Wednesday, November 16, 2011

ఆనందమానందమాయే

ప్రపంచంలోని ఏ ఇద్దరు మనుషులూ ఒకేలా ఆలోచించలేరట. కానీ ప్రతి ఇద్దరిలోనూ ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటుంది, అలాగే ఎక్కడో ఒక ఆలోచన దగ్గర అవును కాదు అనే సందర్భమూ ఎదురవుతుంది. ఇలా వ్యక్తిగతంగా చూస్తేనే ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ, తన తోటి మనిషితో.. ఇటువంటి విషయాలు తెలుసుకుని మసులుకోవడమే మానసిక పరిపక్వత అనుకుంటూ జీవితాన్ని జీవించేస్తున్నా అన్న భ్రమలో కాలాన్ని వెళ్లదీస్తున్న నేను, ఒకే తాటిపై నిలబడి, నలుగురికీ జీవితాన్ని పంచుతున్న ఒక కుటుంబాన్ని చూసి విస్తుపోయాను అంటే అది చిన్న పదమే అవుతుంది.

అవును.. జీవని ప్రసాద్ గారి కుటుంబాన్ని దర్శించిన తరువాత అచ్చంగా నా మనసుపలికిన మాటలు ఇవి. అలా ఇంటిలోని ప్రతి ఒక్కరూ జీవని చిన్నారి పిల్లల్ని ప్రేమ ఆప్యాయతలతో చూడడం, అతిథి సేవని అదృష్టంగా భావించి ఆదరాభిమానాలతో ఉక్కిరిబిక్కిరి చెయ్యడం, అయ్యయ్యో పాపం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం అన్న బాధ క్షణక్షణానికీ ఎక్కువవుతున్నా, ఇంతగా కూడా ఆదరించగలరా అన్న ఆశ్చర్యం ఇక నోరు తెరవనివ్వలేదు. "ఇలా మా ఇంటికి మీరు వస్తూ పోతూ ఉంటే మాకు చాలా సంతోషం" అంటూ నిండైన మనసుతో, గుండెల్లోంచి విరిసిన నవ్వుతో ఆహ్వానించే అమ్మ గారికి; శరీరానికి ఓపిక లేకపోయినా, అందర్నీ ఆనందంగా గమనిస్తూ, జీవని కుసుమాల్ని తన సొంత మనవళ్లు మనవరాళ్లుగా ప్రేమించే నాన్న గారికి; కొడుకుగా జన్మించడం ప్రసాద్ గారి అదృష్టమా? ఇంత మంచి కుటుంబంలోకి అడుగుపెట్టి, వారి ఆలోచనల్ని మనసారా గౌరవిస్తూ, ఎంతో ఇష్టంగా, అలుపు లేకుండా సేవించే సునందక్క దొరకడం ఆ కుటుంబం అదృష్టమా? ఏంటో.. నాకైతే కనీసం ఇన్నేళ్లకైనా ఆ కుటుంబంతో, ప్రేమతో నిండిన పరిసరాలతో పరిచయం ఏర్పడడం నా అదృష్టమనే అనిపిస్తుంది.

రెండు మనసుల్లో మొలకెత్తిన ఒక గొప్ప సంకల్పం ఎంతటివారినైనా ఒకటి చేస్తుంది. అందుకు ఉదాహరణ, జీవని ప్రసాద్ గారిని నోరారా అన్నా అని ఆప్యాయంగా పిలిచే యస్.ఆర్.ఐ.టి. ఛెయిర్మెన్ సాంబ శివా రెడ్డి గారు. యస్.ఆర్.ఐ.టి. కాలేజి కూడా నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా అందులో లైబ్రరీ, ఇంకా ఎక్కువగా రీడింగ్ రూం. ఒక ఇంజినీరింగ్ కాలేజిలో రామాయణం, మహాభారతాల లాంటి పురాణాలకి, అమరావతి కథలు, మైండ్ పవర్, శ్రీశ్రీ కవిత్వం లాంటి మంచి పుస్తకాలకి కూడా స్థానం ఉంటుందని మొదటిసారిగా తెలిసింది:) ఛెయిర్మెన్ గారి ఒక ఫోన్ కాల్‌తో అక్కడి ఇన్‌ఛార్జ్ మాకందించిన గౌరవం, కాలేజి అంతా చూపించిన తీరు చూసి మా ఆనందానికి పట్టపగ్గాల్లేవు :):). మరి ఉన్నట్టుండి వి.వి.ఐ.పి. లు అయిపోయినట్లుగా అనిపించింది. అంత పెద్ద కాలేజి అధిపతి, కోటీశ్వరులు.. ప్రసాద్ గారి ఇంటికొచ్చి ఒక మామూలు మంచం మీద బాసింపట్ల వేసుక్కూర్చుని, భోజనం చేస్తుంటే ఎందుకో నాకు ఆయన మీద ఎనలేని గౌరవం పెరిగిపోయింది. ప్రసాద్ గారి కుటుంబంతో, అతిథులుగా వచ్చిన మాతో, జీవని పిల్లలతో ఆయన మాట్లాడిన తీరు చూసి అభినందించకుండా ఉండలేకపోయాను.

గరికపచ్చ మైదానంలో రంగురంగుల సీతాకోక చిలుకలు చుట్టుముట్టిన భావన, జీవని చిన్నారులు "అక్కా బాగున్నావా" "అన్నయ్యా బాగున్నావా" పలకరింపులతో చుట్టుముట్టినప్పుడు. మన తెలుగు బ్లాగ్లోకపు క్రియేటివ్ హెడ్ రాజ్‌కుమార్, అంతకు ముందు తీసిన ఫోటోల ప్రింట్‌లు ఆ చిన్నారులకి ఇచ్చిన నిమిషంలో, ఎన్ని వేల సూర్యుళ్లని పక్కన పెడితే వారి చిరునవ్వుల వెలుగులకి సరితూగగలదు. ఇక సౌమ్యగారు డిల్లీ నుండి తెచ్చిన గాజులు, చెవి రింగులు, క్లిప్పులు, బెల్టుల్ని చూసి, తీసుకుని, మళ్లీ మళ్లీ చూసి ఎంత ఆనందించారో.. అమ్మా నాన్నా కొత్తగా ఏ వస్తువు కొనిచ్చినా, అంబరాన్నంటే సంతోషాన్ని వెంటపెట్టుకు తిరిగే రోజులు ఏమైపోయాయా అని ఆలోచిస్తే, వాటిని మింగేసింది కాలమా, డబ్బా, బాధ్యతలా, పెద్దరికమా అన్న నా ప్రశ్నకి ఇంకా జవాబే దొరకలేదు. పిల్లల చలాకీతనాన్ని చూసి, మనం వాళ్లకి నేర్పించే సంప్రదాయం పోయి, వాళ్ల దగ్గర నేర్చుకునే రోజులు వస్తే బాగుండు అనుకున్నాను.

ఎన్నాళ్లుగానో కేవలం రాతల ద్వారానే పరిచయం కలిగిన అంతమంది బ్లాగు/బజ్జు మిత్రుల్ని ఒక్కసారిగా కలుస్తానని అనుకోలేదు. కార్తీక్ పెళ్లి అందించిన ఒక మంచి అవకాశం. అందిపుచ్చుకున్నాను:) చాలా ఆనందించాను.అసలు ఎవరో కొత్త వాళ్లతో మాట్లాడుతున్నా అన్న భావనే లేదు ఏ కోశానా.. ఎన్నేళ్లుగానో పరిచయం ఉన్న నా బాల్య మిత్రుల్లా అనిపించారు అందరూ. మరి, అభిరుచి కలిపిన నేస్తాలు కదా:) నాతో పాటు మా ఆయనకూడా బ్లాగ్మిత్రులందరితో కలిసిపోయి సంతోషంగా గడపడం నాకు ఇంకా సంతోషాన్నిచ్చింది:) పెళ్లికొచ్చిన కెమెరా మెన్‌లతో కలిసిపోయిన రాజ్‌కుమారూ; అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఆలోచనల్లో పాపం తన సంగతే మర్చిపోయే ఆర్గనైజర్ బంతి; ఆంగికము, ముఖ కవళికలతోనే మ్యాటర్ అంతా చెప్పడానికి ప్రయత్నించే శీనన్న; భోజన ప్రియురాలు సౌమ్య గారు, భోజనమంటే పడని కిరణు, వాళ్ళిద్దరి సరదా సరదా గొడవలు; పంచులతో నవ్వించే నాగార్జున; అమాయకంగా అనిపించే రెహ్మాన్; ఉన్న పళంగా నన్ను మా ఊరి పొలాలకి తీస్కెళ్లిపోయిన చిలమకూరి విజయ్ మోహన్ గారు; బజ్జులో చూసేది నిజంగా ఈ శంకర్ గారినేనా అని అనుమానం కలిగేంత సైలెంట్‌గా ఉన్న శంకర్ గారు; కాషాయ వస్త్రాల్లో వస్తారేమో అని ఎదురు చూస్తుంటే రంగు దుస్తుల్లో కనిపించి నిరాశపరిచిన నాగానంద స్వాముల వారు.. ఈ అందరితోనూ పంచుకున్న రెండ్రోజుల సమయం నిజంగా అద్భుతం.

పెళ్లంటే పందిళ్లు తప్పట్లు తాళాలు తలంబ్రాలూ... ఇటువంటి సంప్రదాయబద్దమైన పెళ్లిని చూసి చాన్నాళ్లయింది. పెళ్లిలో జరగాల్సిన అన్ని తతంగాల్నీ చాలా చక్కగా సంప్రదాయబద్దంగా జరిపించారు. కార్తీక్ పెళ్లి జంట చూడముచ్చటగా ఉంది.కార్తీక్ తనలో ఉన్న పైశాచికానందాన్ని నిద్రలేపి, పాపం పెళ్లికూతురిని ఏడిపించడం జరిగింది. ఇందుకు గాను తగిన శిక్ష త్వరలోనే అనుభవించబోతున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఎందుంకటే నేను పెళ్లికూతురుతో ఫ్రెండ్‌షిప్ చెయ్యబోతున్నా కదా..;). కార్తీక్ పెళ్లిలో ఉన్నాడన్న మాటే కానీ, పాపం తన మనసంతా మా గుంపు దగ్గరే ఉంది. వీళ్లంతా ఎంచక్కా ఎంజాయ్ చేసేస్తున్నారు, నేను ఇక్కడ ఇరుక్కుపోయా అన్నట్లుగా దీనాతిదీనంగా మొహం పెట్టి పదే పదే మమ్మల్నే చూస్తూ పెళ్లి చేసుకున్నాడు. చివరగా ఫోటోలు గట్రా సుబ్బరంగా దిగేశాంలే..

చిన్నప్పుడు ఎవరి పెళ్లికి వెళ్లినా, ఒక విషయం గురించి మాత్రం ఎప్పుడూ దిగులుగా ఉండేది. భోజనాల నుండి ఏ సాకు చెప్పి తప్పించుకోవాలా అని ఆలోచనల్లో మునిగిపోయేదాన్ని. మరి, పెద్ద పెద్ద బంతిభోజనాల్లో కుర్చుని గంటలు గంటలు తింటూ కుర్చుంటే కుదరదు కదా. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడికెళ్లినా బఫే పద్ధతి చూసి, బంతి భోజనాలు తిని ఎన్నేళ్లయింది అని పాత రోజుల్ని కేవలం ఊహల్లో తలుచుకుంటూ తినెయ్యడమే. అలా బఫే భోజనాలతో విసుగొచ్చిన నేను, కొన్ని సంవత్సరాల తర్వాత కార్తీకు పెళ్లిలో బంతి భోజనాలు చూసిన క్షణంలో.. నాలోపల ఎక్కడో దాగున్న భోజన ప్రియురాలు నిద్రలేచి ఆనంద డోలికల్లో తేలిపోయింది. ఇక రుచి సంగతి చెప్పాలంటే, ముందుగా ప్రసాద్ గారి ఇంటికి వెళ్లిపోవాలి. అల్పాహారం అన్న పేరుతో మూడు రకాల వంటలు, మధ్యాహ్న భోజనం పేరుతో ఇంకొన్ని వంటలు.. ఆహా.. అద్భుతం నిజంగా. అవి అచ్చమైన అనంతపూర్ వంటలంట. నేనైతే దేన్నీ వదిలెయ్యకుండా లాగించేశా :) ఇక పెళ్లి వంటల దగ్గరికొస్తే.. కొంచెం కర్ణాటక రుచులు కలిపిన వంటలంట. ఎన్ని రకాలో.. అఱిటాకులో రుచికరమైన భోజనం. మొత్తంగా రాయలసీమ రుచులకి నేను ఫిదా :):)

ఇక బ్లాగర్ల బ్యాచ్ అల్లరి సంగతి చెప్పాలంటే ఒక టపా సరిపోదు. రెండు రోజులు పూర్తిగా నవ్వులకి అంకితమైపోతే ఎలా ఉంటుందో అనుభవానికొచ్చింది:):) కడుపులో నొప్పి, కళ్లల్లో నీళ్లు మా నవ్వుల్ని ఆపలేకపోయాయి.ఇంత మంచి అనుభవానికి కారణమైన కార్తీక్‌కి, శ్రమ అనుకోకుండా బ్లాగర్లందరినీ ఎంతో ఆదరంగా ఆహ్వానించి ఆతిథ్యాన్నందించిన జీవని ప్రసాద్ గారికి, బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కార్తీక్ కి అతని అర్ధాంగికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారి వైవాహిక జీవితం కలకాలం ఆనందమయం కావాలని, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా జీవితంలోని రెండు పేజీలు ఇంతటి గొప్ప అనుభూతికి లోనవ్వడానికి కారణం మా ఆయన సహకారం:) బ్లాగ్ముఖంగా మా వెంకట్ గారికి కూడా ఓ ధన్యవాదాన్ని ఇచ్చేసుకుంటున్నాను ;)

Thursday, November 3, 2011

గురువు పుట్టిన వేళ

చీకట్లో రోడ్డు మీద బస్సు రామబాణంలా దూసుకుపోతుంది.. స్ట్రీట్ లైట్లు వెనక్కి వెళ్లిపోయి చాలా సేపయ్యి చెట్లు పుట్టలు కూడా వచ్చేశాయి. చల్లగాలి రివ్వున మొహానికి తాకుతూ చలిని పెంచుతుంది..ఇంటికెళుతున్నానన్న ఆనందం ఇవేమీ లెక్కచెయ్యకుండా బస్సుకన్నా వేగంగా ముందుకి పరిగెడుతుంది.. అలోచనలు ఇంటి చుట్టూ చేరి చాలాసేపయింది. తమ్ముళ్లతో ఆడుతూ, అమ్మ చేతి వంట తింటూ నాన్నతో కబుర్లాడుతూ ఊహలు అలా అలా సాగిపోతుండగా.....

