Thursday, September 30, 2010

తోటకూర అనుబంధం..

అవి నేను హాస్టల్ లో కొత్తగా చేరిన రోజులు.. అంటే నా తొమ్మిదవ తరగతిలో కొత్త స్కూల్ కి ఎలాగైనా మారాల్సిందే అని ఏడ్చి గీపెట్టి హాస్టల్ లో చేరిన రోజులన్నమాట.. మరే.. చేరడం అయితే చేరిపోయాను కానీ, హాస్టల్ జీవితం ఎంత అందంగా ఉంటుందో అందులో అడుగు పెట్టిన తరువాత కానీ తెలిసి రాలేదు.. మనిషికొక చిన్న బెడ్. అంటే అందులో నేనూ నా టెడ్డీబేర్ దాని ఫామిలీ అంతా పట్టేట్లుగా కాదండోయ్ (సాధారణంగా సినిమాల్లో అలాగే చూపిస్తాడు కదా). కేవలం నేను మాత్రమే పట్టే బెడ్ అది. భలే బాధగా ఉండేది కొంచెం లావు ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటా అని..:( ఏమిటో బొత్తిగా చదువులు కమర్షియల్ అయిపోయాయి అని ఒకసారి తిట్టేసుకుని కొత్త స్కూల్ ని మిగిలిన విషయాల్లో ఆస్వాదించడం మొదలు పెట్టాను. సరే.. చదువు, ర్యాంకులు అంటే ఎప్పుడూ ఉండేవే.. మరి తిండో..!! ఎంత కష్టం అది (సరిగ్గా ) లేకపోతే..? మొదట్లో మాత్రం భలేగా ఉండేవి రుచిగా.. మరి, నాకు కొత్త కావడం వలన అలా అనిపించిందో.. లేదా.. " ఏదైనా మొదట ప్రజల హృదయాల దాకా చేరగలిగితే తరువాత అది బాలేక పోయినా వాళ్లే చూసుకుంటారు" అన్న సూత్రం ఇక్కడ కూడా అప్లై చేసేశారో తెలియదు కానీ, పిల్లలకు వారి తల్లిదండ్రులకు బ్రహ్మాండమైన భోజనం పెట్టేవారు మొదట్లో. అది చూసి మా నాన్న గారు కూడా చాలా ఆనంద పడిపోయారు. కానీ ఎవరికి మాత్రం తెలుసు..? Infront there is crocodile festival అని..
ప్రతి రోజూ ఉండటానికి మాత్రం చాలా రకాల పదార్థాలు ఉండేవి తినడానికి. ఫలహారం కింద 7 రకాలు, రోజుకొకటి చొప్పున వారం రోజులు. నాకు ఈ రోజుకీ అర్థం కాదు ఆ పదార్థాలని ఫలహారం అని ఎలా అనగలరో. ఒక్కొక్క దానికి ఒక్కో కథ. ఆ కథని ఒక్కో పోస్ట్ లో పంచుకోవచ్చు మీతో. ముఖ్యం గా ఉప్మా గురించి.. సినిమాల్లో ఉప్మా రవ్వ బదులు ఫెవికాల్ వేస్తే ఎలా ఉంటుదో మనకి చాలా సార్లు చూపించారు. నాకు ఎప్పటి నుండో డవుట్, సినిమా వాడికి మా హాస్టల్ యాజమాన్యమే ఆ రెసిపీ అమ్మేసిందేమో అని..;) సరే ఫలహారాల సంగతి కాస్త పక్కన పెడితే, మధ్యాహ్న భోజన పథకం కింద ప్రసాదించే గొప్ప ఉపయోగకరమైన ప్రసాదాలు ఏంటంటే, ఒక పప్పు, ఒక కూర మరియు ఒక పచ్చడి అనబడు పదార్థాలు. అసలు ఆ పచ్చడి గురించి చెప్పాలంటే.. ఒక రెండు పోస్ట్ లు రాయొచ్చేమో. రోజుకొక పచ్చడి పేరు చెబుతారు(బీరకాయ, దొండకాయ, టమాటా, వంకాయ, etc..). కానీ, మా హాస్టల్ యాజమాన్యం ఎంత గొప్పది కాకపోతే వారం రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క రోజు కూడా ముందు రోజు తిన్న పచ్చడికి ఆ రోజు తిన్నదానికి ఒక్క తేడా కూడా కనిపెట్టాలేకుండా అన్ని సంవత్సరాలు (ఇప్పటికి కూడా ఉంది, కానీ అందులో ఫుడ్ ఎలా ఉందో తెలియదు) manage చెయ్యగలుగుతుంది.అదేంటో అన్నిట్లో వేరు శనగల రుచే ఉండేది.
