Friday, March 4, 2011

అంతర్మధనం.. అమ్మ మాటల్లో

ఇది నిజంగా నిజమేనా..? బాధ కాదు, కోపం కాదు, భయం కాదు. ఏదో తెలియని అలజడి మనసులో, ఉదయం అర్చనతో జరిగిన సంభాషణ తరువాత. ఎంత వద్దనుకున్నా మనసు మళ్లీ మళ్లీ అదే గుర్తు చేస్తుంది.
"అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి, తమ్ముడి గురించి"
మనసేదో కీడు శంకించింది, అదే భయంతో "చెప్పు ఏంటట విషయం.."
"ఆదిత్య పెళ్లి గురించి. వాడెవరో అమ్మాయిని ఇషటపడుతున్నాడట, తననే పెళ్లి చేసుకుంటున్నా అంటున్నాడు"
అంతే, అక్కడితో ఇక నా చెవులు పని చెయ్యడం మానేశాయి. ఏదేదో చెబుతుంది నా కూతురు ఆ అమ్మాయి గురించి. ఇక వినే ఆసక్తి నాకు లేకపోవడంతో ఏదో ముక్తసరిగా ముగించి కాల్ కట్ చేసాను. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను వాడి మీద. ఒక వైపు బాధ, మరో వైపు కోపం తన్నుకు వస్తున్నాయి. అంతలోనే అసలెందుకొస్తున్నాయో అర్థం కాని ప్రశ్న. అసలు అది కోపమో, బాధో, మరేదైనా భావనో తెలియని సందిగ్ధత.

వాళ్ల నాన్న మమ్మల్నొదిలి వెళ్లిపోయిన క్షణం నుండి పిల్లలిద్దర్నీ కడుపులో పెట్టుకుని పెంచుకున్నాను. ఒక్కదాన్నే ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. అలా కష్టపడే నా కూతురి పెళ్లి చేశాను, ఉన్నంతలో మంచి సంబంధాన్ని చూసి. ఇప్పుడు వీడేమో నలుగురిలో నన్ను తలెత్తుకోనివ్వకుండా చేస్తున్నాడు. ఎప్పుడూ నా కొంగే పట్టుకుని తిరిగేవాడు, అసలు ఎలా ఒక అమ్మాయి వలలో పడ్డాడో.. పేరుకి 27 యేళ్లు వచ్చాయన్న మాటే కానీ, నా కొడుకు చాలా అమాయకుడు. ఖచ్చితంగా ఏదో చేసి ఉంటుంది ఆ అమ్మాయే. తలుచుకుంటే బాధగా ఉంది, కానీ ఇప్పుడు నా చేతుల్లో ఏముంది. వాడికి ఒక మంచి అమ్మాయిని వెతికి పెళ్లి చేద్దామన్న నా ఆశ అడియాశే అయిపోయింది కదా.. వద్దనుకున్న కొద్దీ ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఇక లాభం లేదని ఉన్నపళంగా హైదరాబాదుకి బయలుదేరాను, నా కూతురి దగ్గరికి.

