Monday, April 9, 2012

ఆరోజు

అమ్మో, చూస్తూ చూస్తూనే టైం గడిచిపోతుంది. ఇక యువరాణివారిని నిద్ర లేపాలి. "అమ్మా మైత్రీ.. లేమ్మా, టైం 7 అయింది". ఏంటో పేరుకే నా కూతురు కానీ నా బుద్ధులు ఒక్కటీ రాలేదు. ఒకేసారి చెప్పిన ఏ పనీ చెయ్యదు."నా బంగారం కదూ, లేమ్మా.. స్కూల్ బస్ మిస్ అయిపోతుంది". "ఉండమ్మా, కాసేపాగి లేస్తాను" బద్ధకంగా ముద్ద ముద్దగా వస్తున్న దాని మాటలు కుక్కర్ విజిల్‌తో ఎప్పుడో కలిసిపోయాయి. బలవంతంగా లేపి "స్కూల్‌బస్ మిస్ అయితే ఆటో వెతుక్కుని వెళ్లే సరికి మీ అసెంబ్లీ అయిపోతుంది. అప్పుడు మీ మిస్ పనిష్‌మెంట్ ఇస్తుంది"  రోజూ పాడే పాటే పాడాలి దీనికి, అప్పుడే మాట వింటుంది. "లేవాలి, నా బంగారం కదూ.." హమ్మయ్య, ఎలాగో అలా దాన్ని బాత్‌రూం లోకి పంపించగలిగాను. బయిటికి వచ్చేసరికి దోశలు సిద్ధంగా ఉంచాలి.

మర్చిపోయాను, రేపు ఉదయాన్నే మామయ్య గారు ఊరినుండి వస్తున్నారు కదా, మొలకల కోసం పెసలు శనగలు నానబెట్టాలి. అబ్బబ్బ, ఆయనతో ఒక గొడవ కాదు, ప్రతి రోజూ బ్రేక్‌ఫాస్ట్ లోకి మొలకలు కావాలి. పతిదేవుడి గారికి రోజుకో రకం బ్రేక్‌ఫాస్ట్ కావాలి. కూతురికి అసలు ఏదీ వద్దు. నాకేమో పది చేతులు కావాలి. "అమ్మా, నా స్కూల్ యూనిఫార్మ్ ఎందుకు ఐరన్ చెయ్యలేదూ??" అడగడం అరవడం తప్ప ఇంకేదీ చేతకాదు కదా, అన్నీ తండ్రి బుద్దులే. "చేస్తున్నా తల్లీ, 2 నిమిషాలు" అయ్యయ్యో పప్పుకి ఇంకా పోపు పెట్టలేదు. కూర మాడిపోతున్నట్టుంది. "ఇదిగో, ఐరన్ అయిపోయింది. త్వరగా బట్టలు వేసుకుని వచ్చెయ్, దోశలు వేసి ఉంచుతా"

ఏంటో.. ఇన్ని సంవత్సరాలుగా దోశలు వేస్తున్నా, మొదటి దోశ మాత్రం ఎప్పుడూ మాట వినదు. "ఏమండీ, టిఫిన్ రెడీ.. మీరు రెడీయా?" పతి దేవులవారు ఆఖరి నిమిషంలో తప్ప మిగిలిన సమయమంతా నింపాదిగా ఉంటారెందులకో... "మైత్రీ, రా నువ్వు కూడా తినెయ్". ముగ్గురికీ మధ్యాహ్న భోజన పథకం సిద్ధం. తండ్రీ కూతుర్లని సాగనంపే పని కూడా అయిపోయింది. ఇక నువ్వెళ్లి నీ కొలువుకి తయారవడమే మిగిలింది, వెళ్లు త్వరగా.. అంతరాత్మ పలుకులు అలారం లాగా భలే పనిచేస్తాయి. హమ్మయ్య మొత్తానికి స్నానం ముగించావు, కాసేపు అద్దంలో చూసుకో ఆ బొట్టు ఎక్కడ పెట్టుకున్నావో. అయ్యయ్యో అవును కదా, ఏం చెయ్యను టైం కి ఆఫీసులో ఉండకపోతే ఇక అద్దం ముందే కుర్చోవాలి, నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకుంటూ.

