Friday, December 31, 2010

కత్తి మీద సాము

"అయ్యోలూ..అమ్మోలూ.. ఇంతేనా బ్రతుకు హో హో హో." మీకందరికీ జెమిని టి.వి. లో వచ్చే అమృతం సీరియల్ కోసం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట తెలిసే ఉంటుంది. కారణం తెలియదు కానీ, ఈ పాట వినగానే అప్రయత్నంగా నాకు ఈ కింద కథ గుర్తొస్తుంది. ఆ పాట విన్నా/ సీరియల్ చూసినా ఎంత నవ్వొస్తుందో, ఈ కథ గుర్తొచ్చినప్పుడల్లా అంత ఉద్వేగం ఆవహిస్తుంది. మనకున్నవే కష్టాలు అనుకోవద్దు అన్న సందేశం ఈ కథలో ఉండడం కారణమేమో కానీ, ఈ పాట గురించిన ఆలోచన వచ్చినప్పుడల్లా రెండు విరుద్ధమైన భావాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాను. అందుకే సిరివెన్నెల బ్లాగులో హాస్యపూరితమైన వ్యాఖ్యానం, ఇక్కడ ఉద్వేగభరితమైన కథనం.

శతాబ్ధి రైలుబండిలో ఒక భోగీలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ.

వివేక్, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో. విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించవలసిన వ్యక్తి ఇలా ట్రెయిన్‌లో ప్రయాణించడం చాలా చిరాకు కలిగించే విషయంగా ఆఫీసు అడ్మిన్‌తో మాట్లాడినా లాభం లేకపోయింది. కనీసం, ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుందామని తన ల్యాప్‌టాప్ తీసి ఏదో పని చేసుకుంటూండగా "మీరు సాఫ్ట్‌వేర్‌లో పని చేస్తారా అండీ" అని పలకరించిందో స్వరం తన పక్కనుండి. కనీసం చూపైనా అటువైపు విసరకుండా "అవును" అని సమాధానమిచ్చి తన పనిలో లీనమై ఉండగా మళ్లీ అదే స్వరం "మన దేశాన్ని మీరెంతో అభివృద్ధి పరుస్తున్నారు. ఈరోజుల్లో మొత్తం కంప్యూటర్ మయం అయిపోయింది. అదంతా మీలాంటి వారి వల్ల జరిగిన అభివృద్ధే" అంటూ మెచ్చుకోలుగా చూశాడు ఆ వ్యక్తి.
"థ్యాంక్స్" అంటూ తన దృష్టిని ఆ వ్యక్తి వైపు సారించాడు సాధారణంగా పొగడ్తని కాదనలేని వివేక్. చక్కని వ్యాయామంతో దృఢమైన శరీరం గల యువకుడు అతను. చాలా సాధారణంగా ఉన్నాడు. ఒక చిన్న టౌన్ నుండి వచ్చినవాడిలా కనిపించాడు. రైల్వే క్రీడాకారుడు అయ్యుండొచ్చు అనుకున్నాడు వివేక్. సాధారణంగా వాళ్లే తమకు ఉచితంగా వచ్చిన రైల్వే పాసుని ప్రయాణాలకు ఎక్కువగా వినియోగించుకుంటారని అతని నమ్మకం.

