Wednesday, October 27, 2010

కాస్త విశ్రాంతి...

ఎప్పుడూ ఏ.సి. ఆఫీసులు, క్యాబులు, కంప్యూటర్లు, కీబోర్డు లేనా. కాస్త అప్పుడప్పుడూ, ఆర్.టి.సి. బస్సులు, చెప్పుల్లేకుండా మట్టిలో నడవడాలూ, పచ్చికలూ, పొలాలు, పక్షులు ఉంటే ఎంత బాగుంటుంది కదూ.. అందుకే పోయిన వారం అలా మా ఊరు వెళ్లొచ్చా.

                                                      ఊరు వెళ్తున్నప్పుడు..

                                               నీటి కాలువలో పాము..(ఏ పామో తెలియదు)


                                                             వరి పొలం..



                                                          పత్తి పువ్వు 


                                                                   నీటి కాలువ 


                                                                   బావి


                                                                     పత్తి

  
                                                                       పసుపు చేను


                                                 బావిలో రాయేసి మరీ తీసాను ఈ ఫోటోలు..:)



                                                               ఎడ్ల బండి 


ఎలా ఉన్నాయి మా ఊరి ఫోటోలు..? బాగున్నాయి కదూ..:)

Tuesday, October 12, 2010

గుచ్చుకున్న "మొగలి రేకులు"

*******************************Note Note Note*******************************
మీలో ఎవరైనా "మొగలి రేకులు" సీరియల్ కి ఫ్యాన్స్ ఉంటే దయచేసి ఇటు తొంగి కూడా చూడకండి. ఆ తరువాత మీ మనోభావాలు గాయపడితే నన్ను బాధ్యురాలిని చెయ్యొద్దు..:( ఇది కేవలం ఆ రేకుల తాకిడి తట్టుకోలేక మొదలెట్టిన నా కంఠశోష. ఎవరినైనా కించపరిచినట్లు అనిపిస్తే క్షంతవ్యురాలిని..
*********************************************************************************



ఓర్నాయనోయ్.. ఓరి దేవుడోయ్.. అనుకోకుండా, నా అదృష్టం బాలేక, శని దేవుడు నా నెత్తిమీదే టెంట్ కట్టుకుని కూర్చున్నందువల్ల, అసలు జ్యోతిష్యం ప్రకారం గానీ, సంఖ్యా శాస్త్రం ప్రకారం గానీ, వాస్తు ప్రకారం గానీ నా పొజిషన్ బాలేక మొన్నటి శుక్రవారం రాత్రి జెమిని టి.వి. పెట్టాల్సి వచ్చింది, అది కూడా రాత్రి 8:30 ప్రాంతంలో.. అప్పటి నుండీ నా కడుపు ఉబ్బిపోయి ఉబ్బిపోయి ఎప్పుడెప్పుడు మీ చెవిలో ఈ విషయం వేద్దామా అని ఎదురు చూస్తూ ఉంది.. ఇదిగో ఇప్పుడు ఇలా మీ అదృష్టం బాలేక నాకు సమయం దొరికింది. ఓర్నాయనోయ్.. ఆ రేకుల జీడిపాకం ఇంకా అవ్వలేదా.. అప్పుడెప్పుడో... చూసినట్లు గుర్తు, అందులో పాత్రలన్నీ వయసుకు తగ్గట్లుగా ఉన్నప్పుడు. అదేంటో.. అందరూ అలాగే కనిపించారు ఇప్పుడు కూడా..(కొన్ని పాత్రలు పోషించిన వాళ్లు మారిపోయారు లెండి..) కానీ వాళ్లకి చెట్టంత ఎదిగిన కొడుకులు, పెళ్లీడుకొచ్చిన కూతుర్లు.. ఇక ఈ పాకం సాగడం ఆగదా అంట.. అసలు సీరియల్ చూడ్డం మొదలు పెట్టగానే నా మైండ్ బ్లాక్ అయిపోయి, నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయి, నా హార్ట్‌లో హోల్ కూడా పడిపోయిన ఫీలింగ్.. ఇంత హింస తట్టుకోలేక నా చిన్ని గుండె ఎన్ని కష్టాలు పడిందో పాపం..

బాలయ్య సినిమా కన్నానా అని నన్నడగొద్దు ప్లీజ్.. రాళ్లల్లో కొన్ని వేలరకాలు, పళ్లు ఊడగొట్టుకోడానికి.. ఇక పులి గొడవ. కొమరం పులి నేను అతి కష్టపడి, అసలు ఎందుకు ఫెయిల్ అయిందో.., ఏ యాంగిల్‌లో డైరెక్టర్‌కి నచ్చి ఉంటుందో చూద్దామని/తెలుకుందామని అంతటి సాహసానికి ఒడిగట్టాను, నా ల్యాప్‌టాప్ పుణ్యమా అని .. నాకు అర్థం కాని ఒకేఒక్క విషయం అలాగే నా మదిలో ఉండిపోయింది."అసలు థియేటర్‌లో చూసిన వాళ్లు ఎలా భరించారా ఆ సంకల్పాన్ని" అని. అంతేనా.. అసలా సంకల్పం ఏ మెదడు నుండి మొలిచిందా అన్న ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకనేలేదు. ఇంకా చాలా చాలా ప్రశ్నలు సమాధానాలు దొరక్క మనసులోనే కొట్టేసుకుని చచ్చిపోతున్నాయి.. అయినా, ఇంకా లోకం పోకడ తెలియని ఈ చిట్టి హృదయానికి అలాంటి భయానక భీభత్సకర దృశ్యాలు చూపిస్తే ఎలా తట్టుకోగలదు..?

