Monday, April 25, 2011

చిత్రమాలికలో.. పరవళ్లు తొక్కే గోదావరి

ఉరుకులు పరుగులు తీసే గోదారి మీద ఎన్నెన్ని పాటలు వచ్చాయో.. అవన్నీ చూసి/విని ఆనంద మేఘాల్లో తేలుతున్నాను. మీ అందరికీ అవన్నీ వినిపించాలని చిత్రమాలికలో టపాతో మీముందుకొచ్చాను:)

గోదావరి అంటే నాకెంత ఇష్టమో, గోదావరి మీద పాటలు కూడా అంతగా నచ్చాయి. మామూలుగా అయితే ఇవన్నీ వినేదాన్ని కాదేమో. ఈ టపా రాయడం కోసం గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఇవే వింటూ, గోదారి అలలపై మునుగుతూ తేలుతూ ఉన్నా!!! మరి ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన కార్తీక్‌కి థ్యాంక్స్ చెప్పకుండా టపా ఎలా పూర్తవుతుంది..??
Thank you sooooooo much Karthik:)

ఇంకెందుకాలస్యం.. చిత్రమాలికలో  నా పరవళ్లు తొక్కే గోదావరి చూసి రండి :)

Wednesday, April 13, 2011

ఙ్ఞాపకాల సౌరభాలు..

చాలా రోజుల తరువాత మొన్న శ్రీరామ నవమికి మా ఊరెళ్లానోచ్..:)
మరి ఆనవాయితీగా మా ఊరి విశేషాలు మీతో పంచుకోవాలిగా. అందుకే ఇలా వచ్చా అన్నమాట:) ఆహా, ఎంత పద్ధతిగా బుద్ధిగా కూర్చున్నారో అందరూ(ఇది అబద్దం అని ఎవరక్కడ అనేది..?).. అందుకే మీరందరూ అంటే నాకిష్టం.

సరే ఇక విషయానికొస్తే, ఊరి విశేషాలు చెప్పడం కన్నా చూపిస్తేనే బాగుంటుందనిపించి ఎంచక్కా మీకోసం ఫోటోలు అవీ తీసాను మరి. 

ఊరికి వెళ్లడమైతే సంతోషంగా ఎగిరి గెంతులేస్తూ వెళ్లాను కానీ ఆ ఎండలకి తట్టుకోలేక కళ్లు తేలేస్తానా అని భయమేసింది. దూరంగా పూయ్..పూయ్.. అంటూ శబ్దం వినిపించేసరికి బుర్రలో ఎక్కడో నిద్ర పోతున్న చిన్న నాటి ఙ్ఞాపకాలు చుట్టు ముట్టి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకెళ్లా. దూరంగా కనిపించేది ఐసు బండే. ఆనందంతో మరోసారి ఎగిరి గెంతేసి మిట్ట మధ్యాహ్నం ఎంచక్కా పుల్లైసు కొనుక్కుని తిన్నా.


మధ్యాహ్నమంతా ఎంతగా సూర్యుడు తన ప్రతాపాన్ని/వీరత్వాన్ని చూపించినా, సాయంత్రమయ్యేసరికి మల్లెల కౌగిట్లో చల్లబడడా..? మా ఇంటి చిన్ని మల్లె చెట్టుకి పూచిన తెల్లని మల్లె పూలని నా స్వహస్తాలతో కట్టాను మల్లెల మాలగా (నిజ్జంగా నిజ్జం)


టపా టైటిల్‌లోనే మీకొక విషయం చెబుదామని మర్చిపోయాను చ..;)
నేను ఫుల్లుగా జున్ను లాగించేసానోచ్:) (ఇది చూసి ఎవరెవరు కుళ్లుకుంటున్నారో నాకు తెలుసు ;)) మరి జున్ను పాలని నాకోసం తెచ్చిన మా బుజ్జి లేగ దూడని చూస్తారా..?ఎండాకాలం కదా.. మా పెరడంతా ఖాళీగా ఉంది. ఈ గొర్రెలెవరివో తెలీదు కానీ ఆ గడ్డినే కష్టపడి పీక్కుంటూ తింటున్నాయి. పాపం:(


నాలుగు రోజులు ఖాళీ సమయం దొరికే సరికి, ఎంచక్కా చిన్నప్పటి రోజులకి వెళ్లిపోయాను. మా నాన్నతో అవీ ఇవీ మాట్లాడుతూ ఉంటే ఒక మంచి విషయం(నాకు, మీకు అది మంచిది కాకపోవచ్చు;)) బయట పడింది. మీరు భయపడకుండా టపా ఇంకా చూస్తా అంటేనే చెబుతా అదేంటో. మీవి ఏమాత్రం పిరికి గుండెలైనా వీక్ హార్ట్స్ అయినా నే చెప్పనంతే.

