Thursday, March 10, 2011

అంతర్మధనం.. శృతి మనోగతం...

వసంతం కన్నా హేమంతాన్ని ఎక్కువగా ఇష్టపడే ఒక మామూలు తెలుగమ్మాయిని. దేవుడి కన్నా ఎక్కువగా మనుషుల్ని, మానవత్వాన్ని నమ్మే ఆడపిల్లని. సముద్ర గర్జనలన్నా, సెలయేటి గలగలలన్నా, అరవిరిసిన విరజాజులన్నా, చలి తెరల్లో మంచు పువ్వులన్నా, మొత్తంగా చాలా బ్యాలన్స్డ్‌గా సాగిపోయే ఈ సృష్టి అన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా నలుగురిలో ఎంత కలివిడిగా ఉన్నా నాలోకంలో నేనుండడం చాలా చాలా ఇష్టం .

అలాంటి నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి ఒక బంధంలో అడుగు పెట్టి జీవితంలోని కొత్త రంగుల్ని చూస్తానని. మరీ సినిమాల్లో చూపించినట్లుగా మనసు జారిపోయి, పువ్వులు రాలిపోయి, ఉరుములు మెరుపులు రావడం జరగలేదు కానీ తను ప్రపోజ్ చేసిన రోజు మాత్రం ఇతనే నా సోల్‌మేట్ అనిపించింది. చాలా సూటిగా అడిగాడు, "నన్ను పెళ్లి చేసుకుంటావా..? నువ్వు లేకపోతే బ్రతకలేను, చనిపోతాను ఇలా చెప్పడం నాకు రాదు. కానీ నువ్వుంటే నా జీవితం చాలా బాగుంటుంది. అంతే సంతోషంగా నిన్ను చూసుకోగలనన్న నమ్మకం నాకుంది. నిర్ణయం నీదే." మనసులో ఇష్టమైతే ఉంది కానీ, ఎందుకో మెదడు సందేహించింది. అందులోనూ అమ్మా నాన్నకి చెప్పకుండా ఇంత పెద్ద విషయంలో నేనొక్కదన్నే నిర్ణయం తీస్కోలేను. ఆదికి అదే విషయం చెప్పాను. "నాకు నువ్వేంటో తెలుసు. కానీ, అమ్మా నాన్నకి విషయం చెబుతాను. వాళ్లకి అభ్యంతరం లేకపోతేనే మన పెళ్లి." సరే అని సంతోషంగానే అన్నాడు కానీ, తన మనసులోని ఆందోళన బయట పడిపోతూనే ఉంది.

అమ్మా నాన్నతో మా విషయం మాట్లాడడానికి ఊరు వెళ్తున్న రోజు, వాళ్లు ఒప్పుకుంటారో లేదో అన్న భయంతో చాలా ఏడ్చాడు ఆది. ఏమీ చెప్పలేని సందిగ్ధంలో నేనుండగా, "అయినా ఏమీ కాదులే. వాళ్లు ఒప్పుకుంటారు. ఇంక వరస్ట్ కేస్‌లో ఒప్పుకోకపోతే, ఆది అండ్ శృతి విల్ బి గుడ్ ఫ్రెండ్స్" ఒకవైపు ఈ మాటలు చెబుతూనే ఏడుస్తున్నాడు. ఆది ఆలోచనలతోనే ఇంటికి వెళ్లాను.

నేను మా అమ్మా నాన్నలకి పుట్టడం నాకు ఎంత అదృష్టమో చెప్పలేను. అసలు విషయాన్ని చెప్పలేక మధన పడుతుంటే, అమ్మ పసిగట్టి నాన్న దగ్గరికి తీస్కెళ్లింది. "నాన్నా, చిన్నప్పటి నుండి మీరిద్దరూ నన్నెలా పెంచారో నాకు తెలుసు. నేను అంతే ఉన్నతంగా పెరిగానని అనుకుంటున్నాను. నాకు ఒక ప్రపోజల్ వచ్చింది. నేను తనకి ఏమీ చెప్పలేదు. మీరు ఒకసారి మాట్లాడగలితే బాగుంటుంది తనతో" ఎలా చెప్పగలిగానో, అసలు అర్థవంతంగా చెప్పానో లేదో కూడా తెలీదు. గుండెలో భయం, గొంతులో తడబాటు, కళ్లల్లో బెరుకు. అమ్మలో కాస్త కంగారు కనిపించింది కానీ, నాన్న మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. "నేను ఒక్కటే చెప్పగలను శృతి, నీ నిర్ణయం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నీకు అతను నచ్చాడా..?" ఉన్నట్టుండి ఏడుపొచ్చేసింది. అదే స్వరంతో చెప్పాను. "ఆది చాలా మంచి అబ్బాయి నాన్న. కానీ నువ్వొకసారి మాట్లాడి నిర్ణయం తీసుకో." అమ్మ మాత్రం కాస్త భయపడి అడిగింది, "కులం ఏంటి?" అని. నా సమాధానం పెదవి దాటేలోగానే "ఇష్టపడిన తరువాత కులాల్ని చూస్తే ఏమొస్తుంది..?" తిరిగి నాన్న ప్రశ్న అమ్మకి. ఆ క్షణంలో మాత్రం అనిపించింది, వాళ్లకి నేను పుట్టడం నా అదృష్టం కాదు, నాకు వాళ్లు ఈ జన్మలో దొరికిన అరుదైన వరం అని.