"మీరు నాకెప్పుడూ అద్భుతంగా కనిపిస్తారు. మీ ఏ.సి. గదిలో కూర్చుని ఆ కంప్యూటర్‌లో ఏదో రాస్తారు. బయట అది ఎన్నో చేస్తుంది" అన్నాడు. ఒక నిరాసక్తమైన నవ్వు బదులిచ్చి మొదలు పెట్టాడు వివేక్ "అది నువ్వనుకున్నంత సులభమైనది కాదు ఫ్రెండ్. ఏదో రెండు లైన్లు రాయడం కాదు. దాని వెనుక చాలా పెద్ద కథ ఉంటుంది" ఇంకా ఏదో చెప్పబోయి ఎందుకులే అనుకుని " అది చాలా కష్టమైన పని.. చాలా కష్టం" అని ఊరుకున్నాడు వివేక్. నిజానికి అతని మనః స్థితికి తనకుండే కష్టాలన్నీ గట్టిగా అరిచి చెప్పుకోవాలనిపించింది.
"మీకు జీతభత్యాలు అంత ఎక్కువగా ఇస్తారంటే ఆశ్చర్యం ఏమీ లేదు. మరి ఇంత కష్ట పడతారు కదా" 
ఇక ఆపుకోలేని కోపాన్ని ఆ వ్యక్తిపై ప్రదర్శించాడు వివేక్. "అందరూ ఇచ్చే డబ్బుల్నే చూస్తారు. మా కష్టాలు ఎవరికి తెలుసు? ముఖ్యంగా ఇండియన్స్‌కే ఇటువంటి 'నారో'మైండ్ ఉంటుంది. ఏ.సి. గదుల్లో కూర్చున్నంత మాత్రాన మాకు చెమట పట్టదు అనుకోవద్దు. మీరు శరీరానికి వ్యాయామం ఇస్తే మేము మెదడుకి ఇస్తాం అంతే తేడా. నిజం చెప్పాలంటే ఏ విషయంలోనూ మీకన్నా తక్కువ ఉండదు ఈ పని. ఇంకా ఎక్కువే" తన కోపాన్ని విసుగుని భరించగలిగే వ్యక్తి దొరికాడనిపించింది వివేక్‌కి. ఏమాత్రం సంకోచించకుండా తన ఉక్రోషాన్నంతా వెళ్లగక్కాడు.
"నీకొక ఉదాహరణ ఇస్తా. మన రైల్వే రిజర్వేషన్ సిస్టం చూడు. ఎవరైనా, ఏ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణానికైనా, దేశంలో ఎక్కడి నుండైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఎంత కష్టంతో నిర్మించబడిన సిస్టమో చూడు. నువ్వు అర్థం చేసుకోగలవా ఇందులో ఉన్న కష్టం..?"
ఆ యువకుడు మాత్రం ఒక ప్లానెటోరియం దగ్గర చిన్న కుర్రాడిలా వింటూ ఉన్నాడు చాలా ఆశ్చర్యంతో. ఇదంతా అతని ఊహకి అందని విషయం. 
కాసేపటికి తేరుకుని " మీరు అటువంటి సిస్టంని డిజైన్ చేసి కోడ్ చేస్తారా?" అడిగాడు.
"ఒకప్పుడు చేసేవాడిని. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ మేనేజర్‌ని"
"ఓహ్.. అంటే ఇప్పుడు కొంచెం మీ పని సులువు అయ్యుండొచ్చు కదా"

తగ్గిందనుకున్న కోపం మళ్లీ పైకెక్కింది వివేక్‌కి "ఎవరి జీవితమైనా పైకెదుగుతుంటే పనులు తగ్గుతాయా.? ఎదుగుదల కొత్త బాధ్యతల్ని తెస్తుంది. ఇప్పుడు నేను కోడ్ చెయ్యను అంటే పని చెయ్యను అని కాదు. పని చేయించాలి. అది ఇంకా కష్టమైన పని. ఇంకా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఒక వైపు ఎప్పటికప్పుడు రెక్వైర్మెంట్లు మార్చేసే 'క్లైంట్', ఇంకోవైపు ఇంకేదో కోరుకునే 'యూజర్' మరో వైపు పనంతా నిన్నే అయిపోవాలి కదా అని ప్రశ్నించే నా పై'మేనేజర్'. ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా?