సరే ముందుకొచ్చారు కాబట్టి చెబుతున్నా. నేను చిన్నప్పుడు ఊసుపోక ప్రాణంపోసిన కళాఖండలన్నిటినీ (కొన్ని పిచ్చి బుర్రలు వాటిని పిచ్చి గీతలంటారు) మా నాన్న భద్రంగా దాచి పెట్టారు:) అవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ శిథిలావస్థలో క్యారు క్యారు మని ఏడుస్తుంటే అది చూసిన నా మాతృ హృదయం కన్నీరు మున్నీరుగా విలపించి , మీరు చిరంజీవులు నాన్నా.. తెలుగు బ్లాగ్లోకం ఉన్నంత కాలం మీరు సజీవంగా ఉంటారు అని హామీ ఇచ్చి, ఇదిగో ఇలా ఫోటోలు తీసి బ్లాగులో పెడ్తున్నా..

రాధా కృష్ణులు.. ఈ బొమ్మకి రంగులేద్దాం అని ఒక రెండు మూడు సంవత్సరాలు అనుకుని ఆ తరువాత నలుపు తెలుపు కూడా రంగులే కదా లైట్ తీసుకున్నా..


ఈ కింద వరసగా వచ్చే కొన్ని బొమ్మలన్నీ నిజంగా ఊసుపోక గీసినవే...:))))
ఇది నా చెయ్యే...:))))))
ఈ కింద రెండూ నా క్రియేటివిటీకి తార్కాణం. భయపడకండి..;) ఇది నీళ్ల కూజా కాదు అని ఎవరికైనా అనిపిస్తే వాళ్లు మండుటెండలో థార్ ఏడారిలో ఒక నెల రోజులు ఉండేలా ఏర్పాట్లు చేస్తా..హిహ్హిహ్హీ...ఊరికే..;)


ఇహహ్హహ్హా.. ఇహహ్హహ్హా..
ఇవి రెండూ నా సొంత సృజనాత్మకత ఉపయోగించి మనసులో 3D ఊహించుకుని మరీ గీసిన ఫ్లవర్ వేసులు..


ఇవి మాత్రం, డిగ్రీలో నా నేస్తం వాళ్లింట్లో ఉన్నప్పుడు గీశాను. మొదటిది నా ఫ్రెండ్ కాలిక్యులేటర్.. రెండోది వాళ్ల తమ్ముడి సైకిలు. 


Tuesday, April 5, 2011

దుష్యంతుడు

******************************************************************************

పేరు : దుష్యంత్
వయస్సు : 28
జన్మదినం : 10-02-1983
చదువు : బి.టెక్
ఉద్యోగం : సాఫ్ట్‌వేర్
ఎత్తు : 5ft 10in
స్థలం : హైదరాబాదు.


సంవత్సరం వయస్సు గల నా కూతురికి తల్లి కావాలి. కులం, కట్నం పట్టింపు లేదు. వితంతువైనా, డివోర్సీ అయినా పర్వాలేదు.
******************************************************************************

ఒక మాట్రిమోనియల్ సైట్‌లో కనిపించిన ఈ ప్రొఫైల్ చూసి నిర్ఘాంతపోయింది అశ్విని. ఈ దుష్యంత్ ఆ దుష్యంత్ ఒకడేనా.? పేరు చూడగానే మొదలైన అనుమానం ప్రొఫైల్‌లో కాస్త ముందుకెళ్లే సరికి బలపడింది. ఇంకా ఏవేవో వివరాలు ఉన్నాయి ప్రొఫైల్‌లో. కానీ చూసే ఆసక్తి లేదు అశ్వినికి. ఇది నిజం కాకపోతే బాగుండు అని గట్టి కోరిక మనసుని బలంగా తాకింది. ఉన్నట్టుండి ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టి, మనసంతా గందరగోళంగా తయారయింది. ప్రస్తుతానికి ఏదీ ఆలోచించే పరిస్థితిలో లేదు తను. అర్జెంట్‌గా ఇది తన ప్రొఫైలో కాదో తెలుసుకోవాలి అని ఒక గట్టి నిర్ణయానికొచ్చి, కామన్ ఫ్రెండ్స్ ఎవరు టచ్‌లో ఉన్నారా అని ఆలోచించడం మొదలు పెట్టింది.


