Wednesday, November 16, 2011

ఆనందమానందమాయే

ప్రపంచంలోని ఏ ఇద్దరు మనుషులూ ఒకేలా ఆలోచించలేరట. కానీ ప్రతి ఇద్దరిలోనూ ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటుంది, అలాగే ఎక్కడో ఒక ఆలోచన దగ్గర అవును కాదు అనే సందర్భమూ ఎదురవుతుంది. ఇలా వ్యక్తిగతంగా చూస్తేనే ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ, తన తోటి మనిషితో.. ఇటువంటి విషయాలు తెలుసుకుని మసులుకోవడమే మానసిక పరిపక్వత అనుకుంటూ జీవితాన్ని జీవించేస్తున్నా అన్న భ్రమలో కాలాన్ని వెళ్లదీస్తున్న నేను, ఒకే తాటిపై నిలబడి, నలుగురికీ జీవితాన్ని పంచుతున్న ఒక కుటుంబాన్ని చూసి విస్తుపోయాను అంటే అది చిన్న పదమే అవుతుంది.

అవును.. జీవని ప్రసాద్ గారి కుటుంబాన్ని దర్శించిన తరువాత అచ్చంగా నా మనసుపలికిన మాటలు ఇవి. అలా ఇంటిలోని ప్రతి ఒక్కరూ జీవని చిన్నారి పిల్లల్ని ప్రేమ ఆప్యాయతలతో చూడడం, అతిథి సేవని అదృష్టంగా భావించి ఆదరాభిమానాలతో ఉక్కిరిబిక్కిరి చెయ్యడం, అయ్యయ్యో పాపం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం అన్న బాధ క్షణక్షణానికీ ఎక్కువవుతున్నా, ఇంతగా కూడా ఆదరించగలరా అన్న ఆశ్చర్యం ఇక నోరు తెరవనివ్వలేదు. "ఇలా మా ఇంటికి మీరు వస్తూ పోతూ ఉంటే మాకు చాలా సంతోషం" అంటూ నిండైన మనసుతో, గుండెల్లోంచి విరిసిన నవ్వుతో ఆహ్వానించే అమ్మ గారికి; శరీరానికి ఓపిక లేకపోయినా, అందర్నీ ఆనందంగా గమనిస్తూ, జీవని కుసుమాల్ని తన సొంత మనవళ్లు మనవరాళ్లుగా ప్రేమించే నాన్న గారికి; కొడుకుగా జన్మించడం ప్రసాద్ గారి అదృష్టమా? ఇంత మంచి కుటుంబంలోకి అడుగుపెట్టి, వారి ఆలోచనల్ని మనసారా గౌరవిస్తూ, ఎంతో ఇష్టంగా, అలుపు లేకుండా సేవించే సునందక్క దొరకడం ఆ కుటుంబం అదృష్టమా? ఏంటో.. నాకైతే కనీసం ఇన్నేళ్లకైనా ఆ కుటుంబంతో, ప్రేమతో నిండిన పరిసరాలతో పరిచయం ఏర్పడడం నా అదృష్టమనే అనిపిస్తుంది.

రెండు మనసుల్లో మొలకెత్తిన ఒక గొప్ప సంకల్పం ఎంతటివారినైనా ఒకటి చేస్తుంది. అందుకు ఉదాహరణ, జీవని ప్రసాద్ గారిని నోరారా అన్నా అని ఆప్యాయంగా పిలిచే యస్.ఆర్.ఐ.టి. ఛెయిర్మెన్ సాంబ శివా రెడ్డి గారు. యస్.ఆర్.ఐ.టి. కాలేజి కూడా నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా అందులో లైబ్రరీ, ఇంకా ఎక్కువగా రీడింగ్ రూం. ఒక ఇంజినీరింగ్ కాలేజిలో రామాయణం, మహాభారతాల లాంటి పురాణాలకి, అమరావతి కథలు, మైండ్ పవర్, శ్రీశ్రీ కవిత్వం లాంటి మంచి పుస్తకాలకి కూడా స్థానం ఉంటుందని మొదటిసారిగా తెలిసింది:) ఛెయిర్మెన్ గారి ఒక ఫోన్ కాల్‌తో అక్కడి ఇన్‌ఛార్జ్ మాకందించిన గౌరవం, కాలేజి అంతా చూపించిన తీరు చూసి మా ఆనందానికి పట్టపగ్గాల్లేవు :):). మరి ఉన్నట్టుండి వి.వి.ఐ.పి. లు అయిపోయినట్లుగా అనిపించింది. అంత పెద్ద కాలేజి అధిపతి, కోటీశ్వరులు.. ప్రసాద్ గారి ఇంటికొచ్చి ఒక మామూలు మంచం మీద బాసింపట్ల వేసుక్కూర్చుని, భోజనం చేస్తుంటే ఎందుకో నాకు ఆయన మీద ఎనలేని గౌరవం పెరిగిపోయింది. ప్రసాద్ గారి కుటుంబంతో, అతిథులుగా వచ్చిన మాతో, జీవని పిల్లలతో ఆయన మాట్లాడిన తీరు చూసి అభినందించకుండా ఉండలేకపోయాను.

