Saturday, August 6, 2011

నా కాళ్లకి చక్రాలొచ్చాయోచ్..ఓచ్..

కాళ్లకి చక్రాలంటే స్కేటింగ్ అనుకుని చక్రాల చెప్పుల్లో కాళ్లెయ్యొద్దు. మరేమో.. మరేమో.. మరేమో.. 6 సంవత్సరాల నా కల ఒక రెండు రోజుల క్రితం తీరింది. పట్టలేని సంతోషంతో కాళ్లకి చక్రాలతో రెక్కల చేతులతో అలా గాల్లో తేలియాడుతూ ఉన్నాను:) ఇంతకీ విషయమేంటంటే, నాకు వాహన యోగం పట్టేసింది, ద్విచక్ర వాహన యోగం. ఎన్నాళ్లుగా.. సారీ ఎన్నేళ్లుగానో ఎదురు చూసిన యోగం ఈరోజు నన్ను వరించింది.

7 సంవత్సరాల క్రితం నా డిగ్రీ చదువు కోసం హైదరాబాదు వచ్చి, కాలేజీలో తోటి విద్యార్థులు చాలా మంది బండి మీద కాలేజీకి వస్తూ ఉంటే చూసినప్పుడు కలిగిన ఇష్టం అది. ఎంతగా అంటే, బస్‌స్టాప్‌లో స్నేహితురాళ్లతో నుంచున్నప్పుడు అటుగా బండి మీద వెళ్లే అమ్మాయిలని అలా నోరు తెరుచుకుని చూసేంతగా. ఎప్పటికైనా మనం కూడా కొనుక్కోవాలే అని గట్టిగా తీర్మానించేసుకున్నాం అప్పుడే. నా ఇష్టాన్ని గమనించిన మా నాన్న, ఇంటికెళ్లినప్పుడు ఓసారి అడిగారు కూడా.."ఏమ్మా, స్కూటీ కొనివ్వనా??"అని. "లేదు నాన్నా.. నేను సంపాదిస్తాను కదా, అప్పుడు కొనుక్కుంటా" అని గర్వంగా చెప్పాను. అలా అలా డిగ్రీ అయిపోయింది. జాబ్ కూడా వచ్చేసింది, హమ్మయ్య ఇక బండి కొనుక్కునే సమయం ఆసన్నమైంది అని మనసు ఫీల్ అయ్యే లోగా, బండి ఉన్న అబ్బాయితో పెళ్లయిపోయింది...;)

భర్త అనగా భరించువాడు అని ఎప్పుడో సంస్కృతంలో చెప్పగా విని, నిజమనుకుని, నా బండి భారాన్ని భరించగలరా అని అడిగాను. అంతే.."బండినా? ఏం బండి ? ఎందుకు బండి? అసలేం భరించాలి? బండంటే తెలుసా నీకు??" అని క్లాసు పీకాడు:( . నేను బండి కావాలి అని అడగడం, ఆయన వద్దు అనడం. ఇలా కొన్నాళ్లు గడిచాక, "నువ్వు ముందు ఫిఫ్టీ కేజిలు అవ్వు అప్పుడు చూద్దాం" అన్నారు. ఆహా, కనీసం ఒక్క అవకాశం ఇస్తున్నారు అని సంబరపడిపోయి, తినీ తినీ తినీ.. ఎంత తిన్నా 50 ని తాకలేకపోయా ప్చ్:(

