలో ఆ ప్రేమ కనిపించదు. ఏమో, అది నా దృష్టిలోపమేనేమో. ఏరోజుకారోజు, 'ఇంకా తెలవారదేమీ.. ఈ చీకటి విడిపోదేమీ' అని పాడుకుంటూ గడిపేస్తున్నా ప్రస్తుతానికి.సుఖాంతాలు, దుఃఖాంతాలు ఉండేది కథలకే కదా, నిజజీవితానికి ఒకటే ముగింపు ఉంటుంది. కోరుకోవలసిందల్లా, ఈరోజు కన్నా రేపు బాగుండాలని. కానీ ఆ రేపటికోసం చూసే ఎదురు చూపుల్లోనే కాలం కరిగిపోతుందేమో..

Monday, March 7, 2011

అంతర్మధనం.. ఆది అంతరంగం..

థ్యాంక్‌గాడ్.. కనీసం అక్క అర్థం చేసుకుంది నన్ను. అమ్మెందుకు అర్థం చేసుకోలేకపోతుందో, జనరేషన్ గ్యాప్ కదూ.. అక్క మాటిచ్చింది,"నేను అమ్మని ఒప్పించి నీ పెళ్లి చేస్తారా". అమ్మని ఎలాగైనా ఒప్పించి శృతినే పెళ్లి చేసుకోవాలి.

శృతి, నా జీవితంలోకి చాలా విచిత్రంగా ప్రవేశించింది. నాకు భావుకత్వం అంతగా రాదు, వచ్చుంటే ఈపాటికి తన గురించి ఒక గ్రంథం రాసేసేవాడినేమో. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉంటుంది, అందర్నీ నవ్విస్తుంది. తనని కలిసే వరకూ అసలు జీవితం ఇంత అందంగా, ఆనందంగా ఉంటుందని తెలీదు. ఇంతకు ముందంతా నాన్న లేని జీవితం, అమ్మొక్కత్తే కష్ట పడుతూ ఉంటే చూడలేని జీవితం. అలా అని అమ్మకి నేను ఏరోజూ హెల్ప్ చేసింది లేదు. ఒక్కటి మాత్రం మనసులో బాగా ఫిక్స్ అయిపోయింది, అమ్మని సుఖపెట్టాలి, ఇక ముందు కష్టం అంటే తెలియకుండా చూసుకోవాలి. ఇదే శృతికి కూడా చెప్పాను.."నాకు మా అమ్మ ఎంతో అత్తమ్మ కూడా అంతే ఆది, నువ్వేం బెంగ పడకు మనమంతా సంతోషంగా ఉంటాం" అన్నది శృతి. ఇక నా జీవితం నిజంగా సంతోషంగా గడవబోతోందని తలుచుకుంటే మనసు ఏదో తెలియని ప్రశాంతతని పొందుతుంది.

ఎలా అయితేనేం, మొత్తానికి అమ్మని కూడా పెళ్లికి ఓకే అనిపించాం, అక్క నేను కలిసి. కానీ చాలా స్పష్టంగా తెలుస్తుంది, అమ్మకి నిజంగా ఈ పెళ్లి ఇష్టం లేదని. అయినా నాకు నమ్మకం ఉందిలే, శృతి అమ్మ మనసు మార్చేస్తుందని. నామ మాత్రంగా పెళ్లిచూపులు పెట్టిన రోజు, మా బంధువులతో, అమ్మతో ఎంతగా కలిసి పోయిందో. ఖచ్చితంగా అమ్మ మనసు మార్చేస్తుంది. ఎందుకో రాబోయే రోజులు తలుచు కుంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. శృతి వాళ్ల ఊర్లోనే జరిగింది పెళ్లి, చాలా బాగా చేశారు. నా శృతి, నా భార్య అయిపోయింది. మొత్తంగా నాది అయిపోయింది. డ్యూయెట్ వేసేసుకుందామంటే పాట రాదు, డ్యాన్సూ రాదు.

కొత్త కాపురం.. స్పెషల్‌గా హనీమూన్ అంటూ వెళ్లలేదు కానీ, కొలీగ్స్ ఏదో టూర్ ప్లాన్ చేస్తే వాళ్లతో కలిసి వెళ్లాం. నా జీవితంలో మరచిపోలేని ట్రిప్ అది. ఇక ఆ ప్రదేశం అందాల్ని చూసి శృతి కవితల మీద కవితలు రాసేసి నా కొలీగ్స్ అందరికీ చూపించేస్తుంది. మొదటి సారి వాళ్లని కలుస్తుంది అన్న భావనే లేదు ఎక్కడా, ఎప్పటి నుండో స్నేహితులు అన్నట్లుగా కలిసిపోయింది వాళ్లతో. ఇంకా విచిత్రం ఏమిటంటే, పెళ్లి ఫోటోలు చూసి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారేంటి అని అడిగిన వాళ్లు కూడా ఇప్పుడు శృతి పార్టీ అయిపోయారు. తనకి నేను దొరకడం తన అదృష్టం అన్న వాళ్లంతా తనే నాకు అదృష్టం అంటున్నారు. ఐ ఎగ్రీ టు దిస్. నిజంగా శృతి నా అదృష్టం.