కొద్ది సేపు ఆగాడు వివేక్. చివరికి "నీకు తెలియదు, కత్తి మీద సాము ఎలా ఉంటుందో" ముగించి ఆ యువకుడి వైపు చూసాడు.
తన సీట్ వెనక్కు ఆనుకుని కళ్లు మూసుకుని ఉన్నాడు, ఏదో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లుగా..
"నాకు తెలుసు సర్.. నాకు తెలుసు. కత్తి మీద సాము ఎలా ఉంటుందో." ఐహిక వస్తువేమీ అతనికి కనిపించడం లేదిప్పుడు. కళ్లు మూసుకుని శూన్యంలోకి చూస్తూ చెబుతున్నాడు.
"మేము మొత్తం 30, మా కెప్టెన్ 4875 శిఖరాన్ని రాత్రికి కవర్ చెయ్యాలని మమ్మల్ని ఆర్డర్ చేసినప్పుడు. శతృవు శిఖరపుటంచుల నుండి కాల్పులు జరిపిస్తున్నాడు. ఎవ్వరికీ తెలియదు, తరువాత బుల్లెట్ ఎక్కడి నుండి వస్తుందో, ముఖ్యంగా ఎవరికి తగులుతుందో. ఉదయాన్నే శిఖరాన్ని అందుకుని మువ్వన్నెల ఝెండా ఎగురవేసే సమయానికి నలుగురం మిగిలాము.
"మీ..రు..?" ఆశ్చర్యంతో వివేక్.
"నేను సుబేదార్ సుశాంత్, కార్గిల్ యుద్ధంలో 4875 పీక్ గురించి యుద్ధం చేసాను. యుద్ధం ముగిసాక, పైవాళ్ల నుండి పిలుపు వచ్చింది. నీ బాధ్యత పూర్తి అయింది నువ్వు కోరుకుంటే సులువైన పని ఇస్తాం అని. మీరు చెప్పండి సర్, ఎవరైనా జీవితాన్ని సులువు చేసుకోవచ్చు అనుకుని తమ బాధ్యత నుండి తప్పుకుంటారా..?
యుద్ధం ముగిసి తిరిగి వస్తుంటే నా తోటి సైనికుడు మంచు కారణంగా అశ్వస్థతకు గురై శతృవుల కాల్పులకు దొరికాడు. అతడిని అక్కడి నుండి తప్పించి భద్రమైన ప్రదేశానికి చేరవేయడం నా బాధ్యత. కానీ మా కెప్టెన్ అందుకు నిరాకరించి, తనే వెళ్లారు. దానికి అతనిచ్చిన కారణం, ఒక ఆర్మీ కమాండర్‌గా మొదట అతను చేసిన ప్రతిఙ్ఞ తను కమాండ్ చేసిన వారి ప్రాణలకు భద్రత కల్పించడం. సైనికుడిని కాపాడినందుకు కెప్టెన్ చంపబడ్డారు. ఆరోజు నుండి నాకు గురి చెయ్యబడిన ప్రతి బుల్లెట్‌ని అతను తీసుకున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు నిజంగా తెలుసు సర్, కత్తి మీద సాము అంటే ఏమిటో.." 


వివేక్ చేష్టలుడిగిపోయాడు. తనువంతా ఉద్వేగంతో నిండిపోయింది. తనకు తెలియకుండానే ల్యాప్‌టాప్ ఆపేసాడు. అంతలో ట్రెయిన ఏదో స్టేషన్‌లో ఆగింది. సుబేదార్ సుశాంత్ తన లగేజ్ తీసుకుని దిగబోతూ.. "ఇట్ వజ్ నైస్ మీటింగ్ యౌ సర్" అన్నాడు. వివేక్ అసంకల్పిత ప్రతీకార చర్య లాగా షేక్‌హ్యాండ్ ఇచ్చి, ఆ చేతిని చూస్తూ మనసులో అనుకున్నాడు 'ఈ చెయ్యి, శిఖరాల్ని అధిరోహించింది, ట్రిగ్గర్ నొక్కింది, మువ్వన్నెల ఝెండా ఎగరేసింది.' తనకి తెలియకుండానే అట్టెన్షన్‌లోకి వెళ్లిపోయి, సెల్యూట్ చేసాడు వివేక్, తన దేశానికి ఇది మాత్రమే తను చెయ్యగలిగింది అనుకుంటూ..


ఇది నేను చాలా రోజుల క్రితం ఆంగ్లంలో చదివాను. గుర్తున్నంత వరకూ తెలుగులో రాయడానికి ప్రయత్నించాను.

43 comments:

భాను said...

