Friday, December 31, 2010

కత్తి మీద సాము

"అయ్యోలూ..అమ్మోలూ.. ఇంతేనా బ్రతుకు హో హో హో." మీకందరికీ జెమిని టి.వి. లో వచ్చే అమృతం సీరియల్ కోసం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట తెలిసే ఉంటుంది. కారణం తెలియదు కానీ, ఈ పాట వినగానే అప్రయత్నంగా నాకు ఈ కింద కథ గుర్తొస్తుంది. ఆ పాట విన్నా/ సీరియల్ చూసినా ఎంత నవ్వొస్తుందో, ఈ కథ గుర్తొచ్చినప్పుడల్లా అంత ఉద్వేగం ఆవహిస్తుంది. మనకున్నవే కష్టాలు అనుకోవద్దు అన్న సందేశం ఈ కథలో ఉండడం కారణమేమో కానీ, ఈ పాట గురించిన ఆలోచన వచ్చినప్పుడల్లా రెండు విరుద్ధమైన భావాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాను. అందుకే సిరివెన్నెల బ్లాగులో హాస్యపూరితమైన వ్యాఖ్యానం, ఇక్కడ ఉద్వేగభరితమైన కథనం.

శతాబ్ధి రైలుబండిలో ఒక భోగీలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ.

వివేక్, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో. విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించవలసిన వ్యక్తి ఇలా ట్రెయిన్‌లో ప్రయాణించడం చాలా చిరాకు కలిగించే విషయంగా ఆఫీసు అడ్మిన్‌తో మాట్లాడినా లాభం లేకపోయింది. కనీసం, ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుందామని తన ల్యాప్‌టాప్ తీసి ఏదో పని చేసుకుంటూండగా "మీరు సాఫ్ట్‌వేర్‌లో పని చేస్తారా అండీ" అని పలకరించిందో స్వరం తన పక్కనుండి. కనీసం చూపైనా అటువైపు విసరకుండా "అవును" అని సమాధానమిచ్చి తన పనిలో లీనమై ఉండగా మళ్లీ అదే స్వరం "మన దేశాన్ని మీరెంతో అభివృద్ధి పరుస్తున్నారు. ఈరోజుల్లో మొత్తం కంప్యూటర్ మయం అయిపోయింది. అదంతా మీలాంటి వారి వల్ల జరిగిన అభివృద్ధే" అంటూ మెచ్చుకోలుగా చూశాడు ఆ వ్యక్తి.
"థ్యాంక్స్" అంటూ తన దృష్టిని ఆ వ్యక్తి వైపు సారించాడు సాధారణంగా పొగడ్తని కాదనలేని వివేక్. చక్కని వ్యాయామంతో దృఢమైన శరీరం గల యువకుడు అతను. చాలా సాధారణంగా ఉన్నాడు. ఒక చిన్న టౌన్ నుండి వచ్చినవాడిలా కనిపించాడు. రైల్వే క్రీడాకారుడు అయ్యుండొచ్చు అనుకున్నాడు వివేక్. సాధారణంగా వాళ్లే తమకు ఉచితంగా వచ్చిన రైల్వే పాసుని ప్రయాణాలకు ఎక్కువగా వినియోగించుకుంటారని అతని నమ్మకం.

