Monday, July 26, 2010

గణితంలో పదనిసలు..

అవి క్రీ.పూ.2 వ సంవత్సరపు రోజులు.. అంటే నేను 2వ తరగతి చదివే రోజులు అన్నమాట. మరేమో అప్పుడు నేను మా చిన్న పల్లెటూరిలో ఉన్న ఒక చిన్న బడికి వెళ్లేదాన్ని. మా చుట్టుపక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకి అదే పాఠశాల. మానాన్న గారేమో ఆ నాలుగైదు గ్రామాలకి ఉన్న ఒకే ఒక తపలా కార్యాలయానికి(పోస్ట్ ఆఫీసు) తల అన్నమాట (అదేనండీ హెడ్). అంతే కాక మా పాఠశాల విద్యా కమిటీ కి అధ్యక్షులు కూడానూ.. అంచేత, మనం స్కూల్ లో ఎన్ని అల్లరి చిల్లరిపనులు చేసినా, ఎన్ని కోతి వేషాలు వేసినా ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. ఇంకో విషయం ఏంటంటే ఎంత అల్లరి చేసినాచదువులో మాత్రం ఎప్పుడూ ముందు ఉండేదాన్ని. అంచేత ఉపాధ్యాయులకి నేనంటే భలే ఇష్టం. మా నాన్నగారు స్కూల్ కి వచ్చినప్పుడల్లా, ఉపాధ్యాయులంతా నా గురించి గొప్పగా చెప్తుంటే, నేను భలే ఆనంద పడిపోయే దాన్ని. మా నాన్నారేమో గర్వ పడిపోయేవారు. ఆగస్ట్ 15, జనవరి 26 వచ్చాయంటే పండగే. స్కూల్ లో, ఆసుపత్రి లో (మనుషుల ఆసుపత్రి & పశువుల ఆసుపత్రి రెండిటిలోనూ..) ఇంకా బ్యాంక్ లో జెండావందనం జరిపించేవారు. నాకు ఎంత ఇష్టం అంటే జెండావందనం అంటే, రోజూ మా అమ్మని ఎంతో విసిగించి కానీ లేవని నేను, ఆ రోజు నేనే లేచి, నా అంతట నేనేతయారయ్యి, ఎవరూ రాక ముందే స్కూల్ కి వెళ్లి పోయేదాన్ని. ముందు రోజు రాత్రి వరకూ ఉండి ముగించిన రంగుకాయితాల అలంకరణకి తుది మెరుగులు దిద్ది, స్నేహితుల తో జాతీయ గీతం మరియు గేయం కూడా పాడటానికి సిద్ధమయ్యేదాన్ని. అలా చాలా ఆనందం గా గడిచిపోయేవి రోజులు. కానీ కాలానికి ఏదైనా అందాన్ని/ఆనందాన్ని చూస్తేకన్ను కుట్టకుండా మానదు కదండీ.. నాకు మాత్రం ఆ కుట్టడం ఏదో ఎక్కాల(టేబుల్స్) రూపం లో వచ్చింది.. అన్నీ బాగాచదివే నేను, ఆ ఎక్కాల విషయానికొస్తే మాత్రం, గోడ కుర్చీ వెయ్యకుండా ఇంటికి వెళ్లేదాన్ని కాదు:( పోనీ ఆ మాస్టారుకైనా, పోనీలే పాపం ఎన్ని రోజులు అలా గోడ కుర్చీ వేయిస్తాం, ఈ సారికి వదిలేద్దాం లే అన్న బుద్ధి పుట్టించొచ్చుగా.. అలాజరిగే సమస్యే లేదన్నట్టుగా రోజు రోజు కీ ఆ "కుట్టడం" ఇంకాస్త ఎక్కువయ్యేది. ఏదో కష్టపడి, అలా అలా నెట్టుకొచ్చానా.. 6వ తరగతి లో వచ్చాయి, అవేవో లెక్కలు. Ax+By+C అంటాడు, 2Ax+7By+d అంటాడు, ఆ రెండిటినీ కలపమంటాడు. దాన్ని చూస్తుంటే నాకు మాత్రం లాటిన్ కి కొంచెం ఎక్కువ, ఉర్దూ కి కొంచెం తక్కువ గా కనిపించేది. అందులోనూ, మాకు అప్పుడు వచ్చిన టీచర్ ఏమో, చాలా ముసలాయన. పెద్ద పొట్ట, గుబురు మీసాలు (వీరప్పన్ కి zoo zoo పొట్ట తగిలిస్తే ఎలా ఉంటుందో అలా అనమాట.) ఎప్పుడూ ఏదో తింటూ ఉండేవాడు. నాకు భలే కోపం వచ్చేది. ఏదీ ఓపిగ్గా చెప్పేవాడు కాదు. కానీ, తప్పు రాస్తే మాత్రం చెవి మెలి తిప్పే వాడు. అప్పుడు నేనేమో నా మీద తెగ జాలి పడిపోయేదాన్ని.