"యస్, గుర్గావ్‌లో పావని ఉంది" అన్న అశ్విని మాటలు ఒక పక్క నుండి వాళ్ల అమ్మ వింటూనే ఉంది. అవేమీ పట్టించుకోకుండా అశ్విని తన మొబైల్ ఫోన్‌ కాంటాక్ట్స్ లో పావని నంబర్‌కి కాల్ చేసింది. నిజానికి తనకి కాల్ చేసి చాలా నెలలు అయిపోయింది, ఇప్పుడు అదే నంబర్ వాడుతుందో , మార్చిందో కూడా తెలీదు.
"వావ్.. వాట్ ఎ సర్ప్రైజ్  అశ్విని, ఎలా ఉన్నావు..?" అవతల నుండి పావని స్వరం వినగానే అశ్విని ఊపిరి పీల్చుకుంది.
"హమ్మయ్య, ఇదే నంబర్ వాడుతున్నావో లేదో అని అనుమానంగా కాల్ చేశాను. దొరికావు. నేను బాగున్నాను పావని, నువ్వెలా ఉన్నావు? ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నావు?" సంతోషంగా ప్రశ్నల వర్షం కురిపించింది  అశ్విని. "హ్మ్.. నేనెక్కడికీ వెళ్లలేదు మేడం. అదే ఇల్లు, అదే ఆఫీసు, అదే నేను. నీ సంగతి చెప్పు. చాలా రోజులయిపోయింది మాట్లాడి. ప్రస్తుతానికి ఎక్కడ వర్కింగ్..?" అడిగింది పావని.
"మూడు సంవత్సరాల క్రితం మన ఆఫీసు వదిలి వెళ్లిపోయాను కదా. అప్పటి నుండి టి.సి.యస్. లోనే పని చేస్తున్నాను. ఇంతకీ నీ హస్బెండ్ ఎలా ఉన్నారు..?"
"మేమంతా బాగున్నాం అశ్విని. రొటీన్ లైఫ్. ఇంతకీ నీ పెళ్లి సంగతి ఏంటి. నీ కాల్ రాగానే పెళ్లి పిలుపులకేనేమో అనుకున్నాను" కొంటెగా నవ్వుతూ పావని అడిగిన ప్రశ్నకి భారమైన నిట్టూర్పుతో సమాధానమిచ్చింది అశ్విని: "చూస్తున్నారు పావని. ఇంకా సెటిల్ కాలేదులే. హే నిన్ను అర్జెంట్‌గా ఒక విషయం అడగాలి. నీకు దుష్యంత్ గుర్తున్నాడా..? అదే మన ప్రాజెక్ట్‌లోనే చేసేవాడు"
"ఆ పేరుతోనే గుర్తు పెట్టుకోవచ్చులే అతన్ని. ఇప్పుడతను హైదరాబాదుకి వెళ్లిపోయాడనుకుంట. చెప్పు ఏంటీ విషయం..?"
"అతని వివరాలు నీకేమైనా తెలుసా.? అంటే పెళ్లి, పిల్లలు, భార్య."
"పెళ్లి నువ్వున్నప్పుడే అయిపోయింది కదా. ఒక పాప పుట్టి సంవత్సరం అయిందనుకుంటా. భార్య గురించి అయితే ఏమీ తెలీదు మరి."
"ఓహ్.. నాకు అతని కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి పావని. చూడగలవా..?"
"ష్యూర్ అశ్విని. ఇప్పుడొక అర్జెంట్ మీటింగ్ ఉంది. నీకు ఒక గంటలో ఇస్తాను అతని వివరాలు. బై బై."
అమ్మో గంటా అనుకుంటూ బై చెప్పింది అశ్విని.