ఉన్నట్టుండి మధ్యలో ఘృతాచి వచ్చింది. ఇలియానా డ్యాన్సు చేస్తూ కనిపించింది. ఇక నిత్య.. కళ్లతోనే ఏదేదో చెబుతుంది.. ఎందుకిలా జరుగుతుంది చెప్మా అని విస్తుపోయిన నా మొహం మీద, శూతమహాముని తన కమండలంలోని నీళ్లు చల్లి.. "ఓసీ దుష్ట శిష్యురాలా.. నీ గురువు జన్మదినమునే మరచితివా??????" అని అన్ని కోణాల్లోంచి ఇకోలతో చెప్పారు.. అప్పడియా, అలాగా, ఈజ్ ఇట్, అటులనా, ఐసె క్యా?? అని తెలిసి తెలియని చాలా భాషల్లో ప్రశ్నించేసరికి, పాపం పారిపోయారు:(

అమ్మో ఇంకాసేపు అలాగే ఇంటిధ్యాసలో పడిపోతే ఎంత ధారుణం జరిగిపోయేది అని బహు చింతించి చింతించీ.. అయినా, జీవితమంటేనే ప్రయాణం కదా, ఇంక ప్రయాణంలో చెప్పే శుభాకాంక్షలకి బోల్డంత వాల్యూ అనుకుని (మీరు కూడా అలాగే అనుకోవాలి మరి:)) ఇలా బస్సులోనే కుర్చుని మా గురూ గారికి బోలెడు విషెస్ అందిస్తున్నా అనమాట..

ప్రియాతి ప్రియమైన గురువు బులుసు సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి పుట్టినరోజులు కనీసం(ఇంకా ఎక్కువే అని కోరుకుంటున్నాను) మరొక 33 అయినా చేసుకుని సెంచరీ కొట్టెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....

గురుగారి శుష్యురాలు :)

రండి అందరూ వచ్చి మీ శుభాకాంక్షలు కూడా అందించండి..
పన్లో పని నాకు హ్యాపీ జర్నీ కూడా చెప్పి మా ఊరొచ్చెయ్యండి ;)

P.S. అంటే 12 గంటలకి నెట్ ఉంటుందో డిస్కనెక్ట్ అవుతుందో అని ఇప్పుడే వేసేస్తున్నా అనమాట :) 

Tuesday, October 4, 2011

బ్లాగ్లోకంలో మీతో నేను - 2

ఇప్పుడు మీకొక నోరూరించే బ్లాగు గురించి చెబుతాను:) ఆ పేరు వింటే చాలు, లాలాజలం వరద గోదారిలా పొంగుతుంది. పరిచయం చేసిన సౌమ్య గారికి, బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలపడం అన్నది చాలా తక్కువ అవుతుంది, కానీ అంతకు మించి ఏమీ చెయ్యలేను. అంత మంచి బ్లాగు ఎవరిదో ఈసరికే మీకర్థమయ్యి ఉంటుందనుకుంటున్నాను. అవును, మన కొత్తావకాయ గారిదే :) అడగడం ఆలస్యం ఆవకాయ గురించి "ఉప్పెంతో కారం అంత, కారం ఎంతో ఆవపిండి అంత,అవన్నీ ఎంతో నూనె అంత. ఆవకాయంటే ఇంతే.." అంటూ చెప్పుకు పోతారు. తిండి తినడం ఇష్టం లేని నా లాంటి వారి చేత కూడా ఔరా, తిండి ఇంత బాగుంటుందా అనిపించేలా రాసిన "ప్రేమలో ఆరుసార్లు" టపా చదివితీరాల్సిందే. పూబాలల గురించి.. అబ్బో చెప్పనలవి కాదు. టపా చదివిన రాత్రి, చెంగల్వలు కల్లోకొచ్చి పలకరించాయంటే అర్థం చేసుకోవాల్సిందే ఆ అద్భుతాన్ని. అంతేనా, ఎన్నో పిట్ట కథలు, చిట్టి కథలు. మొత్తంగా ఆ బ్లాగు స్వర్గంలో దేవకన్యలు తిరిగుతూ ఉండే  నందనవనం :))

తెలంగాణ యాస మరింత నచ్చేట్టుగా చేసిన బ్లాగరు గురించి ఏమని చెప్పుకోగలం? ఆ రామయ్యపై తనకున్న స్నేహానికి, భక్తికి అద్భుతపు తొడుగు తొడిగి అందంగా మలచిన "ఎన్నెల రామాయణం" చదవకపోతే, నేను చెప్పను. మీరు చదవాలి అంతే:)చల్లని వెన్నెల, నవ్వుల  పువ్వులు, ప్రేమ గుర్తులు అన్నీ కనిపించే బ్లాగు. అంతేనా.. బెట్టీ కబుర్లు విన్నారంటే దయ్యం ధైర్యంగా వచ్చి చక్కిగింతలు పెట్టడం చూస్తారు . అసలివన్నీ కాదండీ, ఆ పేరుతోనే కట్టి పడేస్తారు అందర్నీ.. నాకు చాలా నచ్చిన బ్లాగర్లలో ఒకరు, మన ఎన్నెల గారు:) ఇక "పరకాయ ప్రవేశం" చదివారంటే, ఎన్నెల గారి లోకి పరకాయ ప్రవేశం చేసి ఆవిడ అంత బాగా ఎలా రాయగలరో, అన్ని అయిడియాలు ఎలా వస్తాయో తెలుసుకోవాలనిపించక మానదు :)


అలా అలా మాలికలో తిరుగుతూ జెక్కంశెట్టి సూర్రావు-ఎకరం పొలం టైటిల్ చూసి, ఇదేదో మన వంశీ కథ టైటిల్ లాగా ఉందే అనిపించి అలా దూకాను, పడమటి గోదావరిలోకి. మీకు అనుమానంగా ఉంటే ఒకసారి ఈ కథ చదవండి, వంశి కథని కాపీ చేసి తన బ్లాగులో పెట్టేసుకున్నట్లు లేకపోతే నన్నడగండి.బ్లాగరు పేరు శ్రీనివాసరాజు ఇందుకూరి. పశ్చిమ గోదావరి పసిరికలు, కొబ్బరి చెట్లు, ముగ్గుల కళ్లాపి వాకిళ్లు ఇంకా చాలా వాటిని మనకు పంచే ఒక మంచి బ్లాగరు:) శ్రీనివాసరాజు గారింట్లో నేల మాళిగల దర్శనం, లక్ష్మిదేవి  కటాక్షం చూసారంటే మళ్లీ వెనక్కి రారు, ఆ బ్లాగు ఫాలో అవ్వకుండా.ఇక కష్టాలున్న ఏ డెవలపర్ "ప్రతి డెవలపర్ కి ఒక రోజు" చదివినా, అటువంటి ఒకరోజుని తమకి కూడా ఆ దేవుడు ప్రసాదించేలా కోరుకోకుండా ఉండరు:)

శైలబాల.. ఈ పేరుతో కన్నా, "వెన్నెల్లో గోదావరి" పేరుతోనే బ్లాగ్లోకంలో సుప్రసిద్ధురాలు అనుకుంటున్నా :). జీవితం గోదావరి అయితే ప్రేమ వెన్నెల అంటూ.. ప్రేమతో నిండిన జీవితం వెన్నెల్లో గోదావరి అంత అందంగా ఉంటుందని తన నవల ద్వారా రుచి చూపించిన బ్లాగరు మన శైలు. శైలు అంటే వెన్నెల్లో గోదావరి గుర్తు రావడం మామూలు విషయం. వెన్నెల్లో గోదావరి అంటే శైలు గుర్తు రావడం బాగుంటుంది కదా చాలా. అదే జరుగుతూ ఉంటుంది నా వరకు. మంచి రచయితే కాదు, ఇంకా మంచి స్నేహితురాలు కూడా.ఇద్దరు మనుషుల మధ్య ఎటువంటి బంధమైనా, అందులో కాస్త ప్రేమని కలిపితే జీవితం ఎంత అందంగా ఉంటుందో చాలా బాగా చెప్పగలిగింది శైలు. బాధగా అనిపించిన విషయమేమిటంటే.. "వెన్నెల్లో గోదావరి" నవలకి సంబంధించి ఇక భాగాలు లేవు, ముగింపుని కలిశాయి. కానీ, తన నవల ద్వారా శైలు అందించిన ప్రేమ పూల పరిమళాలు చదివిన అందరి మనసుల్లోనూ ఉంటాయి ఎప్పటికీ.. మరి వెన్నెల్లో గోదావరి అంతా చదివేసి వెన్నెల్లో గోదావరి ఎలా పుట్టిందో చూడకుండా వెళ్లిపోతారా???

ఇప్పుడేమో మరొక అద్భుతమైన బ్లాగరు గురించి చెబుతానంటా.. మరేమో ఆవిడెవరంటే.. రోజువారీ విషయాల్లోనే కాసింత హాస్యాన్ని మేళవించి, మనకి చక్కిలిగింతలు పెడతారు కదా.. అర్థమయిపోయిందని నాకు తెలుసోచ్.. మన కృష్ణప్రియ గారు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.. ఎందుకో తెలీదు కానీ, కృష్ణప్రియ గారి డైరీ నేను కాస్త ఆలస్యంగా చూశాను :( అందుకు చింతిస్తూ ఉంటాను కూడా.. అనుకోకుండా ఆ రోజు అతిథిదేవో భవ చూశా.. పాపం, మర్యాదలకు అర్హత లేని అతిథితో కృష్ణప్రియ గారు పడిన కష్టాలు చూసి అయ్యయ్యో అనుకున్నా. ఏమాటకామాటే చెప్పుకోవాలి, నాకు కృష్ణప్రియ గారి బ్లాగులో చాలా చాలా నచ్చేవి ఆవిడ వాడే క్లిప్ ఆర్టులు. భలే పెడతారు, సందర్భానికి అనుగుణంగా. ఆతరువాత అన్ని టపాలూ చదివాను :). ముఖ్యంగా నిర్వోష్ఠ్య బ్లాగాయణం చదివి ఎం చెప్పాలో కూడా తెలీలేదు. ఇదీ అదీ అని చెప్పలేను కానీ, అన్ని టపాలు నచ్చుతాయి నాకు. కొత్తగా రాసిన "నిజమైన కల" చదివి మామూలుగా నవ్వుకోలేదు ;)



పదాలను సున్నితంగా అందంగా అల్లగల మరొక మంచి బ్లాగరు స్నేహ గారు. నిజంగా నేనేనా అంటూ మనతో ముచ్చట్లాడతారు. నేను మొదటగా చూసిన స్నేహ గారి రచన "పెళ్లి చూపులు" కథ. నాకు చాలా బాగా నచ్చిన కథ. అంతకు మించి బాగున్న కథ "రెండవ కథ". ముఖ్యంగా తన గురించి చెప్పుకోవలసినది, ఒక పాత్ర అంతర్గతంగా పడే సంఘర్షణని చాలా బాగా ఆవిష్కరిస్తారు.  బాల్యమా ఇక రావా అంటూ బాధ పడే కవిత చూస్తే మనల్ని మనం అందులో చూసుకుంటాం.చిన్న నాటి ఙ్ఞాపకాలు వెన్నంటి తీసుకెళ్తాయి ఆ రోజులకి. మొత్తంగా నాకు నచ్చిన మరొక మంచి బ్లాగరు స్నేహ గారు :)) 

కార్తీక్. సాధారణంగా కార్తీక్ పేరు వినగానే, చిత్రమాలిక కోసం అందర్నీ వ్యాసాలు అడుగుతాడని చాలా మందికి చిత్రమాలిక గుర్తొస్తూ ఉంటుంది(ట). కానీ నాకు మాత్రం నేను చదివిన మొదటి టపా గుర్తొస్తూ ఉంటుంది. బ్లాగ్వనభోజనాల్లో "టమోటా పులుసు" చేయు విధానం వర్ణించిన టపా. ఆరోజు ఎంతగా నవ్వానంటే.. నాకింకా గుర్తుంది వంటల పుస్తకంలో "టమాటాలని ఒకమాదిరి ముక్కలు కోసుకోవాలి" అని ఉండడంతో, ఏ మాదిరి ముక్కలు కొయ్యాలో తెలీక సైజుకి ఒక ముక్క కోసి వండిన తీరు. అబ్బ కడుపు చెక్కలయ్యేలా నవ్వాను. ఆ తరువాతే చిత్రమాలిక, అందులో తను పోస్ట్ చేసే ఆర్టికల్సూనూ ;)

"నా స్పందన" ఈ పేరు వినగానే మీ ముఖంపై చిరునవుల పువ్వులు పుయ్యడం సర్వ సాధారణం కదూ. నాకైతే అంతే. చాలా సున్నితమైన హాస్యంతో గిలిగింతలు పెట్టి నవ్వించేవాళ్లలో లలిత గారు ఒకరు. నాకు బ్లాగులు తెలిసిన కొత్తల్లో లలిత గారు బ్రేకులో ఉన్నారు. బ్రేకు నుండి తిరిగి వచ్చిన రోజు టపా చూశాను, మొదటిది. "బ్రేక్ కే బాద్, బ్రేకు లేకుండా బాదు" ఏదో డిప్రెషన్ లో ఉన్నట్లు రాశారు. కానీ బాధని కూడా సంతోషంగా, నవిస్తూ చెప్పగలగడం ఒక కళ. ఆరోజు టపా చదువుతూ అనుకున్న మాట ఇది, అంత బగా రాశారు. ఇక ఆ తరువాత నో బ్రేక్, ఆవిడ పంచే నవ్వులకి :) ఓదార్పు కావాలని, పద్మనాభుడికి వెంకటేశుడికి మీటింగు పెట్టి ఇంకా చాలా రకాలుగా నవ్వించేశారు. స్వీట్లు పంచి సంతోషాన్నీ పంచుకున్నారు..