కొన్ని చదివాక మన భావాలను మాటల్లో చెప్పడం సాద్యం కాదు. ఇప్పుడూ అలాగే ఉంది నా పరిస్తితి. హృదయం ఉద్వేగాబరితంయ్యి, కళ్ళు చెమర్చి,,,,,నో వర్డ్స్ అపర్ణ గారూ...సుపర్బ్ పోస్ట్

3g said...

ఎక్సలెంట్ అపర్ణ గారూ...... నిజంగా సూపర్ రాశారు. ఇది ఇంతకు ముందెప్పుడూ నేను వినలేదు. ఈ అనువాదం మీదే అయితే ఇది నేను చదివిన మీపోస్టుల్లో అత్యుత్తమం.

మీ సిరివెన్నెల పోస్ట్ ఎలాఉందో చూసిచెబుతా పక్క టేబ్ లో వెయిట్ చేస్తోంది.

శివరంజని said...

అపర్ణ నేను చదివి మళ్ళీ కామెంట్ పెడతా

veera murthy (satya) said...

కళ్ళకి కట్టినట్టు రాసారు...ఉద్విగ్నంగా ఉంది.

మీ మనసు అనువాదాన్ని కూడా చక్కగా పలుకుతుంది!

నేస్తం said...

ఊ అప్పూ..కార్గిల్ యుద్దం జరిగినపుడు చాలమందిలో బావోధ్వేగాలు ఎగసిపడ్డాయి .. ఒక అమ్మాయి అయితే(పెళ్ళి కూతురు) సైనిక సహాయనిధి కోసం అనుకుంటా తన వొంటి మీద ఉన్న పెళ్ళి నగలు అలా తీసి ఇచ్చేసింది.. ఆ సమయం లో అంత ఉధ్వేగం మామూలు ప్రజ్జల్లో కూడా....మళ్ళీ మామూలే ...మర్చిపోతాం :( నిజంగా గౌరవింపతగిన వారు ఇద్దరే :) జై జవాన్ జై కిసాన్

శోభ said...

చాలా అద్భుతంగా రాశారు అపర్ణగారూ... మనసు పిండేసేలా ఉంది మీ కథనం. చదివించేలా, ఆలోచించేలా ఉంది. ఇలాంటివి మరిన్ని రాస్తుండండి.. అభినందనలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో...

ఆ.సౌమ్య said...

ఇది నేను ఇంతకుముందు చదివాను. మైల్ లో fwd గా వచ్చింది. నాకూ బలే నచ్చింది.

రాధిక(నాని ) said...

చాలా బాగుంది అపర్ణ గారు.మంచి పోస్ట్ .
నూతనసంవత్సర శుభాకాంక్షలండి

రాధిక(నాని ) said...

చాలా బాగుంది అపర్ణ గారు.మంచి పోస్ట్ .
నూతనసంవత్సర శుభాకాంక్షలండి

ఇందు said...

చాలా బాగుంది పోస్ట్.మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అపర్ణగారు!

హరే కృష్ణ said...

అపర్ణగారు..మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
పోస్ట్ చాలా బాగుంది..

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది అప్పు, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

మంచు said...

చాలా బాగా రాసావు అప్పు. ఒక మంచి ఇన్స్పైరింగ్ సంఘటన తొ నూతన సంవత్సరం లొకి స్వాగతం పలుకుతున్నావ్. ఎమిచ్చి తీర్చుకొగలం మనం వాళ్ళ రుణాన్ని. నిజంగా చాలా హత్తుకునేలా రాసావు.

రాజ్ కుమార్ said...

చాల బాగుంది.. మనసుపలికే గారు..

"మేము మొత్తం 30, మా కెప్టెన్ 4875 శిఖరాన్ని రాత్రికి కవర్ చెయ్యాలని మమ్మల్ని ఆర్డర్ చేసినప్పుడు. శతృవు శిఖరపుటంచుల నుండి కాల్పులు జరిపిస్తున్నాడు. ఎవ్వరికీ తెలియదు, తరువాత బుల్లెట్ ఎక్కడి నుండి వస్తుందో, ముఖ్యంగా ఎవరికి తగులుతుందో. ఉదయాన్నే శిఖరాన్ని అందుకుని మువ్వన్నెల ఝెండా ఎగురవేసే సమయానికి నలుగురం మిగిలాము."

