Monday, February 21, 2011

చిత్రమాలికలో నా టపా - భీమిలి కబడ్డీ జట్టు

చిత్రమాలికలో "భీమిలి కబడ్డి జట్టు చిత్రం" గురించి నేను రాసిన టపా ఇక్కడ చూడండి. అక్కడ కొన్ని వీడియోలు పెడదాం అని మర్చిపోయాను. అందుకే ఇక్కడ పెడుతున్నాను:))

Thursday, February 17, 2011

నా సంగీత సాధన

అవి నేను డిగ్రీ చదివే రోజులు. అభిమాన గణంలో మనకున్న పేరేంటంటే, ఏ కళనీ మనం పోషించకుండా ఉండమని;) అదిగదిగో ఏదో గొణుక్కుంటున్నట్టున్నారు మీలో మీరే..? ఎవరేమంటే నాకెందుకు లెండి. నన్ను ఫాలో అవుతున్న ఆ 23 మంది మాత్రం చచ్చినట్లు భరించాల్సిందే కదా. సరే ఇక విషయానికొద్దాం. డిగ్రీ కాలేజీ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా, మధ్యాహ్నం 3 గంటలకల్లా గంట కొట్టేస్తారని:) ఇక ఆ తరువాత సంగతి..? నిద్ర పోయే అలవాటు ఉన్న వాళ్లు నిద్రపోతారు. బాతాఖానీ కొట్టేవాళ్లు ఆ పనిలో ఉంటారు. మరి జనాల్ని పీడించుకు తినాలి అనుకునే వాళ్లు..??(ఏంటి దిక్కులు చూస్తారు..? నే చెప్పింది నా గురించే) ఏదో ఒక విధంగా ప్రపంచానికి పనికొచ్చే పని చెయ్యాలని ఆరాటపడతారు. అవ్విధమ్ముగా నేనెంచుకున్న మార్గాలు మూడు (మరి డిగ్రీ మూడు సంవత్సరాలు కదా). ముందు రెండో సంవత్సరంతో మొదలెడదాం. మనమంతే, దేన్నీ సవ్యంగా సాగనివ్వం. హిహ్హిహ్హ్హీ..

సంగీతం ఒక సముద్రం.. ఆ సముద్రాన్ని అనుభవిస్తూ ఈదాలి అప్పుడే అందులోని అందం/ఆనందం అర్థం అవుతుంది.. "ఆకలేసిన బిడ్డ అమ్మ అని ఒకలా అంటాడు, దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని ఇంకోలా అంటాడు, ఏడుస్తున్న బిడ్డ మరోలా అంటాడు. సంతోషంతో అమ్మా అన్న పిలుపు మరోలా ఉంటుంది" లాంటి శంకరాభరణం డయిలాగులు వినేసి ఆ సంగీత సాగరాన్ని మనం కూడా ఈదేద్దాం అని ఈతకు సరిపడే కొలను కోసం హైదరాబాదు అంతా తిరిగేసాను. శంకరాభరణం, సాగర సంగమం, స్వర్ణ కమలం లాంటి సినిమాలు వస్తే మన చెవికి ఇంకేమీ ఎక్కదు, అంత ఇష్టం. అన్నట్టు, నేనొక్కదాన్నే కాదండోయ్.. తిండి తిప్పలు లో నాకు దొరికిన నాలాంటి నేస్తం కూడా. వెతకగా వెతకగా, మన బడ్జెట్‌లో, మనం ఖాళీగా ఉండే టైంలో మనకి సంగీతం నేర్పించగల అదృష్టం ఒక కాలేజికి దక్కింది. అదే కోఠి లోని "త్యాగరాజ సంగీత నృత్య కళాశాల" అక్కడికెళ్ళి విచారించగా తెలిసిన విషయమేంటంటే, వోకల్ నేర్చుకుంటే ఓన్లీ వోకల్ మాత్రమే ఉంటుంది. అదే ఏదైనా వాయిద్యం నేర్చుకుంటే దాంతోపాటూ వోకల్ కూడా కొన్ని రాగాలు నేర్పిస్తారు అని. ఏం చేసినా ఎఫెక్టివ్‌గా ఎఫీషియెంట్‌గా చెయ్యాలి అనుకునే నాలాంటి వారు దేన్ని ఎంచుకుంటారు అనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదేమో కదూ..