దుష్యంత్ ఆలోచనలతోనే కళ్లు మూసుకుని కుర్చీలో వెనక్కు వాలి 4 సంవత్సరాల క్రితం రోజులకి వెళ్లింది.
బి.టెక్ అయిపోగానే, క్యాంపస్ రెక్రూట్‌మెంట్‌లో జాబ్ వచ్చింది. కంపెనీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన మొదటి రోజు ఇంకా తన కళ్ల ముందు సజీవంగానే ఉంది. తను రిపోర్ట్ చేయాల్సిన మేనేజర్‌ని కలిసింది అతని క్యాబిన్‌లో. చిన్న సైజ్ ఇంటర్వ్యూ పూర్తి అయిన తరువాత వర్క్‌స్టేషన్‌లోకి తీస్కెళ్లి ఒక అబ్బాయిని పరిచయం చేశాడు ఆ మేనేజర్ ఆనంద్.
"He is Mr.Dushyant. From now onwards, you need to work with him. you can contact him for any technical help."
"Ok Sir."
'దుష్యంత్..? పేరు విని భలే అనిపించింది, కనీసం ఇలా అయినా మన పురాణాల్లో పేర్లన్నీ గుర్తుంటాయి ముందు తరాల వాళ్లకి' మనసులో అనుకుంది అశ్విని.
మేనేజర్ దుష్యంత్ వైపు తిరిగి,
"She is Ms.Aswini. New joinee in the project and company as well. Just assist her what she has to do and provide her all the required documents."
"Sure Anand" అని చెప్పి మేనేజర్ వెళ్లిపోగానే దుష్యంత్ అశ్విని కి తన సీట్ చూపిస్తూ చెప్పాడు,
"This will be your seat Aswini. Be comfortable, and let me know if you need any help. I will give you the assignments what you have to do."
"Ok Sir."
"Hey dont call me sir. Just Dushyant. Remember its a corporate world"నవ్వుతూ సౌమ్యంగా చెప్పాడు.
"ok Dushyant" నవ్వుతూ చెప్పింది అశ్విని.


మొదటి రోజు కదా, వర్క్ అంటూ ఏమీ ఇవ్వలేదు కానీ ఆ ప్రాజెక్ట్ గురించి, వాళ్లిద్దరూ కలిసి చేయాల్సిన పని గురించి కొద్దిసేపు చెప్పాడు దుష్యంత్. సాయంత్రమవ్వడంతో టీ కోసం అని బయటికి నడిచారు ఇద్దరూ. కార్పొరేట్ వాతావరణాణికి కొత్త కావడం వలన అశ్విని సైలెంట్‌గా ఉంది, ఏం మాట్లాడితే అందులో ఏం తప్పు ఉంటుందో అని. దుష్యంతే చొరవ తీసుకుని మాట్లాడుతూ ఉన్నాడు.
"So, you are a fresher right..! Congrats for getting started with a good project."
"yeah.. Thank you Dushyant."
"Where are you from Aswini.? I mean your native place.."
"I am from Hyderabad. And about you..?
"Me too" అంటూ దుష్యంత్ తెలుగులోకి దిగిపోయాడు "అయితే తెలుగు వారే అనమాట".
"అవునండీ" ఇప్పటి వరకూ ఉన్న టెన్షన్ అంతా తెలుగు వినగానే పోయింది అశ్వినికి. ఇలా ఊరు కాని ఊరులో వచ్చి ఎలారా భగవంతుడా అనుకుంటూ జాయిన్ అయింది. దుష్యంత్ తెలుగువాడే అవ్వడం అశ్వినికి కాస్త ఊరటనిచ్చింది. దుష్యంత్ తన సంభాషణ కొనసాగించాడు.
"మాది కూడా హైదరాబాదేనండీ. ఉద్యోగం పుణ్యమా అని ఇలా గుర్గావ్ కొచ్చి పడ్డాను" అన్నాడు నవ్వుతూ.
"నాదీ అదే పరిస్థితండీ" వంత పాడింది అశ్విని.
"ఇంతకీ మీరెక్కడ ఉంటున్నారు..? పేరెంట్స్‌తో కలిసి ఉంటున్నారా..? లేక P.G.ఆ..?"
"P.G. లోనే ఉంటున్నా దుష్యంత్. మీరెక్కడ ఉంటున్నారు..?"
"కొలీగ్స్‌తో ఫ్లాట్ తీస్కుని ఉంటున్నా అశ్విని"


