Friday, September 16, 2011

బ్లాగ్లోకంలో మీతో నేను

మధుర అన్నట్లు.. ప్రతి మనిషికీ తన గురించి ఎదుటి వాడు ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని ఉంటుంది (ఇక్కడ మీకు ఏదైనా సినిమా కానీ సీన్ కానీ గుర్తొస్తే అది నా తప్పు కాదు అధ్యక్షా). అలాగే నా గురించి చాలా మంది రాసినవి చూసి చాలా సంతోషించాను. మరి నా మనసులో ఎవరెవరు ఎలా ఉన్నారో కూడా చెప్పాలి కదా. బజ్జులో మొదలు పెట్టిన లిస్ట్, బ్లాగు టపా అయింది..

ఈ లిస్ట్ మొదలు పెట్టగలిగాను అంటే మొదటగా నేను బ్లాగులోకి రాగలిగిన రోజుని తలుచుకునే తీరాలి. అనగనగా ఒక శనివారం.. అంటే 19 జూన్,2010 ఈనాడు పేపర్‌లో మొదటిసారిగా ఒక బ్లాగు గురించి చదివాను. నాకు బాగా గుర్తు, "జెర్మనీ లో కూస్తున్న తెలుగు కోయిల" అని పరిచయం. అక్కడ మొదలయిన ఆసక్తి, మధుర "బరువు-బాధ్యత" టపా తో ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగి పెద్దదయింది. నాకిప్పటికీ మధుర అంటే మొదటగా గుర్తొచ్చేది బరువు - బాధ్యతే.. ఆ తరువాత మిస్.పనిమంతురాలు (1,2). ఆ వెంటనే ఇంకా చాలా గుర్తొస్తాయి:)) ఆ ముచ్చట్లు వింటూ ఉంటే, చాలా విషయాలు అరే నాకు కూడా ఇలాగే జరిగిందే అనిపించేది. ముఖ్యంగా వాళ్ల అమ్మగారి మాటలు, మాట్లడే కొన్ని పదాలు (ఉదా :ఇగం) నాకు చాలా దగ్గరగా అనిపించాయి. మంచుగారి టపాతో (మధుర పెళ్లి రోజు వేసిన టపా) తనది మా ఊరే అని తెలిసి నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.

ఆ తరువాత నాకు తెలిసిన బ్లాగు, బ్లాగాడిస్తా రవి గారిది :). ఒక్కటి కూడా వదలకుండా అన్నీ చదివేశా. ముఖ్యంగా దినాల గురించి ఆయన రాసిన టపా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇంకొద్ది రోజులకి మహిళా దినోత్సవం, అమ్మల దినోత్సవం, నాన్నల దినోత్సవం, అన్నల తమ్ముళ్ల దినోత్సవం లాగా, అర్థ దినోత్సవాలు కూడా వచ్చేస్తాయేమో అన్న అనుమానం భలే నవ్వు తెప్పిస్తుంది. కానీ ఆ తరువాత రవి గారు పద్యాలు రాసేస్తూ దినదినాభివృద్ధి చెందడంతో (మరి నాకు అంత తెలుగు రాదుగా :(( ) అటువైపు వెళ్లడం కాస్త కాస్తగా తగ్గింది.

ఇక తరువాత నేను చదివిన బ్లాగు ఏంటంటే.. ఏంటంటే.. ఏంటంటే.. ఇంతగా ఊరిస్తున్నా అంటే అర్థం అయిపోయి ఉండొచ్చు మీ అందరికీ.. యస్ యస్ అదే.. ఏ బ్లాగులో అయితే టపా పడగానే కామెంట్ల వరదలు వస్తాయో, ఏ బ్లాగులో అయితే హాస్యం, వ్యంగ్యం, ప్రేమ, అభిమానం అన్నీ సమపాళ్లలో కలిపి రంగరించి చదువరులని నవ్వించి నవ్వించి ఏడిపిస్తారో, అదే తెలుగు బ్లాగర్ల అభిమాన బ్లాగు మన "జాజిపూలు". ఈ బ్లాగు గురించి నేను ఎంత తక్కువ చెబితే అంత మంచిది.  మరి నే చెప్పే మాటలేవీ ఆ బ్లాగుతో సరితూగలేవు కదా.. కానీ నాకు దొరికిన ఒక అరుదైన ఙ్ఞాపకం మాత్రం అలా ఉండిపోతుంది. జాజిపూలు బ్లాగులో మొదటి సెంచరీ నాదే. :) కొన్ని సంవత్సరాలుగా అభిమానిస్తున్న ఎవరికీ దక్కని ఆ అవకాశం నాకు దక్కినందుకు నా మీద కట్టిన కక్షలు, కుతంత్రాలు.. ఎంతగా ఎంజాయ్ చేశామో.. ఎప్పటికీ నా మనోఫలకం మీద చెరిగిపోని ముద్రలు జాజిపూలతో నాకున్న ఙ్ఞాపకాలు:) నాకు అన్ని ఙ్ఞాపకాలు మిగిల్చిన టపా "గురువులను పూజింపుము పెళ్లి చేసుకోకుము". ఇప్పటికీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటా ఆ టపా, అందులో వ్యాఖ్యలు:)