ఇదంతా నాకే తప్పుగా అనిపిస్తుందా..? అర్చనేంటి వాడికి వత్తాసు పలుకుతుంది. ఇక చెయ్యగలిగేది ఏమీ లేదని అర్థమయ్యి పరిస్థితికి అనుగుణంగా ఆలోచిస్తుందా..?
"ఇందులో తప్పేముందమ్మా..? ఆది చిన్న వాడేమీ కాదు. వాడికేం కావాలో వాడికి తెలుసు. ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇది సంతోష పడాల్సిన విషయమే కదా. ఇంకా అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి మన కులమే. నువ్వు అన్నీ పిచ్చిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. వాడి జీవితం బాగుంటుంది." ఇవి నా కూతురి మాటలు. అంతేనా ఇక!! చుట్టాల్లో వాడికి ఈ మధ్యనే మంచి ఉద్యోగం వచ్చిందని తెలిసి సంబంధాలు తెస్తున్నారు. 30 లక్షలు కట్నం ఇస్తామని మొన్ననే ఒక సంబంధం వచ్చింది. కాస్త ముందుకెళ్దామనుకున్నా ఆ సంబంధం విషయంలో, ఇంతలో ఈ వార్త. ఒక పెళ్లి చెయ్యాలంటే ఎన్ని తతంగాలు ఉండాలి.. పెళ్లిచూపులు, కట్నాలు-లాంఛనాల మాటలు, పెద్దలంతా ఇష్టపడి చేసే పెళ్లి ఎంత హుందాగా ఉంటుంది. ఇవేమీ లేకుండా ఇలా ఉన్నట్టుండి వచ్చి నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తే సరిపోతుందా..? ఆ కుటుంబం ఎలాంటిదో, అమ్మాయి ఎలాంటిదో, వాళ్ల ఆచార వ్యవహారాలు ఏంటో కూడా తెలుసుకునేది లేదా..

అర్చన కబురు పెట్టినట్టుంది, ఆది కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.
"అమ్మా, ప్లీజ్ అర్థం చేసుకో. శృతి చాలా మంచిది, పైగా నేనంటే చాలా ఇష్టం. ఒప్పుకో అమ్మా" ఆదిత్య మాట్లాడుతున్నాడు.
"ఎలా ఒప్పుకోవాలిరా..? అయినా నువ్వు నిర్ణయం తీసేసుకున్నావుగా, ఇక నన్నడగడం దేనికి? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో" బాధ పెడుతున్నాను చాలా వాడిని. కానీ తట్టుకోలేకపోతున్నాను ఈ నిజాన్ని. నాకు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా, వాడి పాటికి వాడు నిర్ణయం తీసేస్కున్నాడు. వాడి జీవితంలో నేను పోషించాల్సిన పాత్ర ఏమీ లేదా అన్న ఉక్రోషం వచ్చేస్తుంది. నేనంటే వాడికి ఏమాత్రం గౌరవం ఉన్నా, ఈ నిర్ణయం తీసుకోడం కాదు, కనీసం నేను చూపించిన అమ్మాయిని తప్ప ఇంకో అమ్మాయిని కన్నెత్తి కూడా చూసేవాడు కాదు.

నా కూతురు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. "ఏమైందనే ఇప్పుడు. అమ్మాయి చాలా మంచిదని చెబుతున్నాడు కదా. శృతి కూడా చెప్పిందంట వాళ్లింట్లో. మనకి ఓకే అంటే వాళ్ల అమ్మ నాన్న వస్తారంట ఇక్కడికి, పెళ్లి విషయాలు మాట్లాడడానికి."
"మీ ఇద్దరి ఇష్టం" ఇది మాత్రమే నేను చెప్పగలిగింది.
"ఇంకొక ముఖ్య విషయం. వాళ్లతో కట్నమూ, కానుకలు అంటూ మాట్లాడకు. పెద్దగా ఇచ్చుకోలేరట" అర్చన అన్నది. నా భావాలు అర్థం చేసుకున్నట్లుంది వెంటనే చెప్పడం మొదలు పెట్టింది. "మంచి ఉద్యోగం చేస్తుంది. ఇద్దరూ జాబ్ చేసి సంపాదించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఇక కట్నం కాకరకాయ ఎందుకు." మౌనమే నా సమాధానమయింది.