"మీరు నాకెప్పుడూ అద్భుతంగా కనిపిస్తారు. మీ ఏ.సి. గదిలో కూర్చుని ఆ కంప్యూటర్‌లో ఏదో రాస్తారు. బయట అది ఎన్నో చేస్తుంది" అన్నాడు. ఒక నిరాసక్తమైన నవ్వు బదులిచ్చి మొదలు పెట్టాడు వివేక్ "అది నువ్వనుకున్నంత సులభమైనది కాదు ఫ్రెండ్. ఏదో రెండు లైన్లు రాయడం కాదు. దాని వెనుక చాలా పెద్ద కథ ఉంటుంది" ఇంకా ఏదో చెప్పబోయి ఎందుకులే అనుకుని " అది చాలా కష్టమైన పని.. చాలా కష్టం" అని ఊరుకున్నాడు వివేక్. నిజానికి అతని మనః స్థితికి తనకుండే కష్టాలన్నీ గట్టిగా అరిచి చెప్పుకోవాలనిపించింది.
"మీకు జీతభత్యాలు అంత ఎక్కువగా ఇస్తారంటే ఆశ్చర్యం ఏమీ లేదు. మరి ఇంత కష్ట పడతారు కదా" 
ఇక ఆపుకోలేని కోపాన్ని ఆ వ్యక్తిపై ప్రదర్శించాడు వివేక్. "అందరూ ఇచ్చే డబ్బుల్నే చూస్తారు. మా కష్టాలు ఎవరికి తెలుసు? ముఖ్యంగా ఇండియన్స్‌కే ఇటువంటి 'నారో'మైండ్ ఉంటుంది. ఏ.సి. గదుల్లో కూర్చున్నంత మాత్రాన మాకు చెమట పట్టదు అనుకోవద్దు. మీరు శరీరానికి వ్యాయామం ఇస్తే మేము మెదడుకి ఇస్తాం అంతే తేడా. నిజం చెప్పాలంటే ఏ విషయంలోనూ మీకన్నా తక్కువ ఉండదు ఈ పని. ఇంకా ఎక్కువే" తన కోపాన్ని విసుగుని భరించగలిగే వ్యక్తి దొరికాడనిపించింది వివేక్‌కి. ఏమాత్రం సంకోచించకుండా తన ఉక్రోషాన్నంతా వెళ్లగక్కాడు.
"నీకొక ఉదాహరణ ఇస్తా. మన రైల్వే రిజర్వేషన్ సిస్టం చూడు. ఎవరైనా, ఏ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణానికైనా, దేశంలో ఎక్కడి నుండైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఎంత కష్టంతో నిర్మించబడిన సిస్టమో చూడు. నువ్వు అర్థం చేసుకోగలవా ఇందులో ఉన్న కష్టం..?"
ఆ యువకుడు మాత్రం ఒక ప్లానెటోరియం దగ్గర చిన్న కుర్రాడిలా వింటూ ఉన్నాడు చాలా ఆశ్చర్యంతో. ఇదంతా అతని ఊహకి అందని విషయం. 
కాసేపటికి తేరుకుని " మీరు అటువంటి సిస్టంని డిజైన్ చేసి కోడ్ చేస్తారా?" అడిగాడు.
"ఒకప్పుడు చేసేవాడిని. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ మేనేజర్‌ని"
"ఓహ్.. అంటే ఇప్పుడు కొంచెం మీ పని సులువు అయ్యుండొచ్చు కదా"

తగ్గిందనుకున్న కోపం మళ్లీ పైకెక్కింది వివేక్‌కి "ఎవరి జీవితమైనా పైకెదుగుతుంటే పనులు తగ్గుతాయా.? ఎదుగుదల కొత్త బాధ్యతల్ని తెస్తుంది. ఇప్పుడు నేను కోడ్ చెయ్యను అంటే పని చెయ్యను అని కాదు. పని చేయించాలి. అది ఇంకా కష్టమైన పని. ఇంకా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఒక వైపు ఎప్పటికప్పుడు రెక్వైర్మెంట్లు మార్చేసే 'క్లైంట్', ఇంకోవైపు ఇంకేదో కోరుకునే 'యూజర్' మరో వైపు పనంతా నిన్నే అయిపోవాలి కదా అని ప్రశ్నించే నా పై'మేనేజర్'. ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా?