అలా వందవ వ్యాఖ్య కోసం జరిగిన అల్లర్లలో, నాకు నేస్తం అయిన మరో మంచి బ్లాగరు హరే కృష్ణ:) "నేస్తం గారి టపాలో వంద కామెంటు కొట్టేసినందుకు గొడవేసుకోడానికి వచ్చాను" అంటూ చేసిన అల్లరి, అలా అలా నా బ్లాగులో సెంచరీ పూర్తి చేసిన విషయం ఇప్పటికీ గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటాను. హరే అనగానే, మొదట నాకు గుర్తొచ్చేది బ్లోకిరి.. ఆ టపా చదువుతూ ఎంతగా నవ్వుకున్నానో. అంతేనా, అసలు హాలీవుడ్ ఎలా ఉంటుందో తెలీని నాకు, బోలెడు హాలీవుడ్ సినిమాలని పరిచయం చేశాడు.

అదే సమయంలో పరిచయం అయిన మరో ముగ్గురు మంచి బ్లాగర్లు, నేస్తం అక్కకి ముద్దుల తమ్ముళ్లు , నాగార్జున, సాయి ప్రవీణ్, వేణూరాం (ఈయన అప్పటికి బ్లాగరు కాదులే). అప్పటి వరకూ నాకు "మనసు పలికే" అన్న బ్లాగుమరోటి ఉందని తెలీదు. అదీ నాదే అనుకుని నాగార్జున నన్ను బోల్డు సార్లు "ప్రసీద" గారు అని పిలిచేవాడు, నేను ప్రసీద గారిని కాదు మొర్రో అన్నా వినిపించుకోకుండా :). తరువాత నిజం తెలుసుకుని నాకు బోలెడు సారీలు చెప్పాడులే;). నాగార్జున టపాలంటే నాకు వాళ్ల కాలేజి హాస్టల్‌లో దీపావళి సంబరాలు గుర్తొస్తాయి. ఇక సాయి ప్రవీణ్ విషయానికొస్తే, నేస్తం గారిని చూస్తే నన్ను బంగారం అని పిలిచే అక్క గుర్తొస్తున్నారు అనగానే "ప్లీజ్ అపర్ణ గారు, నాకు మీ అక్క వివరాలు ఇవ్వండి. ఆ అక్క ఈ అక్క ఒకరే అయ్యుండొచ్చేమో" అని బ్రతిమిలాడారు:) వేణూరాం అలియాస్ రాజ్‌కుమార్, ఈయన టపాలు అంటూ అప్పటికి లేకపోయినా కామెంట్లతో జనాల్ని పిచ్చెక్కించేవాడు. ఒక కామెంటులో ఎవరో అనగా గుర్తు, "వేణూరాం టపాలు రాయడు కానీ, ఈ కామెంట్లన్నీ కలిపితే తోటరాముడి కన్నా మంచి కామెడీ టపా అవుతుంది" అని. అది నిజమని తరువాత నిరూపించుకున్నాడు :)) (సోదర సోదరీమణులారా..తోటరాముడి అభిమానుల్లారా..  ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.. నేను కూడా తోటరాముడి గారి అభిమానురాలినే ) తోటరాముడి గారి టపాలు చదివి ఎంతగా నవ్వుకున్నానో, అంతగా రాజ్ టపాలు కూడా చదివి నవ్వుకున్నా నేనైతే :)ముఖ్యంగా సుమను సినిమాలు, ఇండస్త్రీలో ఇంకొన్ని సినిమాల రివ్యూలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. రాయడం ఒకటేనా? అంతకన్నా గొప్ప ఫోటోగ్రాఫర్. ఏటికొప్పాక హస్త కళా వైభవం, శిల్పారామం ఫోటోలు చూస్తే అర్జెంటుగా అక్కడికి వెళ్లిపోవాలనిపిస్తూ ఉంటుంది.