ఇలా అయితే లాభం లేదు, మనం ఇంకాస్త పోరు పెడితే ఇంకేదైనా కన్సెషన్ ఇవ్వచ్చు అని, ఆయన మనస్సుని ప్రసన్నం చేసుకోగల శక్తి ఒక్క టి.వి.యస్. స్కూటీకి మాత్రమే ఉందని తలచి, స్కూటీ మంత్ర జపం చేసి, స్కూటీకోటి రాసాను.. నేను "స్కూటీ" అనడం ఆయన "ఫిఫ్టీ" అ(రవ)నడం. ఇలా ఇంకొన్నాళ్లు సాగాక..
ఛి.. ఈ స్కూటీ మనకి అచ్చిరాలేదు, ఛిఛి.. అని నా భారాన్ని హీరోహోండా ప్లెషర్‌కి తగిలిద్దాం అని ట్రై చేశా..;);) ఇక అప్పుడు మా ఆయన కూడా రూట్ మార్చేసి, "నువ్వు ఏ కలర్ కావాలో ఎంచుకో. వచ్చే నెలలోగా మనింట్లో బండి ఉంటుంది. నువ్వు కలర్ ఎంచుకోడమే ఆలస్యం" అని అంటే మొదట్లో సంతోష పడీ పడీ చివరికి నేనే కింద పడ్డా అని తెలుసుకున్నా :(( ఆ వచ్చే నెల రెండు సంవత్సరాలకి వస్తుంది అప్పుడు తెలుసుకోలేకపోయా...

చిరాకొచ్చిన అప్పు ఏడవలేక నవ్వుతూ నవ్వలేక ఏడుస్తూ ప్లీజ్ కొనివ్వు బండి అని ప్రాధేయ పడగా, ఏమాత్రం కనికరం లేని వెంకట్ "ఫలానా వెంకట్ వైఫ్ బండి నడుపుతుంది అని నలుగురూ అంటే ఎంత అవమానం" అని నన్ను ఇంకాస్త ఏడిపించేవాడు. ఇలా ఒక సాకు కాదు, నాకు బండి కొనివ్వకుండా ఉండడానికి సవాలక్ష సాకులు దొరికాయి ఇన్నేళ్లుగా.

ఇంకొన్ని సార్లైతే, "మనం కార్ కొనేద్దాం అప్పు. నాలు చక్రాలు ఇస్తా అంటే రెండే కావాలంటావేంటి???" అనేవాడు. మరి నాకేమో కార్ కన్నా బండే ఇష్టం:) "కావాలంటే కార్ నువ్వు కొనుక్కో, నాకు మాత్రం బండి కొనివ్వు చాలు" అనేదాన్ని. నా వాహన యోగానికి అడ్డంకి ఒక్క మా ఆయనేనా, ఎంత మంది అన్నలకి తమ్ముళ్లకి రాఖీలు కట్టి నాకు బండి కొనిచ్చే అదృష్టాన్ని ఎవరు సొంతం చేసుకుంటున్నారహో అని చాటింపేస్తే, అందరూ క్యూలో నిలబడి కొనిస్తారు అన్న నా ఆశని అడియాశ చేస్తూ అందరూ క్యూలో పరిగెట్టి పారిపోయారు..ప్చ్.. ఒక తమ్ముడైతే "అక్కా నువ్వు పెద్ద దానివి కదా, నీకు రోడ్డు రోలర్ కొనిస్తా అక్కా" అని నా రాఖీ దొబ్బేసాడు దొంగమొహం.

అలా ఎన్నో కష్టాలకోర్చిన అప్పు, నిన్ననే.. సరిగ్గా నిన్ననే మహింద్రా వాడిని కనికరిస్తూ రోడియో కొనుక్కుంది:))))  ఫోటో చూసి ఎలా ఉందో చెప్పండేం :)))










దీన్ని చూసాక మీకేం అర్థమయింది..? ఉదయం నుండి నేను అస్సలు దీని మీద ఎక్కి నడపలేదు అని మీరు అనుకున్నారు అంటే మీరు చాలా తెలివైన వాళ్లన్నమాట:)))) ఈ రంగు చూసి నలుపు అనుకుంటున్నారేమో.. కాదు కాదు.. అదేదో పలకడానికి రాని బ్రౌన్.. షో రూం వాడిని ఒక పావుగంట విసిగించి నేర్చుకున్నాలే, కాప్యుచ్చినో బ్రౌన్ అని:)))

నాకు తెలుసు మీ అందరూ ఏం ఆలోచిస్తున్నారో... పార్టీ అనే కదా..
ఇదిగో ఈ స్వీట్స్ చాకోలెట్స్ మీకోసం:))


Wednesday, August 3, 2011

నాలోని పంతులమ్మ..!!