గరికపచ్చ మైదానంలో రంగురంగుల సీతాకోక చిలుకలు చుట్టుముట్టిన భావన, జీవని చిన్నారులు "అక్కా బాగున్నావా" "అన్నయ్యా బాగున్నావా" పలకరింపులతో చుట్టుముట్టినప్పుడు. మన తెలుగు బ్లాగ్లోకపు క్రియేటివ్ హెడ్ రాజ్‌కుమార్, అంతకు ముందు తీసిన ఫోటోల ప్రింట్‌లు ఆ చిన్నారులకి ఇచ్చిన నిమిషంలో, ఎన్ని వేల సూర్యుళ్లని పక్కన పెడితే వారి చిరునవ్వుల వెలుగులకి సరితూగగలదు. ఇక సౌమ్యగారు డిల్లీ నుండి తెచ్చిన గాజులు, చెవి రింగులు, క్లిప్పులు, బెల్టుల్ని చూసి, తీసుకుని, మళ్లీ మళ్లీ చూసి ఎంత ఆనందించారో.. అమ్మా నాన్నా కొత్తగా ఏ వస్తువు కొనిచ్చినా, అంబరాన్నంటే సంతోషాన్ని వెంటపెట్టుకు తిరిగే రోజులు ఏమైపోయాయా అని ఆలోచిస్తే, వాటిని మింగేసింది కాలమా, డబ్బా, బాధ్యతలా, పెద్దరికమా అన్న నా ప్రశ్నకి ఇంకా జవాబే దొరకలేదు. పిల్లల చలాకీతనాన్ని చూసి, మనం వాళ్లకి నేర్పించే సంప్రదాయం పోయి, వాళ్ల దగ్గర నేర్చుకునే రోజులు వస్తే బాగుండు అనుకున్నాను.

ఎన్నాళ్లుగానో కేవలం రాతల ద్వారానే పరిచయం కలిగిన అంతమంది బ్లాగు/బజ్జు మిత్రుల్ని ఒక్కసారిగా కలుస్తానని అనుకోలేదు. కార్తీక్ పెళ్లి అందించిన ఒక మంచి అవకాశం. అందిపుచ్చుకున్నాను:) చాలా ఆనందించాను.అసలు ఎవరో కొత్త వాళ్లతో మాట్లాడుతున్నా అన్న భావనే లేదు ఏ కోశానా.. ఎన్నేళ్లుగానో పరిచయం ఉన్న నా బాల్య మిత్రుల్లా అనిపించారు అందరూ. మరి, అభిరుచి కలిపిన నేస్తాలు కదా:) నాతో పాటు మా ఆయనకూడా బ్లాగ్మిత్రులందరితో కలిసిపోయి సంతోషంగా గడపడం నాకు ఇంకా సంతోషాన్నిచ్చింది:) పెళ్లికొచ్చిన కెమెరా మెన్‌లతో కలిసిపోయిన రాజ్‌కుమారూ; అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఆలోచనల్లో పాపం తన సంగతే మర్చిపోయే ఆర్గనైజర్ బంతి; ఆంగికము, ముఖ కవళికలతోనే మ్యాటర్ అంతా చెప్పడానికి ప్రయత్నించే శీనన్న; భోజన ప్రియురాలు సౌమ్య గారు, భోజనమంటే పడని కిరణు, వాళ్ళిద్దరి సరదా సరదా గొడవలు; పంచులతో నవ్వించే నాగార్జున; అమాయకంగా అనిపించే రెహ్మాన్; ఉన్న పళంగా నన్ను మా ఊరి పొలాలకి తీస్కెళ్లిపోయిన చిలమకూరి విజయ్ మోహన్ గారు; బజ్జులో చూసేది నిజంగా ఈ శంకర్ గారినేనా అని అనుమానం కలిగేంత సైలెంట్‌గా ఉన్న శంకర్ గారు; కాషాయ వస్త్రాల్లో వస్తారేమో అని ఎదురు చూస్తుంటే రంగు దుస్తుల్లో కనిపించి నిరాశపరిచిన నాగానంద స్వాముల వారు.. ఈ అందరితోనూ పంచుకున్న రెండ్రోజుల సమయం నిజంగా అద్భుతం.