అశ్విని తీసుకున్న P.G., దుష్యంత్ ఉండే ఫ్లాట్ ఒకే ఏరియా కావడంతో రోజూ ఇద్దరూ కలిసే వెళ్లేవారు ఆఫీస్‌కి. ఇద్దరూ కలిసే వర్క్ చెయ్యడం, కలిసే భోజనం చెయ్యడం. వర్క్ విషయంలో దుష్యంత్ చూపించే కమిట్‌మెంట్, అశ్వినికి ఏదైనా అర్థం కాకపోతే అతను వివరించి చెప్పే విధానం, అతని సాఫ్ట్ నేచర్, మంచితనం, హెల్పింగ్ నేచర్ బాగా ఆకట్టుకున్నాయి. రోజు రోజుకీ దుష్యంత్ వ్యక్తిత్వానికి ముగ్ధురాలవ్వసాగింది. ఆ కారణంగానే అశ్విని దుష్యంత్ కి వ్యక్తిగతంగా దగ్గరవ్వడానికి ప్రయత్నించింది. ఎంత వరకూ ఉండాలో అంతవరకే ఉండడం దుష్యంత్ స్వభావం. అందుకే, ఏ రోజూ అశ్వినిని ప్రొఫెషనల్ పరిధి దాటి తనతో మాట్లాడనివ్వలేదు. ఒక కొలీగ్‌గా ఎంత వరకూ కేర్ చెయ్యాలో అంతవరకే ఉండేవాడు.


కానీ అశ్విని పరిస్థితి అలా లేదు. ఒక్కరోజు దుష్యంత్ రాకపోయినా ఆమెకి ఏమీ తోచేది కాదు. మనసంతా దిగులుగా, ఆఫీసంతా ఖాళీగా కనిపించేది. అదే విషయం దుష్యంత్‌తో మాట్లాడితే, "ఇందులో అంత మిస్ అవ్వడానికి ఏముంది అశ్విని. వేరే టీం వాళ్లతో కూడా అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండు." అన్నాడు. అదీ నిజమే కదా అని తన సర్కిల్ పెంచుకోవడం మొదలు పెట్టింది. అందులో భాగమే పావని పరిచయం. పావని కూడా తెలుగమ్మాయే అని తెలిసిన రోజు నుండీ, పావని , అశ్విని మంచి స్నేహితులు అయిపోయారు. ఎందరు స్నేహితుల మధ్యలో ఉన్నా, అశ్వినికి దుష్యంత్ మాత్రం చాలా స్పెషల్‌గా కనిపించేవాడు. ఆఫీసులో ఎంత పెద్ద సమస్య వచ్చినా, దేనికీ దుష్యంత్ కంగారు పడడం గానీ, చిరాకు పడడం కానీ చూడలేదు అశ్విని. అందుకే ఒకరోజు ధైర్యం చేసి అడిగేసింది కూడా బోల్డంత ఆశ్చర్యంతో..
"దుష్యంత్, అసలు నీకు కోపం చిరాకు ఎప్పుడూ రావా..? ఎంత చిక్కు ముడి అయినా నవ్వుతూనే విప్పుతావు..?"
ఎప్పుడు ఉండే చిరునవ్వుతోనే అడిగాడు దుష్యంత్ "ఆ అనుమానం ఎందుకొచ్చింది అశ్విని..?"
"అది కాదు, ఎంత సీరియస్ ఇష్యూ వచ్చినా ఏ రోజూ నీలో చిరాకు చూడలేదు. నీ జూనియర్‌గా నేనెన్ని మిస్టేక్స్ చేసినా ఏరోజూ కోప్పడలేదు.."
"హ్మ్.. చిరాకు కోపం ఇలాంటివన్నీ ఇంకా ప్రాబ్లంని పెద్దది చేస్తాయి కానీ సాల్వ్ చెయ్యవు కదా. అందుకే వాటిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచుతాను."