సమయం : సుమారు ఓ రెండు దశాబ్దాల క్రితం..
ప్రశ్న : పాపా ఏం చదువుతున్నావు..?
జవాబు : ఒకటో తరగతి.
మళ్లీ ప్రశ్న : పెద్దయ్యాక ఏమవుతావు.?
మళ్లీ జవాబు : టీచర్.

ప్రశ్నలు ఎవరడిగినా సరే నా సమాధానం అదే. ఎందుకు అంటే చెప్పలేనేమో.. ఏమో, ఊహ తెలిసాక అమ్మ నాన్న చుట్టాలు పక్కాలు కాకుండా పరిచయం అయిన మొదటి బయటి వ్యక్తి టీచర్ అయిన కారణం గానో.. పిల్లలంతా సదరు టీచర్ అనే వ్యక్తికి భయభ్రాంతులయ్యి ఉండడం వలనో.. ఒక మంచి జాబ్ చేస్తూ గౌరవనీయమైన స్థానంలో ఉన్న మా నాన్న, మా స్కూల్ లో టీచర్స్ కి అంతు లేని విలువ ఇవ్వడం కారణం గానో.. ఏమో తెలీదు. ఫైనల్ గా నేను మాత్రం టీచర్ అయిపోవాలనే నిర్ణయించుకున్నా.

అలా టీచర్ అయిపోయినట్లు ఊహించేసుకుంటూ కలల్లో తేలియాడుతూ చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలకి (నా కంటే చిన్న పిల్లలకి;)) చదువు (?) చెబుతూ నాలోని పంతులమ్మని పెంచి పోషిస్తూ ఉండేదాన్ని. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. ఈ "పంతులమ్మ" అని నన్ను మా తాతమ్మ ఎక్కువగా పిలుస్తూ ఉండేది. ఆవిడతో నాకు చాలా అనుబంధం ఉండేది. నా 4వ తరగతి లో మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. కానీ నాకు ఆ ఙ్ఞాపకలు మాత్రం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి.

ప్రతీ రోజూ.. కళ్లజోడు పెట్టుకుని పుస్తకాల్లో పాఠాల్ని మస్తిష్కాల్లోకెక్కించే టీచర్‌లా కాకుండా, ఎక్కాలు అప్పజెప్పలేదన్న కారణంగా గోడ కుర్చీ వేస్తూ, సామాన్యశాస్త్రాన్ని అతి సామాన్యంగా తీసుకుని చేతులు ఎరుపెక్కేలా బెత్తంతో దెబ్బలు తినే స్టూడెంట్ లాగానే స్కూల్ కి వెళ్లినా.. టీచర్ అయిపోవాలన్న నా జిఙ్ఞాస మాత్రం లెక్కల్లో ఎక్కమంతైనా తగ్గలేదు(లాజిక్కులు అడగొద్దు). నేను టీచర్ అయిపోయి పిల్లల్ని హింసించడానికా అన్న ప్రశ్న మీకు అస్సలు రాకూడదు. మొగ్గగా ఉన్నప్పుడే నాలోని పంతులమ్మని గుర్తించి, మా టీచర్లు, నా తోటి విద్యార్థులకి నాచేత పాఠాలు చెప్పించేవారు. (మీకు తెలీదా, క్లాసులో నిద్ర పోతూ ఉంటే ఆ రోజు చెప్పిన పాఠాన్ని ఆ తరువాత రోజు చెప్పమనే వారు. అలా నాలోని పంతులమ్మని బోలెడన్ని సార్లు నిద్ర లేపాల్సి వచ్చింది నేను క్లాసులో నిద్రపోయి;))