(మరి ఆ క్షణం లో ఏనుగు వచ్చి ఎలుక పిల్ల చెవి తిప్పుతున్నట్లుగా ఉండేది.) చెప్పొద్దూ, ఒకసారి నాకు 0 మార్కులు వచ్చాయి. ఇక చూడాలి నా కష్టాలు. ఎక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారో, ఎక్కడ సంతకం పెట్టించుకుని రమ్మంటారో అని. నిజం గా ఆముదం తాగితే ఎలా ఉంటుందో తెలీదు కానీ నాకు ఆ క్షణం ఆ ఫీలింగ్ పరిచయం అయినట్లుగా అనిపించింది. నన్ను ఇంట్లో ఎప్పుడూ తిట్టి , కొట్టి ఎరుగరు కానీ, ఆ సమయానికి నాకు అదే పెద్ద కష్టం. ఇక ఒక నెలరోజుల వరకూ అదే ఆలోచన. నిద్ర కూదా సరిగ్గా పట్టేది కాదు. కలల్లో కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేసి మీ నాన్నని తీసుకురా అని చెప్పినట్లు.. భలే భయం వేసేదిలే. తెల్లవారగానే మా అమ్మ అడిగేది "ఏంటి రాత్రంతా ఏదేదో కలవరిస్తున్నావ్ ఏమైంది" అని. ఇక ఒకటే టెన్షన్, ఎక్కడ వినేసిందో ఎక్కడ తెలిసి పోయిందో అని. :( మనసులో మాత్రం దేవుడిని ఒకటే కోరేసుకునేదాన్ని, దేవుడా దేవుడా.. (క్షణ క్షణం లో శ్రీదేవి లాగా..) ఈ ఒక్కసారికి ఏదో లాగా గట్టెంకిచ్చెయ్యవా అని. తరువాత కష్టపడిపోయి గణిత సామ్రాజ్యాని ఏలేస్తా లాంటి ప్రతిఙ్ఞ లెన్నో చేసేశాను. దేవుడు నన్ను నమ్మేశాడేమో మరి. ఆసారికి మాత్రం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వలేదు (అది జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గవర్నమెంట్ స్కూల్- సాధారణంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటి రిస్క్ లు తీస్కోరు.) కానీ పాపం దేవుడు, నా సంగతి తెలియక ఆ తర్వాత అలాంటి ప్రతిఙ్ఞలు ఎన్నిటినో నమ్మేశాడు. నేను మాత్రం నేను చేసిన ప్రతిఙ్ఞని ఎలా నిలబెట్టుకోకుండా ఉండాలి అన్న విషయం మీద గాల్లోఒక గ్రంథం రాసేశాను. మరి.. మనకి లెక్కలు తక్కువ కానీ తెలివితేటలు తక్కువ కాదుగా.. అలా అలా.. 7వ తరగతి పరీక్షలు, వాటి ఫలితాలు కూడా వచ్చేశాయి. అన్నిటిలో 90% వచ్చి, లెక్కల్ని మాత్రం అత్తెసరు మార్కులతో అధిగమించి కొంచెంలో స్కూల్ ఫస్ట్ అవకాశం పోగొట్టుకున్నాను.
అప్పుడు మొదలయ్యాయి, నా జీవితం లో స్వర్ణ యుగపు రోజులు. నేను ప్రతిఙ్ఞలు చేసేసి అవి తీర్చకుండా ఉన్నందుకు దేవుడే బాధ పడిపోయి నా ప్రతిఙ్ఞలని నేను నెరవేర్చేలా చేశాడేమో.. అందుకే కదా మరి నా లెక్కల సామ్రజ్యం లోకి నాగరాజు అనబడు మంత్రిని పంపించాడు. నేను అప్పుడు ఆ అన్నయ్య దగ్గరికి ట్యూషన్ కి వెళ్లేదాన్ని. అప్పుడు అర్థం అయింది, అసలు లెక్కలు అంటే జస్ట్ స్కెలిటన్ లోని బొక్కలు కాదని, ఆ బొక్కలకి తొడిగిన చాలా అందమైన తోలు కూడా అని. (దయచేసి ఈ పోలిక గురించి ప్రశ్నలు అడగొద్దు. సమాధానాలు నాకు కూడా తెలియదు ;) ).
అలా నా స్వర్ణ యుగంలో చాలా చాలా అనుభవించేస్తూ.. (అంటే నేను అప్పుడు లెక్కల సామ్రాజ్యంలో మకుటం లేని మహారాణిని అనమాట) స్కూల్ మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలేస్తూ 8వ తరగతి పూర్తి చేసేశాను. మరేమో, ఎప్పుడూ ఒకే రాజ్యం అయ్యేసరికి యువరాణి వారికి బోరొచ్చేసి అలా అలా దేశయాటనకై బయలుదేరి 9వ తరగతికి ఒక ప్రయివేట్ స్కూల్ లో స్థిరపడిపోయాను. అప్పుడేమో నేను హాస్టల్లో ఉండేదాన్ని. మా నాన్నగారు వచ్చినప్పుడల్లా మొదట నన్ను అడిగేప్రశ్న "ఎలా ఉన్నావమ్మా" ఆ ప్రశ్నతో నా పక్క ఉండే స్నేహితురాళ్లంతా కుక్కర్లో పెట్టిన కందిపప్పు లాగా ఉడికిపోయి నామీద అసూయ పడేవారు. మరి వాళ్ల నాన్నలంతా మొదటి బాణంగా "ఎలా చదువుతున్నావు?" అని మాత్రమే అడిగేవాళ్లు. మా నాన్న వచ్చిన ప్రతి సారీ నా చదువు గురించి అడుగుతారేమో అని చూసేవాళ్లు. కానీ మా