దుష్యంత్ దగ్గర అశ్విని నేర్చుకున్న ఇలాంటి జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి. చాలా చిన్న విషయాలు, జీవితాన్ని ఇంకాస్త అందంగా చూపించే విషయాలు చాలా నేర్చుకుంది. వాటి కారణంగానే అతనితో జీవితాంతం కలిసుండాలనుకుంది. అప్పుడే తన జీవితంలోని రంగులన్నీ తను చూడాగలను అనుకుంది. దీనికి ప్రేమ అన్న పేరు పెట్టడానికైతే మనసొప్పలేదు కానీ, అతడితో జీవితం మొత్తం కలిసే ఉండాలి అన్న నిర్ణయానికి మాత్రం వచ్చేసింది. కానీ అతడు ఒప్పుకుంటాడా..? దుష్యంత్‌కి తన మీద ఎలాంటి అభిప్రాయం ఉంది..? తనకి తెలిసినంత వరకూ దుష్యంత్ ఎవరినీ వాళ్ల లిమిట్స్ దాటనివ్వడు. అతడి మనసులో ఏముందో ఎవరికీ చెప్పడు. అతడు తనని పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుంటాడో లేదో ఎలా తెలుసుకునేది.? అశ్విని మనసంతా చిందర వందరగా ఉంది ఇలాంటి ఆలోచనలతోనే.బాగా ఆలోచించి స్థిరమైన నిర్ణయానికి వచ్చేసింది అశ్విని. దుష్యంత్‌తో డైరెక్ట్‌గానే మాట్లాడాలి ఈ విషయం గురించి అని.


--------------------------------------------------------------------------------------------------------
ఎందుకో ఉన్నట్టుండి అశ్విని ఆలోచనలనుండి బైటికి వచ్చింది. టైం చూస్తే అప్పుడే రెండు గంటలు అయిపోయింది పావనితో మాట్లాడి. పావని గంట తర్వాత కాల్ చేస్తా అంది కదా అనుకుని మళ్లీ పావనికి కాల్ చేసింది ఏమైందో కనుక్కుందామని. పావన్ కాల్ కట్ చెయ్యడంతో ఎప్పుడూ లేనంత విసుగొచ్చింది అశ్వినికి. అంతలోనే పావని మెసేజ్ "Stil in meeting. call u 1s its dne". ఒక భారమైన నిట్టూర్పుతో కిచెన్‌లోకి వెళ్లి కాఫీ కలుపుకోని వచ్చింది అశ్విని. కాఫీ తాగుతూ మళ్లీ ఆలోచనల్లోకి జారిపోయింది.
---------------------------------------------------------------------------------------------------------


అనుకున్న విధంగానే ఒక మంచిరోజు చూసుకుని దుష్యంత్‌తో మాట్లాడడానికి సన్నాహాలు మొదలు పెట్టింది. అదే సమయానికి అశ్విని అక్కకి పెళ్లి కుదరడంతో, వచ్చే శనివారం సాయంత్రం అతడికి పార్టీ ఇస్తా అని చెప్పి రెస్టారెంట్‌కి రమ్మని చెపింది. ఎప్పుడూ లేనిది ఆరోజు తనకిష్టమైన వర్క్ శారీ కట్టుకుని రెస్టారెంట్‌కి బయలుదేరింది.


ఇద్దరూ కలిసి ఫుడ్ ఆర్డర్ చేశారు. రూంలో నుండి బయలుదేరడమే టెన్షన్‌తో బయలుదేరిన అశ్వినికి, "శారీలో చాలా బాగున్నావు" అన్న దుష్యంత్ కాంప్లిమెంట్‌తో ఇంకాస్త టెన్షన్ పెరిగిపోయింది.
"త..థ్యాంక్ యూ.." అని  మాత్రం అనగలిగింది.
"ఏమైంది అశ్విని, ఎందుకో టెన్షన్ పడుతున్నట్లున్నావు..?"
"దుష్యంత్, నీతో కొంచెం మాట్లాడాలి"
కాస్త అనుమానంగా అడిగాడు దుష్యంత్ "చెప్పు, ఏంటి విషయం..?"
"అదీ.. ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు." అని గ్లాస్‌తో మంచినీళ్లు తాగడం మొదలుపెట్టింది, విషయం అర్థం కాని దుష్యంత్ చూపులు తనని తాకుతూ ఉంటే.
తాగడం పూర్తి చేసి మాట్లాడ సాగింది "దుష్యంత్, నీతో పరిచయమయ్యి సంవత్సరం గడిచిపోయింది. నా జీవితంలో నిజంగా ఈ సంవత్సరం చాలా విలువైనది. నువ్వు నాకు అర్థమవుతున్న కొద్దీ, నీతోనే నా మిగిలిన జీవితం గడపాలని అనిపిస్తూ ఉంది. ఇంతకు మించి ఏమీ చెప్పలేను. తప్పుగా ఏమీ మాట్లాడలేదనే అనుకుంటున్నాను." దుష్యంత్ ముఖకవళికల్ని గమనించాలి అనుకున్న అశ్విని, ఆ ధైర్యం చెయ్యలేకపోయింది. ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అనుకుంటుండగా దుష్యంత్ మాట్లాడాడు "అశ్విని, నీలో ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయన్న విషయం నిజంగా నాకు తెలీదు. కానీ, అందుకు కారణం నేననే అనుకుంటున్నాను. నీకు సారీ ఎలా చెప్పగలనో కూడా తెలియడంలేదు. నువ్వంటే నాకు గౌరవం ఉంది. అంతే. అంతవరకే. నీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంకో రెండు నెలల్లో నా పెళ్లి. రీసెంట్‌గా ఫిక్స్ అయింది. నువ్వు ఎంత హర్ట్ అవుతావో నేను అర్థం చేసుకోగలను. కానీ, సారీ చెప్పడం నిజంగా ఇంత కష్టమని నాకు ఇప్పుడే తెలిసింది."
ఇంక మాట్లాడేది ఏదీ లేదన్నట్లుగా ముగించాడు.