ఆ విధంగా వయొలిన్ నేర్చేసుకుందామని, అందులో పట్టా పుచ్చేసుకుందామని ఘాట్టిగా ఫిక్స్ అయిపోయామనమాట ఇద్దరం. ఇంకేముందీ కట్ చేస్తే ఆ తరువాత రోజు నుండీ మొదలు వయొలిన్ క్లాసులు. రోజుకో గంట క్లాసు 5 నుండి 6 వరకు సాయంత్రం. మేమున్న హాస్టల్ నుండి గంట ప్రయాణం. 
 శివరంజని చెప్పినట్లుగా అందమైన, అనువైన, అద్భుతమైన ఆర్.టి.సి. సిటి బస్సులో ప్రయాణం. చాలా సార్లు ఫుట్‌బోర్డింగ్ కూడా చేసే వాళ్లం:( అయినా పట్టు వదలని భగీరథుల్లా సంగీత సముద్రాన్ని ఈదెయ్యాలని 4:45 అయ్యేసరికి కాలేజిలో ఉండే వాళ్లం.

ఒక వైపు నుండి, మృదు మధురంగా అలవోకగా మురళి నుండి బైటికి వచ్చే వినసొంపైన సంగీతం. మరోవైపు నుండి గుండెల్లోనే మృదంగం వాయిస్తున్నట్లుగా అనిపించేది, ఆ మృదంగ వాయిద్యం వింటుంటే. ఇంకోవైపు నుండి సా..రీ..గా..మా.. అంటూ కోరస్‌లో వోకల్ పాఠాలు మనసుని ఉర్రూతలూగించేవి. ఇక వీణ గొప్పతనం చెప్పనలవి కాదు. చెవుల్లో తేనె పోసినట్లుగా ఉండేది. ఏమో అసలు అంత కష్ట పడి చేసిన ప్రయాణం బడలిక అంతా ఇట్టే తీసేసినట్లుగా అనిపించేది. సంగీతం మహత్యం గురించి అందరూ చెబుతుంటే ఏమో అనుకున్నాం కానీ అప్పుడు మాత్రం నిజం గా అనుభవంలోకి వచ్చింది. అలా కాలేజి ఎంట్రన్స్‌లోనే మా మూడ్ అంతా మారిపోయేది:) వయొలిన సౌండ్ మాత్రం మా క్లాస్‌రూంలోకి వెళ్తేనే గానీ వినిపించేది కాదు :( అయినా ఎంత బాగుండేదో.

మరి మా వయొలిన్ గురువుగారి గురించి చెప్పాలి కదా. చాలా పెద్దావిడ లే, (పోయిన సంవత్సరం రిటైర్ అయ్యారు) అచ్చు M.S.సుబ్బలక్ష్మిలా ఉంటారు. విచిత్రం, ఆవిడ పేరు కూడా సుబ్బలక్ష్మే :))) వయొలిన్ ఎలా పట్టుకోవాలి దగ్గరి నుండి, స్వరాలెన్ని, వాటిని ఎక్కడ వేలు పెట్టి వాయించాలి.. ఇక మధ్యలో మధ్యలో కోరస్‌లో వోకల్ నేర్పించడం. ఇవన్నీ మొదట్లో చెప్పిన క్లాసులు. అప్పటికి మాకు అక్కడ సీనియర్లు పరిచయం అయిపోయారు (అక్కడ ర్యాగింగ్, ఫ్రెషర్స్ డే ఇలా ఉండవు. గురు పౌర్ణమితో మొదలు పెడతారు ప్రతి సంవత్సరం తరగతులు) పాపం అందులో ఒక సీనియర్‌కి ఎందుకో మా ఇద్దరి గొంతులు పరీక్షించాలనిపించింది. ఇంకేముందీ, మా పాటల పాండిత్యం అంతా ప్రదర్శించేసాం. నీ గొంతులో ఈ క్వాలిటీ ఉంది, నీ గొంతులో ఆ ఫ్రెష్‌నెస్ ఉంది అని ములగ చెట్టు ఎక్కించేస్తే, తెగ ఆవేశ పడిపోయాంలే. ఆ తరువాత రోజే కచ్చేరీ ఇచ్చేద్దామా అని కూడా అనేసుకున్నాం, అంతలోనే ఫిట్టింగ్ పెట్టకపోతే; వోకల్ బాగా ప్రాక్టిస్ చెయ్యండి ఇద్దరూ రోజూ పొద్దున్నే, అప్పుడైతే నోట్స్ బాగా క్యాచ్ చెయ్యగలరు అని.