ఆ మాటల్లో ఏం మంత్రం ఉందో, అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. తన ఊహలకి అలవోకగా అందమైన రూపాన్నిస్తూ ఒదిగిపోతాయి అక్షరాలు. తన రచనలు చదవడం మొదలు పెట్టేంత వరకే మనకు తెలుస్తుంది. ఎలా అక్షరాల వెంట పరిగెడతామో, ఎక్కడెక్కడ ఆగిపోయి అనుభవిస్తూ ఉంటామో తెలియను గాక తెలియదు. నాకు చాలా చాలా నచ్చిన బ్లాగుల్లో ఒకటైన మధు మానసం గురించి ఇంత కన్నా మంచి పరిచయం ఇవ్వాలని ఉంది, కానీ అక్షరాలు నా వెంట రావడం లేదు కదా.. ఏదైనా అనుభూతికో ఊహకో అనుభవానికో తనిచ్చే అక్షర రూపం చూస్తుంటే అసూయగా ఉంటుంది అన్నది అక్షర సత్యం:)నమ్మశక్యంగా లేకపోతే తను రాసిన "ఎవరు చెప్తారు నీకు" చదవండి.
అనుభవాలకి ఎర్ర రంగు అక్షరాల అందమైన మాల కట్టిన "గోరింటాకు గురుతులు" చూస్తే మీరంతా కూడా మీ చిన్నతనానికి వెళ్లిపోతారు. యాత్రా విశేషాలంటూ తను రాసిన అహోబిళం ముచ్చట్లు చదివితే తన రాతల్లోనే చూసేస్తారు అహోబిళం.

శిశిర, ఆ పేరులోనే ఒక పరిపక్వత కనిపిస్తూ ఉంటుంది నాకు. ముందుగా ఎదసడి బ్లాగులోకి వెళ్లాలంటే, శిశిర గురించి తనే రాసుకున్న నాలుగు మాటలు చదివి తీరాల్సిందే. చదువుతూ చదువుతూనే మరో లోకంలోకి వెళ్లిపోకపోతే.. అహ, అసలు అలా జరగదు, ఖచ్చితంగా వెళ్లిపోతాం. తన మాటల్లోని మాయ అలాంటిది. "గమ్యం కంటే ఆ గమ్యంకోసం చేసే ప్రయాణమే నాకిష్టం. ఎందుకంటే అందులోనే బ్రతుకుంది, అందులోనే అర్థముంది" అని చెప్పే శిశిర ఎంత పరిపక్వతతో ఆలోచిస్తుందో, మరెంతగా జీవితాన్ని అర్థం చేసుకుందో తెలుసుకోవాలనుకుంటే తన బ్లాగు చూడాల్సిందే. చాలా విషయాలు చెబుతున్నప్పుడు, తనొక సైకాలజిస్టొ, ఫిలాసఫిస్టో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. కానీ వృత్తి పరంగా ఉపాధ్యాయురాలు అని తెలిసి మరింత సంతోషించా (నాకు ఆ వృత్తంటే చచ్చేంత ఇష్టం మరి). రోజూ మనకు కనిపించే విషయాల్లోనే ఎన్నో కొత్త కోణాలు చెప్పీ చెప్పకుండా "మరో ప్రయాణంలో" చూపించింది శిశిర. శిశిర అంటే సీరియస్ టపాలు అని తనే ఇచ్చేసుకున్న పేరు నుండి కాస్త పక్కకి జరిగి రాసిన టపా "ఒక సాయంత్రం" తప్పక చదివి తీరాలి:)))

జీవితాన్ని ప్రతి క్షణం జీవించాలన్న ఆశతో ముందుకు సాగే తృష్ణ గారి బ్లాగు గురించి అందరికీ తెలిసిందే. వంటల తయారీ మొదలుకొని, సినిమా రివ్యూలు, పుస్తక సమీక్షలు, పాటల పరిచయాలు దేన్నైనా అలవోకగా రాసెయ్యగల బ్లాగరు తృష్ణ గారు. పెరట్లో మొక్కల ఫోటోలు నాకు భలే నచ్చుతాయి. తృష్ణ గారి టపాలన్నీ మంచి ఇంఫర్మేటివ్ గా ఉంటాయి అనిపిస్తుంటుంది నాకైతే. తన బ్లాగులో టపాలు చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి. చాలా ఫ్రీక్వెంట్ గా రాసే తృష్ణ గారు ఈ మధ్యనే బ్రేక్ ఇవ్వడం మనసుకి రుచించలేదు. త్వరలో మళ్లీ తృష్ణ గారు బ్లాగ్లోకానికి రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

మరొక్కసారి నేను ముందు టపాచివర్లో చెప్పిన నాలుగు ముక్కల్ని గుర్తు తెచ్చుకోండీ :):) (ఈ టపాలో నేను పలకరించని వాళ్లెవరూ కూడా తొందరపడి బాధపడి, నా మీద అలిగేసి, ధర్నాలు గట్రా చెయ్యొద్దని మనవి :) :) మీ అందరినీ కలుసుకోడానికి మరొక టపాతో మీ ముందుకు వస్తాను. అంతవరకూ...)
సశేషం..

Tuesday, September 20, 2011

అక్షరమా

మది జారిన శూన్యంలో.. నువ్వూ కరిగిపోయావా?
నీకై తపన కరువని కాలంతో కదిలిపోయావా??

మదిలో మిణుగురు మెరుపుకే
అరగడియైనా ఆలస్యంలేని నీ ఆగమనం..
అందంగా అర్థవంతంగా ముస్తాబయ్యి
కలంలో సిరాలా జాలువారి
పొందిగ్గా ఒదిగిపోయే నీ రూపం.

రెప్పల వెనుక రంగుల్లో ఉండగా చటుక్కున వచ్చే నీ ఙ్ఞాపకం.
నన్నొదిలి వెళ్లేదానివా, తెల్ల కాగితాన్ని నలుపు చేసేంత వరకూ..
రవ్వంత బాధలో ఉంటే, ఒడిలో చేర్చుకుని అందించే ఓదార్పు నీదే కదా.
కొండంత సంతోషంలో ఉంటే నీ ఈ కూతురి నవ్వుని నలుగురికీ పంచేదీ నువ్వే.

ఇదంతా ఒకనాటి మాట 

అలా కళ్లు మూసి తెరిచానో లేదో
కాసిన్ని నెలలు కరిగిపోయాయి గోడమీద.
ఇంతలో ఏమైందో ఏమో,
ఉలుకూ పలుకూ లేని నువ్వు.. నా ఎదురుగా..
ఒక తలంపుకే నన్ను వరిస్తావనుకున్నా.
కానీ ఎన్నెన్ని పిలుపులకి సైతం నీ కరుణ దొరకలేదే.

మనసుని ఎంతని మధించను నిన్ను రప్పించడానికి?
భావాల్ని ఎన్నని వరించను నువ్వు వర్ణించడానికి?
దేనికీ చలనం లేని నిన్ను చూసి
దుఃకిస్తున్న మది ఓదార్పుకైనా రావు కదా..

అయినా ఊహల గేలానికే అందని నువ్వు
కలమంచున కరగడానికెలా వస్తావు?
మనసు పేజీలో లేని నీ సంతకం
సిరాలో కలవడం ఎలా సాధ్యం?

ఆరోజు..అద్వితీయమైన అనుభూతికి మాత్రమే నీ ఆసరా కరువైన రోజు.
అది అనుభూతి గొప్పదనం.
ఈరోజు..కనీసం అనుభవానికైనా నీ ముసుగు వెయ్యలేని రోజు..
ఇది ఖచ్చితంగా నా పరాభవం.

నాకు తెలిసిన నీ గురించి చెప్పాలంటే..
నీ స్పర్శ చాలు, తెల్లని శూన్యం కాస్తా
అంబరాన్నంటే ఆనందంగా మారగలదు
అగాధాలను స్పృశిస్తూ లోతుల్ని కొలవగలదు
చరిత్ర పుటల్లోని చరణాలను వినిపించగలదు
నిజం..
నీ ఒక్క అడుగు చాలు, అంతులేని మది నింగిని తెరిచి చూపించగలదు.

మరి అలాంటి నువ్వు ఎందుకు నేస్తం నా చెంతకు చేరవు..

Friday, September 16, 2011

బ్లాగ్లోకంలో మీతో నేను

మధుర అన్నట్లు.. ప్రతి మనిషికీ తన గురించి ఎదుటి వాడు ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని ఉంటుంది (ఇక్కడ మీకు ఏదైనా సినిమా కానీ సీన్ కానీ గుర్తొస్తే అది నా తప్పు కాదు అధ్యక్షా). అలాగే నా గురించి చాలా మంది రాసినవి చూసి చాలా సంతోషించాను. మరి నా మనసులో ఎవరెవరు ఎలా ఉన్నారో కూడా చెప్పాలి కదా. బజ్జులో మొదలు పెట్టిన లిస్ట్, బ్లాగు టపా అయింది..

ఈ లిస్ట్ మొదలు పెట్టగలిగాను అంటే మొదటగా నేను బ్లాగులోకి రాగలిగిన రోజుని తలుచుకునే తీరాలి. అనగనగా ఒక శనివారం.. అంటే 19 జూన్,2010 ఈనాడు పేపర్‌లో మొదటిసారిగా ఒక బ్లాగు గురించి చదివాను. నాకు బాగా గుర్తు, "జెర్మనీ లో కూస్తున్న తెలుగు కోయిల" అని పరిచయం. అక్కడ మొదలయిన ఆసక్తి, మధుర "బరువు-బాధ్యత" టపా తో ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగి పెద్దదయింది. నాకిప్పటికీ మధుర అంటే మొదటగా గుర్తొచ్చేది బరువు - బాధ్యతే.. ఆ తరువాత మిస్.పనిమంతురాలు (1,2). ఆ వెంటనే ఇంకా చాలా గుర్తొస్తాయి:)) ఆ ముచ్చట్లు వింటూ ఉంటే, చాలా విషయాలు అరే నాకు కూడా ఇలాగే జరిగిందే అనిపించేది. ముఖ్యంగా వాళ్ల అమ్మగారి మాటలు, మాట్లడే కొన్ని పదాలు (ఉదా :ఇగం) నాకు చాలా దగ్గరగా అనిపించాయి. మంచుగారి టపాతో (మధుర పెళ్లి రోజు వేసిన టపా) తనది మా ఊరే అని తెలిసి నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.

ఆ తరువాత నాకు తెలిసిన బ్లాగు, బ్లాగాడిస్తా రవి గారిది :). ఒక్కటి కూడా వదలకుండా అన్నీ చదివేశా. ముఖ్యంగా దినాల గురించి ఆయన రాసిన టపా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇంకొద్ది రోజులకి మహిళా దినోత్సవం, అమ్మల దినోత్సవం, నాన్నల దినోత్సవం, అన్నల తమ్ముళ్ల దినోత్సవం లాగా, అర్థ దినోత్సవాలు కూడా వచ్చేస్తాయేమో అన్న అనుమానం భలే నవ్వు తెప్పిస్తుంది. కానీ ఆ తరువాత రవి గారు పద్యాలు రాసేస్తూ దినదినాభివృద్ధి చెందడంతో (మరి నాకు అంత తెలుగు రాదుగా :(( ) అటువైపు వెళ్లడం కాస్త కాస్తగా తగ్గింది.

ఇక తరువాత నేను చదివిన బ్లాగు ఏంటంటే.. ఏంటంటే.. ఏంటంటే.. ఇంతగా ఊరిస్తున్నా అంటే అర్థం అయిపోయి ఉండొచ్చు మీ అందరికీ.. యస్ యస్ అదే.. ఏ బ్లాగులో అయితే టపా పడగానే కామెంట్ల వరదలు వస్తాయో, ఏ బ్లాగులో అయితే హాస్యం, వ్యంగ్యం, ప్రేమ, అభిమానం అన్నీ సమపాళ్లలో కలిపి రంగరించి చదువరులని నవ్వించి నవ్వించి ఏడిపిస్తారో, అదే తెలుగు బ్లాగర్ల అభిమాన బ్లాగు మన "జాజిపూలు". ఈ బ్లాగు గురించి నేను ఎంత తక్కువ చెబితే అంత మంచిది.  మరి నే చెప్పే మాటలేవీ ఆ బ్లాగుతో సరితూగలేవు కదా.. కానీ నాకు దొరికిన ఒక అరుదైన ఙ్ఞాపకం మాత్రం అలా ఉండిపోతుంది. జాజిపూలు బ్లాగులో మొదటి సెంచరీ నాదే. :) కొన్ని సంవత్సరాలుగా అభిమానిస్తున్న ఎవరికీ దక్కని ఆ అవకాశం నాకు దక్కినందుకు నా మీద కట్టిన కక్షలు, కుతంత్రాలు.. ఎంతగా ఎంజాయ్ చేశామో.. ఎప్పటికీ నా మనోఫలకం మీద చెరిగిపోని ముద్రలు జాజిపూలతో నాకున్న ఙ్ఞాపకాలు:) నాకు అన్ని ఙ్ఞాపకాలు మిగిల్చిన టపా "గురువులను పూజింపుము పెళ్లి చేసుకోకుము". ఇప్పటికీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటా ఆ టపా, అందులో వ్యాఖ్యలు:)


అలా వందవ వ్యాఖ్య కోసం జరిగిన అల్లర్లలో, నాకు నేస్తం అయిన మరో మంచి బ్లాగరు హరే కృష్ణ:) "నేస్తం గారి టపాలో వంద కామెంటు కొట్టేసినందుకు గొడవేసుకోడానికి వచ్చాను" అంటూ చేసిన అల్లరి, అలా అలా నా బ్లాగులో సెంచరీ పూర్తి చేసిన విషయం ఇప్పటికీ గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటాను. హరే అనగానే, మొదట నాకు గుర్తొచ్చేది బ్లోకిరి.. ఆ టపా చదువుతూ ఎంతగా నవ్వుకున్నానో. అంతేనా, అసలు హాలీవుడ్ ఎలా ఉంటుందో తెలీని నాకు, బోలెడు హాలీవుడ్ సినిమాలని పరిచయం చేశాడు.