ఆ క్షణం నుండి అతడికి సంబంధినచిన ఏ ఙ్ఞాపకం తన దగ్గర ఉండొద్దు అనుకుంది అశ్విని. ద్వేషంతో తీసుకున్న నిర్ణయం కాదది, తన చేతుల్లో ఏదీ లేని తన ఇష్టం గురించి ముందు ముందు బాధ పడొద్దని. అందుకే, ముందుగా కంపెనీ మారిపోయింది. కంపెనీ ఎందుకు మారిందో పావనికి కూడా తెలియదు. దుష్యంత్‌కి సంబంధించిన ఈమెయిల్ ఐ.డి, ఫోన్ నంబలు అన్నీ తీసేసింది. ఇదిగో, మళ్లీ ఇప్పుడిలా తన పెళ్లి కోసం ప్రొఫైల్స్ వెతుకుతూ ఉంటే దుష్యంత్ ప్రొఫైల్ కనిపించి గతాన్ని గుర్తు చేసింది.


ఫోన్ రింగ్ అవ్వడంతో ఉలికిపడి ఫోన్ చూస్తే పావని. మళ్లీ కట్ అయిపోతుందేమో అన్న భయంతో వెంటనే ఆత్రుతగా లిఫ్ట్ చేసి, చాలా మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించింది "చెప్పు పావని"
"సారీ అశ్విని. గంట మీటింగ్ అని రెండున్నర గంటలు వాయించాడు మేనేజర్"
"హే.. సారీ ఎందుకు. నేనే నీకు సారీ చెప్పాలి, మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు" కాస్త ఫీల్ అయినా నిజాయితీగానే చెప్పింది ఎప్పుడెప్పుడు దుష్యంత్ కాంటక్ట్ డీటెయిల్స్ ఇస్తుందా అని ఆరాట పడుతూ.
"దుష్యంత్ డీటెయిల్స్ అడిగావు కదూ, 5 నిమిషాల్లో ఇస్తా ఉండు" అని కాల్ కట్ చేసింది పావని. ఎప్పుడెప్పుడు తనకి విషయం తెలుస్తుందా అని ఎదురు చూస్తున్న కొద్దీ ఇంకా లేట్ అవ్వడం అశ్వినిలో ఇంకా భయాన్ని పెంచుతుంది. రకరకాలుగా సాగుతున్నాయి అశ్విని ఆలోచనలు.
అసలెందుకు దుష్యంత్ ఇలా యాడ్ ఇచ్చాడు..?  విడాకులు తీసుకున్నారా..? విడాకులు తీసుకుంటే పాపని అతని వైఫ్ చూసుకోకుండా ఇతని దగ్గర ఎందుకు వదిలేసింది..? అతని వైఫ్ చనిపోయి ఉంటుందన్న ఊహే భయంకరంగా ఉంది. ఇంకేం కారణం ఉండి ఉండవచ్చు..? ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి పాపని మంచిగా చూసుకుంటుందని నమ్మకం ఏమిటి..? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో అశ్వినికి నిమిష నిమిషానికీ తలనొప్పి పెరిగిపోతుంది. మళ్లీ కవలకూడదు అనుకున్న వ్యక్తిని ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకునేలా చేశాడు దేవుడు.. అసలు మర్చిపోయాను అనుకున్న వ్యక్తి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తుంది తను..?