లైట్లు, గ్యాస్ అన్నీ ఆఫ్ చేశావా? చూసుకో ఒకసారి, లేకపోతే రోజంతా నన్ను చంపేస్తావు అదే ప్రశ్నని వంద సార్లు వదిలి. హా చేశాలే, నువ్వు నీ దెప్పి పొడుపులు. ఇంటితాళం ఎక్కడ పెట్టానూ.. ఆ దొరికింది. తలుపు వేసి పక్కకి చూశానో లేదో, ఎప్పుడో కొని అసలింత వరకూ వేసుకోని హీల్స్ 'ఈరోజైనా వేసుకోవా' అన్నట్లు చూస్తున్నాయి. అంతరాత్మ మళ్లీ కస్సుమంది, నువ్వు పెట్టాల్సిన ఉరుకులు పరుగులకి ఇప్పుడు అదొక్కటే తక్కువ అని. సర్లే, వదిలెయ్. త్వరగా వెళ్లి లిఫ్ట్ బటన్ నొక్కు అదెక్కడుందో ఏంటో. హమ్మయ్య వచ్చేస్తుంది. కాలానికి ఋతువుకీ సంబంధం లేకుండా పెదవులు ఎందుకు ఇంతగా పగిలి మంట పెడున్నాయి. బ్యాగ్‌లో లిప్‌గార్డ్ ఉండాలి కదా, లిఫ్ట్‌లో పెట్టేసుకోవచ్చులే.

తానాన తన నానా.. తానానా నన నానా..
అరే, ఇదే పాట. హమ్మింగ్ వస్తుంది, లిరిక్స్ గుర్తు రావట్లేదు. శృతి, లయ అని వస్తుంది.. కమాన్ కమాన్ గుర్తు రా.. తానాన తన నానా.. అబ్బా, ఇంక ఈ పాట ఈరోజంతా వదలదు, గుర్తొచ్చే వరకూ.. తానాన.. తానాన.. ఇలా కాదు, ఇంకేదైనా మార్చు పాట లేకపోతే గుర్తొచ్చే వరకూ పీక్కు తింటావ్. నిజమేలే, సాంగ్ చేంజ్. హ్మ్మ్మ్.. రాగాల పల్లకిలో కోయిలమ్మా.. రాలేదు ఈ వేళ ఎందుకమ్మా.. ఎందుకమ్మా. భలే పాట గుర్తు చేశావ్.ఎంత బావుంటుందో.. బావుంటుంది బావుంటుంది, టైం చూస్తే ఇంకా బాగుంటుంది. అమ్మో టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్..ఇలా నడిస్తే కాదు, పరిగెడితేనే యం.యం.టి.యస్ ని అందుకుంటావు. మొన్న ఇలాగే ఒక్క నిమిషం ఆలస్యం అయ్యేసరికి ట్రెయిన్ నీ కళ్ల ముందే వెళ్లిపొయ్యి, ఆఫీసు వరకూ ఆటోలో వెళ్లాల్సి వచ్చింది, మర్చిపోయావా? ఇంతకీ ఈరోజు ట్రెయిన్ ఉందా వెళ్లిపోయిందా, హమ్మయ్య రాలేదు ఇంకా. ఈలోపు టికెట్ కొనుక్కోపో. తానాన తన నానా.. ఈపాట ఎప్పుడు గుర్తొస్తుందో.. లిప్ గార్డ్ చేతిలోనే పట్టుకుని తిరుగుతున్నావా, బ్యాగ్‌లో పెట్టెయ్యకుండా!