ఇక ఆ తరువాత, మాలికలో హారం లో ఎక్కడ మంచి టైటిల్ కనబడితే అక్కడికి దూరిపోయి బోలెడు మంచి మంచి బ్లాగుల తలుపు తట్టాను. అదే విధంగా ఎందరో గొప్ప గొప్ప బ్లాగర్లు కూడా నా బ్లాగు తలుపు తట్టి నన్ను ప్రోత్సహించారు. అందులో ముందుగా నేను చెప్పుకోవలసింది కొత్తపాళీ గారి గురించి. కొత్తపాళీ గారి "పెరడు వ్యవసాయం - గోంగూర రుచి" టపా చదివి చాలా నచ్చి వ్యాఖ్య పెట్టాను. అందరూ "కొత్తపాళీ గారి టపా చాలా గంభీరంగా ఉంటుంది అన్న అభిప్యారం ఇక్కడితో మారిపోయింది" అనగా విని అమ్మో అనుకున్నాను. మిగిలిన కొన్ని టపాలు చదివాక చాలా గౌరవం ఏర్పడింది. ఒకానొక రోజు నా బ్లాగులో ఏం రాయాలో అర్థం కాక సలహాలు అడుగుతూ రాసిన "నేను నా మనసు" టపా చూసి, ఆ వెనువెంటనే " నన్ను నేను కోల్పోయాను" అన్న నా మొదటి కవిత చదివి రాసిన వ్యాఖ్య " ఇంత చక్కటి భావుకమైన వాక్యం రాసిన మీరు ఏం రాయాలో తెలియట్లేదు అంటే నమ్మడానికి మేం వెర్రికుట్టెలం కావాలి. :) " ఈరోజుకీ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వారికి ధన్యవాదాలు మాత్రమే చెప్పడం చాలా తక్కువ అవుతుంది.

కాస్త గంభీరం అయింది కదూ.. ఇప్పుడు కాసిని నవ్వుల్లోకి వెళదాం:) అదేనండీ మన శివరంజని ఎర్రబస్సు దగ్గరికి:) నవ్వులతో చంపేసే అల్లరి పిల్ల. తలుచుకుంటే చాలు, మొదట నవ్వు, ఆ తరువాత తను రాసిన పేరు టపా, ఎర్రబస్సు టపా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి. మొదటగా నేను చదివిన టపా "నువ్వు నాకు నచ్చలేదు నచ్చలేదు". ఆరోజు అక్కడ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. దెబ్బకి పోలియో వచ్చి పడిపోయిన తన బ్లాగు లేచి పరిగెట్టినట్లు శివరంజనే స్వయంగా చెప్పింది మరి:) కొంతమంది కలిసి లీటర్లు లీటర్లు పోలియో మందు తాగిస్తే పరిగెట్టదూ మరి?? ఒక అందమైన అల్లరి తెలుగు కోనసీమ అమ్మాయి అలా కళ్ల ముందు తిరుగుతూ ఉంటుంది అల్లరిగా, తన తలపు రాగానే:)

అమ్మో అందరిగురించి చెబుతూ మా గురూ గారి గురించి చెప్పకపోతే ఎలా??? బులుసు సుబ్రహ్మణ్యం గారు:) నవ్వితే నవ్వండి అంటూ ఆగకుండా నవ్వాల్సిందే అనిపించేలా రాస్తూ కడుపుబ్బ నవ్వించే హాస్య చక్రవర్తి:) మొదటగా ఆయన హాస్యాస్త్రానికి నేను బలయిన టపా "సతీ ద్రౌపది పాకం" కడుపు నొప్పొచ్చేలా నవ్వాను. అభిమానిని అయిపోయాను. ఆ తరువాత నా టపా చదివి అయిడియా వచ్చింది అని చెప్పి రాసిన "నేను ఎందుకు వ్రాస్తున్నాను" సీరీస్. ఎంతగా పొంగిపోయానో :) అంతే ఇంక నాకు గురూ గారు అయిపోయారు. ఇప్పటికీ నేనైతే ఏలూరు బస్సులోనే ఉన్నాను పలక బలపం పట్టుకుని:))

ఇందు.. పువ్వులు, చల్లని వెన్నెల, దానిపై తన సంతకం.. మొత్తంగా వెన్నెల సంతకం:) నిజంగా వెన్నెలంత చల్లని అమ్మాయి. గిలిగింతలు పెట్టే చక్కని ముచ్చట్లు రాతలు. నాకు బాగా గుర్తుండిపోయిన తన రచన "తొలిసారి నిన్ను చూసింది మొదలు" నిజంగా అరకుని చూసి తీరాల్సిందే అన్న కోరికని ఇంకా బలంగా చేసిన రచన అది. మనసులో ఒక ఆలోచనకి అక్షర రూపం ఇంత అందంగా ఇవ్వొచా అన్న ఆలోచన రేకెత్తించిన రచన అది. చిట్టి చీమ కథ అయితే నన్ను కూడా ఒక చిన్న పాపని చేసి కూర్చోబెట్టుకుని చెప్పినట్లు అనిపిస్తుంది. అంత బాగా రాస్తుంది మా వెన్నెల ఇందు:)