అనుకున్నట్లుగానే ఒకరోజు ఆది వాళ్ల అక్క, అర్చన గారింటికి వెళ్లాము, అమ్మా, నాన్న, పెద్దమ్మ, పెదనాన్న, నేను. మొదట కాస్త భయమేసింది కానీ, ఆది వాళ్ల అక్కతో మాట్లాడిన తరువాత మనసు కాస్త స్థిమిత పడింది. అర్చన గారు నాకు చాలా నచ్చారు. కాబోయే అత్తమ్మతో మాత్రం అంతగా మాట్లాడలేదు ఆరోజు. అమ్మతో మాట్లాడుతూ ఉంటే విన్నాను."నాకు నా కూతురు ఎంతో కోడలు అంతే. అర్చనకి కూడా అక్క చెల్లెళ్లు లేరు. పిల్లలందరూ సంతోషంగా ఉండడమే కదా కావల్సింది. దేవుడు చల్లగా చూడాలని కోరుకుందాం" ఎందుకో అత్తమ్మ మాటలతో అమ్మ కూడా టెన్షన్ ఫ్రీగా అనిపించింది. మొత్తానికి పెళ్లి అయిపోయింది.

కొత్తలో ఎవరికైనా ఇలాగే అనిపిస్తుందేమో తెలీదు కానీ, నాకు మాత్రం నా జీవితం పూల పాన్పు లాగా అనిపించింది. నన్ను ఇష్టపడి ప్రేమగా చూసుకునే భర్త, మా సంతోషమే కోరుకునే అత్తయ్య, మంచికి చెడుకి మాలో కలిసిపోయే అర్చన వదిన. ఆది వాళ్ల అమ్మని, అత్తయ్య అని కాకుండా అత్తమ్మ అని పిలవడం కూడా నాకు భలే నచ్చుతుంది.
అత్తయ్యలో అమ్మని, అత్తయ్యని అమ్మలా చూసుకుంటున్న భావన కలుగుతుంది నాకు. పెళ్లి తరువాత ఆది, నేను ఎక్కడికీ వెళ్లలేదని వదిన "ఎక్కడికైనా వెళ్లొచ్చు కదా ఆది, ఈరోజులు మళ్లీ రావు" అన్నది. కానీ, మా రొటీన్ జీవితాల్లో హనీమూన్ ఎక్కడ కుదురుతుంది..? అనుకోకుండా ఆది వాళ్ల కొలీగ్స్‌తో చిన్న ట్రిప్‌కి వెళ్లాము. నిజంగా నా జీవితంలో మరచిపోలేని రోజులు. అంత బాగా ఎంజాయ్ చేశాం. ఇన్ని రోజులకన్నా ఆది నాకు కొత్తగా కనిపించాడు వాళ్ల కొలీగ్స్‌తో ఉన్నప్పుడు. భలే నచ్చాడు. వాళ్లంతా కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. అద్భుతం కన్నా పెద్ద పదం ఏదైనా ఉంటే వాడాలని ఉంది ఆ ట్రిప్ గురించి.

'జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు, కాలానికి కన్ను కుట్టడం' ఇలాంటి వైరాగ్య/వేదాంత వాక్యాలకి నాకు ఇంతకు ముందు అర్థం తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఇంకా బాగా చెప్పాలంటే ట్రిప్ నుండి వచ్చిన తరువాత తెలియడం మొదలు పెట్టింది మా అత్తమ్మ రూపంలో. ఉన్నట్టుండి ఒకరోజు నిద్రలేచేసరికి, నువ్వెక్కడున్నావో అర్థం కాక, ఒక పెద్ద పులుల గుంపు నీమీద పడి నిన్ను చిత్రవధ చేస్తుంటే ఎలా ఉంటుంది..? నాకు అనుభవంలోకి వచ్చింది ఒక ఉదయం. మా అత్తమ్మ, వదిన ఒకరి తరువాత ఒకరు నన్ను తిట్టడం చూసిన తరువాత, వాళ్ల మాటలు విన్న తరువాత. ఎందుకు తిడుతున్నారో తెలీదు, అసలేమైందో తెలీదు. ఆది, వదినని తిట్టాడు(ట) దేనికో. అది నా కారణంగా అని అత్తమ్మ మొదలు పెట్టిన సుప్రభాతం అది. దానికి ముగింపు, వదిన ఫోన్ కాల్. విషయం మొత్తం అర్థం అయింది. ఇన్నిరోజులూ అత్తమ్మ చూపించింది ప్రేమ కాదు, నటన అన్న నిజాన్ని జీర్ణించుకోలేక మనసు ఉక్కిరి బిక్కిరి అయింది. ఇంకా నవ్వొచ్చే విషయమేంటంటే, ఏ రోజైనా ఆది నేను బైటికి వెళ్తే ఖచ్చితంగా రెండు విషయాల్లో ఏదో ఒకటి జరుగుతుంది. మా అత్తమ్మకి ఒంట్లో బాగోక పోవడం లేదా ఇంట్లో పెద్ద గొడవ జరగడం. ఇంత చిన్న ఈక్వేషన్ ఆదికి ఎందుకు అర్థం కాదో నిజంగా నాకు అర్థం కాదు.

నాకు మాత్రం ఇల్లు ఒక నాటక రంగస్థలం లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆదికి ఈ విషయం చెబితే, "పిచ్చిగా మాట్లాడకు. అసలేంటి నీ ఉద్ధేశ్యం? అమ్మకి నా మీదున్నది కూడా ప్రేమ కాదంటావా..?" అరుపులతో కలిసిన మాటలు వచ్చాయి ఆది నుండి. "అది కాదు ఆది. ఒక్కసారి నా బాధ అర్థం చేసుకోడానికి ప్రయత్నించు ప్లీజ్.."
"చూడు శృతి, అమ్మ చాలా కష్ట పడింది. నీకు ఇంతకు ముందే చెప్పాను ఈ విషయం. ఇకపై అమ్మని సుఖపెట్టడం నా బాధ్యత". నాకు విరక్తితో కూడిన నవ్వొచ్చింది. నిజంగా ఈ ప్రపంచంలో కష్టపడని మనిషి ఉంటాడా..? ఎవరి జీవితపు రెండు పుటల్ని స్పృశించినా, వాటి వెనుక టన్నుల కొద్దీ కష్టాల కావ్యాలు ఉంటాయి. అయినా ఇక వాదించడం అనవసరం అని తెలిసింది. రోజు రోజుకీ నాలో సహనం కూడా తగ్గుతూ వచ్చింది.


ఆది, నేను ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. అందులో కూడా ప్రైవసీ ఉండదు. ఆదికి నాకు మధ్యలో అడ్డుగోడలా ఎప్పుడూ అత్తమ్మ ఉంటుంది. తన తాపత్రయమంతా, ఆదికి నేను తగిన మేట్ కాదు అని తెలియజేయాలని. అందుకు తన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే వీలు దొరికినప్పుడలా "ఏరి కోరి చేసుకున్నావు కదా.. అనుభవించు" అని అంటూ ఉంటుంది. కానీ తనకి తెలియదు, నేనిలా మారడానికి కారణం తన ప్రవర్తన అని. నేనేం చేసినా అది తనకి తెలియాలి, తన పర్మిషన్ తీసుకుని చెయ్యాలి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, తనని అడగకుండా నేను ఏది చేసినా అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని రూపు రేఖలు సమూలంగా మార్చేసి, తనకి అనుగుణంగా మలుచుకోగల సమర్ధురాలు. ఎవరు చేసిన పని అయినా సరే, ఫలితం బాగుంటే అది తనే చేసినట్లు ఏమాత్రం తడుముకోకుండా దండోరా కూడా వేయించగలదు. ఏంటో, ప్రపంచంలో ఎన్నో అందాలు,ఆనందాలు, విజయాలు, మనకోసం ఎదురు చూస్తూ ఉంటే, మనుషులు మాత్రం ఇక్కడ ఇలా వంటింట్లో తిట్టుకుంటూ కూర్చోడం నాకు భలే వింతగా ఉంటుంది.