ఇది చదివాకా, ఇంకేమని చెప్పగలము ? నేస్తం గారు అన్నట్టు... జై జవాన్ జై కిసాన్

నూతన సంవత్సర శుభాకాంక్షలు..

తృష్ణ said...

Happy New Year...మీ బ్లాగ్ గురించి ఈ టపాలో రాసానండి. వీలున్నప్పుడు చూడండి. http://trishnaventa.blogspot.com/2010/12/2-discovered-blogs.html

kiran said...

@అపర్ణ - touch చేసేసింది అపర్ణ -- పోస్ట్...!!
చాల బాగుంది.. :)

అశోక్ పాపాయి said...

మనసుపలికే బ్లాగ్ కి అందులో మీ పిల్లి బొమ్మకి మళ్లి మీకు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

బులుసు సుబ్రహ్మణ్యం said...

కధ బాగుంది. మీ అనువాదం ఇంకా బాగుంది. ఏ వృత్తి తక్కువ కాదు. కొందరు జీవనోపాధి కోసం చేస్తారు.కొందరు వృత్తిని గౌరవిస్తారు.మరి, చాలా కొద్ది మంది పదుగురి కోసము పని చేస్తారు.(ఎక్కడో చదివాను)

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

మాలా కుమార్ said...

happy new year

Sravya V said...

మీ అనువాదం బాగుంది . నేను పైన బులుసు సుబ్రహ్మణ్యం గారి వాఖ్య తొ పూర్తీ గా ఎకీభవిస్తున్నా !

మాలా కుమార్ said...

మీరు చెప్పిన కథ చాలా ఉద్వేగభరితం గా వుంది . బాగారాసారు .

జయ said...

I wish you a very happy new year Aparna gaaru.

మనసు పలికే said...

భాను గారు, మీ వ్యాఖ్య చూసాక నాకు కూడా నో వర్డ్స్.. చాలా చాలా థ్యాంక్స్ మీ అభినందనలకు.

3g గారు, ఈ స్టొరీ ఇంగ్లీష్ లొ ఒక మెయిల్ వచ్చందండీ నాకు చాలా రోజుల క్రితం. ఇప్పుడు ఆ మెయిల్ కూడా లేదు నాదగ్గర. నాకు గుర్తున్నంత వరకూ అనువదించడానికి ప్రయత్నించాను. చాలా సంతోషం గా అనిపించింది మీ వ్యాఖ్య చూసాక:)

రంజనీ.. చదివావా..? ఏమైపోయావ్..? :(

సత్య గారు, మీకు బోలెడన్ని ధన్యవాదాలండీ:)

మనసు పలికే said...

నేస్తం అక్కయ్యా.. అవునా!! చాలా మంచి విషయాన్ని పంచుకున్నారక్కా..
>>నిజంగా గౌరవింపతగిన వారు ఇద్దరే :) జై జవాన్ జై కిసాన్
చాలా చాలా చాలా బాగా చెప్పారు అక్కా. ధన్యవాదాలు వ్యాఖ్య పెట్టినందుకు:)

శోభారాజు గారు, ధన్యవాదాలండీ నా టపా నచ్చినందుకు. మీలాంటి వారి ప్రోత్సాహం ఉంటే తప్పకుండా రాస్తానండీ:) మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు:))

సౌమ్య గారు, మీకు కూడా (వ)నచ్చిందన్నమాట :) ధన్యవాదాలు..

రాధిక గారు, ధన్యవాదాలండీ. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

మనసు పలికే said...

ఇందు గారు, ధన్యవాదాలండీ. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

హరే కృష్ణ గారు, ధన్యవాదాలు:). మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

వేణు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు:). మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

మంచు గారు, హమ్మయ్య మొదటి సారనుకుంటా కదూ, మనస్పూర్తిగా బాగుందని చెప్పడం..;)
>>ఎమిచ్చి తీర్చుకొగలం మనం వాళ్ళ రుణాన్ని
అవునండీ. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఏమిచ్చినా తీర్చుకోలేమేమో అని.
ధన్యవాదాలు మంచు గారు:)

మనసు పలికే said...