వెన్నెల అనగానే మీకు మరో పేరు గుర్తు రావాలే.. నాకు తెలుసు కదా మీ పల్స్ ;). మరి.. రంగులతో దేన్నైనా గుప్పిట పట్టగల చిత్రలేఖనం అందరికీ వస్తందా?? కొన్ని చేతులకే ఆ మహిమ ఉంటుంది. అందులో ఒకరే మన కిరణు. ఒక్క చిత్రలేఖనమేనా.. చిన్నగా చక్కిలిగింతలు పెట్టే పిల్లగాలి లాంటి అల్లరి తనది. అందుకే తన టపాలు కూడా పొట్ట పగిలేలా నవ్వించవు, గిలిగింతలు పెట్టినట్లుగా టపా చదివినంతసేపూ పెదవులపై నవ్వు పువ్వుల్ని అరవిరిసిన విరజాజుల్లా పూయిస్తూనే ఉంటాయి. చదివేసాక కూడా వదలవు మనల్ని ఆ ఆలోచనలు అచ్చం ఆ పూల పరిమళం లాగానే:) అందుకే భావి భారత బెంగుళూరు పౌరులంతా కలిసి తనకి విగ్రహం పెట్టించబోతున్నారు:)). నాకైతే "నేనూ వాచ్ కొనుక్కున్నా కదా" అన్న తన టపా ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది:)

మరి ఈ అల్లరిపిల్లలందరి గురించి ఏకరువు పెట్టి మా అందరి గురూ గారి గురించి చెప్పకపోతే ఎలా?? ఇంకెవరు.. ఘతోత్కచురాలు ;) మాయా శశిరేఖ. నేను మొదటగా చూసింది తన "చెక్కిన చేతులకు జోహార్లు" టపా. అబ్బ. నిజంగా చూడ్డానికి రెండు కళ్లు సరిపోని అంత మంచి దృశ్యాల్ని/ప్రదేశాన్ని తన మాటలతో మనందరికీ చూపించగలిగారంటే ఇంకేం చెప్పగలం. మహానటి సావిత్రి పై తనకున్న అభిమానం కళ్లముందు కదలాడుతూ ఉంటుంది తన స్కెచెస్ చూస్తూ ఉంటే. ఎంత సీరియస్ టపాలు రాసినా, మాతో కలిసి తను చేసే అల్లరే గుర్తుండిపోతుంది బాగా. "నువ్వు ఎక్కడా తగ్గొద్దు, నేనున్నాగా నీవెనక" అంటూ చిలిపి గొడవల్లో తనిచ్చే ప్రోత్సాహం చిరునవ్వుల్ని పూయిస్తూ ఉంటుంది:)

అయ్యయ్యో.. ఇంకో అల్లరి పిల్ల గురించి చెప్పకపోతే సౌమ్యగారు ఊరుకోరు..;) అదేనండీ మన కావ్య:) ఏదో అలా ఒకటిఈ రెండు భాగాల్లో పూర్తి చేసేసుకునే చిన్న చిన్న కథలు తెలిసిన మనకి, ఏకంగా రెండు  మూడు సీరియల్స్ చకచకా నడిపేస్తూ, నవ్విస్తూ అల్లరి చేసే మన కావ్య. నేనైతే "ప్రేమే నా ప్రాణం" సీరియల్ లో తనిచ్చిన ట్విస్ట్ ని ఇంకా జీర్ణం చేసుకోలేదు తెలుసా. ఇంక తననెలా మర్చిపోతాం..

నవ్వులు కాస్త ఎక్కువయ్యాయా??? మరిప్పుడు భావుకత్వం లోకి దూకేద్దామా??? అంతకంటే ముందు ఇంకో ప్రత్యేక వ్యక్తి గురించి చెప్పాలి. నెమలికన్ను మురళి గారు. నెమలికన్ను గారిది నేను మొదటగా చూసిన టపా "ఫ్రీ హగ్స్" బ్లాగు యొక్క పరిచయం. ఆ పరిచయం చూసి ఎంతగా అభిమానం పెరిగిపోయిందంటే, ఏమో చెప్పలేనేమో.. ఏదైనా అంశాన్ని ఆయన వర్ణించే తీరు అద్భుతం. దేని గురించైనా అనాలిసిస్ చేసి దాని లోతుల్ని మనకి చూపిస్తూ ఉంటే ఔరా అనుకోడం నా వంతు అవుతుంది. పుస్తకాల పరిచయం కానీ, బ్లాగుల పరిచయం కానీ, తన చిన్న నాటి ఙ్ఞాపకాలు కానీ..ఏదైనా వర్ణించడం ఆయనకి కొట్టిన పిండేమో అనిపిస్తుంది. నాకైతే "మా భూషణం" ఎంత నచ్చాడో... ఒక మంచి బ్లాగు అయినా, ఒక మంచి పుస్తకం అయినా, ఒక మంచి సినిమా అయినా.. ఏదైనా సరే, మురళి గారి రాతల్లో అందంగా ఒదిగిపోవలసిందే.