హ్మ్..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు, విశేషాలు, విశేషణలు, ఆశ్చర్యార్థకాలు, ప్రశ్నార్థకాలు ఎదురవుతాయి. కాబట్టి స్ట్రయిట్ గా పాయింట్ లోకి వచ్చేస్తున్నా.. అలా హాస్టల్ లో పెట్టే రకరకాల గడ్డి అంతా తిని కొన్ని రకాల ఇంటి వంటల కోసం, కరువు ప్రాంతాల్లో సహాయ శిబిరాలు విసిరేసే పొట్లాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చూస్తూ ఉండే వాళ్లం.. సింపుల్ గా గోతి కాడ నక్కలా..:)
అలాంటి కొన్ని వంటల్లో కొబ్బరి పచ్చడి, కోడిగుడ్డు కూర, గడ్డ పెరుగు, కాకర కాయ అన్నిటికన్నా ముఖ్యంగా తోటకూర, చుక్క కూర, పాలకూర ( ఇలాంటి ఆకు కూరలన్నీ హాస్టల్స్ లో పెట్టరు, పనెక్కువ అని) ఉండేవి. ఇంటికెళ్లినప్పుడలా మా నాన్నారేమో, కోడి తెప్పించనా, చేప తెప్పించనా, మేక తెప్పించనా అని ఎంతో ప్రేమగా అడుగుతారు. నేనేమో తోటకూర, పాల కూర, కొబ్బరి పచ్చడి అని అంతే ప్రేమగా అడుగుతాను. ఇక్కడో ఆశ్చర్యార్థకము మరియు ప్రశ్నార్థకమూ మా నాన్నగారికి. మా అమ్మ మాత్రం చాలా ఆనందంగా, అలా పెరట్లోకి వెళ్లిపోయి,లేలేత తోటకూర తెచ్చేసి రుచికరంగా వండి పెట్టేది.
ఇంతకీ మా ఇంటి గురించి మా పెరడు గురించి చెప్పలేదు కదూ.. మా ఇంట్లో ఉన్న రెండు పోర్షన్స్ లో మేము మా బాబాయి వాళ్లు ఉంటాము. బాబాయికి ఇద్దరు కొడుకులు, (వాళ్లే) నాకున్న ఇద్దరంటే ఇద్దరే తముళ్లు. నేనేమో వాళ్లకున్న ఏకైన అక్కయ్యని. మా అందరికీ కలిపి ఒకే ఒక తాతయ్య..:). మా ఇంటి చుట్టు ఒక రెండెకరాల పెరడు ఉంటుంది.ఆ పెరడులో మా తాతయ్య, మొక్క జొన్నలు, పశువులకి జాడు వగైరా పెంచేవారు. మా అమ్మ, పిన్నేమో ఆకు కూరలు, కూరగాయలు పండించేవారు. అన్ని రకాల కూరగాయ పాదులు, మొక్కలు ఉండేవి.
అలా అప్పటికప్పుడు పెరట్లోకి వెళ్లి లేత తోటకూర తెచ్చి కొంచెం టమాటా కలిపి వండితే భలే ఉండేది..:) అలాగే చుక్క కూర పాలకూర కూడానూ.. అలా ఆకుకూరలతో నాకు పుట్టిన అనుబంధం, ఇప్పటికీ పెరిగి పెద్దదయ్యి, పువ్వులు పూసి, కాయలు కాసి, అవి పండి, ఎండి, కిందపడి, విత్తులతో కొత్త అనుబంధపు మొక్కలు మొలిచి, ఒక వట వృక్షం అయ్యి తనివి తీరని అనుబంధం గా మారింది.
నాకు తెలుసు ఇప్పుడు మీరంతా ఏమనుకుంటున్నారో.. ఒకప్పుడు, " తిండి తిప్పలు" అని పోస్ట్ పెట్టేసి తన గోడు వెళ్లబుచ్చుకున్న ఈ అమ్మాయికి ఇలా ఇష్టమైన వంటకాలు కూడా ఉంటాయా అనే కదా.. హ్మ్..ఏం చేస్తాం.. నా హాస్టల్ జీవితం కొన్ని వంటల మీద ఇష్టాన్ని పెంచితే చాలా వాటి మీద తగ్గించేసింది. ఉదాహరణకి ఉప్మా.. ఇలాంటివి  చూస్తేనే తిప్పలు పడేది తినడానికి.. :(