వేణూరాం, బోలెడన్ని ధన్యవాదాలు టపా నచ్చినందుకు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలకి :)
>>జై జవాన్ జై కిసాన్ :))))

తృష్ణ గారు, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ:) మీ వ్యాఖ్య చూసిన వెంటానే మీ టపా చూసేసానండీ:) నాకు చాలా సంతోషం గా అనిపించింది మీ టపాలో నా బ్లాగు పరిచయం:)) బోలెడన్ని ధన్యవాదాలు..

కిరణ్, ధన్యవాదాలు:))

అశోక్.. ధన్యవాదాలు ,ముఖ్యంగా నా పిల్లి బొమ్మకి చెప్పినందుకు దాని తరపున కూడా ధన్యవాదాలు..:) నీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మనసు పలికే said...

సుబ్రహ్మణ్యం గారు,
>>ఏ వృత్తి తక్కువ కాదు. కొందరు జీవనోపాధి కోసం చేస్తారు.కొందరు వృత్తిని గౌరవిస్తారు.మరి, చాలా కొద్ది మంది పదుగురి కోసము పని చేస్తారు
చాలా చాలా మంచి విషయాన్ని పంచుకున్నారు. ధన్యవాదాలు కథ, నా అనువాదం నచ్చినందుకు.
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.. 2011 లో కూడా మీరు బోలెడన్ని టపాలు రాసేసి మమ్మల్ని కడుపుబ్బ నవ్వించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను :)

మాలాకుమార్ గారు, ధన్యవాదాలు.:) మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.. అనువాదం నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

శ్రావ్య గారు, ధన్యవాదాలండీ:)

జయ గారు, ధన్యవాదాలండీ.మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శిశిర said...

అపర్ణా,
నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోస్ట్ బాగుంది.

Sasidhar Anne said...

Aparna manchi story ni parichayam chesinanduku thanks :)

Military valla gurinchi chadvuthunnappudu alla oka feeling vasthundhi :)

శివరంజని said...

హేయ్ అపర్ణ సూపర్ రాశావు తెలుసా .... ఎంత బాగా అనువదించావంటే నేను కూడా ఆ ట్రైన్ లో ఉండి వాళ్ళామాటలు వింటున్నానేమొ అనిపించింది

మన soldiers నిజం గా మనకన్నా బంగారాలు.... వాళ్ళ ముందు మనం కాకి బంగారం లా తేలిపోతాము ....
వాళ్ళే మన కి కనిపించే నిజమైన దేవుళ్ళు కదూ

మనసు పలికే said...

శిశిర గారు, ధన్యవాదాలండీ:) మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శశిధర్, ధన్యవాదాలు:) నువ్వన్నది నిజం, మిలిటరీ వాళ్ల గురించి చదువుతున్నా, వాళ్ల గురించిన (మంచి) సినిమాలు చూసినా, వాళ్ల గురించిన ఆలోచన వచ్చినా చాలు, ఏదో తెలియని ఉద్వేగం కలుగుతుంది.

రంజనీ, ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది నీకు అంతగా నచ్చినందుకు:) నిజమే మరి, వాళ్లే నిజమైన బంగారాలు, మనల్ని రక్షించే దేవుళ్లు:)

Srini said...

Its really a good one... liked it a lot...

Wish u happy new year...

btw, will see ur other blog 'సిరివెన్నెల' also..

మనసు పలికే said...

శ్రీని గారు, ధన్యవాదాలు. సంతోషంగా ఉంది నా టపా మీకు నచ్చినందుకు:) మీకు కూడా కాస్త (చాలా) లేట్‌గా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

Ennela said...