సరే, మన రేకుల గొడవలోకొద్దాం. నేనైతే మొగలి పువ్వుల్ని ఎప్పుడూ చూడలేదు కానీ, పుస్తకాల్లో చదివిన ఙ్ఞానం, ఆనోటా ఈనోటా విన్న పైత్యం కలిసి వాటికి ఒక గౌరవపూర్వకమైన స్థానాన్ని కల్పించాయి.కానీ అదేంటో ఇప్పుడు ఆ పేరు వింటేనే జెమిని టి.వి. గుర్తొస్తూ ఉంటుంది.. అయినా, ఈ ఒక్క సీరియల్‌ని అనుకుని ఏం లాభం లెండి. ఇంకా చాలా ఉన్నట్లున్నాయి ఇలాంటి ఆణి ముత్యాలు, జాతి రత్నాలు. ఏదో ఓ సినిమా(బాగా హిట్టయిన సినిమా) పేరు పెట్టేసి దాన్ని నాలుగు సార్లు రాగయుక్తంగా మాట్లాడేసి (పాడేసి) పాటయిపోయిందనిపించేసి.. ఇలా ఉంటున్నాయి కదూ సీరియల్స్.. ఎరక్కపోయి ఇరుక్కుపోయినప్పుడల్లా నేను ఎంత బాధ పడిపోతానో తెలుసా.. ఇంకా అందులో బోలెడన్ని బంపర్ ఆఫర్‌లు.. ఉన్నట్లుండి ఒక పాత్ర లోకి ఇంకో వేరే ఎవరో వ్యక్తి వచ్చి నటించేస్తూ ఉంటాడు/ఉంటుంది. ఇదేంటా అని విస్తుపోయే లోగా "తరువాయి భాగ వచ్చే వారం"... ఏదో ఈ భాగం లో బోల్డంత కథ చూపించేసినట్లు..!! తీరా జరిగిందేదో తెలుసుకునే సరికి అప్పటి వరకు అడ్రస్ లేని ఒక ఆక్సిడెంట్ వస్తుంది పిక్చర్‌లోకి.. దానితో పాటు ఒక ప్లాస్టిక్ సర్జరీ..
మనుషులు మారిపోతారు, కానీ మారిన ఆ మనుషుల్ని గుర్తు పట్టకూడని వాళ్లంతా గుర్తు పట్టేస్తారు.. ఒకే మనిషి వేషం మార్చుకుని వెళ్తే ఎవ్వరూ గుర్తు పట్టలేరు.. హేమిటో..
కొన్ని సమయాల్ని/సంఘటనల్ని మనం నిజ జీవితాల్లో ఎంతో మామూలుగా తీసుకుని పక్కకి తప్పుకుని పోతూ ఉంటాం.. కానీ ఈ serials లో అలాక్కాదు. ప్రతి చిన్న విషయానికి, కెమెరా నాలుగు దిక్కుల నుండి రావాలి. ఒక ఎపిసోడ్ అంతా ఆ ఒక్క మొహాన్నే చూపించాలి. మరీ అంత పెద్ద ఆశ్చర్యార్థకం ఉంటుందంటారా మన నిజ జీవితాల్లో.. అంతేనా.. ఇంకా ఎన్నెన్ని బంపర్ ఆఫర్‌లు..? ఏ సీరియల్ తీసుకున్నా ఆడ విలన్లే.  సాధారణంగా ఇంట్లో ఉండి ఏమీ తోచక ఈ సీరియల్స్‌ని  చూసే వాళ్లంతా ఆడవాళ్లే.. వాళ్ల మనసుల్లో ఎన్ని విషబీజాలు నాటుతున్నాయో ఈ సీరియళ్లు అని తలుచుకుంటే భయం వేస్తూ ఉంటుంది.. అదృష్టం, నాకు మాత్రం ఇష్టం లేదు ఆ చెత్త అంటే.. లేకపోతే నేను ఈ సమయానికి ఓ యశోద(ఆంటీ) లాగానో, ఇంకో (ఇంకే పేరూ గుర్తు రావడం లేదులే..) లాగానో తయారయ్యి ఉండేదాన్నేమో కదూ..!!!! హహ్హహ్హహ్హా.. (విలనీ నవ్వు)