అదే సమయంలో పరిచయం అయిన మరో ముగ్గురు మంచి బ్లాగర్లు, నేస్తం అక్కకి ముద్దుల తమ్ముళ్లు , నాగార్జున, సాయి ప్రవీణ్, వేణూరాం (ఈయన అప్పటికి బ్లాగరు కాదులే). అప్పటి వరకూ నాకు "మనసు పలికే" అన్న బ్లాగుమరోటి ఉందని తెలీదు. అదీ నాదే అనుకుని నాగార్జున నన్ను బోల్డు సార్లు "ప్రసీద" గారు అని పిలిచేవాడు, నేను ప్రసీద గారిని కాదు మొర్రో అన్నా వినిపించుకోకుండా :). తరువాత నిజం తెలుసుకుని నాకు బోలెడు సారీలు చెప్పాడులే;). నాగార్జున టపాలంటే నాకు వాళ్ల కాలేజి హాస్టల్‌లో దీపావళి సంబరాలు గుర్తొస్తాయి. ఇక సాయి ప్రవీణ్ విషయానికొస్తే, నేస్తం గారిని చూస్తే నన్ను బంగారం అని పిలిచే అక్క గుర్తొస్తున్నారు అనగానే "ప్లీజ్ అపర్ణ గారు, నాకు మీ అక్క వివరాలు ఇవ్వండి. ఆ అక్క ఈ అక్క ఒకరే అయ్యుండొచ్చేమో" అని బ్రతిమిలాడారు:) వేణూరాం అలియాస్ రాజ్‌కుమార్, ఈయన టపాలు అంటూ అప్పటికి లేకపోయినా కామెంట్లతో జనాల్ని పిచ్చెక్కించేవాడు. ఒక కామెంటులో ఎవరో అనగా గుర్తు, "వేణూరాం టపాలు రాయడు కానీ, ఈ కామెంట్లన్నీ కలిపితే తోటరాముడి కన్నా మంచి కామెడీ టపా అవుతుంది" అని. అది నిజమని తరువాత నిరూపించుకున్నాడు :)) (సోదర సోదరీమణులారా..తోటరాముడి అభిమానుల్లారా..  ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.. నేను కూడా తోటరాముడి గారి అభిమానురాలినే ) తోటరాముడి గారి టపాలు చదివి ఎంతగా నవ్వుకున్నానో, అంతగా రాజ్ టపాలు కూడా చదివి నవ్వుకున్నా నేనైతే :)ముఖ్యంగా సుమను సినిమాలు, ఇండస్త్రీలో ఇంకొన్ని సినిమాల రివ్యూలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. రాయడం ఒకటేనా? అంతకన్నా గొప్ప ఫోటోగ్రాఫర్. ఏటికొప్పాక హస్త కళా వైభవం, శిల్పారామం ఫోటోలు చూస్తే అర్జెంటుగా అక్కడికి వెళ్లిపోవాలనిపిస్తూ ఉంటుంది.

ఇక ఆ తరువాత, మాలికలో హారం లో ఎక్కడ మంచి టైటిల్ కనబడితే అక్కడికి దూరిపోయి బోలెడు మంచి మంచి బ్లాగుల తలుపు తట్టాను. అదే విధంగా ఎందరో గొప్ప గొప్ప బ్లాగర్లు కూడా నా బ్లాగు తలుపు తట్టి నన్ను ప్రోత్సహించారు. అందులో ముందుగా నేను చెప్పుకోవలసింది కొత్తపాళీ గారి గురించి. కొత్తపాళీ గారి "పెరడు వ్యవసాయం - గోంగూర రుచి" టపా చదివి చాలా నచ్చి వ్యాఖ్య పెట్టాను. అందరూ "కొత్తపాళీ గారి టపా చాలా గంభీరంగా ఉంటుంది అన్న అభిప్యారం ఇక్కడితో మారిపోయింది" అనగా విని అమ్మో అనుకున్నాను. మిగిలిన కొన్ని టపాలు చదివాక చాలా గౌరవం ఏర్పడింది. ఒకానొక రోజు నా బ్లాగులో ఏం రాయాలో అర్థం కాక సలహాలు అడుగుతూ రాసిన "నేను నా మనసు" టపా చూసి, ఆ వెనువెంటనే " నన్ను నేను కోల్పోయాను" అన్న నా మొదటి కవిత చదివి రాసిన వ్యాఖ్య " ఇంత చక్కటి భావుకమైన వాక్యం రాసిన మీరు ఏం రాయాలో తెలియట్లేదు అంటే నమ్మడానికి మేం వెర్రికుట్టెలం కావాలి. :) " ఈరోజుకీ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వారికి ధన్యవాదాలు మాత్రమే చెప్పడం చాలా తక్కువ అవుతుంది.

కాస్త గంభీరం అయింది కదూ.. ఇప్పుడు కాసిని నవ్వుల్లోకి వెళదాం:) అదేనండీ మన శివరంజని ఎర్రబస్సు దగ్గరికి:) నవ్వులతో చంపేసే అల్లరి పిల్ల. తలుచుకుంటే చాలు, మొదట నవ్వు, ఆ తరువాత తను రాసిన పేరు టపా, ఎర్రబస్సు టపా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి. మొదటగా నేను చదివిన టపా "నువ్వు నాకు నచ్చలేదు నచ్చలేదు". ఆరోజు అక్కడ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. దెబ్బకి పోలియో వచ్చి పడిపోయిన తన బ్లాగు లేచి పరిగెట్టినట్లు శివరంజనే స్వయంగా చెప్పింది మరి:) కొంతమంది కలిసి లీటర్లు లీటర్లు పోలియో మందు తాగిస్తే పరిగెట్టదూ మరి?? ఒక అందమైన అల్లరి తెలుగు కోనసీమ అమ్మాయి అలా కళ్ల ముందు తిరుగుతూ ఉంటుంది అల్లరిగా, తన తలపు రాగానే:)

అమ్మో అందరిగురించి చెబుతూ మా గురూ గారి గురించి చెప్పకపోతే ఎలా??? బులుసు సుబ్రహ్మణ్యం గారు:) నవ్వితే నవ్వండి అంటూ ఆగకుండా నవ్వాల్సిందే అనిపించేలా రాస్తూ కడుపుబ్బ నవ్వించే హాస్య చక్రవర్తి:) మొదటగా ఆయన హాస్యాస్త్రానికి నేను బలయిన టపా "సతీ ద్రౌపది పాకం" కడుపు నొప్పొచ్చేలా నవ్వాను. అభిమానిని అయిపోయాను. ఆ తరువాత నా టపా చదివి అయిడియా వచ్చింది అని చెప్పి రాసిన "నేను ఎందుకు వ్రాస్తున్నాను" సీరీస్. ఎంతగా పొంగిపోయానో :) అంతే ఇంక నాకు గురూ గారు అయిపోయారు. ఇప్పటికీ నేనైతే ఏలూరు బస్సులోనే ఉన్నాను పలక బలపం పట్టుకుని:))

ఇందు.. పువ్వులు, చల్లని వెన్నెల, దానిపై తన సంతకం.. మొత్తంగా వెన్నెల సంతకం:) నిజంగా వెన్నెలంత చల్లని అమ్మాయి. గిలిగింతలు పెట్టే చక్కని ముచ్చట్లు రాతలు. నాకు బాగా గుర్తుండిపోయిన తన రచన "తొలిసారి నిన్ను చూసింది మొదలు" నిజంగా అరకుని చూసి తీరాల్సిందే అన్న కోరికని ఇంకా బలంగా చేసిన రచన అది. మనసులో ఒక ఆలోచనకి అక్షర రూపం ఇంత అందంగా ఇవ్వొచా అన్న ఆలోచన రేకెత్తించిన రచన అది. చిట్టి చీమ కథ అయితే నన్ను కూడా ఒక చిన్న పాపని చేసి కూర్చోబెట్టుకుని చెప్పినట్లు అనిపిస్తుంది. అంత బాగా రాస్తుంది మా వెన్నెల ఇందు:)

వెన్నెల అనగానే మీకు మరో పేరు గుర్తు రావాలే.. నాకు తెలుసు కదా మీ పల్స్ ;). మరి.. రంగులతో దేన్నైనా గుప్పిట పట్టగల చిత్రలేఖనం అందరికీ వస్తందా?? కొన్ని చేతులకే ఆ మహిమ ఉంటుంది. అందులో ఒకరే మన కిరణు. ఒక్క చిత్రలేఖనమేనా.. చిన్నగా చక్కిలిగింతలు పెట్టే పిల్లగాలి లాంటి అల్లరి తనది. అందుకే తన టపాలు కూడా పొట్ట పగిలేలా నవ్వించవు, గిలిగింతలు పెట్టినట్లుగా టపా చదివినంతసేపూ పెదవులపై నవ్వు పువ్వుల్ని అరవిరిసిన విరజాజుల్లా పూయిస్తూనే ఉంటాయి. చదివేసాక కూడా వదలవు మనల్ని ఆ ఆలోచనలు అచ్చం ఆ పూల పరిమళం లాగానే:) అందుకే భావి భారత బెంగుళూరు పౌరులంతా కలిసి తనకి విగ్రహం పెట్టించబోతున్నారు:)). నాకైతే "నేనూ వాచ్ కొనుక్కున్నా కదా" అన్న తన టపా ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది:)

మరి ఈ అల్లరిపిల్లలందరి గురించి ఏకరువు పెట్టి మా అందరి గురూ గారి గురించి చెప్పకపోతే ఎలా?? ఇంకెవరు.. ఘతోత్కచురాలు ;) మాయా శశిరేఖ. నేను మొదటగా చూసింది తన "చెక్కిన చేతులకు జోహార్లు" టపా. అబ్బ. నిజంగా చూడ్డానికి రెండు కళ్లు సరిపోని అంత మంచి దృశ్యాల్ని/ప్రదేశాన్ని తన మాటలతో మనందరికీ చూపించగలిగారంటే ఇంకేం చెప్పగలం. మహానటి సావిత్రి పై తనకున్న అభిమానం కళ్లముందు కదలాడుతూ ఉంటుంది తన స్కెచెస్ చూస్తూ ఉంటే. ఎంత సీరియస్ టపాలు రాసినా, మాతో కలిసి తను చేసే అల్లరే గుర్తుండిపోతుంది బాగా. "నువ్వు ఎక్కడా తగ్గొద్దు, నేనున్నాగా నీవెనక" అంటూ చిలిపి గొడవల్లో తనిచ్చే ప్రోత్సాహం చిరునవ్వుల్ని పూయిస్తూ ఉంటుంది:)

అయ్యయ్యో.. ఇంకో అల్లరి పిల్ల గురించి చెప్పకపోతే సౌమ్యగారు ఊరుకోరు..;) అదేనండీ మన కావ్య:) ఏదో అలా ఒకటిఈ రెండు భాగాల్లో పూర్తి చేసేసుకునే చిన్న చిన్న కథలు తెలిసిన మనకి, ఏకంగా రెండు  మూడు సీరియల్స్ చకచకా నడిపేస్తూ, నవ్విస్తూ అల్లరి చేసే మన కావ్య. నేనైతే "ప్రేమే నా ప్రాణం" సీరియల్ లో తనిచ్చిన ట్విస్ట్ ని ఇంకా జీర్ణం చేసుకోలేదు తెలుసా. ఇంక తననెలా మర్చిపోతాం..

నవ్వులు కాస్త ఎక్కువయ్యాయా??? మరిప్పుడు భావుకత్వం లోకి దూకేద్దామా??? అంతకంటే ముందు ఇంకో ప్రత్యేక వ్యక్తి గురించి చెప్పాలి. నెమలికన్ను మురళి గారు. నెమలికన్ను గారిది నేను మొదటగా చూసిన టపా "ఫ్రీ హగ్స్" బ్లాగు యొక్క పరిచయం. ఆ పరిచయం చూసి ఎంతగా అభిమానం పెరిగిపోయిందంటే, ఏమో చెప్పలేనేమో.. ఏదైనా అంశాన్ని ఆయన వర్ణించే తీరు అద్భుతం. దేని గురించైనా అనాలిసిస్ చేసి దాని లోతుల్ని మనకి చూపిస్తూ ఉంటే ఔరా అనుకోడం నా వంతు అవుతుంది. పుస్తకాల పరిచయం కానీ, బ్లాగుల పరిచయం కానీ, తన చిన్న నాటి ఙ్ఞాపకాలు కానీ..ఏదైనా వర్ణించడం ఆయనకి కొట్టిన పిండేమో అనిపిస్తుంది. నాకైతే "మా భూషణం" ఎంత నచ్చాడో... ఒక మంచి బ్లాగు అయినా, ఒక మంచి పుస్తకం అయినా, ఒక మంచి సినిమా అయినా.. ఏదైనా సరే, మురళి గారి రాతల్లో అందంగా ఒదిగిపోవలసిందే.

మరి నెమలికన్ను గారు పరిచయం చేసిన మరొక అద్భుతమైన బ్లాగరు మురారి గారు (ఫ్రీ హగ్స్). ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అక్షరాల వెంట కళ్లు పరిగెడుతూ ఉంటే అప్పటికే చదివిన దానికి మనసు సంతోషపడుతూ ఇంకా కావాలి అంటూ ఆతృతగా చూస్తూ ఉంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది?? నాకైతే మురారి గారి బ్లాగులో అది కనిపించింది. ఏదైనా భావాన్ని, అనుభూతిని ఆయన పలికించే తీరు అద్భుతం. ఆయన రచన చదివేశాక, మనసు ఒక సంతృప్తితో నిండుకోడం తెలుస్తూనే ఉంటుంది, అదే సమయంలో అప్పుడే అయిపోయిందా అనిపించడామూ సహజమే. ఆయన టపాలన్నీ చదివేశాను. ఇది ముందు ఇది వెనుక అని చెప్పలేని విధంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కనిపిస్తాయి ఆ టపాలన్నీ..