మీకు ఇక్కడింకో విషయం చెప్పాలి. నేను మాంసాహారం కూడా తింటాను కానీ అది కూడా మామూలు ఒక కూరలా తినడమే తప్ప, స్పెషల్ గా, ఇష్టం గా తినడం అంటూ ఏమీ ఉండదు. చాలా చాలా తక్కువ. ఇలా ఆకు కూరలు, రోటి పచ్చళ్లు అయితే ఫుల్ గా తినేస్తా. అదిగో సరీగ్గా అక్కడే సామాన్య ప్రజానీకానికి నాకు పెద్దగా పడేది కాదు. నీకిష్టమైన కూర ఏది అనగానే "అశోకుడు చెట్లు నాటించెను, బావులు తవ్వించెను" లాగా తడుముకోకుండాగా వచ్చే సమాధానం తోటకూర. ఆతర్వాత వెంటనే ఏమాత్రం ఆలస్యం కాకుండా మొహమాట పడకుండా వచ్చే శబ్దం లాఫింగ్ క్లబ్ లో నవ్వే నవ్వులు. అందుకే ఈ సమాజం మీద నాకు తీరని పగ, నెరవేరని ప్రతీకారం.
మన దగర ఉన్న ఇంకో మహత్తర నైజం ఏంటంటే.. ఏదైనా కొత్త పదార్థాన్ని ఎన్ని చెప్పినా తినను కానె, ప్రూఫులతో సహా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటే తినేస్తా. అంటే ఆరోగ్యానికి మంచిది కదా అని కష్టపడి తినను. అదేంటొ చాలా సహజంగా దాని మీద ఇష్టం వచ్చేస్తుంది. అదే కోవలోకి, క్యారెట్, కీరా, ఓట్స్, కాకరకాయ(నాకు ఇదంటే భలే ఇష్టం), పాలు ఇంకా చాలా, సాధారణంగా సామాన్య ప్రజానీకం తినడానికి ఇష్టపడనివి మరియు ఆరోగ్యానికి మంచివీ..
కాకరకాయ విషయంలో మీతో ఒక విషయం పంచుకోవాలిక్కడ. నాకున్న ఇద్దరు తమ్ముళ్లలో చిన్నవాడు,వాడు వెళ్తున్న దారిలో ఎక్కడైనా కాకరకాయ తీగ కనిపిస్తే చాలు, అదేదో దేవతలు వాడికోసం అమృతం కాయల రూపంలో పంపించి కాకర తీగల్లో దాచినట్టు తెగ వెతికేసి, కాకరకాయ కోసేసుకుని మనమంతా కొబ్బరి, క్యారెట్ ఎంత ఆనందంగా తింటామో వాడు అంత ఆనందంగా పచ్చి కాకరకాయ తింటాడు. ఇలాంటి రాచకార్యాలు చాలా చేస్తాడులే వాడు. వాడి గురించి ఒక నవల రాసెయ్యొచ్చు, కనీసం ఒక పోస్ట్ అయినా రాసి నా జన్మ సార్థకం చేస్కుంటాను త్వరలో;).
ప్రస్తుతానికి నా తోటకూర కబుర్లు. అదేంటో, సామాన్య ప్రజానీకం సంగతి పక్కన పెడితే నా నేస్తాలు కూడా నన్ను సపోర్ట్ చెయ్యరు ఈ విషయంలో. డిగ్రీలో ఒక్క నేస్తం తప్ప. పేరు అనుపమ. ఏ రోజైనా తోటకూర లంచ్ బాక్స్ లో తెస్తే ఆ రోజు తన బాక్స్ నాకే..:) ఇంకా ఏ రోజైనా నేను వాళ్లింటికి వెళ్తే, వాళ్ల అమ్మకి చెప్పి మరీ ఆరోజు అదే కూర వండిస్తుంది.. ఇప్పటికి కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటే అంటూ ఉంటుంది " ఆ రోజులు మర్చిపోలేము కదూ.. అసలు నాకైతే తోటకూర వండిన ప్రతి రోజూ నువ్వే గుర్తొస్తావు.." అంటుంది. కానీ ఇంకెవ్వరూ అర్థం చేసుకోకపోగా నవ్వేసి, తొక్క.. తోటకూర.. అంటూ హేళన చేస్తారు.. Grrr...
ఇప్పుడు చెప్పండి. మీరంతా ఏం చేస్తారు..? సపోర్ట్ ఇస్తారా..? సామాన్య ప్రజానీకంలో కలిసి పోతారా.? రెండవ దారి మీదైతే తరువాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలిని కాను.(ఏం చేస్తానో ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అందుకే ఇటువంటి శాపం..;)).