కొత్త కాపురం మెల్లిగా పాతబడుతున్నట్లుగా అనిపిస్తుంది, మా రొటీన్ జీవితాలతో. ఆఫీసు, ఇల్లు.. ఇల్లు, ఆఫీసు. ఇదే లోకం అయిపోతుంది. ఇటువంటి జీవితాల్లో తేడా తేవాలనేమో దేవుడు అమ్మకి శృతికి చిన్న గీత పెట్టాడు మధ్యలో. ఎవరిది తప్పు అంటే చెప్పలేను. ఒకరోజు మాత్రం అమ్మ శృతిని ఎందుకో అనరాని మాటలు అన్నది. మొదట కూల్‌గా ఉన్నా, శృతి కూడా తరువాత తగ్గలేదు. ఫైనల్‌గా నాకు అర్థమయింది ఏంటంటే; నాలో మార్పు వచ్చింది, అది శృతి కారణంగా అని అమ్మ అనుకుంటుంది. నిజానికి నేను అమ్మ కలిసి ఉండి ఐదు సంవత్సరాలు దాటింది. చదువులు, ఉద్యోగాల పేరిట బయట ఉన్నాను ఎక్కువగా. మరి ఈ మార్పు ఎలా కనిపించిందో అమ్మకి. అదే విషయం చెబుదామంటే, నేను చెప్పే విధానం కూడా అమ్మకి నచ్చడం లేదు.. కనీసం శృతి అయినా అర్థం చేసుకుంటుంది అనుకుంటే, మరి నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు అని ఎదురు ప్రశ్న వేస్తుంది. పట్టించుకోకు అని చెప్పడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఇంట్లో మనశ్శాంతి మాత్రం తగ్గిపోయింది. ఎప్పుడూ గలగల మాట్లాడుతూ ఉండే శృతి, ఇంట్లో నోరు తెరవడం లేదు. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఏదో వైరాగ్యాన్ని ఆశ్రయించినట్లుగా ఉంది.

శృతి గురించి అమ్మ కంప్లైంట్లు, అమ్మ చేసే పనుల గురించి శృతి కంప్లైంట్లు. మధ్యలో నేను ఎంతగా నలిగిపోతున్నానో ఎవరికీ పట్టదు.
"నాకసలు గౌరవం ఇవ్వదురా. అత్తంటే ఎంత భయం, గౌరవం ఉండాలి. కనీసం నాతో ఏదీ సరిగా మాట్లాడదు కూడా" అమ్మ చెప్పింది.
"అమ్మా ప్లీజ్.. శృతి చిన్నది. ఇంకొన్ని రోజులు పోతే దానికే అర్థం అవుతుంది." ఏదో చెప్పాలి అని చెప్పడమే, కానీ ఎంత వరకూ నిజమో, వర్క్ అవుతుందో కూడా తెలీదు.
"పెళ్లి చేసుకుంది, ఇంకా ఏంటిరా చిన్నది??"
"ఇంక ఆపమ్మా. ఎప్పుడూ ఒకటే గోల" వద్దనుకున్నా, కోపం, విసుగు గొంతు దాటి వచ్చేస్తున్నాయి.

అమ్మతో ఇలా ఉంటే.. శృతిది వేరుగా ఉంటుంది.
"ఆది, నావల్ల కావట్లేదు మీ అమ్మ ఛాదస్తంతో. నేను ఏది చేసినా నచ్చదు. ఈరోజు ఒకలా చెయ్యమంటుంది. సరే కదా మరోసారి అలాగే చేస్తే అది తప్పు అంటుంది. ఇండైరెక్ట్‌గా అనాల్సిన మాటలన్నీ అంటుంది" బాధ పడుతూ చెప్పింది ఒక రాత్రి.
"ప్లీజ్ శృతి అర్థం చేసుకో. అమ్మ చాలా కష్ట పడింది. అమ్మని ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఎలా?"
"ఏది చిన్న విషయం అది..? నాకసలు ఇంట్లో ఉండాలంపించడంలేదు....
తన వాక్యం పూర్తి అయిందో లేదో కూడా తెలీదు. ఏమంటున్నానో కూడా తెలీకుండా అరిచేశాను తన మీద. ఈ అరుపులు విని అమ్మ వచ్చింది తన రూం నుండి. నా కోపం అమ్మ మీదకి పాస్ అవ్వడం సెకండ్స్‌లో జరిగిపోయింది.