నేను పెరుగుతున్న కొద్దీ నాకు ఇంకా పెరిగిన పెద్ద పెద్ద టీచర్లు దొరికి నాలోని పంతులమ్మని కూడా ఇంకా పెంచి పెద్దది చేసారు. అంటే పరీక్షలు పెట్టే స్థాయికి ఎదిగిందనమాట పంతులమ్మ. ఆ రోజులే వేరులే. 9వ తరగతిలో మా లెక్కల మాస్టారు లెక్కల్లో మన ప్రావీణ్యాన్ని గుర్తించి నలు దిక్కులా వ్యాపింపజేసి, పూ......ర్తిగా నమ్మకం పెంచేసుకుని, పక్కన విద్యార్థులని పరీక్షించమని ఆర్డర్స్ వేసి బయటికి వెళ్లిపోయేవారు ఎంచక్కా.. కాకా పట్టించుకోవడం అంత బాగుంటుందని తెలిసిన మొదటి రోజులవి. "అప్పు, ఈ సిద్ధాంతం వద్దు అప్పు, అది ఇవ్వు. ఈ లెక్క అస్సలు వద్దు ప్లీజ్ ఈజీ ది చూసి ఇవ్వు." ఆహా ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే భలే సంతోషంగా ఉంటుందిలే ;)

అలా పెరిగి పెరిగి నాలోని పంతులమ్మ డిగ్రీలోకి వచ్చింది. ఈసారి అత్య్తుత్సాహంతో, ఒక ట్యుటోరియల్ లో చిన్న పిల్లలకి పాఠాలనమాట:) నిజంగా అవి మాత్రం బంగారు రోజులు (ఇదిగో అమ్మాయిలూ గాజులు కాదు రోజులు). 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకూ అనమాట. 2 గంటల పాటు వాళ్లకి అన్నీ నేనే చెప్పాలి. వాళ్ల హోం వర్క్ చేయించాలి ఒక 15 మంది పిల్లలు. భలే ఉండేవాళ్లు ముద్దు ముద్దుగా.. కానీ ఒకటే బాధ, హైదరాబాదు స్కూల్స్ కదా తెలుగు రాదు ఎవరికీ :(. తెలుగు తల్లిని బ్రతికించడానికి నావంతు కృషిగా వాళ్లకి తెలుగు బాగా నేర్పించడానికి కష్టపడ్డాను. వాళ్లకి బాగా వచ్చిందనైతే చెప్పను కానీ అంతకు ముందు కంటే కాస్త మెరుగు అని చెప్పడానికి గర్వపడుతున్నాను:) వాళ్లు నన్ను టీచర్ టీచర్ అని పిలుస్తూ ఉంటే భలే ముచ్చటగా అనిపించేది:) నేను నిజంగా ఒక టీచర్ అయితే నా విద్యార్థులకి ఏమేమి బుద్దులు నేర్పాలో, చదువొక్కటే ముఖ్యం గమ్యం కాదు అంతకు మించిన విలువలు ఎన్ని ఉన్నాయో ఎలా వాటిని పాటించాలో ఇవన్నీ వాళ్లకి చెప్పడానికి ప్రయత్నించేదాన్ని వాళ్ల వయసుకు తగ్గట్టుగా. ఒక సంవత్సరం పాటు చెప్పినా ఒక్క రోజు కూడా ఎవ్వరినీ కొట్టలేదు, నేనంటే భయం కాకుండా గౌరవం ఏర్పడేలా చెయ్యడానికి ప్రయత్నించాను. నిజంగా నాకు చాలా నచ్చిన రోజులు అవి. ఇక ఆ తరువాత కొన్ని పరిస్థితుల కారణంగా, క్యాట్ ప్రిపేర్ అయ్యే ఒక అమ్మాయికి హోం ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాను. నేను పదిలపరుచుకోవలసిన గొప్ప ఙ్ఞాపకాలు అయితే ఏమీ లేవు ఆమెతో:)
 