అసలు బ్లాగు లెజెండ్ గురించి మాట్లాడకుండా ఇంత దూరం వచ్చానంటే నన్నేమనాలి..??? ఆయ్..
మంచు పల్లకి. ఆ పేరంటేనే నాకు భలే ఇష్టం. అసలు మంచుగారు ఎవరో తెలీక ముందు ఆయన రాసిన "నాదెండ్లతో ఒక రోజు" చదివాను. ఎందుకో అది ఈరోజుకీ గుర్తుంది. మంచు గారి టపాల్లో నేను గమనించిందేమిటంటే, ఏదో బ్లాగు నడుపుతున్నామంటే నడుపుతున్నాం, ఏదో ఒకటి రాయాలి కదా అని రాయడం కాకుండా అందరికీ ఉపయోగపడే విషయాలు రాస్తారు. నాకు ఆయన రాసిన "కొంచెం గౌరవం" ఆయన మీద చాలా గౌరవాన్ని పెంచింది. "కొన్నాళ్ల తరువాత" టపా నాకు బోలెడంత ఙ్ఞానాన్ని ప్రసాదించింది:) ముఖ్యంగా ప్రతి పోస్టూ శ్రీ రామ అంటూ మొదలు పెట్టడం నాకు బాగా నచ్చుతుంది:))

అమ్మో అసలు తెలియకుండానే ఇంత పెద్ద టపా రాసేశానా.. ఇంకా చాలా బ్లాగుల తలుపులు తట్టాలి. దానికి నా రెండవ టపా ఎదురు చూస్తూ ఉంది. ఈ టపాలో నేను పలకరించని వాళ్లెవరూ కూడా తొందరపడి బాధపడి, నా మీద అలిగేసి, ధర్నాలు గట్రా చెయ్యొద్దని మనవి :) :) మీ అందరినీ కలుసుకోడానికి మరొక టపాతో మీ ముందుకు వస్తాను. అంతవరకూ...
సశేషం..

Saturday, August 6, 2011

నా కాళ్లకి చక్రాలొచ్చాయోచ్..ఓచ్..

కాళ్లకి చక్రాలంటే స్కేటింగ్ అనుకుని చక్రాల చెప్పుల్లో కాళ్లెయ్యొద్దు. మరేమో.. మరేమో.. మరేమో.. 6 సంవత్సరాల నా కల ఒక రెండు రోజుల క్రితం తీరింది. పట్టలేని సంతోషంతో కాళ్లకి చక్రాలతో రెక్కల చేతులతో అలా గాల్లో తేలియాడుతూ ఉన్నాను:) ఇంతకీ విషయమేంటంటే, నాకు వాహన యోగం పట్టేసింది, ద్విచక్ర వాహన యోగం. ఎన్నాళ్లుగా.. సారీ ఎన్నేళ్లుగానో ఎదురు చూసిన యోగం ఈరోజు నన్ను వరించింది.

7 సంవత్సరాల క్రితం నా డిగ్రీ చదువు కోసం హైదరాబాదు వచ్చి, కాలేజీలో తోటి విద్యార్థులు చాలా మంది బండి మీద కాలేజీకి వస్తూ ఉంటే చూసినప్పుడు కలిగిన ఇష్టం అది. ఎంతగా అంటే, బస్‌స్టాప్‌లో స్నేహితురాళ్లతో నుంచున్నప్పుడు అటుగా బండి మీద వెళ్లే అమ్మాయిలని అలా నోరు తెరుచుకుని చూసేంతగా. ఎప్పటికైనా మనం కూడా కొనుక్కోవాలే అని గట్టిగా తీర్మానించేసుకున్నాం అప్పుడే. నా ఇష్టాన్ని గమనించిన మా నాన్న, ఇంటికెళ్లినప్పుడు ఓసారి అడిగారు కూడా.."ఏమ్మా, స్కూటీ కొనివ్వనా??"అని. "లేదు నాన్నా.. నేను సంపాదిస్తాను కదా, అప్పుడు కొనుక్కుంటా" అని గర్వంగా చెప్పాను. అలా అలా డిగ్రీ అయిపోయింది. జాబ్ కూడా వచ్చేసింది, హమ్మయ్య ఇక బండి కొనుక్కునే సమయం ఆసన్నమైంది అని మనసు ఫీల్ అయ్యే లోగా, బండి ఉన్న అబ్బాయితో పెళ్లయిపోయింది...;)

భర్త అనగా భరించువాడు అని ఎప్పుడో సంస్కృతంలో చెప్పగా విని, నిజమనుకుని, నా బండి భారాన్ని భరించగలరా అని అడిగాను. అంతే.."బండినా? ఏం బండి ? ఎందుకు బండి? అసలేం భరించాలి? బండంటే తెలుసా నీకు??" అని క్లాసు పీకాడు:( . నేను బండి కావాలి అని అడగడం, ఆయన వద్దు అనడం. ఇలా కొన్నాళ్లు గడిచాక, "నువ్వు ముందు ఫిఫ్టీ కేజిలు అవ్వు అప్పుడు చూద్దాం" అన్నారు. ఆహా, కనీసం ఒక్క అవకాశం ఇస్తున్నారు అని సంబరపడిపోయి, తినీ తినీ తినీ.. ఎంత తిన్నా 50 ని తాకలేకపోయా ప్చ్:(

ఇలా అయితే లాభం లేదు, మనం ఇంకాస్త పోరు పెడితే ఇంకేదైనా కన్సెషన్ ఇవ్వచ్చు అని, ఆయన మనస్సుని ప్రసన్నం చేసుకోగల శక్తి ఒక్క టి.వి.యస్. స్కూటీకి మాత్రమే ఉందని తలచి, స్కూటీ మంత్ర జపం చేసి, స్కూటీకోటి రాసాను.. నేను "స్కూటీ" అనడం ఆయన "ఫిఫ్టీ" అ(రవ)నడం. ఇలా ఇంకొన్నాళ్లు సాగాక..
ఛి.. ఈ స్కూటీ మనకి అచ్చిరాలేదు, ఛిఛి.. అని నా భారాన్ని హీరోహోండా ప్లెషర్‌కి తగిలిద్దాం అని ట్రై చేశా..;);) ఇక అప్పుడు మా ఆయన కూడా రూట్ మార్చేసి, "నువ్వు ఏ కలర్ కావాలో ఎంచుకో. వచ్చే నెలలోగా మనింట్లో బండి ఉంటుంది. నువ్వు కలర్ ఎంచుకోడమే ఆలస్యం" అని అంటే మొదట్లో సంతోష పడీ పడీ చివరికి నేనే కింద పడ్డా అని తెలుసుకున్నా :(( ఆ వచ్చే నెల రెండు సంవత్సరాలకి వస్తుంది అప్పుడు తెలుసుకోలేకపోయా...

చిరాకొచ్చిన అప్పు ఏడవలేక నవ్వుతూ నవ్వలేక ఏడుస్తూ ప్లీజ్ కొనివ్వు బండి అని ప్రాధేయ పడగా, ఏమాత్రం కనికరం లేని వెంకట్ "ఫలానా వెంకట్ వైఫ్ బండి నడుపుతుంది అని నలుగురూ అంటే ఎంత అవమానం" అని నన్ను ఇంకాస్త ఏడిపించేవాడు. ఇలా ఒక సాకు కాదు, నాకు బండి కొనివ్వకుండా ఉండడానికి సవాలక్ష సాకులు దొరికాయి ఇన్నేళ్లుగా.

ఇంకొన్ని సార్లైతే, "మనం కార్ కొనేద్దాం అప్పు. నాలు చక్రాలు ఇస్తా అంటే రెండే కావాలంటావేంటి???" అనేవాడు. మరి నాకేమో కార్ కన్నా బండే ఇష్టం:) "కావాలంటే కార్ నువ్వు కొనుక్కో, నాకు మాత్రం బండి కొనివ్వు చాలు" అనేదాన్ని. నా వాహన యోగానికి అడ్డంకి ఒక్క మా ఆయనేనా, ఎంత మంది అన్నలకి తమ్ముళ్లకి రాఖీలు కట్టి నాకు బండి కొనిచ్చే అదృష్టాన్ని ఎవరు సొంతం చేసుకుంటున్నారహో అని చాటింపేస్తే, అందరూ క్యూలో నిలబడి కొనిస్తారు అన్న నా ఆశని అడియాశ చేస్తూ అందరూ క్యూలో పరిగెట్టి పారిపోయారు..ప్చ్.. ఒక తమ్ముడైతే "అక్కా నువ్వు పెద్ద దానివి కదా, నీకు రోడ్డు రోలర్ కొనిస్తా అక్కా" అని నా రాఖీ దొబ్బేసాడు దొంగమొహం.

అలా ఎన్నో కష్టాలకోర్చిన అప్పు, నిన్ననే.. సరిగ్గా నిన్ననే మహింద్రా వాడిని కనికరిస్తూ రోడియో కొనుక్కుంది:))))  ఫోటో చూసి ఎలా ఉందో చెప్పండేం :)))










దీన్ని చూసాక మీకేం అర్థమయింది..? ఉదయం నుండి నేను అస్సలు దీని మీద ఎక్కి నడపలేదు అని మీరు అనుకున్నారు అంటే మీరు చాలా తెలివైన వాళ్లన్నమాట:)))) ఈ రంగు చూసి నలుపు అనుకుంటున్నారేమో.. కాదు కాదు.. అదేదో పలకడానికి రాని బ్రౌన్.. షో రూం వాడిని ఒక పావుగంట విసిగించి నేర్చుకున్నాలే, కాప్యుచ్చినో బ్రౌన్ అని:)))

నాకు తెలుసు మీ అందరూ ఏం ఆలోచిస్తున్నారో... పార్టీ అనే కదా..
ఇదిగో ఈ స్వీట్స్ చాకోలెట్స్ మీకోసం:))


Wednesday, August 3, 2011

నాలోని పంతులమ్మ..!!

సమయం : సుమారు ఓ రెండు దశాబ్దాల క్రితం..
ప్రశ్న : పాపా ఏం చదువుతున్నావు..?
జవాబు : ఒకటో తరగతి.
మళ్లీ ప్రశ్న : పెద్దయ్యాక ఏమవుతావు.?
మళ్లీ జవాబు : టీచర్.

ప్రశ్నలు ఎవరడిగినా సరే నా సమాధానం అదే. ఎందుకు అంటే చెప్పలేనేమో.. ఏమో, ఊహ తెలిసాక అమ్మ నాన్న చుట్టాలు పక్కాలు కాకుండా పరిచయం అయిన మొదటి బయటి వ్యక్తి టీచర్ అయిన కారణం గానో.. పిల్లలంతా సదరు టీచర్ అనే వ్యక్తికి భయభ్రాంతులయ్యి ఉండడం వలనో.. ఒక మంచి జాబ్ చేస్తూ గౌరవనీయమైన స్థానంలో ఉన్న మా నాన్న, మా స్కూల్ లో టీచర్స్ కి అంతు లేని విలువ ఇవ్వడం కారణం గానో.. ఏమో తెలీదు. ఫైనల్ గా నేను మాత్రం టీచర్ అయిపోవాలనే నిర్ణయించుకున్నా.

అలా టీచర్ అయిపోయినట్లు ఊహించేసుకుంటూ కలల్లో తేలియాడుతూ చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలకి (నా కంటే చిన్న పిల్లలకి;)) చదువు (?) చెబుతూ నాలోని పంతులమ్మని పెంచి పోషిస్తూ ఉండేదాన్ని. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. ఈ "పంతులమ్మ" అని నన్ను మా తాతమ్మ ఎక్కువగా పిలుస్తూ ఉండేది. ఆవిడతో నాకు చాలా అనుబంధం ఉండేది. నా 4వ తరగతి లో మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. కానీ నాకు ఆ ఙ్ఞాపకలు మాత్రం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి.

ప్రతీ రోజూ.. కళ్లజోడు పెట్టుకుని పుస్తకాల్లో పాఠాల్ని మస్తిష్కాల్లోకెక్కించే టీచర్‌లా కాకుండా, ఎక్కాలు అప్పజెప్పలేదన్న కారణంగా గోడ కుర్చీ వేస్తూ, సామాన్యశాస్త్రాన్ని అతి సామాన్యంగా తీసుకుని చేతులు ఎరుపెక్కేలా బెత్తంతో దెబ్బలు తినే స్టూడెంట్ లాగానే స్కూల్ కి వెళ్లినా.. టీచర్ అయిపోవాలన్న నా జిఙ్ఞాస మాత్రం లెక్కల్లో ఎక్కమంతైనా తగ్గలేదు(లాజిక్కులు అడగొద్దు). నేను టీచర్ అయిపోయి పిల్లల్ని హింసించడానికా అన్న ప్రశ్న మీకు అస్సలు రాకూడదు. మొగ్గగా ఉన్నప్పుడే నాలోని పంతులమ్మని గుర్తించి, మా టీచర్లు, నా తోటి విద్యార్థులకి నాచేత పాఠాలు చెప్పించేవారు. (మీకు తెలీదా, క్లాసులో నిద్ర పోతూ ఉంటే ఆ రోజు చెప్పిన పాఠాన్ని ఆ తరువాత రోజు చెప్పమనే వారు. అలా నాలోని పంతులమ్మని బోలెడన్ని సార్లు నిద్ర లేపాల్సి వచ్చింది నేను క్లాసులో నిద్రపోయి;))

నేను పెరుగుతున్న కొద్దీ నాకు ఇంకా పెరిగిన పెద్ద పెద్ద టీచర్లు దొరికి నాలోని పంతులమ్మని కూడా ఇంకా పెంచి పెద్దది చేసారు. అంటే పరీక్షలు పెట్టే స్థాయికి ఎదిగిందనమాట పంతులమ్మ. ఆ రోజులే వేరులే. 9వ తరగతిలో మా లెక్కల మాస్టారు లెక్కల్లో మన ప్రావీణ్యాన్ని గుర్తించి నలు దిక్కులా వ్యాపింపజేసి, పూ......ర్తిగా నమ్మకం పెంచేసుకుని, పక్కన విద్యార్థులని పరీక్షించమని ఆర్డర్స్ వేసి బయటికి వెళ్లిపోయేవారు ఎంచక్కా.. కాకా పట్టించుకోవడం అంత బాగుంటుందని తెలిసిన మొదటి రోజులవి. "అప్పు, ఈ సిద్ధాంతం వద్దు అప్పు, అది ఇవ్వు. ఈ లెక్క అస్సలు వద్దు ప్లీజ్ ఈజీ ది చూసి ఇవ్వు." ఆహా ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే భలే సంతోషంగా ఉంటుందిలే ;)