Tuesday, September 21, 2010

నేను - నామనసు

టపా రాయాలి. చాలా రోజులు అయిపోయినట్లుంది నా "మనసు పలికి". కానీ, ఏం రాయాలో ఎలా రాయాలో  అసలు ఎందుకు రాయాలో అర్థం కాక; అదేదో సినిమాలో బాబూమోహన్ అనుకున్నట్లుగా "ఎందుకు? ఏమిటి? ఎలా?" అన్న ప్రశ్నలు టక టకా అడిగేసుకున్నాను నా మనసుని. కానీ నా మనసేమన్నా చాకోలేట్స్ తినే చిన్న పిల్లా ఇలా బుజ్జగించి అడిగితే చెప్పెయ్యడానికి. నేనంటే మహా కోపం దానికి.. అది చెప్పిన మాట విననని. అందులోనూ,  చాలా రోజులుగా పలికించకపోయేసరికి నా మనసు బద్ధకరత్న బిరుదుని సంపాదించుకుని హాయిగా ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. పది రోజులకేనా అని నోరెళ్లబెట్టకండి. బద్ధకం ఆపాదించుకోడానికి 10 రోజులు చాలా తక్కువ సమయం అని తెలిస్తే నా మనసు ఇగో చాలా హర్ట్ అవుతుంది..
అంత బద్ధకంగా వర్షాకాలంలో ముసుగుతన్ని నిద్రపోతున్న నా మనసుని ఇలా హఠాత్తుగా నిద్ర లేపి పలకమంటే ఏం పలుకుతుంది పాపం..? కాస్త ఆలోచించుకోవాలి కదా.
అందుకే.. నాకు ఎలా సమాధానాలు చెప్పాలో అలాగే చెప్పింది.
మరే.. ఎందుకు రాయాలి అని చాలా మర్యాదగా, సవినయంగా అడిగి చూశాను. పనీ పాటా లేక అని సమాధానం వచ్చింది..:(
పోనీ రెండో బాణం అన్నా తగలక పోతుందా అని "ఏమిటి?" అని అడిగేసి ఎంత పొరపాటు చేశానో తరువాత కానీ అర్థం కాలేదు.