అనుకున్నట్లుగానే శృతి వచ్చింది ఒకరోజు వాళ్ల అమ్మా నాన్నని తీసుకుని. మా అల్లుడు, కూతురు మాట్లాడారు పెళ్లి పెద్దలుగా. ఆదికి ఆ అమ్మాయిలో ఏం నచ్చిందో నిజంగా నాకు అర్థం కాలేదు. డబ్బు లేదు, అందం లేదు. ఏమన్నా అంటే మంచిది అంటాడు. నాకెందుకో అసలు ఈ సంబంధం కుదరకపోతే బాగుండు అనిపిస్తుంది. కలివిడిగా అయితే మాట్లాడుతుంది కానీ..నా కొడుకుని వల్లో వేసుకుంది అన్న కోపంతో నాకు నచ్చలేదు.. ఒక్కతే కూతురు కాబట్టి ఉన్నదంతా శృతికే అన్నట్లు మాట్లాడారు వాళ్ల అమ్మా నాన్న. మాటలయ్యాక ముహూర్తాలు. ఎంతైనా నాకొడుకు పెళ్లి కదా. ముహూర్తాలు పెట్టించి దగ్గరుండి అన్నీ జరిపించాను.

కొత్తలో చాలా బాగుంది నా కోడలు. తర్వాత తర్వాత ఏమైందో నా కొడుకులో మాత్రం చాలా మార్పు చూశాను. చీటికి మాటికి కసురుకోవడం. తల్లినన్న గౌరవం కూడా లేకుండా చిన్నదానికి కూడా కోడలు ముందు తిట్టడం. అసలు నన్ను పట్టించుకోవడం మానేశాడు ఈ మధ్య. ఎంతసేపూ ఆఫీసు, పెళ్లాం. కొలీగ్స్‌తో విహారయాత్రలు. బయట భోజనాలు. ఇంట్లో అమ్మ ఒకతి ఉంది. కొంత సమయం తనతో కూడా గడుపుదాం అన్న ఆలోచన రాదేమో.. లేకపోతే కోడలు రానివ్వడం లేదేమో. ఇవన్నీ ఎవరితోనూ పంచుకోలేని బాధలు. రోజూ అర్థరాత్రి వరకూ వెక్కి వెక్కి ఏడ్చే బాధలు. పోనీ కోడలైనా మంచిదా అంటే, అసలు అత్తయ్య, ఆడపడుచు అన్న గౌరవమే లేదు. ఇదే మాట అంటే ఇంట్లో పెద్ద గొడవ. నానా మాటలనే కొడుకు, హావభావాలతోనే తిట్టినంత పని చేసే కోడలు. ఒంటరితనంతో నేనెంత బాధ పడుతున్నానో ఎవరికి తెలుసు..? నా 50 యేళ్ల అనుభవంతో నేను చెప్పే మాటలేవీ వాళ్ల చెవులకి ఎక్కవు. నేనేదో వాళ్ల ఆనందాలకి అడ్డొస్తున్నానన్న భావనలో ఉంటారు. వాళ్లు సంతోషంగా ఉండడమే కదా నాక్కావలసింది

రాను రానూ, వాళ్లిద్దరు కూడా అన్యోన్యంగా ఉండడంలేదు. చీటికి మాటికి గొడవలు. శృతి అలగడం, ఆది బ్రతిమిలాడడం. ఆది అరవడం, శృతి ఎదిరించడం. ఇదే వరస ఎప్పుడు చూసినా. మధ్యలో పెద్దరికంగా నేవెళ్తే, "నీకెందుకు మధ్యలో నువ్వు రాకు" అని కొడుకుగారి హితోపదేశం. ఏరికోరి చేసుకున్నావు కదా అనుభవించనివ్వు అనుకుంటాను నాలోనేనే. ఒకసారి బైటికి అనేశాను కూడా. కోడలు బాధపడినట్లు ఉంది పాపం. ఆది మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు బాగా చూసుకోదు మరి. పగలంతా కష్టపడి వచ్చే భర్తకి కాస్త ప్రేమ పంచాలి కానీ ఇలా అరిచి గొడవ పెడితే వచ్చేదేముంది. వీళ్లిద్దరి గురించే నేను బైటికి ఎక్కువగా వెళ్లను కూడా. అర్చన దగ్గరికి వెళ్లినా ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండను. ఆది ఎలా ఉన్నాడో అన్న బెంగ నన్ను నిలవనివ్వదు.