అలా పెరిగి పెరిగి నాలోని పంతులమ్మ డిగ్రీలోకి వచ్చింది. ఈసారి అత్య్తుత్సాహంతో, ఒక ట్యుటోరియల్ లో చిన్న పిల్లలకి పాఠాలనమాట:) నిజంగా అవి మాత్రం బంగారు రోజులు (ఇదిగో అమ్మాయిలూ గాజులు కాదు రోజులు). 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకూ అనమాట. 2 గంటల పాటు వాళ్లకి అన్నీ నేనే చెప్పాలి. వాళ్ల హోం వర్క్ చేయించాలి ఒక 15 మంది పిల్లలు. భలే ఉండేవాళ్లు ముద్దు ముద్దుగా.. కానీ ఒకటే బాధ, హైదరాబాదు స్కూల్స్ కదా తెలుగు రాదు ఎవరికీ :(. తెలుగు తల్లిని బ్రతికించడానికి నావంతు కృషిగా వాళ్లకి తెలుగు బాగా నేర్పించడానికి కష్టపడ్డాను. వాళ్లకి బాగా వచ్చిందనైతే చెప్పను కానీ అంతకు ముందు కంటే కాస్త మెరుగు అని చెప్పడానికి గర్వపడుతున్నాను:) వాళ్లు నన్ను టీచర్ టీచర్ అని పిలుస్తూ ఉంటే భలే ముచ్చటగా అనిపించేది:) నేను నిజంగా ఒక టీచర్ అయితే నా విద్యార్థులకి ఏమేమి బుద్దులు నేర్పాలో, చదువొక్కటే ముఖ్యం గమ్యం కాదు అంతకు మించిన విలువలు ఎన్ని ఉన్నాయో ఎలా వాటిని పాటించాలో ఇవన్నీ వాళ్లకి చెప్పడానికి ప్రయత్నించేదాన్ని వాళ్ల వయసుకు తగ్గట్టుగా. ఒక సంవత్సరం పాటు చెప్పినా ఒక్క రోజు కూడా ఎవ్వరినీ కొట్టలేదు, నేనంటే భయం కాకుండా గౌరవం ఏర్పడేలా చెయ్యడానికి ప్రయత్నించాను. నిజంగా నాకు చాలా నచ్చిన రోజులు అవి. ఇక ఆ తరువాత కొన్ని పరిస్థితుల కారణంగా, క్యాట్ ప్రిపేర్ అయ్యే ఒక అమ్మాయికి హోం ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాను. నేను పదిలపరుచుకోవలసిన గొప్ప ఙ్ఞాపకాలు అయితే ఏమీ లేవు ఆమెతో:)
 
అసలిప్పుడీ గోలంతా మాకెందుకు తల్లీ అంటున్నారా??? మరేమో ఈ మధ్యనే దేవుడిచ్చిన ఒక అన్నయ్య అమ్మా నాన్నతో పరిచయమయిందనమాట:) అంటే మా పెద్దమ్మ పెదనాన్నతో:) అయితే మాకేంటీ అంటే బెత్తంతో కొట్టేస్తా అంతే.. ఎంచక్కా, పెద్దమ్మా పెదనాన్నా ఇద్దరూ ఉపాధ్యాయులే.. నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయమేమనగా అటు పెద్దమ్మ వాళ్లింట్లో ఇటు పెదనాన్న వాళ్లింట్లో అందరి వృత్తీ అదే:) చాలా సంతోషకరంగా అనిపించిన విషయమేమనగా, వారి వృత్తి పట్ల వారికున్న గౌరవం, అంకిత భావం. మాటల్లో చెప్పలేనంత గౌరవం పెరిగిపోయింది వారి మాటలు వింటూ ఉంటే. అవే మాటలు నిద్రపోతున్న నా చిన్నతనపు ఙ్ఞాపకాలని తట్టి లేపాయి. మామూలుగానే నాకు ఉపాధ్యాయ వృత్తి పట్ల చాలా ఇష్టం గౌరవం ఇంకా చాలా ఉన్నాయి:) ఇంక పెదనాన్న మాటలు వినగానే అవన్నీ, వర్షాకాలంలో మా ఊరి గోదారిలా ఉప్పొంగి పోతున్నాయి. ఒక్కసారిగా టీచర్ అవ్వాలన్న కోరిక మళ్లీ నన్ను బలంగా తాకింది.

చేసే పనిని ఒక ఉద్యోగంలా కాకుండా, ఒక సేవగా సమాజం పట్ల తమవంతు బాధ్యతగా చేస్తూ దాన్నే ఇష్టపడుతూ, గర్వంగా చెప్పుకోవడం.. నాకు భలే అనుభూతినిచ్చింది:). ఒక్కసారి నన్ను నేను ప్రశ్నించుకున్నాను, ఎన్ని సార్లు నేను చేసే పనిని ఒక సేవలా సంతోషంగా చేసాను? బహుశా అసలు ఒక్కసారి కూడా లేదేమో.. మనం నీతిగా చేసే పని ఏదైనా సరే, దాని పట్ల మనకి గౌరవం ఉండడం కదా ముఖ్యం. ఏంటో.. ఏదో మొదలు పెడితే అది ఇంకేదో అయ్యేలా ఉంది.

సాధారణంగా మారుమూల పల్లెటూర్లలో ఉన్న పాఠశాలల్లో పని చేసే టీచర్లు ఎంతమంది ప్రతి రోజూ వెళ్లి పాఠాలు చెబుతారు? అసలు చెకింగ్‌లు గట్రా జరగవు అని తెలిస్తే ఇక స్కూల్ అన్నది ఒకటి ఉందన్న విషయమే మర్చిపోతారేమో. అదే అభిప్రాయంతో ఉన్న నేను అన్నయ్య మాటలతో కళ్లు తెరిచి, ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఒక చిన్న పాఠశాలకి కావాలని ట్రాన్స్‌ఫర్ చేయించుకుని దాని అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మా పెదనాన్న నిబద్ధతని చూసాను.

మాటల మధ్యలో పెదనాన్న అన్నారు "మా అబ్బాయిని కూడా ఒక మామూలు గవర్నమెంట్ స్కూల్ లోనే వేశామమ్మా. అందరూ అడిగారు, స్థోమత ఉండి కూడా ఇలా గవర్నమెంటు స్కూల్ లో తెలుగు మీడియంలో వేస్తే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? కాన్వెంటులో చేర్పించొచ్చు కదా అని.. కానీ తల్లి.., నేను నా భార్య గవర్న్‌మెంటు స్కూల్ లో ఉపాధ్యాయులం. మా పిల్లల్నే బయట చేర్పిస్తే మమ్మల్ని మేము అవమానించుకున్నట్లే కదా.." అని. మాటలు కరువైన మనసు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉందంటారా!!!

శ్రేయోభిలాషులంతా భయపడ్డట్లు మా అన్నయ్య భవిష్యత్తుకి ఏమీ కాలేదు. ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడి, అంతకన్నా మంచి పేరుని సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా చాలా మంచి వ్యక్తిగా ఎదిగాడు :))

నేను మర్చిపోయిన నా ఇష్టాన్ని, చిన్నతనపు ఙ్ఞాపకాల్ని పరోక్షంగానైనా గుర్తు చేసి.. యాంత్రికమైపోయిన జీవితంలో ఆశల చిగుళ్లని మళ్లీ మొలకెత్తించిన పెద్దమ్మ, పెదనాన్నలకి ప్రేమతో అంకితం..:))

Thursday, July 21, 2011

నీకూ నాకూ మధ్య..!!

నీకూ నాకూ  మధ్య
లెక్కే లేని అడుగుల దూరం

అయినా సరే...
కనుపాపల ముందు, రెప్పల వెనుక
నీ రూపం ప్రతినిమిషం.
మనసైతే నీతోనే సావాసం.
తలపులు నీవే, తికమకలు నీవల్లే..

ఉఛ్వాసం..
ఎక్కడి నుండో నువ్వు నాకోసం పంపిన ఊపిరి.
చిరునవ్వు..
నీ ఊహల, ఊసుల గిలిగింతల ఫలితం..

నువ్వొస్తావేమో అన్న ఊహ చాలు
వేల వాయులీనాలు నాకోసం మోగుతాయి.
ఎవరో పిలిచింది నీ పేరే అన్న అనుమానం చాలు
తనువంతా నవ్వుతుంది.

అద్భుతం..
నిన్ను వెంటబెట్టుకొచ్చిన క్షణం నా ఎదురుగా...
ఆశ్చర్యంగా.. అందంగా.. ముస్తాబయ్యి.


నువ్వు నేను..
మనసులో మాటలు సైతం వినిపించేంత దగ్గరగా..

నీ స్పర్శ తాలూకు పరిమళం
నాతోనే ఉండేంత దగ్గరగా..
నీడలు సైతం చేతులు కలిపి నడిచేంతగా..
కొత్త లోకం.. రంగుల ఇంద్రజాలం.. నీ వల్లే..

తెలియకుండా కాలం రోజుల పేజీలు తిప్పేసింది.

ఇరువురి అడుగుల్లో తెలియని తడబాటు.
నీ అడుగులు నా గమ్యాన్ని తలవవు.
నా దారి నీ తీరానికి సాగదు.

ఉన్నట్టుండి..
అగాధాలు సరితూగలేని దూరం..
మనసులు ముచ్చటించలేని మౌనం..
మదికీ మదికీ మధ్య.

Monday, July 18, 2011

అనగనగా ఒక ప్రయాణం

జీవితమంటే ఒక ప్రయాణమట. మజిలీ మజిలీ కి కలిసేవారెందరో, విడిపోయే వారెందరో.. తియ్యని అనుభవాల్ని పంచే ప్రయాణం ఒకటైతే, చేదు ఙ్ఞాపకాల్ని మిగిల్చే ప్రయాణం మరొకటి. అసలే భావాన్నీ నిద్ర లేపకుండా తాను నిద్రపోయే ప్రయాణం ఒకటైతే, ఆలోచనల్ని రేకెత్తించే ప్రయాణం మరొకటి. కానీ, మొన్న వారాంతం నేను చేసిన ప్రయాణం మాత్రం నాకు నాలుగు ప్రశ్నల్ని మిగిల్చి వెళ్లిపోయింది.

ఆ ప్రయాణం కథా కమామీషు ఏంటంటే, నేను మావారు హైదరాబాదుకు 100 కిలోమీటర్లలో ఉన్న ఒక ఊరికి వెళ్లాల్సొచ్చింది. అబ్బా, దొరక్క దొరక అయిదు రోజులకోసారి వచ్చే శెలవల్ని ఇలా వృధా చెయ్యాలా అని ఓ ఇరవై ఐదు సార్లు అనుకుంటూ......... వెళ్లడం అయింది. తిరిగి ప్రయాణమవడం కూడా అయింది. ఆదివారం సాయంత్రం కారణంగా అసలు బస్సుల్లో సీట్లు దొరకట్లేదు. అలా బస్ స్టాండ్ లో నిలబడి.. నిలబడి.. ఓ నాలుగైదు బసుల్ని వదిలేసి, ఇక తప్పదని ఒక బస్సు ఎక్కేసాం. అదృష్టం ఈ బస్సు అంత రద్దీగా లేదు.. నిజ్జంగా, నించోడానికి స్థలం ఉంది :).

ఇక చేసేది లేక, మధ్యలో ఎవరైనా దిగాపోతారా, సీట్ దొరక్క పోతుందా అన్న దూ..రాశతో అలాగే బస్సులో ఉండిపోయాం. డ్రైవర్ వెనగ్గా మా ఆయన, ఆయనకి వెనగ్గా మరియు బస్సులో మిగిలి పెజానీకానికంతటికీ ముందుగా నేను నుంచున్నాం. ఎవరి హడావిడిలో వాళ్లు. ఒక పెద్దాయన పుస్తకంలో దించిన తల ఎత్తడం లేదు. ఒక కొత్తగా పెళ్లైన జంట వేరే ప్రపంచాన్ని పట్టించుకోడం లేదు. ఒక ఫోను ప్రియుడు ప్రపంచానికంతటికీ వినిపించేలా, ఫోను అవసరం లేదు అనిపించేలా అవతల వ్యక్తికి విషయాన్ని అందిస్తున్నాడు. కండక్టరు టికెట్లు కొట్టడం మొదలెట్టాడు. బస్సు ఇలా స్టార్ట్ అయిందో లేదో అలా ఎవరో ఇద్దరు ఆపించి ఎక్కి, సీట్లు ఉన్నాయా అని కండక్టర్ ని అడిగారు. కండక్టరు సమాధానం చెప్పకముందే నిలబడి ఉన్న మా పరిస్థితిని చూసి అర్థం చేసుకుని, మేము బ్యానట్(గేర్ ఉంటుంది కదా.. అక్కడ) మీద కుర్చుంటాం అనడంతో కండక్టరు "లేదు లేదు. బ్యానట్ మీద కూర్చోవద్దు అని అక్కడ రాసుంది కదా, అయినా ఎలా అడుగుతున్నారు?" అన్నాడు.