కథలు*** ఎబ్బే.. మనకి సరిపోవు. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద బ్లాగరులు బ్లాగరిణి లు కథల మీద కథలు రాసేసి కామెంట్ల మీద కామెంట్లు కొట్టేసి అందులో తల, బ్లాగు పండి పోయి ఉన్నారు. ఇక నువ్వు మొదలెట్టావనుకో ఆ బ్లాగే వాళ్లకంతా కథల మీద విరక్తి వచ్చెయ్యొచ్చు..

పాటలు *** మరద్దే.. ఎకసెక్కాలంటే.. పాటల పరువు తియ్యకు. (నీ జీవితానికి పాటలు రాయడం ఒక్కటే తక్కువ ఇప్పుడు అన్నట్లు) వచ్చేసింది కదా సమాధానం... ఇంకేం చూస్తున్నారు..:(

జోకులు*** హిహ్హిహ్హ్హి.. నువ్వు జోకులు టపా చేస్తున్నావంటేనే నవ్వు వచేస్తుంది. తరువాత ఎవ్వరికీ నవ్వు రాకపోవచ్చు.. లైట్ తీస్కో...

సినిమా రివ్యూలు*** ముందు కొత్త కొత్త సినిమాలు మొదటి రోజో మొదటి వారం లోనో చూడటం నేర్చుకో.. తరువాత రాద్దువులే రివ్యూలు..

బొమ్మలు?? ***  వెయ్యక వెయ్యక రెండు బొమ్మలు వేసి పెట్టావ్.. ముందు పూర్తి కాని ఆ బొమ్మని పూర్తి చెయ్యి.. లేదా ఇంకో నాలుగు కొత్త బొమ్మలు వేసి అప్పుడు పెట్టు "నీ పిచ్చి గీతలు" టపా.

ఫోటోలు *** తార గారన్నట్లు రెండు లక్షలు కొట్టు కెమెరా పట్టు.. పోస్ట్ పెట్టు.. (నా ఆర్థిక స్థోమత తెలిసి కూడా...)

పోనీ.... క..వి..త..లు.. *** వద్దమ్మా వద్దు.. నువ్వు కవితలని మొదలెడితే అవి కాస్తా తవికలయ్యి కూర్చుంటున్నాయి..దయచేసి అంత సాహసం చెయ్యొద్దమ్మా..

ఇదంతా కాదు, అసలు నిన్నడిగేదేంటని నా ఙ్ఞాపకాలు స్మృతులు అన్నీ కలిపి ఒక దండగా పేర్చేసి మీ అందరి ముందు ఉంచేద్దామనుకున్నానా.. మరి మనసనే దారం లేకుండా ఎలా.?? :( మాయాబజార్ సినిమాలో యస్.వి.రంగారావు లాగా.. యమలీలలో సత్యనారాయణ లాగా ఒక పెద్ద నవ్వు నవ్వేసి నా మనసు నన్ను కించ పరిచేసి గాయ పరిచేసి ముక్కలు ముక్కలు చేసేసింది..
సామాన్య, సాంఘిక, గణిత, అర్థ, జీవ, పౌర, భౌగోళిక, ఇంకేదైనా శాస్త్రాలు, చరిత్ర సహాయం చేస్తాయేమో అని కూడా చూశాను. అబ్బే.. అవన్నీ చదివేసి చాలా యుగాలు గడిచిపోయినట్లు ఉంది. ఇక రాజకీయం, మన ఒంటికి/ఇంటికి పడదు.. ఇంకేం చేస్తాం..? నోరు మూసుకుని, చెవులు తెరుచుకుని మనసు చెప్పింది వినడం మొదలెట్టాను.
ఎంత విన్నా ఏం లాభం చెప్పండి. చెప్పే మనసుకి వినే మనుషులు లోకువన్నట్లు.. అన్నీ అవకతవకలే.. అన్నీ బ్లాగర్లు భయపడి పారిపోయే ఆలోచనలే.. ఒక్కటైనా సరిగా చెప్పవు కదా నువ్వు అనుకుంటూ(తిట్టుకుంటూ) వింటూ ఉన్నాను.
ఇంత కష్ట పడి వింటూ ఉన్నానా..? కొంచెమైనా జాలి పడాలి కదా.. ఉహు.. ఇంతా చేసి, ఇప్పుడు మత్తులోంచి బైటికి వచ్చినట్లుంది. సినిమాల్లో హీరోకో హీరోయిన్ కో ఆక్సిడెంట్ అయ్యి తలకి పెద్ద గాయం తగిలి "ఎవరు నేను..? ఎక్కడున్నాను..?" అన్నట్లుగా "అసలేం జరిగింది ఇప్పటి వరకూ..? నువ్వు నన్నేమైనా హింసించావా..?" అని నన్నే హింసించడం మొదలెట్టింది..:(
ఇంకేం చేస్తాను.. ఈ సారి చెవులు కూడా మూసేస్కుని పరుగందుకున్నాను..
ఇదిగో.. మిమ్మల్నే..
పెద్ద పెద్ద.. గొప్ప గొప్ప బ్లాగర్లూ.. కాస్త సాయం చేద్దురూ..
" ఏం రాయాలి..? ఎలా రాయాలి.? ఎందుకు రాయాలి..?"
మీ ఋణం వెంటనే తీర్చుకుంటాలే.. మీ టపాల్లో కామెంటేసి..;-)