ఈ తాళం చెవి బ్యాగ్‌లో ఉందేంటీ, ఎప్పుడు పెట్టానూ? కొత్త అనుమానాలు పెట్టకు, రోజూ లాగే తాళం వేసి బ్యాగులో పెట్టేసుకుని ఉంటావు. అదిగో ట్రెయిన్ వచ్చేసింది, ఎక్కు ముందు. ఎక్కానులే, కానీ అసలు ఈ తాళం ఎప్పుడు బ్యాగులో పెట్టానూ? ఒక్క సారి చేసిన పనులన్నీ రివైండ్ రివైండ్.. లైట్స్ ఆఫ్, గ్యాస్ ఆఫ్, డోర్ క్లోజ్, తర్వాత?? తర్వాత?????? మామయ్య గారు ఇంట్లోనే ఉంటారు కాబట్టి రోజూ తాళం గొడవ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎప్పుడన్నా అందరం కలిసి బయిటికి వెళ్లినా, ఒకటికి రెండు సార్లు తాళం వేసింది చెక్ చేసుకోవడం అలవాటు. కానీ ఇప్పుడేమో, ఏ చెప్పులేసుకోవాలి అన్న డిస్కషన్ కూడా గుర్తుండి చచ్చింది, అసలు తాళం వేశానా లేదా అన్న విషయం మాత్రం గుర్తు రావట్లేదు.

అయినా ఈ అనుమానాలన్నీ ట్రెయిన్ ఎక్కిన తర్వాతే మొదలవ్వాలా? ఇప్పుడేది దిక్కు? తర్వాత స్టేషన్‌లో దిగి ఇంటికెళ్లే సరికి కనీసం అర్థగంట పడుతుంది. ఈలోగా ఇంట్లోకి ఎవరూ వెళ్లరు కదా. ఏంటీ, తాళం ఖచ్చితంగా వెయ్యలేదు అని డిసైడ్ అయిపోయావా? ఏమో, చూడబోతే అలాగే ఉంది. మొహమంతా దిగులు కమ్మేసి ఒళ్లంతా చెమట పట్టేసింది, భయంతో. పక్క వాళ్లకి ఫోన్ చేస్తే?? వాళ్లు ఊర్లో లేరుగా. సెక్యూరిటీ? నంబర్ ఉందా??అయ్యో ఇప్పుడెలా? పనిమనిషి కూడా పొద్దున్న రాలేదు, ఆఫీసు టైం అయిపోతుందని వచ్చేశాను. ఆ మనిషికసలే బెల్ కొట్టే అలవాటు లేదు, మహాతల్లి నేను ఉన్నాననుకుని డైరెక్ట్‌గా తలుపు తోసుకుని లోపలికి వెళ్లిపోతుంది. హాల్‌లోనే ల్యాఫ్‌టాప్ ఉంది. చిన్న దాని గొలుసు డ్రెస్సింగ్ టేబుల్ మీదే ఉంది, లోపలన్నా పెట్టాను కాదు. అయినా నీ పిచ్చి కానీ, దొంగ బుద్ధి ఉన్నవాళ్లకి ఏ మూలన ఏం ఉన్నా తెలిసిపోతుంది.

ఇక అంతే సంగతులు, ఇల్లంతా గోవింద నామాలతో నిండిపోతుందేమో తిరిగెళ్లేసరికి. దేవుడా, దేవుడా నీదే భారం, ఈ ఒక్కసారికి ఎలాగైనా గట్టెక్కించు, ఒక అర్థ గంట ఇంటికెవ్వరూ వెళ్లకుండా చూడు. తిరుపతి నడిచొస్తా. ఏడుకొండలవాడా వెంకట రమణా..హమ్మయ్య ట్రెయిన్ ఆగింది. అమ్మల్లారా అక్కల్లారా, నన్ను కాస్త దిగనివ్వండి ట్రెయిన్. "ఎక్స్‌క్యూజ్ మీ, కాస్త జరుగుతారా ఇక్కడ దిగాలి" తల్లీ, కాస్త జరుగమ్మా అసలే ఇక్కడ ఒక నిమిషమే ఆగుతుంది ట్రెయిన్. హయ్యో, ట్రెయిన్ కదిలిపోతుంది "హెలో కాస్త జరగండీ" అయ్యో ఫోన్ కింద పడిపోయింది. అన్నీ ఇప్పుడే రావాలా.. నెక్స్ట్ స్టాపే గతి. అప్పటివరకూ అష్టాక్షరి చదువుకుంటే ఏమన్నా ఫలితం ఉంటుందేమో. నీ మొహం, తర్వాత స్టాప్‌లో దిగి ఇంటికెలా వెళ్తావో అది ఆలోచించు ముందు. నీ పతిదేవుల వారికి ఫోన్ చేస్తావా? గొప్ప సలహా ఇచ్చావ్‌లే, ఆయన ఇంటికి రావాలంటే రెండు గంటలు పడుతుంది, అంత సేపూ నాకు వాయింపే. తాళం వెయ్యకుండా ఉంటే ఎలాగూ తిట్లు తప్పవు, ఒక వేళ వేసి ఉంటే అసలు విషయం చెప్పకుండా తప్పించుకోవచ్చు కదా. ఇంటికెళ్తున్నావ్ సరే, ఆఫీసు సంగతో.. ఇప్పుడు ఆఫీసు చూసుకోమంటావా? ఇంట్లో పోయే వస్తువులు చూసుకోమంటావా?

