Friday, July 16, 2010

ఐటి లో పంటపొలాలు..

ఈ రోజు మా కార్యాలయం లో జరిగిన ఒక చిన్న సంభాషన తరువాత నాకు వచ్చిన ఒక చిలిపి ఆలోచనని ఇలా ఒక టపాగా రాస్తే బాగుండు అనిపించి మీ ముందుంచుతున్నాను.ఇది ఎవరినీ ఉద్ధేశించి రాసింది కాదు. సరదాగా నవ్వుకోడానికి మాత్రమే ఈ కల్పిత కథనం. ఎవరినైనా కించపరిచినట్లు అనిపిస్తే క్షంతవ్యురాలిని.
ఐటి లో పంటపొలాలు, ఒక్క సారి ఊహించుకోండి.. ప్రతి క్యాబిన్ లో కంప్యూటర్, కీబోర్డ్ ఇంకా ఒక దూరవాణి పరికరం( టెలిఫోన్:) ) కాకుండా.. మట్టి, అందులో మొక్కలు వాటికి పూతలు మరియు కాయలు. చాలా బాగుంది కదూ..!!అంతా పచ్చ పచ్చగా.. చల్లగా. కానీ అంతా ఇలా సవ్యంగా, అందంగా సాగితే అది జీవితం అవదు కదండీ... మధ్యలో డెలివరీ మేనేజరు/ప్రాజెక్ట్ మేనేజరు అనబడు ఇంటి పెద్ద ఉంటాడు కదా.. పోయిన సంవత్సరం ఎన్ని బస్తాలు వడ్లు పండించావ్.. ఈ సంవత్సరం లక్ష్యం ఎన్ని బస్తాలు పండించాలని (గోల్స్ & ఆబ్జెక్టివ్స్).. పోయిన సంవత్సరం పట్టిన పురుగు ఈ సంవత్సరం పట్టకుండా, ఒకవేళ పట్టినా దాని సమూల నిర్మూలనకు తగు ప్రణాళిక సిద్ధం గా ఉందా.. ఆ ప్రణాళిక అందరి ఆమోదం పొందిందా.. ఇలా గత సంవత్సరపు దిగుబడి కి గాను అన్ని రకాల అక్షింతలు వేయించుకుని, కొత్త సంవత్సరపు కొత్త వ్యవసాయానికి వీర నారుల్లా/నారీమణుల్లా ముందుకు సాగుతామా..
అప్పుడు మొదలవుతాయి అసలైన కష్టాలు. అసలే సొంత పొలం కాదాయె (అదేనండీ క్లైంట్ ప్రసాదించిన ప్రాజెక్ట్ కదా). తెచ్చిన విత్తులు(రిక్వైర్మెంట్స్) అర క్యాబిన్ కైతే సాగు చెయ్యాల్సింది ఒక క్యాబిన్. ఎదో ఒక విధంగా కష్టపడి విత్తు నాటడం అన్న బృహత్కార్యాన్ని (మరి అర క్యాబిన్ విత్తులతో క్యాబిన్ కి సరిపడా నాటడం అంటే మాటలా.?) పూర్తి చేస్తాం. మన బాధను అర్థం చేస్కున్నట్లుగా ఆ విత్తులు కాస్తా మొక్కలయ్యి సిద్ధం గా ఉంటాయి. ఇక ఇప్పుడు ఆ మొక్కలను నాటాలి (వేరు వేరు మాడ్యూల్స్ ని కలిపి ఒక అప్లికేషన్ పూర్తి చెయ్యడం అన్నమాట). ఆ కార్యక్రమం కాస్తా పూర్తయ్యాక ప్రశాంతం గా కూర్చుందాం అవి పెరిగి పెద్దయ్యేదాకా అనుకుంటే పొరపాటే.. మధ్య మధ్యలో పురుగులు పడుతూ ఉంటాయి (టెస్టింగ్ లో బగ్గులు వస్తూ ఉంటాయి). వాటికి మందులు కొడుతూ మధ్య మధ్య లో అక్షింతలు వేయించుకుంటూ.. 