అపర్ణ గారు..చాల బాగుంది..సస్పెన్సు భలే మెయింటెయిను చేసారు మీరు..చివరి దాకా తెలియలేదు తెలుసా ఆ వ్యక్తి యెవరో..అఫ్కోర్స్ నేను తొందర పడి..అతనూ సాఫ్ట్ వేరేనేమో అని చీప్ గా అలోచించేసాను..చేసిన పాపం చెప్పుకుంటే పోతుందనీ చెప్పేస్తున్నానన్నమాట

మనసు పలికే said...

హహ్హహ్హా.. ఎన్నెల గారు..అతనూ సాఫ్ట్‌వేర్ అనుకున్నారా..!
ధన్యవాదాలు టపా నచ్చినందుకు:)

Sasidhar Anne said...

సంక్రాంతి శుభాకాంక్షలు..
ఈ సంక్రాంతి మీ జీవితం లో మర్రిన్ని కాంతులు తేవాలి అని.. ఆశిస్తూ..
మీ
శశిధర్

గీతిక బి said...

అబ్బో... బాగా లేటుగా చదువుతున్నట్టున్నాను పోస్ట్ ని. చాలా చాలా బాగుంది అపర్ణా.

నాకు చాన్నాళ్ళక్రితం వరకు ఆర్మీ వాళ్ళ గురించినవి చదవినవే తప్ప డైరెక్ట్ గా చూసిన ఉదాహరణలు తెలియదు. కానీ ఇక్కడ మాధవరం అనే ఊరు (ఆ ఊరిని మిలట్రీ మాధవరం అంటారు) గురించి తెలిశాక చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ ప్రతీ ఇంట్లోనూ ఆర్మీ జవాన్లే ఉంటారు. అలాగే ప్రతీ ఇంట్లోనూ భర్తనో, బిడ్డనో, సోదరుడ్నో లేక అందర్నీనో కోల్పోయిన ఆడవాళ్ళూ ఎక్కువుంటారు. ఇలా ఎన్ని జరిగినా ఇంకా ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా ఆర్మీలోకే పంపిస్తారు. చాలా గ్రేట్ కదా.

నిజంగా... చాలా... ఎక్సెలెంట్ పోస్ట్ వ్రాశావు అపర్ణా

మనసు పలికే said...

S.R.Rao గారు,శశిధర్: ధన్యవాదాలు. ఆలస్యంగా చెబుతున్నందుకు క్షమించాలి. సంక్రాంతిని చాలా బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను.:)

గీతిక, మిలిటరీ మాధవరం గురించి నాకు తెలియదు. చాలా మంచి విషయాన్ని పంచుకున్నావు. ధన్యవాదాలు. ఆశ్చర్యంగా ఉంది చదువుతూ ఉంటే.. "ఇలా ఎన్ని జరిగినా ఇంకా ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా ఆర్మీలోకే పంపిస్తారు"
నిజంగా చాలా గ్రేట్.. అటువంటి వారికి ఎన్ని చేసినా మన ఋణం తీరదు.

గిరీష్ said...

nice post..ilanti bhavodvegaalu prathi okkarilo untay..time ki bayatapadathay..chinnappudu edo book lo chadivaanu.. oka puvvu..thanu evari daggariki vellali ani prasnimpabadithe..chivariki devudi paadala chentha kuda undataaniki naaku istam ledu..desam kosam pranalu arpinchina vaalla kaalla daggara mathrame istam ani chebuthundi..

మనసు పలికే said...

గిరీష్ గారు, మీరు చెప్పిన పువ్వు కథ నాకు బాగా నచ్చింది. ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి. నిజమేనండీ. ఇటువంటి భావోద్వేగాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కానీ, బయట పడాటానికి సమయం రావాలి.

Praveena said...

chala baga rasaru...manakusu hattukunde...

మనసు పలికే said...

ధన్యవాదాలు ప్రవీణ గారు..:)

Arun Kumar said...

కొన్ని చదివాక మన భావాలను మాటల్లో చెప్పడం సాద్యం కాదు. ఇప్పుడూ అలాగే ఉంది నా పరిస్తితి. హృదయం ఉద్వేగాబరితంయ్యి, కళ్ళు చెమర్చి,,,,,నో వర్డ్స్ అపర్ణ గారూ...సుపర్బ్ పోస్ట్