కొద్ది సేపు ఆగాడు వివేక్. చివరికి "నీకు తెలియదు, కత్తి మీద సాము ఎలా ఉంటుందో" ముగించి ఆ యువకుడి వైపు చూసాడు.
తన సీట్ వెనక్కు ఆనుకుని కళ్లు మూసుకుని ఉన్నాడు, ఏదో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లుగా..
"నాకు తెలుసు సర్.. నాకు తెలుసు. కత్తి మీద సాము ఎలా ఉంటుందో." ఐహిక వస్తువేమీ అతనికి కనిపించడం లేదిప్పుడు. కళ్లు మూసుకుని శూన్యంలోకి చూస్తూ చెబుతున్నాడు.
"మేము మొత్తం 30, మా కెప్టెన్ 4875 శిఖరాన్ని రాత్రికి కవర్ చెయ్యాలని మమ్మల్ని ఆర్డర్ చేసినప్పుడు. శతృవు శిఖరపుటంచుల నుండి కాల్పులు జరిపిస్తున్నాడు. ఎవ్వరికీ తెలియదు, తరువాత బుల్లెట్ ఎక్కడి నుండి వస్తుందో, ముఖ్యంగా ఎవరికి తగులుతుందో. ఉదయాన్నే శిఖరాన్ని అందుకుని మువ్వన్నెల ఝెండా ఎగురవేసే సమయానికి నలుగురం మిగిలాము.
"మీ..రు..?" ఆశ్చర్యంతో వివేక్.
"నేను సుబేదార్ సుశాంత్, కార్గిల్ యుద్ధంలో 4875 పీక్ గురించి యుద్ధం చేసాను. యుద్ధం ముగిసాక, పైవాళ్ల నుండి పిలుపు వచ్చింది. నీ బాధ్యత పూర్తి అయింది నువ్వు కోరుకుంటే సులువైన పని ఇస్తాం అని. మీరు చెప్పండి సర్, ఎవరైనా జీవితాన్ని సులువు చేసుకోవచ్చు అనుకుని తమ బాధ్యత నుండి తప్పుకుంటారా..?
యుద్ధం ముగిసి తిరిగి వస్తుంటే నా తోటి సైనికుడు మంచు కారణంగా అశ్వస్థతకు గురై శతృవుల కాల్పులకు దొరికాడు. అతడిని అక్కడి నుండి తప్పించి భద్రమైన ప్రదేశానికి చేరవేయడం నా బాధ్యత. కానీ మా కెప్టెన్ అందుకు నిరాకరించి, తనే వెళ్లారు. దానికి అతనిచ్చిన కారణం, ఒక ఆర్మీ కమాండర్‌గా మొదట అతను చేసిన ప్రతిఙ్ఞ తను కమాండ్ చేసిన వారి ప్రాణలకు భద్రత కల్పించడం. సైనికుడిని కాపాడినందుకు కెప్టెన్ చంపబడ్డారు. ఆరోజు నుండి నాకు గురి చెయ్యబడిన ప్రతి బుల్లెట్‌ని అతను తీసుకున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు నిజంగా తెలుసు సర్, కత్తి మీద సాము అంటే ఏమిటో.." 


వివేక్ చేష్టలుడిగిపోయాడు. తనువంతా ఉద్వేగంతో నిండిపోయింది. తనకు తెలియకుండానే ల్యాప్‌టాప్ ఆపేసాడు. అంతలో ట్రెయిన ఏదో స్టేషన్‌లో ఆగింది. సుబేదార్ సుశాంత్ తన లగేజ్ తీసుకుని దిగబోతూ.. "ఇట్ వజ్ నైస్ మీటింగ్ యౌ సర్" అన్నాడు. వివేక్ అసంకల్పిత ప్రతీకార చర్య లాగా షేక్‌హ్యాండ్ ఇచ్చి, ఆ చేతిని చూస్తూ మనసులో అనుకున్నాడు 'ఈ చెయ్యి, శిఖరాల్ని అధిరోహించింది, ట్రిగ్గర్ నొక్కింది, మువ్వన్నెల ఝెండా ఎగరేసింది.' తనకి తెలియకుండానే అట్టెన్షన్‌లోకి వెళ్లిపోయి, సెల్యూట్ చేసాడు వివేక్, తన దేశానికి ఇది మాత్రమే తను చెయ్యగలిగింది అనుకుంటూ..


ఇది నేను చాలా రోజుల క్రితం ఆంగ్లంలో చదివాను. గుర్తున్నంత వరకూ తెలుగులో రాయడానికి ప్రయత్నించాను.

Thursday, December 23, 2010

వేదమంటి మా గోదారి..