మరి నెమలికన్ను గారు పరిచయం చేసిన మరొక అద్భుతమైన బ్లాగరు మురారి గారు (ఫ్రీ హగ్స్). ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అక్షరాల వెంట కళ్లు పరిగెడుతూ ఉంటే అప్పటికే చదివిన దానికి మనసు సంతోషపడుతూ ఇంకా కావాలి అంటూ ఆతృతగా చూస్తూ ఉంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది?? నాకైతే మురారి గారి బ్లాగులో అది కనిపించింది. ఏదైనా భావాన్ని, అనుభూతిని ఆయన పలికించే తీరు అద్భుతం. ఆయన రచన చదివేశాక, మనసు ఒక సంతృప్తితో నిండుకోడం తెలుస్తూనే ఉంటుంది, అదే సమయంలో అప్పుడే అయిపోయిందా అనిపించడామూ సహజమే. ఆయన టపాలన్నీ చదివేశాను. ఇది ముందు ఇది వెనుక అని చెప్పలేని విధంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కనిపిస్తాయి ఆ టపాలన్నీ..

అసలు బ్లాగు లెజెండ్ గురించి మాట్లాడకుండా ఇంత దూరం వచ్చానంటే నన్నేమనాలి..??? ఆయ్..
మంచు పల్లకి. ఆ పేరంటేనే నాకు భలే ఇష్టం. అసలు మంచుగారు ఎవరో తెలీక ముందు ఆయన రాసిన "నాదెండ్లతో ఒక రోజు" చదివాను. ఎందుకో అది ఈరోజుకీ గుర్తుంది. మంచు గారి టపాల్లో నేను గమనించిందేమిటంటే, ఏదో బ్లాగు నడుపుతున్నామంటే నడుపుతున్నాం, ఏదో ఒకటి రాయాలి కదా అని రాయడం కాకుండా అందరికీ ఉపయోగపడే విషయాలు రాస్తారు. నాకు ఆయన రాసిన "కొంచెం గౌరవం" ఆయన మీద చాలా గౌరవాన్ని పెంచింది. "కొన్నాళ్ల తరువాత" టపా నాకు బోలెడంత ఙ్ఞానాన్ని ప్రసాదించింది:) ముఖ్యంగా ప్రతి పోస్టూ శ్రీ రామ అంటూ మొదలు పెట్టడం నాకు బాగా నచ్చుతుంది:))

అమ్మో అసలు తెలియకుండానే ఇంత పెద్ద టపా రాసేశానా.. ఇంకా చాలా బ్లాగుల తలుపులు తట్టాలి. దానికి నా రెండవ టపా ఎదురు చూస్తూ ఉంది. ఈ టపాలో నేను పలకరించని వాళ్లెవరూ కూడా తొందరపడి బాధపడి, నా మీద అలిగేసి, ధర్నాలు గట్రా చెయ్యొద్దని మనవి :) :) మీ అందరినీ కలుసుకోడానికి మరొక టపాతో మీ ముందుకు వస్తాను. అంతవరకూ...
సశేషం..

26 comments:

ఆ.సౌమ్య said...

wow...అన్నీ బాగా కవర్ చేసావు..బాగా రాసావు. నన్ను గుర్తుపెట్టుకున్నందుకు థాంక్సులు అప్పూ!

రాజేష్ మారం... said...

చాలా బ్లాగులు పరిచయం చేసారు.. Thank You

నేస్తం said...

నీలో నచ్చేదేమిటంటే చాలా అందంగా చెప్తావ్ ఏదైనా :)ఏదైనా అలోవొకగా చేసేస్తావ్..అసలంత స్పీడ్ గా నిమిషాల్లో అన్ని పనులు ఎలా చక్కపెడతావో అర్ధం కాదు.. చాలా సార్లు గమనించాను ఈ విషయాన్ని నీలో ...చాలా టాలెంట్ ఉందిరా అప్పూ నీలో

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>అమ్మో అందరిగురించి చెబుతూ మా గురూ గారి గురించి చెప్పకపోతే ఎలా???
అంటే తప్పదురా బాబు చెప్పక పోతే ఏడుస్తాడు అని చెప్పారా? vaaaaaaaaaaaaa.

>>>ఇంకెవరు.. ఘతోత్కచురాలు ;)

ఒహ్హోఃహో ఆహ్హహః ఆనందంతో నేను కధకళి డూయింగ్ .

కొత్త పాళీ said...

good show.
తెలుగు బ్లాగులు ప్రాచుర్యం పొందినప్పటినించీ "మీ బ్లాగుకి హిట్లు పెంచడం ఎలా" అని సలహాల టపాలు ఏడాదికి ఒకసారో ప్ఫదిసార్లో వెలువడుతూనే ఉన్నాయి. ఇట్లాంటి టపాలన్నిటిలోనూ అందరూ కామన్‌గా చెప్పిన ఒకే ఒక సూత్రం - మనకి నచ్చిన బ్లాగర్ల టపాలకి లింకులిస్తూ మెచ్చుకుంటూ ఒక టపా రాయాలని. మీరు ఇప్పటికైనా గ్రహించారు, సంతోషం :)

హరే కృష్ణ said...