వాడు సంతోషంగా ఉంటే నాకు చాలు. ఆరోజుల కోసం చూస్తూ ఉంటాను....
సశేషం.....

25 comments:

రాజ్ కుమార్ said...

first comment??????

..nagarjuna.. said...

రెండవ భాగం ఏమైనావుందా ?

మాలా కుమార్ said...

అమ్మ అంతర్మధనం గురించి బాగా రాసారు . ముందు ఎంత అనుకున్నా పిల్లల సంతోషాన్నేగా అమ్మ కోరుకునేది .

veera murthy (satya) said...

నిజమే...విశేషంగా ఇలాంటి కథలు సశేషంగానే ముగుస్తాయి....

బాగా రాసారు.

--satya

Anonymous said...

wow gotta love that

ఇందు said...

బాగా వ్రాసావ్ అప్పూ!! హ్మ్! ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ! కొన్ని సార్లు అది అనుభవించేది అమ్మ ఐతే...కొన్ని సార్లు ఆ ఇంటికి వచ్చిన కోడలు....కానీ ఈ పర్టిక్యులర్ కథలో నాకు బాధితురాలు అమ్మే అనిపిస్తోంది! కొడుకు బాగుండాలి అనె ఆదుర్దా కనిపిస్తోంది! పాపం కదా!

చాల బాగుంది స్టోరి...కొంచెం బాధ పెట్తినా!

బులుసు సుబ్రహ్మణ్యం said...

సశేషం అన్న ముగింపు బాగుంది. పెద్దవారైన పిల్లల సంతోషాలలో పాలు పంచుకోలేక పోయినా, అందరి బాధలు అనుభవించేది అమ్మ. అమ్మకధ నిజంగానే అంతం లేని కధ.

బరువైన టపాలకీ బరువైన హృదయంతో బరువైన కామెంటు.:):)

నాగార్జున గారన్నట్టు రెండవ భాగం వ్రాసే ఉద్దేశ్యం ఉంటే పై లైనులు పీకి పారేయండి. నా కామెంటు సశేషం చేసెయ్యండి.

సుమలత said...

బాగా రాసారు ఎది ఎమి అయిన పిల్లల్లు సంతోషమే
పెద్ద వారికి కావాలి

శిశిర said...

అమ్మ మనసులోని అంతర్మధనాన్ని చాలా బాగా ఆవిష్కరించారు.

sneha said...

chaalaa baagundi andi
next part eppudu

రాజ్ కుమార్ said...

కధ బాగుంది మనసుపలికే గారు.. మీరు కూడా సీరియల్ మొదలెట్టారన్న మాట.. "అంతర్మధనం . అమ్మ మాటల్లో " తర్వాతి భాగం కూడా రాసెయ్యండి త్వరగా..

రాజ్ కుమార్ said...

ఫస్ట్ కామెంట్ నాదే..:) :)కేవ్వవ్వ్వ్వ్...

Unknown said...

Good start. i think its a cmn prblm in most of d families.. because of possessiveness.. waitng 4 next post :D

Ennela said...

బాగుంది అపర్ణా, రొండోది జెర జెలిదిన రాయమ్మా...ఎక్కువ దినాలయితె మల్ల ఒకటోది యాద్ మరుస్త!

Arun Kumar said...

అమ్మ అంతర్మధనం గురించి బాగా రాసారు .

Ratna said...

I could not stop myself commmenting on this after reading this..

I just felt like I am present in the situation as long as I was reading this story..

Narration is just excellent..

Finally - it's mirror image of the relation of wife and husband in the present days.. and as another blogger "satya garu" said, these types of stories would never end.. I mean, there is no solution for these kind of situations unless there is some self realisation in the people present in that context..