ఒకవైపు ఆలోచిస్తూనే ఐదు నిమిషాలు ఎప్పుడెప్పుడు అయిపోతాయా, పావని ఎప్పుడెప్పుడు కాల్ చేస్తుందా అని ఫోన్ వైపు చూస్తూ ఉంది. అప్పుడే పావని కాలింగ్ అని కనిపించి, లిఫ్ట్ చేస్తే ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయం భయంగా, అసలు అతను ఇతను ఒకడేనా అన్న సంశయంతో కాల్ లిఫ్ట్ చేసింది.
"అశ్విని, అష్టకష్టాలు పడి విషయం తెలుసుకున్నాను దుష్యంత్ గురించి"
"ఏం జరిగింది పావని...?" ఆతృత ఆపుకోలేకపోతోంది అశ్విని.
"దుష్యంత్ వాళ్ల వైఫ్ కి" అని ఏదో చెప్పబోతుంటే మధ్యలో అశ్విని కంగారుగా అడిగింది " ఏం జరిగింది.?"
"ఏమీ కాలేదు అశ్విని, ఆ అమ్మాయికి ఆన్సైట్ ఆఫర్ వస్తే నెల క్రితమే దుష్యంత్, అతని వైఫ్, వాళ్ల పాప U.K కి వెళ్లారట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే దొరకలేదు. ఈమెయిల్ ఐ.డి ఉంది, కావాలంటే ఇస్తాను."
"అలాగా.. గ్రేట్ న్యూస్. అయితే ఇప్పుడు యు.కె. లోనే ఉన్నారనమాట. బాగున్నారా అందరూ..?" ఒక విధమైన ప్రశాంతతో అడిగింది అశ్విని, ఇంకా మనసులో ఏ మూలో ఉన్న చిన్న అనుమానం తొలుస్తూనే ఉండగా..
"They all are fine Aswini. రెండురోజుల క్రితమే గణేషన్‌తో మాట్లాడాడట దుష్యంత్. నీకు గణేషన్ తెలీదు కదూ, నువ్వు వెళ్లిపోయిన తరువాత జాయిన్ అయ్యాడులే మన ప్రాజెక్ట్‌లో. ఇతను దుష్యంత్‌కి చాలా క్లోస్. అందుకే ఇతనికే కాల్ చేసి వివరాలు తెలుసుకున్నాను."
"థ్యాంక్ యూ సో మచ్ పావని." మనసంతా సంతోషంగా ఉందిప్పుడు అశ్వినికి. మరీ ఈ రెండు రోజుల్లో అయితే ఏదో జరిగిపోయి అలా యాడ్ ఇవ్వడు కదా అన్న ఆలోచన వచ్చిన తరువాత.
"పర్వాలేదు మేడం. ఇంతకీ ఇంత సడెన్‌గా అతను ఎందుకు గుర్తొచ్చాడు...?"
"హ్మ్.. కారణమేమీ లేదు పావని. ఎందుకో అలా గుర్తొచ్చి అడిగాను అంతే. సరే ఉంటాను మరి కాస్త పని ఉంది" మళ్లీ ఎదురు ప్రశ్న ఏమి వినాల్సి వస్తుందో అని బై చెప్పేసింది.
"అలాగే అశ్విని, టేక్ కేర్. బై. పెళ్లి త్వరగా ఫిక్స్ చేసుకుని, నన్ను తప్పకుండా పిలువు. సరేనా.?"
"ష్యూర్ పావని"


అయితే ఇద్దరూ ఒకటి కాకథలుదనమాట అనుకుని హ్యాపీగా ఊపిరి పీల్చుకుంది అశ్విని. అంతలోనే ప్రొఫైల్‌లో చూసిన దుష్యంత్ గుర్తొచ్చి మనసులో 'దేవుడా, పాపం ఆ పాపకి మంచి తల్లి దొరికేలా చూడు' అని మనస్పూర్తిగా కోరుకుంటూ  తన సిస్టంని షట్ డౌన్ చేసింది.