పెళ్లంటే పందిళ్లు తప్పట్లు తాళాలు తలంబ్రాలూ... ఇటువంటి సంప్రదాయబద్దమైన పెళ్లిని చూసి చాన్నాళ్లయింది. పెళ్లిలో జరగాల్సిన అన్ని తతంగాల్నీ చాలా చక్కగా సంప్రదాయబద్దంగా జరిపించారు. కార్తీక్ పెళ్లి జంట చూడముచ్చటగా ఉంది.కార్తీక్ తనలో ఉన్న పైశాచికానందాన్ని నిద్రలేపి, పాపం పెళ్లికూతురిని ఏడిపించడం జరిగింది. ఇందుకు గాను తగిన శిక్ష త్వరలోనే అనుభవించబోతున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఎందుంకటే నేను పెళ్లికూతురుతో ఫ్రెండ్‌షిప్ చెయ్యబోతున్నా కదా..;). కార్తీక్ పెళ్లిలో ఉన్నాడన్న మాటే కానీ, పాపం తన మనసంతా మా గుంపు దగ్గరే ఉంది. వీళ్లంతా ఎంచక్కా ఎంజాయ్ చేసేస్తున్నారు, నేను ఇక్కడ ఇరుక్కుపోయా అన్నట్లుగా దీనాతిదీనంగా మొహం పెట్టి పదే పదే మమ్మల్నే చూస్తూ పెళ్లి చేసుకున్నాడు. చివరగా ఫోటోలు గట్రా సుబ్బరంగా దిగేశాంలే..

చిన్నప్పుడు ఎవరి పెళ్లికి వెళ్లినా, ఒక విషయం గురించి మాత్రం ఎప్పుడూ దిగులుగా ఉండేది. భోజనాల నుండి ఏ సాకు చెప్పి తప్పించుకోవాలా అని ఆలోచనల్లో మునిగిపోయేదాన్ని. మరి, పెద్ద పెద్ద బంతిభోజనాల్లో కుర్చుని గంటలు గంటలు తింటూ కుర్చుంటే కుదరదు కదా. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడికెళ్లినా బఫే పద్ధతి చూసి, బంతి భోజనాలు తిని ఎన్నేళ్లయింది అని పాత రోజుల్ని కేవలం ఊహల్లో తలుచుకుంటూ తినెయ్యడమే. అలా బఫే భోజనాలతో విసుగొచ్చిన నేను, కొన్ని సంవత్సరాల తర్వాత కార్తీకు పెళ్లిలో బంతి భోజనాలు చూసిన క్షణంలో.. నాలోపల ఎక్కడో దాగున్న భోజన ప్రియురాలు నిద్రలేచి ఆనంద డోలికల్లో తేలిపోయింది. ఇక రుచి సంగతి చెప్పాలంటే, ముందుగా ప్రసాద్ గారి ఇంటికి వెళ్లిపోవాలి. అల్పాహారం అన్న పేరుతో మూడు రకాల వంటలు, మధ్యాహ్న భోజనం పేరుతో ఇంకొన్ని వంటలు.. ఆహా.. అద్భుతం నిజంగా. అవి అచ్చమైన అనంతపూర్ వంటలంట. నేనైతే దేన్నీ వదిలెయ్యకుండా లాగించేశా :) ఇక పెళ్లి వంటల దగ్గరికొస్తే.. కొంచెం కర్ణాటక రుచులు కలిపిన వంటలంట. ఎన్ని రకాలో.. అఱిటాకులో రుచికరమైన భోజనం. మొత్తంగా రాయలసీమ రుచులకి నేను ఫిదా :):)