వావ్ పువ్వు పరిమలించగానే పుడుతుంది
అలాగే ఒక బ్లాగరు అనుకొని విధంగా తన పేరుని వేరే బ్లాగులో మొదట చూడడం కెవ్వు కేకలు పెట్టిస్తుంది

ఎంత క్లిష్టమైన విషయాన్ని భావుకతని మా లాంటి సామాన్యులకి చెప్పే విధానం లో నీ ప్రతిభ అసమానం
దుబాయి సిడ్నీ ఉండే అభిమానులను అడిగితేనే తెలుస్తుంది పాశ్చ్యాత్య దేశాలను ఎలా పావనం చేస్తున్నావో
నీ బ్లాగు చదవాక నేను కూడా సరళంగా చెప్పడంనేర్చుకొని ఏదో నా వంతుగా బ్లాగులోకాన్ని బ్రష్టు పట్టిస్తున్నాను
ప్రజలు భావుకత కి చెమటలు పట్టిస్తున్న రోజుల్లో మధుర తో కలసి అడుగు పెట్టి నీ పరిమలాలతో గుబాళించి పావనం చేసావు అని ఘాట్టి ఫీలింగ్!

అపర్ణ బ్లాగుని పొగడడం రెండు వాక్యాల్లో ఇప్పటితో ముగిస్తున్నాం

SHANKAR.S said...

అయితే నన్ను "అప్పు"డే ధర్నాలు గట్రా చేయద్దంటారు. అంతేనా :))))))

..nagarjuna.. said...

>>మీకు ఏదైనా సినిమా కానీ సీన్ కానీ గుర్తొస్తే అది నా తప్పు కాదు..<<
ఐతే తప్పు మధురగారి దన్నమాట, సరే ఆవిడనే ఆడుగుతా మరి ;)

కొత్తపాళి గారు, మా బ్లాగు లింకులు ఇస్తే సాటి బ్లాగర్ల మీద అభిమానం కొద్దీ అనుకున్నాం. మీరేమో హిట్లు పెంచుకోడానికి అంటున్నారు, అంటే ఇదంతా అబద్దమా వాఆఆఆఆ :( :(

jokes apart, wish you a greAAAAAt time ahead appu. మిగతా పొగడ్తలు మర్చిపోయాను, గుర్తుతెచ్చుకొని వాయిదాల్లో చెప్పేస్తా :)

kiran said...

వహ్వా...అప్పు...ఏమన్నా రాసావా.......!!!! :))))
నీ ఓపిక కి న జోహారులు...
నీ జ్ఞాపకశక్తి కి నా జేజేలు..:)...........ఎంత బాగుందో...మన దోస్తుల గురించి నువ్వు రాసిన మాటలు..
నన్ను ఇంక ఎవరు ఇలా పొగడరేమో.....థాంక్స్ అప్పు డియర్ :)

మధురవాణి said...

So sweeeeeet of you Appu....నా బ్లాగు పేపర్లో వచ్చిన తేదీ నాకే గుర్తు లేదు.. నువ్వు భలే గుర్తుంచుకున్నావ్.. :)

అవును.. ఇప్పుడైతే నిన్ను తలచుకోగానే ముందు మన ఊరే గుర్తొస్తుంది.. తర్వాతే మిగతావన్నీ.. :)))

అలాగే నేస్తం గారు చెప్పినదానికి నేనూ జై అంటున్నా.. :)))

మనసు పలికే said...

చాలా చాలా థ్యాంక్స్ సౌమ్య గారూ :)) అమ్మో, మిమ్మల్నెలా మర్చిపోతాను?? అసలు అలా ఎలా అనేసుకున్నారు..?? ఆయ్..;)

రాజేష్ గారు, ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి:) ఇంకా చాలా చాలా మంచి బ్లాగులు ఉన్నాయి. నాకు నచ్చిన బ్లాగులన్నీ కవర్ చెయ్యడానికి ట్రై చేస్తాను.

నేస్తం అక్కయ్యా... ఇంక ఈరోజు నాకు భోజనం అవసరం లేదు. నాకు మళ్లీ మొదటి రోజులు గుర్తొస్తున్నాయి, మీ బ్లాగులో సెంచరీ పూర్తి చేసిన రోజులు. "చాలా టాలెంట్ ఉందిరా అప్పూ నీలో" ఆహా ఓహో.. నేను గెంతుతున్నానిక్కడ అక్కయ్యా.. థ్యాంక్ యూ సోఓఓఓఓఓఓఓఓ మచ్ :)))

మనసు పలికే said...