రోజు రోజుకీ నాకు కోపం పెరగడం తప్ప, ఇంట్లో ఏ మార్పూ లేదు.
"అత్తమ్మ ప్రేమ అంతా నటన అని తెలిసిన రోజే నాకు తన మీద గౌరవం పోయింది. గౌరవం ఉన్నట్లు నటించడం మాత్రం నాకు రాదు" ఇది "కనీసం అమ్మ వయసుకన్నా గౌరవం ఇవ్వొచ్చు కదా శృతి.." అన్న నా ప్రశ్నకి శృతి సమాధానం. ఏంటీ జీవితం అని నా మీద నాకే అసహ్యం వేసింది. ఎక్కడ జరుగుతుంది తప్పు..? ఎవరు ఎవర్ని అర్థం చేసుకోవడం లేదు..? అమ్మ, నేను, శృతి కలిసి సంతోషంగా ఉండాలి అన్న నా ఒకే ఒక కోరిక ఇక తీరదా..? ఇలా ముగ్గురం బాధ పడుతూనే ఉండాలా.? నాకు ఇద్దరూ ప్రాణం. ఎవరెక్కువ అంటే చెప్పలేను. దేవుడా, "నీకు అమ్మ కావాలా..? శృతి కావాలా.?" అన్న పరిస్థితిని మాత్రం నాకు తీసుకు రాకు.

Friday, March 4, 2011

అంతర్మధనం.. అమ్మ మాటల్లో

ఇది నిజంగా నిజమేనా..? బాధ కాదు, కోపం కాదు, భయం కాదు. ఏదో తెలియని అలజడి మనసులో, ఉదయం అర్చనతో జరిగిన సంభాషణ తరువాత. ఎంత వద్దనుకున్నా మనసు మళ్లీ మళ్లీ అదే గుర్తు చేస్తుంది.
"అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి, తమ్ముడి గురించి"
మనసేదో కీడు శంకించింది, అదే భయంతో "చెప్పు ఏంటట విషయం.."
"ఆదిత్య పెళ్లి గురించి. వాడెవరో అమ్మాయిని ఇషటపడుతున్నాడట, తననే పెళ్లి చేసుకుంటున్నా అంటున్నాడు"
అంతే, అక్కడితో ఇక నా చెవులు పని చెయ్యడం మానేశాయి. ఏదేదో చెబుతుంది నా కూతురు ఆ అమ్మాయి గురించి. ఇక వినే ఆసక్తి నాకు లేకపోవడంతో ఏదో ముక్తసరిగా ముగించి కాల్ కట్ చేసాను. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను వాడి మీద. ఒక వైపు బాధ, మరో వైపు కోపం తన్నుకు వస్తున్నాయి. అంతలోనే అసలెందుకొస్తున్నాయో అర్థం కాని ప్రశ్న. అసలు అది కోపమో, బాధో, మరేదైనా భావనో తెలియని సందిగ్ధత.

వాళ్ల నాన్న మమ్మల్నొదిలి వెళ్లిపోయిన క్షణం నుండి పిల్లలిద్దర్నీ కడుపులో పెట్టుకుని పెంచుకున్నాను. ఒక్కదాన్నే ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. అలా కష్టపడే నా కూతురి పెళ్లి చేశాను, ఉన్నంతలో మంచి సంబంధాన్ని చూసి. ఇప్పుడు వీడేమో నలుగురిలో నన్ను తలెత్తుకోనివ్వకుండా చేస్తున్నాడు. ఎప్పుడూ నా కొంగే పట్టుకుని తిరిగేవాడు, అసలు ఎలా ఒక అమ్మాయి వలలో పడ్డాడో.. పేరుకి 27 యేళ్లు వచ్చాయన్న మాటే కానీ, నా కొడుకు చాలా అమాయకుడు. ఖచ్చితంగా ఏదో చేసి ఉంటుంది ఆ అమ్మాయే. తలుచుకుంటే బాధగా ఉంది, కానీ ఇప్పుడు నా చేతుల్లో ఏముంది. వాడికి ఒక మంచి అమ్మాయిని వెతికి పెళ్లి చేద్దామన్న నా ఆశ అడియాశే అయిపోయింది కదా.. వద్దనుకున్న కొద్దీ ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఇక లాభం లేదని ఉన్నపళంగా హైదరాబాదుకి బయలుదేరాను, నా కూతురి దగ్గరికి.