హమ్మయ్య, ట్రెయిన్ ఆగింది, సక్సెస్‌ఫుల్ గా దిగాను కూడా. "ఆటో" రావయ్యా బాబూ. "మీటర్ మీద ఎక్కువే ఇస్తాలే త్వరగా పొనివ్వు నాయనా" దేవుడా దేవుడా, ఈ ఒక్కసారికి ఎలాగైనా కాపాడు తండ్రి, ఇంకెప్పుడూ ఇలా అజాగ్రత్తగా ఉండను. ఇంట్లో డబ్బు కూడా ఎక్కువగానే ఉంది. ముందు వెనకా చూడకుండా ఆటో ఎక్కేశాను, అసలు ఆటోకి సరిపడా డబ్బులున్నాయా పర్స్‌లో..? భగవంతుడా, ఇవి సరిపోవు. ఇప్పుడు ఎ.టి.యం. ఎక్కడ వెతికేదీ? "ఇక్కడ ఏదైనా ఎ.టి.యం. కనిపిస్తే ఆపు నాయనా" లేకపోతే నీకు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. హమ్మయ్య దొరికింది. ఇదేంటి ఎర్రర్? డబ్బులు లేవా? అకౌంట్‌లోనా? ఎ.టి.ఎం. లోనా? అకౌంట్‌లో ఉన్నాయే. మూలిగే నక్కమీద తాటికాయంటే ఇదేనా? హయ్యో. మళ్లీ ఇంకో ఎ.టి.యం అంటే చుట్టు తిరిగి వెళ్లాలి. సరే ఇప్పుడు చెయ్యడానికి ఏం లేదు. ఇంటికెళ్లి, ఇల్లంతా భద్రంగానే ఉంటే కిందకొచ్చి డబ్బులిస్తా. ఈలోగా ఇంటికెవరైనా వెళ్లుంటారా? వెళ్లినా బెల్లు కొట్టి వెనక్కి వెళ్లిపోతే బాగుండు, ఇంట్లోకి వెళ్లకుండా. అపార్ట్‌మెంట్స్ దగ్గరికొచ్చేశావు. గేట్ నుండి బయటికొచ్చేదెవరు చూడు, కారిడార్ క్లీన్ చేసే లక్ష్మమ్మే కదూ. అవును, చేతిలో ఆ సంచీ?? అది మా ఇంట్లోదిలాగానే ఉందేంటి?

రామచంద్ర మహాప్రభో.. అందులో ఉన్నవి మా ఇంట్లో వస్తువులు కాకుండా చూడు తండ్రి.. ఆపి అడిగితే?? ఒకవేళ కాకపోతే దరిద్రంగా ఉంటుంది, ముందు ఇంటికెళ్లి చూడు. అదెక్కడికి పోతుంది, మళ్లీ ఇక్కడికే కదా వస్తుంది."బాబూ, ఇక్కడ ఆపెయ్యి. పర్సులో సరిపడా డబ్బులు లేవు, ఇంట్లోకెళ్లి తెచ్చిస్తా. ఇక్కడే ఉండు 5 నిమిషాలు" అమ్మా లక్ష్మీ దేవి, కాపాడు తల్లీ... బయిటికి వెళ్లిపోకమ్మా..హమ్మయ్య లిఫ్ట్ గ్రౌండ్‌లోనే ఉంది. ఫాస్ట్ ఫాస్ట్.. దేవుడా, తలుపు తెరిచి చూపించకు తండ్రీ. కళ్లు తెరవాలంటే భయంగా ఉంది.