కింద చూస్తే నీళ్లు.. పైన చూస్తే ఆకాశం.. పక్కనంతా పచ్చని కొండలు.. అదొక కొత్త ప్రపంచం.. ఆ అందాల్ని వర్ణించడం చాలా కష్టం. ఎవరన్నారు నీటికి రంగు, రుచి, రూపం లేవని..? ఖచ్చితంగా చూసి ఉండరు మా గోదావరి తల్లిని. గలగలమని పరవళ్లు తొక్కుతూ ఎంత అందంగా వయ్యారంగా నడుస్తూ ఉంటుందనీ.. ఆ అందాన్ని వర్ణించతరమా.. ఎన్నెన్ని కథల్ని, ఊసుల్ని, ఆనందాల్ని, విషాదాల్ని తనలో దాచుకుని అవేమీ బయటకు కనిపించకుండా గంభీరంగా , ముగ్ధలా సాగుతూ ఎందరిని అలరిస్తుందనీ.. మౌనంగా ఎన్నెన్ని ఊసుల్ని మనసుల్లోకి జొప్పిస్తుందో , మన ప్రమేయం లేకుండానే.. అంత గొప్ప గోదారి ఎంత ఒద్దిగ్గా ఉంటుందనీ.. ఇక తనపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఆ తల్లి ఒక అమృతవర్షిణే.. ఎందరి జీవితాలను తన చుక్కానితో నడిపిస్తుందనీ..

ఆ గోదారమ్మ అలల హొయల పరుగు, అబ్బా.. మాటలు సరిపోవట్లేదు. ప్రకృతి మాత తన సింగారాన్ని గోదారి పైటతో అలంకరించుకున్నట్లు.. ఎంత అందమైన అలంకరణో తెలుసా.. లోతైన గంభీరమైన అద్భుతమైన అలంకరణ. ఎవ్వరినీ కదిలించకుండా తన దారిన తాను, చిన్ని చిన్ని అలలతో సున్నితంగా కొండల్ని తడుముతూ..తడుపుతూ.. ముద్దాడుతూ.. తనలో తను కలుస్తూ.. తనతో తను విడివడుతూ.. ఎంత అద్భుతమైన అందం.. ఎంత అందమైన నిజం.. వెరసి నా పాపికొండలు ప్రయాణం.. ఒక్కసారిగా కృత్రిమత్వానికి దూరంగా సహజత్వంలోపలికి గోదారి తల్లి నన్ను భద్రంగా తీసుకెళ్తున్న భావన.
భద్రాచలం నుండి పేరంటాళ్ల పల్లి వరకు సాగిన ఆ ప్రయాణం నేను జన్మలో మర్చిపోలేనిదనే చెప్పుకోవాలి. అదృష్టం.. పంచభూతాలూ సహకరించాయి మా ప్రయాణమంతా..:)

పాపి కొండల మధ్యలో పాపిటంత గోదారి  
 చుక్కల్లా మారిన సూర్యుడి జలకాలాట

గోదారి తల్లి సన్నిధిలో వెన్నెల రాత్రి గడుపుతారా..

పడమర పొత్తిళ్లలో సూరీడు..


అలల లయలు..
లయల అలలు..
అలల్లో దాగిన లయలు..
లయలతో సాగే అలలు..

అలపై అల దూసుకు వస్తూ..
అల కింద అల నలిగిపోతూ..
అల పక్కన అల స్నేహంగా..

అలతో అల కలిసిపోతూ..
అలతో అల విడివడుతూ..
అలను అల తోసుకుంటూ..

మొత్తంగా

అలల లయలు..
లయల అలలు..
అలా అలా సాగుతూ..

వెళ్లొస్తా నేస్తం..


వెన్నెల రాత్రి బసకి వెదురు బొంగుల విడిది..

హైలెస్సా.. హైలెస్సా..