ఇదంతా నాకే తప్పుగా అనిపిస్తుందా..? అర్చనేంటి వాడికి వత్తాసు పలుకుతుంది. ఇక చెయ్యగలిగేది ఏమీ లేదని అర్థమయ్యి పరిస్థితికి అనుగుణంగా ఆలోచిస్తుందా..?
"ఇందులో తప్పేముందమ్మా..? ఆది చిన్న వాడేమీ కాదు. వాడికేం కావాలో వాడికి తెలుసు. ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇది సంతోష పడాల్సిన విషయమే కదా. ఇంకా అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి మన కులమే. నువ్వు అన్నీ పిచ్చిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. వాడి జీవితం బాగుంటుంది." ఇవి నా కూతురి మాటలు. అంతేనా ఇక!! చుట్టాల్లో వాడికి ఈ మధ్యనే మంచి ఉద్యోగం వచ్చిందని తెలిసి సంబంధాలు తెస్తున్నారు. 30 లక్షలు కట్నం ఇస్తామని మొన్ననే ఒక సంబంధం వచ్చింది. కాస్త ముందుకెళ్దామనుకున్నా ఆ సంబంధం విషయంలో, ఇంతలో ఈ వార్త. ఒక పెళ్లి చెయ్యాలంటే ఎన్ని తతంగాలు ఉండాలి.. పెళ్లిచూపులు, కట్నాలు-లాంఛనాల మాటలు, పెద్దలంతా ఇష్టపడి చేసే పెళ్లి ఎంత హుందాగా ఉంటుంది. ఇవేమీ లేకుండా ఇలా ఉన్నట్టుండి వచ్చి నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తే సరిపోతుందా..? ఆ కుటుంబం ఎలాంటిదో, అమ్మాయి ఎలాంటిదో, వాళ్ల ఆచార వ్యవహారాలు ఏంటో కూడా తెలుసుకునేది లేదా..

అర్చన కబురు పెట్టినట్టుంది, ఆది కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.
"అమ్మా, ప్లీజ్ అర్థం చేసుకో. శృతి చాలా మంచిది, పైగా నేనంటే చాలా ఇష్టం. ఒప్పుకో అమ్మా" ఆదిత్య మాట్లాడుతున్నాడు.
"ఎలా ఒప్పుకోవాలిరా..? అయినా నువ్వు నిర్ణయం తీసేసుకున్నావుగా, ఇక నన్నడగడం దేనికి? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో" బాధ పెడుతున్నాను చాలా వాడిని. కానీ తట్టుకోలేకపోతున్నాను ఈ నిజాన్ని. నాకు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా, వాడి పాటికి వాడు నిర్ణయం తీసేస్కున్నాడు. వాడి జీవితంలో నేను పోషించాల్సిన పాత్ర ఏమీ లేదా అన్న ఉక్రోషం వచ్చేస్తుంది. నేనంటే వాడికి ఏమాత్రం గౌరవం ఉన్నా, ఈ నిర్ణయం తీసుకోడం కాదు, కనీసం నేను చూపించిన అమ్మాయిని తప్ప ఇంకో అమ్మాయిని కన్నెత్తి కూడా చూసేవాడు కాదు.

నా కూతురు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. "ఏమైందనే ఇప్పుడు. అమ్మాయి చాలా మంచిదని చెబుతున్నాడు కదా. శృతి కూడా చెప్పిందంట వాళ్లింట్లో. మనకి ఓకే అంటే వాళ్ల అమ్మ నాన్న వస్తారంట ఇక్కడికి, పెళ్లి విషయాలు మాట్లాడడానికి."
"మీ ఇద్దరి ఇష్టం" ఇది మాత్రమే నేను చెప్పగలిగింది.
"ఇంకొక ముఖ్య విషయం. వాళ్లతో కట్నమూ, కానుకలు అంటూ మాట్లాడకు. పెద్దగా ఇచ్చుకోలేరట" అర్చన అన్నది. నా భావాలు అర్థం చేసుకున్నట్లుంది వెంటనే చెప్పడం మొదలు పెట్టింది. "మంచి ఉద్యోగం చేస్తుంది. ఇద్దరూ జాబ్ చేసి సంపాదించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఇక కట్నం కాకరకాయ ఎందుకు." మౌనమే నా సమాధానమయింది.