ఇక బ్లాగర్ల బ్యాచ్ అల్లరి సంగతి చెప్పాలంటే ఒక టపా సరిపోదు. రెండు రోజులు పూర్తిగా నవ్వులకి అంకితమైపోతే ఎలా ఉంటుందో అనుభవానికొచ్చింది:):) కడుపులో నొప్పి, కళ్లల్లో నీళ్లు మా నవ్వుల్ని ఆపలేకపోయాయి.ఇంత మంచి అనుభవానికి కారణమైన కార్తీక్‌కి, శ్రమ అనుకోకుండా బ్లాగర్లందరినీ ఎంతో ఆదరంగా ఆహ్వానించి ఆతిథ్యాన్నందించిన జీవని ప్రసాద్ గారికి, బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కార్తీక్ కి అతని అర్ధాంగికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారి వైవాహిక జీవితం కలకాలం ఆనందమయం కావాలని, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా జీవితంలోని రెండు పేజీలు ఇంతటి గొప్ప అనుభూతికి లోనవ్వడానికి కారణం మా ఆయన సహకారం:) బ్లాగ్ముఖంగా మా వెంకట్ గారికి కూడా ఓ ధన్యవాదాన్ని ఇచ్చేసుకుంటున్నాను ;)

Thursday, November 3, 2011

గురువు పుట్టిన వేళ

చీకట్లో రోడ్డు మీద బస్సు రామబాణంలా దూసుకుపోతుంది.. స్ట్రీట్ లైట్లు వెనక్కి వెళ్లిపోయి చాలా సేపయ్యి చెట్లు పుట్టలు కూడా వచ్చేశాయి. చల్లగాలి రివ్వున మొహానికి తాకుతూ చలిని పెంచుతుంది..ఇంటికెళుతున్నానన్న ఆనందం ఇవేమీ లెక్కచెయ్యకుండా బస్సుకన్నా వేగంగా ముందుకి పరిగెడుతుంది.. అలోచనలు ఇంటి చుట్టూ చేరి చాలాసేపయింది. తమ్ముళ్లతో ఆడుతూ, అమ్మ చేతి వంట తింటూ నాన్నతో కబుర్లాడుతూ ఊహలు అలా అలా సాగిపోతుండగా.....

ఉన్నట్టుండి మధ్యలో ఘృతాచి వచ్చింది. ఇలియానా డ్యాన్సు చేస్తూ కనిపించింది. ఇక నిత్య.. కళ్లతోనే ఏదేదో చెబుతుంది.. ఎందుకిలా జరుగుతుంది చెప్మా అని విస్తుపోయిన నా మొహం మీద, శూతమహాముని తన కమండలంలోని నీళ్లు చల్లి.. "ఓసీ దుష్ట శిష్యురాలా.. నీ గురువు జన్మదినమునే మరచితివా??????" అని అన్ని కోణాల్లోంచి ఇకోలతో చెప్పారు.. అప్పడియా, అలాగా, ఈజ్ ఇట్, అటులనా, ఐసె క్యా?? అని తెలిసి తెలియని చాలా భాషల్లో ప్రశ్నించేసరికి, పాపం పారిపోయారు:(

అమ్మో ఇంకాసేపు అలాగే ఇంటిధ్యాసలో పడిపోతే ఎంత ధారుణం జరిగిపోయేది అని బహు చింతించి చింతించీ.. అయినా, జీవితమంటేనే ప్రయాణం కదా, ఇంక ప్రయాణంలో చెప్పే శుభాకాంక్షలకి బోల్డంత వాల్యూ అనుకుని (మీరు కూడా అలాగే అనుకోవాలి మరి:)) ఇలా బస్సులోనే కుర్చుని మా గురూ గారికి బోలెడు విషెస్ అందిస్తున్నా అనమాట..

ప్రియాతి ప్రియమైన గురువు బులుసు సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి పుట్టినరోజులు కనీసం(ఇంకా ఎక్కువే అని కోరుకుంటున్నాను) మరొక 33 అయినా చేసుకుని సెంచరీ కొట్టెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....

గురుగారి శుష్యురాలు :)

రండి అందరూ వచ్చి మీ శుభాకాంక్షలు కూడా అందించండి..
పన్లో పని నాకు హ్యాపీ జర్నీ కూడా చెప్పి మా ఊరొచ్చెయ్యండి ;)

P.S. అంటే 12 గంటలకి నెట్ ఉంటుందో డిస్కనెక్ట్ అవుతుందో అని ఇప్పుడే వేసేస్తున్నా అనమాట :)