ఇదంతా నాణేనికి ఒకవైపు. రెండో వైపు నాకు నచ్చని అంశాలున్నాయి.ముఖ్యంగా ప్లాస్టిక్ చెత్త గోదావరిలోనే పారెయ్యడం, నాకు చాలా బాధ కలిగించిన విషయం. :(
ఎంత మందికని చెప్పగలను.. నా వరకు నేను మాత్రం అందులో ఏమీ పారెయ్యకుండా చూసుకున్నాను. మనం ఇలా ప్రకృతికి హాని కలిగిస్తున్నందుకే కదా ప్రకృతి మన మీద కన్నెర్రజేస్తుంది... నాకో బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది. అలా చెయ్యొద్దూ ఇలా చెయ్యొద్దూ అని ఎంత చెప్పినా మనం వినం. ప్రకృతికి మనం ఎంత హాని కలిగిస్తే అంత మన జీతాల్లోంచి కట్ అని ఏదైనా చట్టం వస్తే బాగుండు.;)  ఏమంటారూ..?

Tuesday, December 14, 2010

నా నేస్తానికి అంకితం

"నవ్వు" అంటే ఏంటి..?
అప్పుడే పుట్టిన మొగ్గల్లా పెదవులు విచ్చుకోవడమా..!
అరవిరిసిన కుసుమాల్లా కళ్లు మారడమా..!!
విరబూసిన జాజుల్లా మనసు వెలగడమా!!

అదేంటో మరి..
నీ సావాసంలో అయితే నా శరీరమంతా నవ్వుతుంది. 

కలిసి గడిపిన క్షణాల్లో ఎన్నెన్ని ఊసులు దొర్లుతాయని..
ప్రపంచమంతా మన మాటల్ని పలకరించే పక్కకి జరుగుతుందేమో..

ముత్యాల ముచ్చట్లలో ఒదిగిపోయిన సమయం
మనకి కనిపించదు అనుకుంటాం కానీ..
నిజానికి.. మనం కలిస్తే..
కాలం అసూయతో పరుగందుకుంటుంది.

"ఎంత సమయం" కన్నా "ఎలా గడిపాం" అన్నదే కదా ముఖ్యం.
నీతో పంచుకున్న ఆ నాలుగు నిమిషాలు చాలు
స్నేహానికి అర్థం చెప్పడానికి.


చాలా రోజుల తరువాత ఈరోజు నా స్నేహితురాలు కలిసిందండీ. ఎవరి పనుల్లో వారు మునిగిపోయి, అసలు ఫోన్ కూడా చేసుకోక చాలా రోజులే అయింది. రెండు కొప్పులు ఒకచోట చేరితే ఏం జరుగుతుందో తెలుసు కదా..;) ప్రపంచంలోని విషయాలన్నీ ఒకసారి మాట్లాడేసుకున్నాం. మా సంతోషానికి మాకు ఒక గంట సమయం మాత్రమే దొరికింది..:( ఏం చేస్తాం. బోలెడన్ని ఆ గంటలోనే మాట్లాడేసుకుని సంతోషంగా గడిపాం. ఇద్దరు మనుషులకి ఒకే అంశం మీద ఆసక్తి ఉంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. తను కూడా మనలాగే కళా పోషకురాలు..:) ఇక సాహిత్యం మీద చర్చ మీద చర్చ జరిపేసి, టైం చూసి భారంగా నిట్టూర్చి వెళ్లిపోయింది..:(

నా మనసుకు నచ్చిన నేస్తం కోసం, మనసులో మెదులుతున్న ఆ నాలుగు భావాలకి ఇలా అక్షర రూపం ఇచ్చాను. మీరు భరించాలి తప్పదు..:))

Friday, December 3, 2010

"కళ"కొచ్చిన కష్టాలు..:(

అటకటా.. అసలు నాకు బ్లాగుల గురించి ఎందుకు తెలియవలె.. తెలిసినదే పో.. వాటి గురించి నేనెందుకు పట్టించుకోవలె..? పట్టించుకుంటినే పో.. నాకు కూడా ఒక బ్లాగు ఉండవలెనని నాకేల అనిపించవలె..? అనిపించనదే పో.. ఆలోచన వచ్చిందే తడవుగా ఎందుకు మొదలు పెట్టవలె.. పెట్టితినే పో, ఆవేశం ఆగక అందరికీ ఎందుకు దండోరా వేయించవలె.. హయ్యో హత విధీ.. ఈరోజు ఇటుల ఎందుకు చింతించవలె..