Got a feeling of nice read..

Awaiting the next episode..

Anonymous said...

Sorry Appu bujji ipudu daka chudaledu .. Excellent ga rasav ...

Chadavagane maa amma gurtocchindi :(

-kavya

గిరీష్ said...

nice one..
one doubt, is this a story or a real one?
chala mandi katha bagundi, nice serial, next episode eppudu antunte doubt vachindi.

kiran said...

ఆహా...అప్పు..ఎంత బాగుందో...:)
ఎవరైనా అత్తగారికి చూపిస్తే..నీకు ఉత్తమ కోడలి బహుమతి వచ్చే అవకాశం ఉంది.. :)

మనసు పలికే said...

వేణూరాం, హహ్హహ్హా.. నీదే ఫస్ట్ కామెంటు:) దీన్ని సీరియల్ అనే అంటారా.?? ఏమో మరి. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి..

నాగార్జున, రెండు, మూడు భాగాలు కూడా చదివేశావు కదా:) ధన్యవాదాలు..

మాలా కుమార్ గారు, అవునండీ, నిజంగా అమ్మ ఎప్పుడూ పిల్లల సంతోషాన్నే కోరుకుంటుంది. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:)

మనసు పలికే said...

సత్య గారు, హహ్హహ్హ బాగా చెప్పారు;) మీరు దేన్నైనా భలే కవితాత్మకంగా చెబుతారు:)

అఙ్ఞాత గారు, ధన్యవాదాలు.

ఇందు, హ్మ్మ్.. నిజమే ఒక్కొక్కరిది ఒక్కో బాధ. విచిత్రమేమిటాంటే, అసలు అక్కడ నిజంగా సమస్య అంటూ ఏమీ లేకపోయినా ఉన్నట్లుగా భ్రమపడి, దాని గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా ఫీల్ అవ్వడం.. ఏంటో కదూ.. అంతా భ్రాంతి;)

మనసు పలికే said...

గురూగారూ.. హయ్యబాబోయ్.. మీ బరువైన కామెంటుని, నా మొదటి కథ నిజంగా మోయలేకుండా ఉంది;) బోలెడు ధన్యవాదాలు మీకు:)

సుమలత గారు, ధన్యవాదాలండీ నా టపా నచ్చినందుకు:)

శిశిర గారు, ధన్యవాదాలు:)

మనసు పలికే said...

స్నేహ గారు, ధన్యవాదాలు:)

చంద్ర గారు, చాలా బాగా చెప్పారు. పొసెసివ్‌నెస్సే కారణం అనుకుంటాను. ధన్యవాదాలండీ..

ఎన్నెల గారూ.. బోలెడు ధన్యవాదాలు:) మూడూ రాసేశాను. తొందర తొందరగా చదివేసి నన్ను పొగిడెయ్యండి ప్లీజ్..;)

మనసు పలికే said...

అరుణ్ కుమార్ గారు, ధన్యవాదాలు:)

రత్న గారు, చాలా చాలా థ్యాంక్స్:) నిజమేనండీ, ఇది ఈరోజుల్లో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ జరిగే కథే. పరిష్కారం కూడా దొరకడం కష్టమే. అందుకే ప్రస్తుతానికి ముగ్గురి మనోభావాలు రాసి అలా వదిలేశాను. మీ వ్యాఖ్య చాలా సంతోషాన్నిచ్చింది:) ధన్యవాదాలు..

కావ్యా,
థ్యాంక్ యూ సో మచ్:) అమ్మ గుర్తొచ్చిందా..:(

మనసు పలికే said...

గిరీష్ గారు, రియల్ స్టోరీ కాదు లెండి..:) ఏదో మనసుకి తోచింది రాశాను. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:)

కిరణ్, హహ్హహ్హా.. ఇంకెందుకు ఆలస్యం..;) ఇప్పించు ప్లీజ్..Thank you soo much...