'పోయిన సారి వచ్చిన పురుగు ని అప్పుడే "సమూల" నాశనం చేయకుండా ఎందుకు రెండో సారి వచ్చే దాకా ఎదురు చూస్తూ ఉన్నావ్..' లాంటివన్నమాట. ఆ విధంగా ఎన్నో రకాల కష్టాలని ఓర్చుకుని పట్టిన పురుగుని "చంపినట్లు చేసి" సంతోషం గా ఉండే సమయం లో.. "లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గుర్తొస్తుంది. పుట్టిన పురుగు చావదు. కేవలం ఒక రూపం నుండి ఇంకో రూపం లోకి మారుతుంది." ఇక అప్పుడు మొదలవుతుంది, మూల కారణాన్వేషణ(రూట్ కాజ్ అనాలసిస్).. అసలు ఆ పురుగు ఎందుకు పట్టింది..? ఎక్కడి నుండి వచ్చింది..? ఎందుకు మరో రూపం లో వచ్చింది..? ఇలా కొన్ని "సులువైన ప్రశ్న"లకి "అతి వేగంగా" సమాధానాలు దొరికాక, వాటి శాశ్వత పరిష్కారానికై మార్గాల వెతుకులాట ప్రారంభమవుతుంది. శాశ్వత పరిష్కారం సంగతి పక్కన పెడితే, ఈ లోపు పట్టిన పురుగు కాస్తా చేనంతా మేసేస్తూ ఉంటుంది. అప్పటి వరకూ నిద్ర పోతున్న మిగిలిన కుటుంబ సభ్యులు(రకరకాల మేనేజర్లు) అంతా మేల్కొని కథ మళ్లీ మొదటి నుండి చెప్పమంటారు.ఇక మళ్లీ ప్రశ్నల వర్షం మొదలవుతుంది. ఇక్కడ ప్రశ్నలకి సమధానాలు చెప్పాలో, అక్కడ చేనుకి పట్టిన పురుగు సంగతి చూడాలో అర్థం కాని అమాయక చక్రవర్తులం అటు అదీ సరిగ్గా చెయ్యలేక, ఇటు ఇదీ సరిగ్గా చెయ్యలేక రెండు విధాలా నష్టపోతాము.ఇవన్నీ కాక, మధ్య మధ్య లో ఎన్ని విత్తులు మొక్కలు అయ్యాయి, ఒక్కో మొక్కకి ఎన్ని ఆకులు వచ్చాయి, ఎన్ని మొక్కలకి పురుగులు పట్టాయి, ఎన్ని పురుగులు నిర్మూలించబడ్డాయి, ఎన్ని బ్రతికి పోయాయి అన్న వాటి మీద రోజు వారీ, వారాంతపు, నెలాంతపు ప్రగతి పత్రాలు.. ఏ రోజు వ్యవసాయం గురించి ఆలోచన మొదలు పెట్టాలి అని ఆలోచించిన క్షణం నుంచి విత్తులు మొక్కలయ్యి, మొక్కలు వరి కంకులయ్యి, కంకులు వరి గింజలయ్యి అవి బియ్యం గా రూపు దిద్దుకుని అవి అన్నం గా మారి, ఎవరో ఒకరి ఆకలి తీర్చేంత వరకూ జరిగిన ప్రతి రూపాంతరాన్ని పొందిగ్గా భద్రపరచాలి(డాక్యుమెంటేషన్)..
ఇదంతా జరిగే లోపే, పంట చేతికొచ్చే సమయం అయిపోతుంది. ఎప్పటి లాగానే రావాల్సిన దానికన్నా పది బస్తాలు తక్కువ పండించి అక్షింతలు వేయించుకోడానికి సిద్ధంగా ఉంటాం. మళ్లీ వచ్చే సంవత్సరానికైనా ఎక్కువ బస్తాలు పండించాలి అన్న లక్ష్యాలు మళ్లీ మొదలవుతూ ఉంటాయి. అది జరగదు అన్న విషయం మాత్రం అందరికీ ఆపాటికే అర్థం అయిపోయే ఉంటుంది.
ఇదండీ ఐటి లో పంటపొలాల కథా కమామీషు.. ఎలా ఉందంటారు..? తప్పకుండా మీ సలహాలని అందిస్తారు కదూ..