అసలు ఇలాక్కాదు... అతను మా ఆఫీసులోకే ఎందుకు రావలె.? వచ్చినా మా ప్రాజెక్టు.. ఇంకా నా పక్క సీటే ఎందుకు ఎంచుకోవలె.? దీని పేరే కదూ ఖండ కావరం.. (కాదని చెప్పకండి.. చెప్పిన వాళ్లందరికీ ఒక్కో తిట్టు..) 
నాకు తెలుసు మీరంతా ఏమి ఆలోచిస్తున్నారో. అసలు ఉపోద్ఘాతం ఏమీ లేకుండా ఇలా మాటర్‌లోకొచ్చేసి మీకు ఏమీ అర్థం కాని గోండు జాతి భాష సినిమా చూపించేస్తున్నాను కదూ.. చెబుతాను వినుకోండి. మరేమో మనకి కొంచెం ఆవేశం, ఆతృత, ఆశ, అత్యుత్సాహం ఇంకా అవీ ఇవీ ఎక్కువ కదా.. మన బలాగు సంగతి నాకు తెలిసిన వారికీ, తెలియని వారికీ, తెలిసీ తెలియని వారికీ బట్టీ కొట్టిన పాఠం లాగా అప్పజెప్పేశానా.. అదేంటో అందరూ నాకు మంచోళ్లే తగులుతారు.. ఎక్కువ మంచి కాని వాళ్లు తగులుతారు (అదేనండీ చెడ్డోళ్లు..). అలాంటి ఒక మంచి కాని పిచ్చోడి పేరు రాంబాబు.. ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక పేరు రాంబాబు.. గుర్ర్‌ర్ర్‌ర్ర్ (పేరు మార్చడమైనది )పోనీలే పాపం, ఏదో ఫ్రెండే కదా అని మన బ్లాగు చదివే సదవకాశం ఉచితంగా చాలా సహృదయంతో ప్రసాదిస్తే దానిని సద్వినియోగ పరుచుకోకుండా ఇలా నన్ను నానా మాటలని, నన్ను నా బ్లాగుని ఇంకా చెప్పాలంటే బ్లాగుల్లో ఉన్న మన అక్కలూ అన్నలూ అందర్నీ కించపరిచేశాడు. మాట్లాడితే "మనసు పలుకుతుందా" అమ్మాయి ఉరుకుతుందా, ఎన్ని సంవత్సరాలైనా ఆ అమ్మాయి గమ్యం లేకుండా అలా పరిగెట్టేస్తూ ఉంటుందా, బ్లాగర్ సర్వర్ క్రాష్ అయిపోయే దాకా నీ మనసు పలుకుతూనే ఉంటుందా, అసలు అలసట రాదా... ఇలాంటి ప్రశ్నలు. ఒకవైపు ఆఫీసులో ఇష్యూస్‌కే టైం లేక ఇవాల్సిన అప్‌డేట్‌లు ఇవ్వకుండా ఉండిపోతుంటే రెండు బ్లాగుల్ని మేనేజ్ చేసే టైం ఎక్కడ దొరుకుతుంది.. ఇలాంటి ధర్మ సందేహాలు. మీరే చెప్పండి ఇదేమన్నా భావ్యమా..?

పనిలో ఉన్నప్పుడో, భోజనాలు చేస్తున్నప్పుడో ఏదో ఒక టాపిక్‌లో మొదలెట్టేస్తాడు.. మనసు పలికిందా అని. నా జీవిత కాలంలో ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక ఘడియలో నేనైనా మర్చిపోవచ్చేమో అసలు నాకంటూ ఒక బ్లాగు ఉందనీ, అందులో నేను అవీ ఇవీ గెలుకుతూ ఉంటానని. కానీ అతను మాత్రం  మర్చిపోను గాక మర్చిపోడు. మనసు అన్న పదం కనిపిస్తే చాలు మనసు పలికే, ఆ వెనువెంటనే నేను కూడ గుర్తొచ్చేస్తాను. పోనీ అంతటితో ఊరుకుంటాడా అంటే, అది కాదే... నాకు గుర్తు చేసేసి, నన్ను కించపరిచేసి, ఏడిపించేసి, నా బ్లాగు ఫోటోలో ఉన్న అమ్మాయిని నానా మాటలనేసి గానీ వదలడు. అనేది నన్నొక్క దాన్నేనా..!! మన బ్లాగ్లోకాన్నంతా అనేస్తాడు..  నాకో డవుట్.. అసలిదంతా ప్రతి పక్షాల కుట్రా..? తీవ్రవాదుల చర్యా..? ఆల్‌ఖయిదా మతోన్మాదమా..? కాదు కాదు ఇదంతా పురుషాహంకారమే అని సవినయంగా మనవి చేసేసుకుంటున్నాను.