నాన్నఎప్పుడూ అడిగేవాళ్లు కారు. మంచిగా తిను, మంచిగా నిద్రపో అని మాత్రమే చెప్పెవారు. వాళ్ల ఆశ నెరవేరక పోయేసరికి, వాళ్లే చెప్పేవాళ్లు, ఈ సారి అప్పుకే ఫస్ట్ రాంక్ అని. మా నాన్న ఒక చిరుమందహాసం ఇచ్చి ఊరుకునే వాళ్లు. నాకు భలేకోపం వచ్చేది. నేను అంత సాధిస్తే ఇలా తీసి పారేస్తారేంటి అని(ఇప్పుడు తెలుస్తుంది లెండి మా నాన్న చేసిందే మంచి అని). ఇంకా చెప్పాలంటే చాలా చాలా టాలెంట్ టెస్టుల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ పేటెంట్స్ తీసేస్కున్న దానిలా కొట్టుకొచ్చేసేదాన్ని.
లెక్కల్లో మాత్రం ఎప్పుడూ నంబరు9 మేఘం మీదే ఉండేదాన్ని. అలా అక్కడ కూడా రాణి గారి ప్రతాపం చూపించేస్తూ అక్కడి ప్రజలని గడ గడ లాడిస్తూ జెండా పాతేసి(ఎంతగా జెండా పాతానంటే, మా స్కూల్ డైరెక్టరు సర్ కూడా నన్ను "మా అమ్మాయి" అని పిలిచేవారు.) ఎట్టకేలకు 9 మరియు 10 తరగతుల్లో 99/100 మార్కులు కొట్టేసి స్కూల్ ఫస్ట్ గా నిలిచిపోయి చివరికి అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రతిభా అవార్డు కూడా తీసేస్కుని అలసిపోయి వేసవి సెలవుల్లో బాగా విశ్రాంతి తీసేస్కున్నారన్నమాట.
ఇక 10వ తరగతి లో మన ప్రావీణ్యం చూసిన అదే యాజమాన్యపు ఇంటర్ కాలేజీ వారు, నేనేదో ర్యాంకుల పంటపండించేస్తానని, బంగారు బాతునని ఫీల్ అయిపోయి నన్ను ఫ్రీగా చదివిస్తాం అదే కాలేజీలో అని నోరు జారిపోయారు. కానీ మనం దేవుడితో పెట్టుకున్న ఒప్పందం గురించి వాళ్లకేం తెలుసు.. మరి నేనేమో విధిని/దేవుడిని పట్టించుకోడం మానేశాననుకుంటా.. ఈ సారి కొంచెం ఘాట్టిగానే తన్నింది. అంటే మెల్లగా తన్నుకుంటూ మొదలు పెట్టింది ఇంటర్నుండి. మనం దాన్ని డిగ్రీ లోకి వచ్చాక కూడా లెఖ్క చెయ్యకపోయేసరికి గురి చూసి ఏమాత్రం తప్పకుండా ఘాట్టిగాతన్నిందనమాట. డిగ్రీ 2వ సంవత్సరపు ఫలితాలతో తెలిసివచ్చింది యువరాణిగారికి, తను తన్నబడిందనీ..స్ట్రయిట్ గా వచ్చి సప్లమెంటరీ బకెట్లో పడిందనీ.. అది కూడా తను ఎంతో ఎత్తుకు ఎదిగి వచ్చిన బొక్కల లెక్కల్లో అనీ.. ఇక ఏముందీ..ఏడుపే ఏడుపు..కష్టాలకి సంబంధించిన సామెతలన్నీ ఒకేసారి గుర్తుకొచ్చాయి. అంటే "కష్టాలు మనుషులకి కాక మ్రానులకి/కాకులకి వస్తాయా" "మంచి మనుషులకే కష్టాలు వస్తాయి "etc.. అప్పటికే చేతిలో ఉన్న రెండు జాబు ఆఫర్ లెటర్లు ఇంకా దుఃఖాన్ని పెంచాయి."అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు" అన్నట్లుగా ఫెయిల్ అయినందుకు కాదు, రెండు జాబులు పెట్టుకుని కూడా ఫెయిల్ అయితే నా పరువు ఏ గోదావరి/గంగలో దూకి సూసైడ్ చేస్కుంటుందో అని నా బాధ. అప్పుడు మళ్లీ దేవుడు గుర్తొచ్చాడు. ఈసారి ఇంకా ఘాట్టిగా మొక్కేస్కున్నాను. 108 ప్రదక్షిణలు చేసేస్తానని. ఇంకా ఏమేమో ఏమేమో చేసేస్తానని. ఈసారి దేవుడు నమ్మడు అని ఫిక్స్ అయిపోయాను. కానీ చిత్రం, దేవుడు నమ్మేశాడు.. నన్ను మళ్లీ గట్టెక్కించేశాడు. ఎంతైనా దేవుడు దేవుడే కదా.. అలా గట్టెక్కేసిన తరువాత, మొత్తానికి డిగ్రీ ముగించాను అనిపించి ఉద్యోగంలో జాయినయిపోయి ఇలా కాలాన్ని వెళ్లదీస్తున్నానన్నమాట. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తూ ఉంటుంది. నా లెక్కల గ్రాఫు మాత్రం నాకు ఒక కార్డియోగ్రాఫుని తలపిస్తూ ఉంటుంది. :)