అసలిప్పుడీ గోలంతా మాకెందుకు తల్లీ అంటున్నారా??? మరేమో ఈ మధ్యనే దేవుడిచ్చిన ఒక అన్నయ్య అమ్మా నాన్నతో పరిచయమయిందనమాట:) అంటే మా పెద్దమ్మ పెదనాన్నతో:) అయితే మాకేంటీ అంటే బెత్తంతో కొట్టేస్తా అంతే.. ఎంచక్కా, పెద్దమ్మా పెదనాన్నా ఇద్దరూ ఉపాధ్యాయులే.. నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయమేమనగా అటు పెద్దమ్మ వాళ్లింట్లో ఇటు పెదనాన్న వాళ్లింట్లో అందరి వృత్తీ అదే:) చాలా సంతోషకరంగా అనిపించిన విషయమేమనగా, వారి వృత్తి పట్ల వారికున్న గౌరవం, అంకిత భావం. మాటల్లో చెప్పలేనంత గౌరవం పెరిగిపోయింది వారి మాటలు వింటూ ఉంటే. అవే మాటలు నిద్రపోతున్న నా చిన్నతనపు ఙ్ఞాపకాలని తట్టి లేపాయి. మామూలుగానే నాకు ఉపాధ్యాయ వృత్తి పట్ల చాలా ఇష్టం గౌరవం ఇంకా చాలా ఉన్నాయి:) ఇంక పెదనాన్న మాటలు వినగానే అవన్నీ, వర్షాకాలంలో మా ఊరి గోదారిలా ఉప్పొంగి పోతున్నాయి. ఒక్కసారిగా టీచర్ అవ్వాలన్న కోరిక మళ్లీ నన్ను బలంగా తాకింది.

చేసే పనిని ఒక ఉద్యోగంలా కాకుండా, ఒక సేవగా సమాజం పట్ల తమవంతు బాధ్యతగా చేస్తూ దాన్నే ఇష్టపడుతూ, గర్వంగా చెప్పుకోవడం.. నాకు భలే అనుభూతినిచ్చింది:). ఒక్కసారి నన్ను నేను ప్రశ్నించుకున్నాను, ఎన్ని సార్లు నేను చేసే పనిని ఒక సేవలా సంతోషంగా చేసాను? బహుశా అసలు ఒక్కసారి కూడా లేదేమో.. మనం నీతిగా చేసే పని ఏదైనా సరే, దాని పట్ల మనకి గౌరవం ఉండడం కదా ముఖ్యం. ఏంటో.. ఏదో మొదలు పెడితే అది ఇంకేదో అయ్యేలా ఉంది.

సాధారణంగా మారుమూల పల్లెటూర్లలో ఉన్న పాఠశాలల్లో పని చేసే టీచర్లు ఎంతమంది ప్రతి రోజూ వెళ్లి పాఠాలు చెబుతారు? అసలు చెకింగ్‌లు గట్రా జరగవు అని తెలిస్తే ఇక స్కూల్ అన్నది ఒకటి ఉందన్న విషయమే మర్చిపోతారేమో. అదే అభిప్రాయంతో ఉన్న నేను అన్నయ్య మాటలతో కళ్లు తెరిచి, ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఒక చిన్న పాఠశాలకి కావాలని ట్రాన్స్‌ఫర్ చేయించుకుని దాని అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మా పెదనాన్న నిబద్ధతని చూసాను.

మాటల మధ్యలో పెదనాన్న అన్నారు "మా అబ్బాయిని కూడా ఒక మామూలు గవర్నమెంట్ స్కూల్ లోనే వేశామమ్మా. అందరూ అడిగారు, స్థోమత ఉండి కూడా ఇలా గవర్నమెంటు స్కూల్ లో తెలుగు మీడియంలో వేస్తే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? కాన్వెంటులో చేర్పించొచ్చు కదా అని.. కానీ తల్లి.., నేను నా భార్య గవర్న్‌మెంటు స్కూల్ లో ఉపాధ్యాయులం. మా పిల్లల్నే బయట చేర్పిస్తే మమ్మల్ని మేము అవమానించుకున్నట్లే కదా.." అని. మాటలు కరువైన మనసు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉందంటారా!!!

శ్రేయోభిలాషులంతా భయపడ్డట్లు మా అన్నయ్య భవిష్యత్తుకి ఏమీ కాలేదు. ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడి, అంతకన్నా మంచి పేరుని సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా చాలా మంచి వ్యక్తిగా ఎదిగాడు :))

నేను మర్చిపోయిన నా ఇష్టాన్ని, చిన్నతనపు ఙ్ఞాపకాల్ని పరోక్షంగానైనా గుర్తు చేసి.. యాంత్రికమైపోయిన జీవితంలో ఆశల చిగుళ్లని మళ్లీ మొలకెత్తించిన పెద్దమ్మ, పెదనాన్నలకి ప్రేమతో అంకితం..:))