మీకిక్కడ మరో విషయం చెప్పాలి. ప్రపంచంలో చెడ్డ మనుషులెవరూ ఒక్కరే ఉండరు. వారికి ఒక కుడి భుజం ఉంటుంది. ఆ భుజం పేరు సోంబాబు (పేరు మార్చడమైనది ). ఎంచక్కా నా మిగతా స్నేహితులంతా చక్కగా చదివేసి "సూ..పరు, కేక, కెవ్వు, కత్తి, చాకు, బ్లేడు" ఇంకా వీలైతే  "గునపం, గడ్డపార, ఱంపం" అని పొగిడేస్తూ ఉంటారా.. వీళ్లిద్దరేమో నన్ను నానా రకాలుగా హింసించేస్తూ ఉంటారు. వా..వా..:(:( ఏమన్నా అంటే ఎప్పుడూ పొగడ్తలనే కాదు విమర్శల్ని కూడా తీసుకోవాలమ్మా అంటారు..:( పోనీ చదివి విమర్శిస్తారా అంటే, విమర్శిస్తారు కానీ చదవరు. మొన్నొక రోజు పొరపాటున మన దగ్గర ఉన్న బ్రహ్మాస్తం వదిలా "మడిసన్నాక కూసింత కళా పోషణ ఉండాలి" అని. అనేసి ఎంత తప్పు చేసానో నాకు రోజుకి తొంభై ఆరు సార్లు తెలుస్తుంది (అదేం సంఖ్యా అని ఆలోచించకండి. పెద్ద లాజిక్కు ఏమీ లేదు. ఏదో అలా పెట్టేసా..) "మమ్మల్ని పోషించుకోవడమే కష్టంగా ఉంది.. ఇంక ఏ కళనని పోషించాలి.." అన్నది ఆ సమయానికి వచ్చిన సమాధానం (మరే.. ఇద్దరూ ఎముకల గూడు మీద తోలు కప్పినట్లుగా ఉంటారులే..) ఇంక ఆ తరువాత జరిగిన ప్రతి సంభాషణ లోనూ దీన్నేనా  కళ అంటారు..? దాన్నేనా  కళ అంటారు.. అంటూ వెధవ ప్రశ్నలు. వదిలెయ్యండి మహాప్రభో అంటూ అరిచి గగ్గోలు పెట్టినా నా గోడు విన్న పాపాన పోలేదు..చివరికి మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటూ ఉన్నా కూడా ఇది కూడా ఒక కళేనా.. ఏం పేరబ్బా అని ఎగతాళి చేస్తూ ఉంటారు..:( అలా వినీ వినీ ఈ మధ్య కళ అన్న పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నాను..
కోపంతో, నీ మీద పగ ప్రతీకారం తీర్చుకుంటానుండు అని చెప్పి, ఇదిగో ఇలా మనదైన స్టైల్‌లో కోపాన్ని వెళ్లగక్కుతున్ననమాట.. :((
హ్మ్.. ఇంతా తిట్టేసి, టపా రాసేసి ఇదిగో మీ గురించి ఈ టపా రాసాను అని చెబితే, విచ్చలవిడిగా సొంత పేరే రాసేసి టపా పెట్టుకో మళ్లీ దానికి అలియాస్ పేర్లు ఎందుకు ..అని నన్ను తీవ్రంగా కించపరిచేశాడు. 
ఎంత ఖండ కావరం..!!!!!!!!