Monday, November 22, 2010

మౌన ముద్ర

కనుల ముందు కొత్త కాంతి..
వేయి దీపాలు ఒక్కసారి వెలిగినట్టు..
కోటి నక్షత్ర మాల ఎదురైనట్టు..
ఈ వెలుగు కోసం చూసిన రోజులు ఏమయ్యాయి..?
ఇప్పుడిలా సిగ్గుతో పక్క చూపులు ప్రవేశించాయేం..!?
ఇన్నాళ్లూ గుంభనంగా గుండె గదిలో దాచుకున్న.......,
చెప్పలేను..
ఏమని చెప్పగలను..?
ఎన్నని చెప్పగలను..?
వాసంత, హేమంత, శరత్, శిశిరాలను..
సంగీత, సాహిత్య, శత వర్ణ చిత్రాలను..
మోదాగ్ర శిఖరాలను, ఖేదాఖాతాలను..
హిమవన్నగాలను.., మహార్ణవాలను..
పదిలంగా దాచుకున్న మనసుని..
చైత్రపు చినుకునే కాదు, వేసవి వెన్నెలనూ ఆనందించే ఈ మనసుని..
అరలు.. తెరలు.. దాటుకుని హృది కవాటాల్ని తెరిచి.. నీ ముందుంచాలని..
ఎన్నెన్ని కలలు కన్నాను.?
మరేంటి..? ఇప్పుడిలా..!!
చిగురించిన వాసంతం నీకు స్వాగతం పలుకుతున్నా..
తలపుల తలుపులు వాటంతటే తెరుచుకున్నా..
ఈ పిచ్చి మనసు..
మౌన ముద్ర దాల్చి..
కనీసం నీ చూపులతో చూపులు కలపలేకపోతోంది..

Monday, November 8, 2010

"క్షణం" అడిగిన ప్రశ్న..

ఎదగాలి.. పైపైకి ఎగరాలి..
గోడమీద ఊగిసలాడే కాలాన్ని వెనక్కి నెట్టుకుంటూ పరిగెత్తాలి...
మీదకి దూసుకు వచ్చే ఘడియ మెట్లను ఎక్కుకుంటూ పైకెళ్లాలి..
ఉవ్వెత్తున ఎగిసి పడే క్షణల కెరటాల్లోంచి దూసుకుంటూ ముందుకెళ్లాలి.
నిశీధిలో దాక్కున్న నిమిషాలు సైతం "నేను సైతం" అనాలి..

కానీ..
నన్ను నేను కోల్పోయిన ఆ క్షణం.. ఆ ఒక్క క్షణం మాత్రం నన్ను అడుగుతుంది..
"ఎక్కడి వరకూ.." అని.
నాకు తెలియదు, అది నేనే వేసుకున్న ప్రశ్న అని.. ఎప్పుడూ సమాధానం చెప్పను.
"సంతోషం దొరికేంత వరకూ.." ఇప్పుడు చెప్పాను.
"సం...తో..షం..???" చాలా విస్మయంతో చూసింది.
మరి కావాల్సిన తీగ కాలికి తగిలితే పక్కకి తప్పుకుని పోయే నన్ను, అలా చూడ్డంలో తప్పు లేదులే..

"మొన్నొక రోజు, నువ్వు సూర్యుడికన్నా ముందు నిద్ర లేచిన ఉదయం, 
పువ్వులన్నీ బద్దకంగా ఒళ్లు విరుచుకుంటున్న క్షణంలో..
చల్లని మలయమారుతంలా నీ చెంతకొచ్చింది.. అదే కదూ సంతోషమంటే..?

ఇంకొక రోజు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆపదలో ఉన్న నీ నేస్తానికి సహాయం చేసిన రోజు,
ప్రశాంతంగా నీ వద్దకొచ్చింది.. అదే కదూ సంతోషమంటే..?

మరొక రోజు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పసికందుని కాపాడిన రోజు, సంతృప్తితో పాటు నిన్ను చేరుకుంది.. అదే కదూ సంతోషమంటే..?

ఇంకోరోజు, ఒక చిన్న విజయగర్వంతో నువ్వు కలతల్లేని నిద్ర పోయిన రోజు,
రాత్రంతా నిన్ను హత్తుకుని పడుకుంది.. అదే కదూ సంతోషమంటే.."

అవునా..
ఇన్ని సార్లు నన్ను కలిసిందా..?
అప్పుడర్థమైంది. ఎదగాలి అన్న కాంక్షతో, వచ్చిన ప్రతి క్షణాన్ని పక్కకు నెట్టేస్తున్నానే తప్ప, ఆ క్షణం నాకోసం ఏం తెస్తుంది అన్నది తెలుసుకోవడంలేదని.
ఇలా ఎన్నెన్ని నిమిషాలని కనీసం తొంగి కూడా చూడకుండా చీకట్లో చేజార్చుకుంటున్నానో..
నాకు ప్రసాదించబడిన ఎన్నెన్ని సుమధుర ఘడియల సౌరభాల్ని, ఆస్వాదించకుండా పోగొట్టుకుంటున్నానో.

వెతకాలి, నేను పోగొట్టుకున్న ఒక్కొక్క నిమిషాన్ని వెతికి పట్టుకోవాలి..
చేజార్చుకున్న నా సంతోషపు ఛాయల్ని ఏ నిశీధిలో దాక్కున్నా సరే, కనిపెట్టి తెచ్చుకోవాలి..
ఆ అమూల్యమైన క్షణాలు ఏ మతిమరుపు ముళ్లపొదల్లో చిక్కుకున్నా సరే, గుర్తుపట్టి అపురూపంగా నా దోసిలిలో దాచిపెట్టుకోవాలి.

ఇక ఏ క్షణం నాకోసం ఏం తెచ్చినా, దాన్ని పూర్తిగా ఆస్వాదించి సంతోషంగా సాగనంపాలి..
మరోసారి ఏ క్షణమూ నన్ను ప్రశ్నించకూడదు.. అసలు నన్ను నేను కోల్పోకూడదు..
ఎందుకంటే, నన్ను నేను కోల్పోయిన ఆ క్షణం, ఆ ఒక్క క్షణం నన్ను అడిగిన ప్రశ్నతో నాకు జీవితం విలువ తెలిసింది..
మరి.. మళ్లీ మళ్లీ జీవితాన్ని కోల్పోలేం కదా.

Wednesday, November 3, 2010

నా "నీకు"...



నా హృదయం ప్రార్ధిస్తోంది నా హృదయ స్పందన విను
జీవితం అనే కాలం లో కొన్ని మధురమైన క్షణాలను నీకు అందిస్తా
నేను శ్వాసిస్తున్న ఊపిరిని నీతో పాటు పంచుకుంటా
నీ కోసం ఎవరైనా గాలిస్తే ..నా కళ్ళల్లో వెతకమని చెప్పు..  

ప్రతి కదలిక లో పుడుతుంది ఒక కొత్త దారి
వెళ్తున్న ప్రతి దారీ కావచ్చు మరొక కొత్త మలుపు
నీ పరిచయం అయ్యాక తెలుసుకున్నా నువ్వే నా మజిలీ
కవిత్వం లో నిశబ్దం గుర్తెరిగిన అనుభూతి నీ తోడు.
నా హృదయం అనే గది లో వెదజల్లు పరిమళం నువ్వై..
నువ్వే నా అపూర్వం .. నువ్వులేని నేను అసంపూర్ణం..