అనుకున్నట్లుగానే శృతి వచ్చింది ఒకరోజు వాళ్ల అమ్మా నాన్నని తీసుకుని. మా అల్లుడు, కూతురు మాట్లాడారు పెళ్లి పెద్దలుగా. ఆదికి ఆ అమ్మాయిలో ఏం నచ్చిందో నిజంగా నాకు అర్థం కాలేదు. డబ్బు లేదు, అందం లేదు. ఏమన్నా అంటే మంచిది అంటాడు. నాకెందుకో అసలు ఈ సంబంధం కుదరకపోతే బాగుండు అనిపిస్తుంది. కలివిడిగా అయితే మాట్లాడుతుంది కానీ..నా కొడుకుని వల్లో వేసుకుంది అన్న కోపంతో నాకు నచ్చలేదు.. ఒక్కతే కూతురు కాబట్టి ఉన్నదంతా శృతికే అన్నట్లు మాట్లాడారు వాళ్ల అమ్మా నాన్న. మాటలయ్యాక ముహూర్తాలు. ఎంతైనా నాకొడుకు పెళ్లి కదా. ముహూర్తాలు పెట్టించి దగ్గరుండి అన్నీ జరిపించాను.

కొత్తలో చాలా బాగుంది నా కోడలు. తర్వాత తర్వాత ఏమైందో నా కొడుకులో మాత్రం చాలా మార్పు చూశాను. చీటికి మాటికి కసురుకోవడం. తల్లినన్న గౌరవం కూడా లేకుండా చిన్నదానికి కూడా కోడలు ముందు తిట్టడం. అసలు నన్ను పట్టించుకోవడం మానేశాడు ఈ మధ్య. ఎంతసేపూ ఆఫీసు, పెళ్లాం. కొలీగ్స్‌తో విహారయాత్రలు. బయట భోజనాలు. ఇంట్లో అమ్మ ఒకతి ఉంది. కొంత సమయం తనతో కూడా గడుపుదాం అన్న ఆలోచన రాదేమో.. లేకపోతే కోడలు రానివ్వడం లేదేమో. ఇవన్నీ ఎవరితోనూ పంచుకోలేని బాధలు. రోజూ అర్థరాత్రి వరకూ వెక్కి వెక్కి ఏడ్చే బాధలు. పోనీ కోడలైనా మంచిదా అంటే, అసలు అత్తయ్య, ఆడపడుచు అన్న గౌరవమే లేదు. ఇదే మాట అంటే ఇంట్లో పెద్ద గొడవ. నానా మాటలనే కొడుకు, హావభావాలతోనే తిట్టినంత పని చేసే కోడలు. ఒంటరితనంతో నేనెంత బాధ పడుతున్నానో ఎవరికి తెలుసు..? నా 50 యేళ్ల అనుభవంతో నేను చెప్పే మాటలేవీ వాళ్ల చెవులకి ఎక్కవు. నేనేదో వాళ్ల ఆనందాలకి అడ్డొస్తున్నానన్న భావనలో ఉంటారు. వాళ్లు సంతోషంగా ఉండడమే కదా నాక్కావలసింది

రాను రానూ, వాళ్లిద్దరు కూడా అన్యోన్యంగా ఉండడంలేదు. చీటికి మాటికి గొడవలు. శృతి అలగడం, ఆది బ్రతిమిలాడడం. ఆది అరవడం, శృతి ఎదిరించడం. ఇదే వరస ఎప్పుడు చూసినా. మధ్యలో పెద్దరికంగా నేవెళ్తే, "నీకెందుకు మధ్యలో నువ్వు రాకు" అని కొడుకుగారి హితోపదేశం. ఏరికోరి చేసుకున్నావు కదా అనుభవించనివ్వు అనుకుంటాను నాలోనేనే. ఒకసారి బైటికి అనేశాను కూడా. కోడలు బాధపడినట్లు ఉంది పాపం. ఆది మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు బాగా చూసుకోదు మరి. పగలంతా కష్టపడి వచ్చే భర్తకి కాస్త ప్రేమ పంచాలి కానీ ఇలా అరిచి గొడవ పెడితే వచ్చేదేముంది. వీళ్లిద్దరి గురించే నేను బైటికి ఎక్కువగా వెళ్లను కూడా. అర్చన దగ్గరికి వెళ్లినా ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండను. ఆది ఎలా ఉన్నాడో అన్న బెంగ నన్ను నిలవనివ్వదు.

వాడు సంతోషంగా ఉంటే నాకు చాలు. ఆరోజుల కోసం చూస్తూ ఉంటాను....
సశేషం.....