మీ అపర్ణ..

15 comments:

మధురవాణి said...

:) :) :)

అప్పు said...

ఏమిటండీ మధురవాణి గారూ..!! సీనియర్ బ్లాగిణి గా నాకు ఏదో సలహా ఇస్తారేమో అనుకుంటే అలా నవ్వేసి ఊరుకుంటారేంటండీ.? I demand an explanation here.. :):)

సవ్వడి said...

బాగుంది...
సలహాలు గురించి నన్ను అడగొద్దు.
ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నావా.. తెలుగు మీడియం లో చదువుకున్నావా..
గుడ్!

మనసు పలికే said...

@సవ్వడి : 10వ తరగతి వరకూ తెలుగు మీడియం, తరువాత ఇంగ్లీష్ మీడియం. మీ ప్రశ్న యొక్క అంతరార్థమేమిటో తెలుసుకోవచ్చునా.. :)
నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు. :):)

సవ్వడి said...

telugulo cadivinavaalle inta baagaa raayagalaru. anthe!

మనసు పలికే said...

@సవ్వడి : ఓ.. అలా అంటారా..!! అది నేనైతే ఒప్పుకోలేను.. ఎందుకంటే దేనికైనా 'చెయ్యాలి , నేర్చుకోవాలి ' అన్న ఉత్సుకత ముఖ్యం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే..:)
కానీ మీ ప్రోత్సాహానికి నా ధన్యవాదాలు. :)

Ramakrishna Reddy Kotla said...

బాగుంది :))

మనసు పలికే said...

ధన్యవాదాలు కృష్ణ గారూ..:)

Pranav Ainavolu said...

హాహాహాహా...
మీ interpretation కెవ్వు కేక.
నాక్కూడా అప్పుడప్పుడు (office లో bore కొట్టినప్పుడన్నమాట) ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి :)


"ప్రశ్నలకి సమధానాలు చెప్పాలో, అక్కడ చేనుకి పట్టిన పురుగు సంగతి చూడాలో అర్థం కాని అమాయక చక్రవర్తులం అటు అదీ సరిగ్గా చెయ్యలేక, ఇటు ఇదీ సరిగ్గా చెయ్యలేక రెండు విధాలా నష్టపోతాము"
నిజమేనండీ... పోనీ వచ్చిన error ఎలాగూ వచ్చి చచ్చింది కదా. దాన్ని solve చేశాక మాట్లాడుకోవచ్చుకదా. ఊహూ... అలాక్కాదు.. దాని గురించి ఒక్కొక్కడు mails పంపడం, ఫోన్లు చేయడం ఎందుకు? (software అన్నాక errors కాక ఎమోస్తాయో మరి!) అసలే ఇచ్చే టైమ్ తక్కువ అందులో వీళ్ళకు సమాధానం చెప్పలా లేక issue solve చేయాలో అర్ధమవ్వదు.

మొత్తానికి పోస్ట్ సూపరు!

మనసు పలికే said...

ధన్యవాదాలు ప్రణవ్ గారు. ఇప్పుడే మీ ప్రణవనాదం చూశాను. :) చాలా బాగున్నాయి మీ ఆలోచనలు, ఆలోచింపజేసేలా ఉన్నాయి. కొద్దిగా నిరాశ చెందాను, ఏప్రిల్ తరువాత ఏ నెలా కనిపించలేదు మీ బ్లాగులో..:(

మీరు చెప్పింది నిజమండీ.. కొంచెం టైం ఇచ్చి మనల్ని చెయ్యమనరు. ఒకళ్ల తరువాత ఒకళ్లు కాల్స్ చేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వదులుతారు.:(

Sai Praveen said...

హహ. సూపర్.
సవ్వడి గారి లాగే నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. మీ తెలుగు చాలా బాగుంది.

మనసు పలికే said...

ధన్యవాదాలు సాయి ప్రవీణ్ గారు.. :)

Arun Kumar said...

బాగుంది...
మీ తెలుగు చాలా బాగుంది.

Anonymous said...

పోస్ట్ చాల బాగుంది ..రెండిటిని కంపరే చేసి బాగా రాసారు .... ఈ thought వచ్చినందుకే మిమ్మల్ని పోగాడొచ్చు :)

మనసు పలికే said...

అరుణ్ కుమార్ గారు,
ధన్యవాదాలు:)

CS గారు,
హహ్హహ్హా.. చాలా చాలా థ్యాంక్స్ అండీ:)