"అలా ఎలా కుదురుతుంది? నేనిప్పుడు అర్జెంట్ గా హైదరాబాదు వెళ్లాలి. నాకు సీట్లు లేవు,అందుకే నేను అక్కడే కుర్చుంటా" అన్నాడు ఆ ఇద్దర్లో ఒకడు కాస్త గొడవ ధోరణిలో.
"ఇది లగ్షరీ బస్సు బాబూ. అక్కడ కుర్చోనివ్వరు" అని కండక్టరు తన సమాధానం పూర్తి చెయ్యకముందే, "నాకు తెలుసు ఇది లగ్షరీ బస్సే అని. నీ పేరు ఏంటి చెప్పు. నీ వివరాలు ఏంటి? ఇది ఏ డిపో బస్సు?" అంటూ గట్టి గట్టిగా అరుస్తుంటే అర్థం అయింది, ఆ హేరోలు ఇద్దరూ పీపాలకి పీపాలు కడుపులో పోసి వచ్చారని. ఇక ఓపికలేక కండక్టర్ "బ్యానట్ కీ నాకూ సంబంధం లేదు. అది డ్రైవర్ సొత్తు, ఆయన్నే అడుగు అని వదిలించుకున్నాడు" "ఆపు, బస్సు ఆపు ఇక్కడే" అని డ్రైవర్‌ని బెదిరించి ఆయన వివరాలు కూడా అడుగుతున్నాడు. డ్రైవర్ కి విసుగొచ్చి "అసలొస్తావా రావా నువ్వు? ఏంటి ఈ గోల" అంటూ మళ్లీ స్టార్ట్ చేసాడు బండిని. వాడు మళ్లీ ఆపించడం.. ఇలా ఓ మూడు నాలుగు సార్లు జరిగాక ఇక డ్రైవర్ తన మాట వినకపోవడంతో కండక్టర్ వైపు తిరిగి "నన్ను ఎక్కడి వరకూ తీసుకెళ్తారో తీసుకెళ్లండి, నేను టికెట్ తీసుకోను" అనేసరికి, ఎక్కడో మేరుపర్వతం కండక్టర్ గారి గుండెల్లో బద్దలయ్యింది. ఓ ఆంధ్రప్రదేష్ రాష్ట్ర రవాణా సంస్థ షట్‌చక్ర వాహన చోదకుడా, చైతన్య రథ సారధీ కాస్త ఆపవయ్యా అన్నట్లు హావభావాలు పెట్టి, "ఆపవయ్యా పక్కకి" అన్నాడు.

ఇక సినిమా మొదలు.

"మీ ఇద్దరి వివరాలు చెప్పండి. మీరు రెగ్యులరా? ముందు మీకు కొన్ని పుస్తకాలు ఇస్తారు, వాటిని చదువుకుని డ్యూటీకి రండి" ఇలా ఏదేదో అరుస్తున్నాడు. కాసిన్ని అచ్చ తెలుగు పచ్చి బూతులు కూడా విసిరాడు (నేను వినకూడనివి వాడకూడనివి :(). ఎవరి గోలలో వాళ్లున్న ప్రయాణీకులు మధ్యమధ్యలో అరుస్తున్నారు , ఏంటి గోల వాళ్లని బయటికి తోసేసి బండి స్టార్ట్ చెయ్యండి అని. అయినా ఇలాంటి చిన్న చిన్న గొడవలు బస్సుల్లో మామూలే అని నా పాటికి నేను మాంచిగా ముదిరాక, చక్కగా మాడగొట్టిన మొక్కజొన్న కంకిని తింటూ నుంచున్నా..

"సరే బ్యానట్ మీద కూర్చోవద్దు, అది రూల్. మరి సీట్లు అయిపోయాక కూడా నువ్వు టికెట్లు ఎందుకిస్తున్నావు?" అని తాగుబోతు లాజిక్ ఒకటి తీశాడు కండక్టర్‌ని ఉద్ధేశిస్తూ. "నిజమే కదా" అని కాసేపు అనిపించినా మళ్లీ బస్సు ఫుల్లుగా ఉన్నా కూడా ఎక్కడం మనకి అవసరం, కాబట్టి ఎక్కాం. అంటే అందులో ప్రయాణీకుల అవసరం కూడా ఉంది, కండక్టర్ తప్పెందుకవుతుంది..

ఉన్నట్టుండి ఆ తాగుబోతు లెజెండ్‌కి మా ఆయన దొరికాడు. "మీరే చెప్పండి. మీరు డబ్బులు కట్టారు కానీ నుంచుని ఉన్నారు. ఈ లెక్క పైకి వెళ్లదు, ఇదంతా కండక్టరు దొబ్బేస్తాడు. నష్టపోయేది మీరే" అని ఏదో క్లాస్ పీకుతున్నాడు. మా ఆయనకి చిరాకొచ్చి "ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు బస్సులో వస్తే స్టార్ట్ చేయిద్దాం. లేకపోతే దిగిపోండి, మా టైం వేస్ట్ చెయ్యొద్దు" అని కాస్త గట్టిగానే అరిచాడు. ఇంకా ఏదేదో వాగుతూ పెద్దగొడవే చేశాడు డ్రైవర్‌తో కండక్టర్‌తో ఆ తాగుబోతు మహానుభావుడు. ఉన్నట్టుండి బ్యానట్ మీద కూర్చుని షూ లేస్ విప్పుతూ "నాకు తెలుసు మీరు నా మాట వినరు. మీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు" అంటూ షూ తీసి ఒక్క ఉదుటున డ్రైవర్ చెంప మీద కొట్టాడు వాడి షూతో.. అప్పుడు అర్థం అయింది వీడు మామూలుగా గొడవ పెట్టే రకం కాదు పెద్ద వెధవలా ఉన్నాడు అని. కోపమొచ్చి డ్రైవర్ సీట్లోంచి లేచి గొడవకొచ్చాడు. మా ఆయన ఇంకా ఓ నలుగురు వాడితో గొడవ పడుతూ ఉన్నారు. వాడేమో "మీకు దండం పెడతాను. మీరంతా దేవుళ్లు. నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు, ఈ డ్రైవరు కండక్టరే @$^%$^%**$%$%$" అంటూ ఏదేదో వాగుతూ ఉన్నాడు. నాకేమో పిచ్చి కోపం వచ్చేస్తుంది. బస్సులో ఉన్న నలుగురైదుగురు ఆడాళ్లలో, యంగ్ యూత్ డైనమిక్ నేనే..;) ఎంతకోపమొచ్చిందంటే వాడిని అలా బయటికి నెట్టేయ్యాలన్నంత. కానీ మన పర్సనాలిటీ చూసి వాడు "చిన్న పిల్లలు కూడా చెబుతారా" అని ఒక్క మాటన్నా చాలు, మా ఆయన నన్ను అక్కడికక్కడే చితక్కొట్టేసి డైరెక్ట్‌గా ఆంబులెన్స్‌లో ఇంటికి తీస్కెళ్లిపోగలడు అని నోరు మూసుకుని నుంచున్నా.. మిగిలిన జనాలేమో ఏదో సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉన్నారు, వాడికి నాలుగు తగిలించకుండా. అందుకే, మన APSRTC వాడి ఋణం కాస్తైనా తీర్చుకోవాలని నా వెనకాల ఓ నలుగుర్ని "ఏంటలా చూస్తారు? వెళ్లి నాలుగు పీకి కిందకి నెట్టెయ్యండి వాడిని " అని అరుంధతిలో జేజెమ్మ స్టైలో అందామనుకుని మామూలుగా చెప్పి ఎంకరేజ్ చేశాను. అంతే.. ఓ పది మంది ముందుకెళ్లి కొట్టారు వాడిని. ఏంటో.. అసలు జనాలు ఇలా ఎందుకు తప్ప తాగుతారో.. తాగినా నోర్మూసుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా.. ఇలా రోడ్లమీద పడి జనాల్ని ఎందుకు హింసించడం..???

అక్కడే ఇంకో సన్నివేశం కూడా.. అలా గొడవ జరుగుతూ ఉంటే ఒకతను తొంగి తొంగి చూస్తూ ఉన్నడు, నా ముందు నుంచుని. ఆ పక్క సీట్లోనే అతని అమ్మ ఉంది. ఒక 60 సంవత్సరాలు ఉంటాయేమో, ఊరికే నిలబడడం కొడుకుని తట్టి పిలవడం "కొడకా నువ్వు అటు పోకు" అని చెప్పడం. ఇలా ఓ పది సార్లు చేసుంటుంది. నిజానికి అతను కనీసం ఒక్క మాట కూడ మాట్లాడలేదు. అతనేమన్నా నూనూగు మీసాల నూత్న ప్రాయమా అంటే ఒక 35 సంవత్సరాలుంటాయి. పోనీ నిజం సినిమా మొదటి సగం మహేష్ బాబులాగా మిల్కీ బోయ్ యా అంటే అలాకూడా కాదు, చూడ్డానికి రఫ్‌గానే కనిపించాడు. ఎంతైనా తల్లి హృదయం అంటారా????

నిజమే, కన్నతల్లి హృదయం అంతే.. కొడుక్కి ఏం జరిగినా తల్లడిల్లిపోతుంది.. ఆవిడ అతడికి మాత్రమే కన్నతల్లి; ఒప్పుకుంటాను.. కానీ, కనీసం ఆ డ్రైవర్‌ని కొడుకులా కాకపోయినా ఒక మనిషిగా కూడా చూడలేకపోయిందా? డ్రైవర్ షూతో దెబ్బలు తిన్నది ఒక్కసారి కాదు, చాలా సార్లే, గట్టిగానే... తలుచుకుంటే డిపోలో అప్పజెప్పడమో, స్టేషన్‌లో అప్పజెప్పడమో చెయ్యొచ్చు. ఇద్దరు కలిసి తిరిగి తన్నొచ్చు కూడా..మరి తాగుబోతు వెధవతో గొడవెందుకు అనుకున్నారో, అనవసరంగా టైం వేస్ట్ అనుకున్నారో తెలీదు కానీ, డ్రైవర్, కండక్టర్ చాలా సహనంతో ఉన్నారు...తప్పు తమవైపు ఉన్నా ఒప్పుకోకుండా చుట్టూ మనుషుల్ని హింసించే వాళ్లు కోకొల్లలు. అలాంటి వారికి సహాయం సంగతి పక్కన పెడితే, తిరిగి నాలుగు తన్నాలనిపిస్తుంది. కానీ, కనీసం ఇలాంటి తోటి మనిషికి అవసరం అయినప్పుడు కూడా సహాయం చెయ్యకపోతే ఇంక మనం మనుషులుగా పుట్టి అర్థం ఏముంది? అసలిదంతా కాదు. ఆ డ్రైవర్ స్థానంలో తన కొడుకే ఉండి, వేరే ఎవరూ అతనికి సహాయం చెయ్యడానికి రాకపోతే..??????

కొసమెరుపు:
ఆ విధంగా అందరూ కలిసి వాడిని కొట్టి బస్సులోంచి తోసేసాక, మన డ్రైవర్ ఎక్కడ ఆ గొడవే మనసులో పెట్టుకుని ఏం చేస్తాడో పాపం అని తెగ టెన్షన్ పడిపోయాం నేను మా ఆయన. కానీ చాలా నెమ్మదిగా(ఆర్.టి.సి. స్పీడ్ గురించి ఎవరో మాట్లాడుతున్నారక్కడ) మంచిగా డ్రైవ్ చేస్తూ గమ్యం చేర్చాడు. కానీ పాపం చాలా బాధగా అనిపించింది ఆ డ్రైవర్‌ని చూస్తే.. అసలెటువంటి సంబంధం లేని ఎవడో వ్యక్తి చేత అలా చెప్పు దెబ్బలు తినాల్సి వచ్చింది, అతని తప్పేమీ లేకుండానే. పాపం ఆ ఉద్యోగాలే అంతేమో..

Thursday, June 23, 2011

బల్లి దోశ కావాలా..??

బల్లి అంటే ఎంతమందికి ఇష్టం..???

తమరి ముఖారవిందాల్ని ఎందుకలా మా(డ్చే)ర్చేసారు? బొత్తిగా తోటిజీవుల మీద ప్రేమ లేకుండా పోతుంది మీ అందరికీ;)

సరే సరే మీరు నన్ను కర్ర పుచ్చుకుని తరిమి తరిమి కొట్టక ముందే అసలు విషయానికొస్తాను. పోయిన వారాంతం మా ఇంటికి మా ఆయన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. అందులో ఒక పెళ్లైన జంట మాధవి, రాజేష్... వాళ్ల ఏకైక సంతానం రెండేళ్ల అభి:) ఈ జనరేషన్ పిల్లల గురించి నేను కొత్తగా చెప్పడానికి ఏముంది.? మీలో చాలా మందికి ఏదో ఒక విధంగా పరిచయమే అని అనుకుంటున్నాను:) పేరుకి రెండేళ్లు.. మాటల పుట్ట అల్లరి బుట్ట (ప్రాస కోసం వాడా అంతే;))

అసలు విషయం ఏంటంటే, వాడు వచ్చీ రాగానే ఇల్లంతా తిరుగుతూ అరుస్తూ గంతులేసాడు. దాంతో ఆకలేసింది.ఇక కేకలు మొదలెట్టాడు. నాకు బల్లి దోశ కావాలి అని... అవును మీరు విన్నది నిజమే, వాడు అడిగింది బల్లి దోశే.. చిన్న పిల్లోడు కదా, ఉల్లిని బల్లి అంటున్నాడని "మాధవి ఇప్పుడు ఉల్లి దోశ ఎక్కడి నుండి తేను..? కావాలంటే మామిడి పళ్లు, పపయా ఉన్నాయి, ముక్కలు కోసిస్తా.." అన్నాను. "అయ్యో వాడు అడిగేది ఉల్లి దోశ కాదప్పూ... అది బల్లి దోశే.. వాడికి బల్లి అంటే చాలా ఇష్టం ఎందుకో మరి" అన్నది. కళ్ళు తిరిగి ఢాం అని పడబోయి తమాయించుకున్నాను;) అంతలో మళ్లీ తనే "మా ఇంట్లో కొద్ది రోజులు ఒక బల్లి ఉంది, షూ స్టాండ్ దగ్గర. వాడికి అది బాగా నచ్చి దాని తోక పట్టుకోడానికి వెంటపడుతూ ఉంటే వాడిని ఆపడానికి మా తాతలు దిగొచ్చేవారు:(. ఎలాగో ఆ బల్లిని తరిమేసి, మొన్న 5 రకాల బల్లి బొమ్మల్ని తెచ్చాం వాడికోసం. ఇంక వాటికి ఒకటే ముద్దులు. వాడు పెద్దయ్యాక నేషనల్ జాగ్రఫీ లో బల్లుల బొమ్మల్ని తీసి పెడతాడేమొ అని భయమేస్తుంది అప్పూ " అంది నేను ఆ సీన్ ఉహించుకుంటూ ఉండగా;) . "అది సరే మరి ఈ బల్లి దోశ కథేంటి..?" అని అడిగాను ఆశ్చర్యంగా, అయోమయంగా..."హ్మ్.. ఏమో మరి వాడికే తెలియాలి. వాడికిష్టమైన అన్ని వంటలకీ బల్లి ని యాడ్ చేస్తాడు. బల్లి దోశ, బల్లి కితెన్ (చికెన్) ఇలా అనమాట." పడీ పడీ నవ్వాను వాడి తెలివితేటలకి.:))))