గురూ గారూ.. (శంకరాభరణం లో కోపంగా "శారదా" అన్న పిలుపు గుర్తు తెచ్చుకోండి :P) మీ గురించి తప్పదురా బాబూ అని చెప్పడమా.. ఇంతేనా మీరు మీ శిష్యురాలిని అర్థం చేసుకున్? ఐ హర్ట్ ;);) ఏమైనా సరే మీ వ్యాఖ్యకి మాత్రం ధన్యవాదాలు:))


కొత్త పాళీ గారు, ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:). ఏం చేస్తాం అండీ, అంత కష్టపడినా అనుకున్న కార్యం నెరవేరలేదు కదా మరి.


హరే, నీ పొగడ్తలకి నేను ఫుల్ ఖుష్ ఇక్కడ :)) కానీ అదంతా నిజమే అంటావా? (కాదన్నావో నీ గురించి రాసిన నాలుగు ముక్కలు తీసేస్తా :D:D). బోలెడు బోలెడు ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి :))

మనసు పలికే said...

శంకర్ గారూ.. అంతే అంతే.. అప్పుడే ధర్నాలు గట్రా పెట్టుకోకండి :)) ఆప్కే నంబర్ భీ ఆయేగా..;)

నాగార్జున, అడిగారా మరి మధురని? ఏమన్నారు? మాకు ఎప్పుడు చెబుతారు???;) అయ్యయ్యో నాగార్జున, కొత్త పాళీ గారి మాటలు పట్టుకుని నేను అబద్ధం చెప్పా అనుకోకు. నిజంగా అవన్నీ నా మనసులోని మాటలు:)) బోలెడు ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి, విషెస్ కి:))


కిరణు, ఎంత మంచి దానివి.. చూశావా నీకు తెలియకుండానే నువ్వు కూడా నన్ను పొగిడేస్తున్నావ్..;) నన్ను కూడా ఎవరూ ఇలా పొగడరేమో:)) ధన్యోస్మి..

మనసు పలికే said...

మధుర, మరి నాకు బ్లాగుల గురించి బాగా తెలిసినది నీ బ్లాగ్ వలనే కదా. అది కూడా ఆరోజు పేపర్ లో చూసిన తరువాతే :)) ఎలా మర్చిపోగలను.. నీ వ్యాఖ్య నాకు బోలెడంత ఆనందాన్ని తెచ్చి పెట్టింది. మన ఊరికి ఎప్పుడెళ్లిపోదాం మధురా...

జ్యోతిర్మయి said...

మీ ఈ టపాలో చాలా మంచి బ్లాగులను, టపాలను పరిచయం చేశారు. ధన్యవాదములు...

The Chanakya said...

బాగా రాశారండి. కానీ చదవడానికి చాలా ఓపిక కావాలి. అందుకే సగం చదివాను. మిగతా సగం మళ్లీ వచ్చి చదూతానేం. ఏం అనుకోకండి. :p

మనసు పలికే said...

జ్యోతిర్మయి గారు, ఇంకా చాలా ఉన్నాయండి. వచ్చే టపాలో మరిన్ని మంచి బ్లాగుల గురించి రాయబోతున్నాను. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి :)


చాణక్య గారు, ఏంటీ.. చదవడానికే ఓపిక కావాలా????? ;) ఇది దారుణం. సరేలే ఏం చేస్తాం, మిగిలిన సగం కూడా త్వరగా చదవండి :)) ధన్యవాదాలు వ్యాఖ్యకి..

మురళి said...

వావ్.. భలేగా రాశారండీ..!!
మీ టపాల్లో నా మొదటి ఓటు 'పరవళ్ళు తొక్కే గోదావరి' కే!!!

వేణూరాం said...

భలే రాశారు మనసుపలికే గారూ.. చాలా ఆలస్యం గా చూశాను మీ టపా. మధ్యలో నా పేరు చూసుకొనీ చల్లారిపోయిన చపాతీ లాగ ఉండే నా మొహం అప్పుడే వేయించిన పూరీలాగా పొంగిపోయిందీ. థాంకులు..థాంకులు.

మీరు ఇంకా గొప్ప గొప్ప పోస్ట్లు రాసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.

బ్లాగు ముఖం గా మీకొక విజ్ఞప్తి. మీరిలా తోట రాముడి పేరూ, నా పేరూ పక్క పక్కన పెట్టి రాస్తే జనాలు నన్ను ఎగరేసి ఎగిరి తన్నే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి గావునా, రేప్పొద్దున్న నాకెవరైనా డొక్కలో కిక్కిచ్చేస్తే తదుపరి పరిణామాలకి మీరే బాధ్యత వహించాలి. ;) ;) ;)

మంచు said...