Wednesday, September 8, 2010

"నేను" నేనే..

మరిప్పుడేమో.. నేను ఎప్పుడో ఇంటర్ లో ఉన్నప్పుడు రాసుకున్న కవిత ఒకటి మీ మీదకి వదులుతానంట.. మీరంతా దాన్ని చకా చకా చదివేసి నన్ను పొగిడెయ్యాలంట..;) లేకపోతే నేను కచ్చే అంట..:)

ఎవరి రంగంలో వారు గొప్పవారే..
ఒక కృష్ణ శాస్త్రి.. ఒక ఐన్ స్టీన్..
ఒక డావిన్సీ.. ఒక మదర్ థెరిస్సా..

ఎవరి దృక్పథంలో చూస్తే వారిది మంచే..
ఒక అరుణ్ శౌరి.. ఒక బిన్ లాడెన్...
ఒక దేవదాసు.. ఒక నేను..

ఎన్ని సార్లు అనుకున్నానో.. సాహిత్యంలో కృష్ణ శాస్త్రినవ్వాలని..
ఇంకెన్ని సార్లనుకున్నానో.. ఐన్ స్టీన్ గుర్తింపు నాకుండాలని..
డావిన్సీ కుంచె నాచేతికొస్తే బాగుండుననుకున్న సందర్భాలు లెక్క లేవు..
ఎన్నో సార్లు థెరిస్సాకే అమ్మనవ్వాలనిపించింది..

ఒకనాటి కృష్ణ రజనిలో..
నా కనుపాప నిశ్శబ్ధంగా..
కను రెప్పల చాటు నుండి స్వప్నాలను ప్రసవిస్తుంది..
తనకే సంబంధం లేదన్నంత అమాయకంగా..
ఆ కలల పరంపరలోనే..
అందర్నీ చూస్తాను నాలా..
నన్ను చూసుకుంటాను అందరిలా..

అంతలోనే కనుపాప ఏదో గుర్తొచ్చిన దానిలా.. చప్పున కళ్లు తెరుస్తుంది..!
తన లోగిలిలో ఏముందో చూద్దామనేమో..
అదేంటో నేను, నేనుగానే ఉంటా..
రాత్రి తాలూకు స్వప్నాలను ఏరుకోవడం కోసం విఫలయత్నం చేస్తూ ఉంటాను..
స్వప్నాలు కదా..! దొరకవు.

మొదట.. నిరాశగా.. తరువాత.. రాజీ పడుతూ..
ఆ తరువాత అమితానందంతో..
"నేను"..
నేనుగానే ఉంటాను..
నేను నేనుగానే ఉండాలనుకుంటాను..
తెలుసు కదా.. ఎవరికి వారు గొప్పే..:):)