ఫుడ్ తీసుకురాడానికి రాజేష్, రవి అన్నయ్య కలిసి బయటికెళ్లారు, మా ఆయనేమో ఇంకా ఆఫీసు నుండి రాలేదు. మాధవి, వాడికి మా అందరి గ్రూప్ ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉంది, ఇదెవరు అదెవరు అని. వాడు చెబుతూ ఉన్నాడు "రవి మామ, నాగ్ మామ, అప్పు.." ఇలా.. మా ఆయన ఫోటో చూసి "పెంకట్ మామ" అన్నాడు. వాడికి వ పలకదట. భలే పేరు పెట్టాడులే అని నవ్వుకున్నాం. అంతలో మాధవి అడిగింది "వెంకట్ మామ కావాలా" అని. చాలా స్ట్రాంగ్‌గా వెంటనే "వద్దు" అన్నాడు. "మరి అప్పు?" అంటే "అప్పు కావాలి" అన్నాడు :)) మా ఆయన్ని వద్దు అనడానికి వాడికి స్ట్రాంగ్ రీజనే ఉంది;) వాడు పుట్టిన 5 నెలల నుండే మా ఆయన వాడిని ఏడిపిస్తూ ఉన్నాడు;) అది కూడా మామూలుగా ఏడిపించడం కాదు, ఇంతసేపు నవ్వుతున్నాడుగా కాసేపు ఏడిపిద్దాం అని గిల్లి మరీ ఏడిపించేవాడు;) అందుకే ఆయనంటే వాడికి భయం చాలా..అస్సలు దగ్గరికి వెళ్లడు.ఒకవేళ బలవంతంగా ఎత్తుకున్నా ఏడ్చేస్తాడు;)
"వెంకట్ మామ ఎందుకొద్దు..? నీకు కితెన్ వెంకట్ మామే తెస్తాడు. మనం ఇప్పుడుంది వెంకట్ మామ ఇంట్లోనే.." అని మాధవి అనగానే కాస్త అయోమయంలో పడి.. ఇంకాసేపు ఆలోచించుకుని... "అయితే పెంకట్ మామ కావాలి" అన్నాడు. ఒకటే నవ్వులు మాకు..

కాసేపు ఆకలిని మర్చిపోయి ఆటల్లో పడ్డాడు. ఫర్నిచర్ ఎక్కువ లేకపోవడంతో ఇల్లు చాలా స్పేషియస్ గా కనిపించింది వాడికి. ఇక ఒకటే గెంతులు:) గట్టి గట్టిగా అరుస్తూ ఎగురుతున్నాడు. "ఇల్లు నచ్చిందా అభీ" అని మాధవి అడిగితే "ఇల్లు చచ్చింది" అన్నాడు. నేను షాక్. వాడు పుట్టినప్పటి నుండి తెలుసు గానీ, మాటలు బాగా(??) వచ్చాక ఇదే ఫస్ట్ టైం కలవడం. వాడు "న" సరిగ్గా పలకలేడట:)) "చచ్చింది కాదు అభీ.. న..చ్చిన్..దీ, ఇలా అను" అని వాళ్లమ్మ పాపం తెగ నేర్పించేస్తుంది. వాడేమో ఇంకా సీరియస్‌గా ముద్దు ముద్దుగా "న.. చచ్చింది" అన్నాడు. నవ్వు ఆపుకోడం నా వల్ల కాలేదు. మళ్లీ "అప్పు నచ్చిందా" అని అడిగింది..."అప్పు చచ్చింది" అని ఆన్సర్.. కడుపు నొప్పొచ్చేలా నవ్వాను:))))


అంతలో మళ్లీ వాడికి ఆకలి గుర్తొచ్చి బల్లి దోశ గుర్తొచ్చింది;) పాపం ఇంట్లో పాలు కూడా ఉంచలేదు (వీళ్లందరూ వస్తున్నారు కదా అని పెరుగు తోడేసేసా పాలన్నీ). ఫుడ్ తీసుకురాడానికి బయటికెళ్లిన వాళ్లు ఇంకా రాలేదు. ఇంక వాడే ఫ్రిజ్ అంతా వెతికేసుకుని స్వీట్స్ కనిపిస్తే తినేసాడు పాపం.. అవి తింటే అన్నం తినడని వాళ్లమ్మ భయం..:( మొత్తానికి పాలతో వాడి పెంకట్ మామ, ఫుడ్ తో వాడి నాన్న, మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఒకేసారి వచ్చేసారు:) ఇక వాడైతే కితెన్.. బల్లి కితెన్.. అంటూ ఒకటే హడావుడి. నేను డిన్నర్ కి కావాల్సిన డిషెస్, ప్లేట్స్ అన్నీ తెస్తూ ఉంటే మాధవి ఫుడ్‌ని ప్లేట్స్ లో పెడుతూ ఉంది. నేనొచ్చి కూర్చునే సరికి "తీస్కో అప్పు, తిను" అని నా చేతిలో ప్లేట్ పెడుతూ అభి:) "వాడికి నువ్వు వాడి ఏజ్ అమ్మాయిలా కనిపిస్తున్నట్టున్నావు అప్పూ" అని కౌంటర్‌తో మాధవి .. గుర్ర్ర్ర్‌ర్ర్‌ర్ర్...

ఫస్ట్ వాడికి తినిపించేసి తను భోజనం చేస్తూ, మాధవి అందరి పేర్లూ వరసగా అడుగుతూ ఉంది వాడిని. "అది రవి మామ, ఇది నాగ్ మామ, అది రాం మామ, ఇది డాడీష్ (దాడీ+రాజేష్), (వాడిని వాడు చూపించుకుంటూ) ఇది అభి, నువ్వు మామిడి (మాధవి), ఇది అప్పు" ఇలా చెబుతూ (ఇది చదివి పాపం వాడిని "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" సినిమాలో సునీల్‌తో పోలిస్తే మీ అందరికీ బల్లి దోశ తినిపించేస్తాడు జాగ్రత్త..) మా ఆయన దగ్గరికొచ్చేసరికి "అది పెంకట్, నాకొద్దూ" అన్నాడు మా అందరికీ నవ్వుల విందునందిస్తూ :))) పాపం మా ఆయన;)

అందరం రాత్రంతా అలా మెళకువగానే ఉన్నా కూడా అస్సలు అలసట అనిపించలేదు..అంతగా ఎంజాయ్ చేసాం వాడి అల్లరితో:) పిల్లలంటే దేవుళ్లు అని ఎవరు చెప్పారో కానీ అదెంత గొప్ప సత్యమో కదా.. కాసేపు వాళ్లతో ఉంటే చాలు, మన కష్టాలు, సమస్యలు, చిరాకులు అన్నీ దూరమవుతాయి:) దేవుడు ప్రతి మనిషినీ ఎల్లప్పుడు అంటిపెట్టుకుని ఉండే వీలు లేక అమ్మ రూపంలో ప్రతి ఇంట్లో ఉంటాడట.. అదే దేవుడు, అమ్మ గొప్పది అన్న విషయాన్ని లోకం నలుమూలలా చాటి చెప్పడానికి,జీవితం విలువ అందరికీ తెలియజెప్పడానికి పిల్లల రూపంలో వచ్చాడేమో అనిపిస్తుంటుంది నాకు:) కానీ ప్రతి మనిషికీ తోటి ప్రాణి విలువ చెప్పేది, మనిషి ని మనిషిగా చూడడం నేర్పించేది మాత్రం దేవుళ్ల లాంటి పిల్లలే.. కల్మషపు గాలి కాస్త కూడా సోకని స్వఛ్చమైన ముత్యాలు:)

Thursday, May 26, 2011

ఆదివారం అగచాట్లు

ఆదివారం.. ఉదయాన్నే 11 గంటలకి ఆవులిస్తూ, మెల్లిగా దుప్పటి పక్కకి జరిపి, నిద్రమొహంతోనే ఈనాడు/సాక్షి/ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం చదవడం, తర్వాత చిన్నగా కాలకృత్యాలు ముగించి కడుపులో కాస్త పడేయడం.. అద్భుతమైన అనుభూతులు కదా.. ఏంటి, ప్రతి ఆదివారం జరిగే సంగతినే గొప్పగా చెబుతున్నానా.? మరద్దే, అక్కడే ఆదివారం అనుబంధంలో కాలేశారు. ఆదివారం అర్థరాత్రి 7 గంటలకల్లా నిద్రలేచి (వంట చెయ్యాలంటే ఇంకో గంట ముందు), అన్ని పనులూ అర్థ..గంటలో ముగించుకుని దేశాన్ని ఏలే అభినవ యువనేత లాగా, రాణీ రుద్రమదేవి లాగా, ఝాన్సీ లక్ష్మి బాయి లాగా కదనరంగంలోకి దూకుతున్నట్లుగా, నడుస్తున్నట్లుగా పరిగెడుతూ మొత్తానికి ఆటో స్టాండ్కి వెళ్లడం. ఇది కల కాదు. ప్రతి ఆదివారం జరిగే తంతే..

అంత బిల్డప్ ఇచ్చి ఎక్కడికా వెళ్లేది అనే కదూ చూస్తున్నారు. ఒక్కసారి సంతూర్ యాడ్ గుర్తు తెచ్చుకోండి. "కాలేజా.. నేనా.. మామ్మీ" ఇక్కడేమో కాస్త రివర్స్. మేమంతా వెళ్లేది కాలేజికే (అంటే మేమందరం మమ్మీలని కాదు..). కథా కమామీషు అంతా చెప్పాలంటే ముందు ఆటో ఎక్కలి కదా. ఆటో స్టాండ్కి కాస్త పెద్దదైన పురుగొచ్చినా (పిల్ల మనిషి అనేసుకుంటాడు ఆటోవాడు) సరే, కనీసం ఎటెళ్లాలి అన్న సింగిల్ ప్రశ్న కూడా అడక్కుండా ఆటోలోకి తొక్కేసి లాక్కెళ్లిపోయే రకాలు మా హైదరాబాదు ఆటోవాలాలు. నిజమే మరి, మనుషుల్ని పురుగుల్లానే తొక్కేస్తారు ఆటోలో. ఒరేయ్ బాబూ నే వెళ్లాల్సింది అటు కాదురా అన్నా వినిపించుకోడు. మీరు భయపడకండి మేడం, మిమ్మల్ని సేఫ్గా XYZ (ఏరియా పేరు) దగ్గర దించేస్తాను అన్నట్లుగా అభయహస్తం ఒకటి. ఎలాఓకలా మనది కాని నిమిత్తమాత్రపు ఆటోని వదులుకుని మన గమ్యం దగ్గర చేర్చే ఆటోని వెతికి పట్టుకుని అందులో ఎక్కి ఊపిరి పీల్చుకునే లోపు, ధడేల్.. ధిడేల్.. ధన్.. ధన్ అంటూ సంగీత వాయిద్యాల కఠోర హోరు వినిపిస్తూ ఉంటుంది. అదేంటో అర్థమయ్యేలోపు చెవులకి సగం చిల్లులు పడిపోయి ఉంటాయి కనిపించకుండా.. :(

"భయ్యా.. థోడా వాల్యూం కం కర్ సక్తే క్యా?" మ్యావ్ అన్న సౌండు కూడా వినిపించనంత చిన్నగా అరిచే పిల్లిలా నేను. "నై హోతా" ఇంకోసారి మాట్లాడావో ఏరియాలో నీకింకో ఆటో దొరక్కుండా చేస్తా అన్న మెసేజ్ని చూపుల్తోనే చెబుతూ ఇంకాస్త సౌండ్ పెంచే అతను (అదేనండీ ప్రపంచంలోని రోడ్లన్నీ అతని పేరు మీదే ఉండి, ఏదో ఉదాత్తంగా మన మొహాలకి ధారాదత్తం చేసే ఆటో డ్రైవరు/ఓనరు). మొత్తానికి జాగ్రత్తగా సైడ్ కి తీస్కెళ్లి సరదాగా దేనికి పెడతాడో తెలీకుండా జాలీగా నడిపేస్తూ గమ్యం చేర్పించే సరికి మనకి తలనొప్పి వస్తుంది. హమ్మయ్య అనుకునేలోపు ఇంకో తలనొప్పి ఎదురవుతుంది. ఎవరంటే ఏం చెప్పను? అజయ్ కి ఆర్య లాంటి ఫ్రెండు లేకపోతే ఆర్య2 సినిమా వచ్చేదే కాదు. నాకు ప్రవీణ లాంటి నేస్తం లేకపోతే టపా పుట్టేదే కాదు. మీకు అర్థం అయిందనుకుంటాను! అయినా సరే నేననుకున్న నాలుగు ముక్కలు చెప్పి కానీ వదలను మిమ్మల్ని.

అమ్మాయి గురించి చెప్పాలంటే మనం కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. అంటే మరీ శ్రీకృష్ణ దేవరాయల కాలానికి కాదు కానీ ఒక 3 సంవత్సరాలు వెనక్కన్నమాట. పొరపాటున, నా అదృష్టం బాలేక, ఒకరోజు అమ్మాయికి ఒక పెన్ను ఇచ్చా. పెన్ను దానం కూడా ఒకానొక సమయంలో శాపం అయి కుర్చుంటుందని నాకు తర్వాతే తెలిసింది. అప్పటి నుండి తర్వాత ఒక సంవత్సరం వరకూ అదే