:-)))) నీకు భలే గుర్తున్నాయ్ అన్నీ :-))) నేస్తం గారు, మధుర గార్ల చెప్పింది ఒప్పుకొవడానికి ఎప్పుడూ మనసొప్పుకొకపొయినా... ఈసారి ఒప్పుకొవాలనిపిస్తుంది :-)
చాలా బాగా రాసావ్ :-) నా గురించి అయితే ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ రాసేసావ్ .. తప్పు అలా రాయకూడదు. :-)

థాంక్యూ.. థాంక్యూ :-))))

శివరంజని said...

అప్పు ఇంతకీ అందరి గురించి రాసావు కదా మరి నీ గురించి నేను రాస్తానేం

మొదట నేను చదివిన పోస్ట్ బ్యూటి పార్లర్ గురించి రాసిన పోస్ట్............
హాస్యం , కవితలు , బొమ్మలు , కధలు ,ఫోటోగ్రఫీ ఇందు గలడందు లేడని సందేహం వలదు అన్న చందానా రాసే మా అప్పు డార్లింగ్ తన పోస్ట్ లతో బాటు తను కూడా నాకు బాగా ఫ్రెండ్ అయిపొయింది .......

తన మాటలతో నాకు బూస్టింగ్ ఇచ్చేటప్పుడు నా తల తన భుజం మీద వాల్చి వినాలి అనిపిస్తుంది.........................
పోట్లాడేటప్పుడు రాయిచ్చుకుని కొట్టి వ్వేవ్వే అని వెక్కిరించాలి అనిపిస్తుంది.....................
ఇప్పుడు ఈ పోస్ట్ లో నాగురించి రాసిన లైన్స్ చదివాకా

అర్జెంట్ గా హైదరాబాద్ వచ్చి ఎత్తి గిర గిరా స్పీడ్ గా తిప్పేసి అంతే స్పీడ్ గా కింద పడెయ్యాలి అనిపిస్తుంది :P ........

మై స్వీట్ ఫ్రెండ్ నువ్వు ఏది రాసినా సూపర్ గా ఉంటుంది .......

ఇందు said...

Appu darling Thankyou somuch :) Nuvvu okkadanive boledu manchidanivi. andaru nannu gurtuku techukuni dayyam annaaru Appu :( Nuvve Vennela lanti challani ammayi annav :) entha sweetoo kadaaa nuvvu! :) Thankyou once again my dear! Nuvvante naku anthe ishtam :) especially nee kavitwam andulo nuvvu use chese manchi words...I really love it :)

మనసు పలికే said...

మురళి గారు, ధన్యోస్మి :))

వేణూరాం.. చల్లారిపోయిన చపాతీ ఆ???? హహ్హహహ్హహ్.. ఇంతకీ తోటరాముడి గారి పేరు పక్కన మీ పేరు ఉంచినందుకు ఎవరైనా ఏమైనా అన్నారా??? తదుపరి పరిణామాలను వివరింపుడీ..;)
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు..

మంచు గారూ.. మీకు ఏమీ అనిపించడం లేదా?? మీరు నాతో కూడా ఎప్పుడూ ఏకీభవించరు ;) మీరు నన్ను ఇలా పొగడడం కూడా కొత్తే.. ధన్యోస్మి..

మనసు పలికే said...

రంజనీ.. నాకోసం ఇంత పెద్ద వ్యాఖ్య రాశావా??? ఎంత మంచిదావిని :)) నీకు బోలెడు థ్యాంకులు.. ఇంక ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు నీ వ్యాఖ్యకి. నీకు బోలెడు చాకొలేట్స్ పంపిస్తాను సరేనా..:))

హహ్హహ్హ ఇందు.. అంటే నేను మీ దయ్యాల డిస్కషన్ లో అసలు పాలు పెరుగు పంచుకోలేదు కదా.. అందుకే నాకు నీ పేరు తలుచుకోగానే నువ్వు రాసిన మంచి కథ గుర్తొస్తూ ఉంటుంది. నీ వ్యాఖ్యకి బోలెడు ధన్యవాదాలు:)))

రవి said...

అపర్ణగారు, మీరు పుస్తకాల సంతలో కలిశారు కదా. అప్పుడు మీరు మీ బ్లాగు గురించి చెప్పినప్పుడు చదివినట్టు అనిపించింది కానీ సరిగ్గా గుర్తుకు రాలేదు. మీరు బ్లాగులో వేసిన బొమ్మలు భలే ఉన్నాయి. (బొమ్మలేసే వాళ్ళంటే నాకు కొంచెం కుళ్ళు లాంటిదేదో కూడా ఉంది.)

మనసు పలికే said...

రవి గారూ..
ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:) మీరు నా బ్లాగుని ఇంతకు ముందు చూసే అవకాశం తక్కువేలే, ఎందుకంటే నేను కూడా ఎప్పుడూ వ్యాఖ్య పెట్టలేదు. కానీ అన్నీ చదివేదాన్ని, ఎంత బాగా రాశారు అనుకునేదాన్ని:))