ఫ్లాట్ బయట అటు పక్కగా నిలబడింది ఎవరు!! రత్తాలే కదూ. "రత్తాలూ" "అమ్మగోరూ, వచ్చేశారా! ఏంటమ్మా, తలుపుకి తాలవెయ్యకుండా ఎల్లిపోనారు.పని మీద దగ్గిర్లో ఏడికన్నా పోయుంటారేమో, వచ్చేత్తారులే అని సూత్తా ఉన్నానమ్మా. ఎల్లిపోదామా అంటే, ఏమో రోజులు బాలేవు ఎవరొచ్చి ఏమెత్తుకుపోతారో అని కనిపెట్టుకుని ఉన్నా తల్లి. పోను సేద్దామంటే, అందులో డబ్బుల్లేకపాయే.  సానా టయివైపోనాది, నేనెల్లొత్తానమ్మా. అంట్ల పని, ఇంటి పని సాయంత్రవొచ్చి సేత్తా."

పనిమనిషికి కాల్ చెయ్యమంటే, దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు అవుతుంది అన్నావు. ఇప్పుడేంటి మనసుతో మాట్లాడకుండా కళ్లలో నీళ్లు నింపుకుంటున్నావు?

Monday, January 30, 2012

మరీచిక

గుండె.. యుగాలపాటుగా శ్వాసిస్తూనే ఉంది..
మనసు.. నిశీధి లోకంలో నిను వెదుకుతూ ఉంది..
పయనం.. ప్రతి మలుపంచున నీ ఉనికిని ఊహిస్తూ,
తరగని దూరాన్ని తనలో కలుపుకుంటుంది.

పాదం వదిలిన ప్రతి గురుతులో
రెప్పలు ఓడిన ఆనవాలు..

తీరాలను కలపలేని ప్రతి జామూ
వారధిగా వదిలే జవాబుల్లేని ప్రశ్నలు..

ఇన్నేళ్ల ఊపిరికి దొరకని నువ్వు
వాస్తవపు తొడుగులో..చేదుగా..

మిత్రమా..!!
చావుపుట్టుకల చక్రం నిజమేనంటావా..??
నీ నమ్మకం.. నాగమ్యం..
అందుకే, మరుజన్మ విల్లు నీ పేరున రాసి
మరుక్షణమే మృత్యువుని ముద్దాడుతా..

ఎందుకంటే, నాకు తెలుసు...
నా ఈ ఒంటరి ఎడారి జీవితానికి నువ్వొక మరీచికవని.

Friday, January 20, 2012

మహాసముద్రం


నా మనసొక మహాసముద్రం..
కెరటాల్లా.. ఆలోచనలు..
ఎంత వద్దన్నా నీ వైపుకే.

అలల ఆశ, నువ్వు మహాకాశం కావాలని.
అందుకే, ఆవేశంగా పైకెగిసి..
తీరంలోనే నిన్ను చూసిన క్షణం,
ఇష్టంగా కిందికి దూకుతాయి..
ఆర్తిగా నిన్ను తడుముతాయి.

ఎందుకు నేస్తం??
తీరంతోనే నీ సాహచర్యం?
"నీకు చేరువుగా ఉండొచ్చని"
సమాధానం నాదా? నీదా?

ఇన్నాళ్లూ ఎగసి ఎగసి అలసింది
ఆకాశాన్ని అందుకోలేక కాదు,
అక్కడ నువ్వు లేవని...

ఒక్క క్షణం నింగిని తాకి చూడు.
అర్ణవాకాశాలు కలవడం చూస్తావు..