8 comments:

హరే కృష్ణ said...

ha ha
good one!

మనసు పలికే said...

ధన్యవాదాలు కృష్ణ గారూ!!

..nagarjuna.. said...

>> గాల్లోఒక గ్రంథం రాసేశాను
>>బొక్కలకి తొడిగిన చాలా అందమైన తోలు కూడా అని
>>కానీ చిత్రం, దేవుడు నమ్మేశాడు..

హహ్హహ్హహ్హహ..... (ఇదికూడా నాకు పేటెంట్ )

మనసు పలికే said...

నాగార్జున.. ఓపిగ్గా టపాలన్నీ చదువుతున్నందుకు ధన్యవాదాలు.:)
>>హహ్హహ్హహ్హహ..... (ఇదికూడా నాకు పేటెంట్ )
అవునా.. హిహ్హిహ్హి.. అయితే మనిద్దరం ఒకే గూటికి చెందిన పక్షులమేమో..

Anonymous said...

gud job

మనసు పలికే said...

ధన్యవాదాలు Ram గారు..:)

గిరీష్ said...

Actually maths is an excellent subject for me..intikocchaka nenu chese first home work maths and last english :)..nenu kooda o tapaa raaddam anukuntunna deenimeeda..nenu 7th class lo mathrame school first, 10th lo miss..nice one

Arun Kumar said...

baga rasarandi