ఇక చూడండి మా ప్రయత్నాలు. పొద్దున్నే 5 గంటలకల్లా నిద్రలేచి, సంగీత సాధన మొదలు పెట్టేవాళ్లం;) హాస్టల్ టెర్రస్ మా సాధనకి ని(ఆ)లయమైంది. మా సీనియర్ అంతలా పొగిడారు అంటే అంతో ఇంతో విషయం ఉందనేగా అర్థం. కానీ అదేంటో మా హాస్టల్ పిల్లలు మాత్రం పొద్దున్నే కాకిగోల మొదలైంది బాబోయ్ అని తిట్టుకునే వాళ్లు:( మేము త్వరలో కచ్చేరీ చేసేస్తాం అని కుళ్లు.. అలా ఒక నె....ల రోజులు సాధన చేసాం. కచ్చేరీ సంగతేమో కానీ, (డిగ్రీ) కాలేజీ లో మాత్రం నిద్రొచ్చేది. ఎందుకులే రిస్క్ అని మానేసాం, ప్చ్ :( సరే కాలేజీలో అయితే వయొలిన్ నేర్చేసుకుంటున్నాం ఏకధాటిగా. మరి ప్రాక్టిస్ సంగతో..? అందుకే ఇంట్లో అరిచి, గోలపెట్టి, అన్నం మానేసి, పోరాడి మొత్తానికి డబ్బులు సంపాదించేసాం వయొలిన్ కొనుక్కోడానికి. ఇద్దరం చెరొక వయొలిన కొనుక్కున్నాం. అప్పటి నుండి వయొలిన్ సాధన టెర్రస్ మీద:)) ఇలా అయితే కష్టం, జనాలు మనల్ని ప్రాక్టిస్ చేసుకోనివ్వరు అని హాస్టల్ ఖాళీ చేసి ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాం.

అలా అలా, దాటు స్వరాలు, జంట స్వరాలు, మాయా మాళవ గౌళ రాగం, ఇంకా కొన్ని రాగాలు నేర్చుకున్నాం, గుర్తు లేదు ప్రస్తుతానికి ఏమేం రాగాలు నేర్చుకున్నామో:((. నా నేస్తం మాత్రం మధ్యలోనే మానేసింది:(. అలాగే ఒక సంవత్సరం గడిచిపోయింది. పరీక్షలు కూడా అయిపోయాయి. మా సుబ్బలక్ష్మి టీచర్ దగ్గర మాత్రం నాకు మంచి పేరొచ్చింది (ఇది నిజ్జంగా నిజ్జం) ఈ అమ్మాయి బాగా వాయిస్తుంది వయొలిన్ అని.

కాలానికి నాపై కన్ను కుట్టింది. 2వ సంవత్సరం క్లాసులు 4-5 వరకు ఉండేలా ప్లాన్ చేసింది అందుకే. అదే టైంకి నా డిగ్రీ కాలేజీ 4 వరకు ఉండేలా చేసింది ఈ కాలం:(( అందుకే ఈ కాలానికి నేను బద్ధ విరోధిని. పనిలో పనిగా ఈ తుఛ్చ కాలానికి ఏంటిచ్చేది విలువ అని ఇవ్వడం మానేసాను కూడా.

ఇక తర్వాత అప్పుడప్పుడూ మా సీనియర్ దగ్గరికెళ్లి నేర్చుకునేదాన్ని కానీ ఆ తరువాత పూర్తిగా మానేసాను. అతను మాత్రం చెబుతూ ఉండేవాడు, సుబ్బలక్ష్మి టీచర్ నిన్ను గుర్తు చేస్కుంటూ ఉంటారు అని;) పాపం ఆవిడ గానీ ఇప్పుడు నా వయొలిన్‌ని, దాని తుప్పు పట్టిన తీగల్ని చూస్తే మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తారేమో...