ఈ మధ్య నాకు ఆది మీద ప్రేమ కన్నా, అత్తమ్మ మీద నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ అయిపోయాయి. ఇంటినుండి ఎప్పుడెప్పుడు బయట పడదామా అనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజూ. నాకు తెలుసు, అత్తమ్మ ఇలా ప్రవర్తించడానికి కారణం తనకి సరైన వ్యాపకం లేకపోవడం. "ఈ వయసులో అమ్మ ఏం చేస్తుంది..? తననలా ఉండనివ్వు ప్రశాంతంగా" అన్న ఆది మాటలు విని ఇక మరి నోరు తెరవలేదు నేను.ఆది(వాళ్ల అమ్మ) కోసం చాలా విషయాల్లో రాజీ పడ్డాను. ఒకరోజు ఏదో నవల చదువుతున్న నా దగ్గరికి వచ్చి, "ఏంటిది.. ఇలాంటివి చదివితే అమ్మకి నచ్చదు. ఇంకెప్పుడూ చదవకు" అన్నాడు. మరోసారి, ఆఫీసులో మొదలు పెట్టిన ఒక స్వఛ్చంద సేవా సంస్థకి నెలకి కొంత డబ్బు ఇస్తా అంటే "ముందు మనం మంచిగా సెటిల్ అయిన తరువాత ఇవన్నీ. అయినా అమ్మకి తెలిస్తే ఊరుకోదు" అన్నాడు ఆది. పోనీలే, వాళ్లు పెరిగిన పరిస్థితి అలాంటిది కదా అని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను. కానీ, ఇలా నా జీవితపు ప్రతి అడుగులో అడ్డు తగులుతూ ఉంటే, చివరికి "నేను, నాది" అనుకునే విధంగా ఏదీ మిగలదేమో అని భయమేస్తుంది.

రోజులు గడుస్తున్న కొద్దీ జీవితం మరీ నిస్సారమైపోయిన భావన కలుగుతుంది. పెళ్లికి ముందు ఆదితో గడిపిన రోజులకి వెళ్లిపోవాలని ఉంది. నాకోసం ఎంత తపన పడ్డాడు. అదేంటో మరి, ఇప్పుడు తన కళ్లలో ఆ ప్రేమ కనిపించదు. ఏమో, అది నా దృష్టిలోపమేనేమో. ఏరోజుకారోజు, 'ఇంకా తెలవారదేమీ.. ఈ చీకటి విడిపోదేమీ' అని పాడుకుంటూ గడిపేస్తున్నా ప్రస్తుతానికి.సుఖాంతాలు, దుఃఖాంతాలు ఉండేది కథలకే కదా, నిజజీవితానికి ఒకటే ముగింపు ఉంటుంది. కోరుకోవలసిందల్లా, ఈరోజు కన్నా రేపు బాగుండాలని. కానీ ఆ రేపటికోసం చూసే ఎదురు చూపుల్లోనే కాలం కరిగిపోతుందేమో..

32 comments:

Anonymous said...

1st comment... :):)

--kiran

మధురవాణి said...

Excellent! :)

..nagarjuna.. said...

i guess i don't have to read it all...first paragraphs were sufficient

way to go for you aparna.....

..nagarjuna.. said...

damn good appu.....
>>చాలా బ్యాలన్స్డ్‌గా సాగిపోయే ఈ సృష్టి అన్నా చాలా ఇష్టం
>>మరీ సినిమాల్లో చూపించినట్లుగా మనసు జారిపోయి...
>>నాకు వాళ్లు ఈ జన్మలో దొరికిన అరుదైన వరం అని....

>>ఎవరి జీవితపు రెండు పుటల్ని స్పృశించినా, వాటి వెనుక టన్నుల కొద్దీ కష్టాల కావ్యాలు ఉంటాయి

స్పామింగ్ లాగా ఔతుందనుకుంటే సారి...but mention చేయకుండా ఉండలేకపోయా... :)

>>ఇంత చిన్న ఈక్వేషన్ ఆదికి ఎందుకు అర్థం కాదో నిజంగా నాకు అర్థం కాదు

అంత కాంప్లెక్స్ విషయాలు మా మహరాజులకు అర్ధంకావులే... :)

sneha said...

చాలా బాగా రాసారు ఒకే సమస్యను ముగ్గురు ఎవరి పరిధిలో వారు ఎలా అనుకుంటారో .గుడ్ నైస్ నేరెషన్

శిశిర said...

Superb. నాకు నచ్చిన కొన్ని వాక్యాలు చెప్పాలంటే నాగార్జునగారన్నట్టు స్పామింగ్ లాగా అవుతుందేమో అనిపించి ఆగిపోయా. చాలా అవగాహనతో, అనుభవంతో మనుషుల మనస్తత్వాలు చదివేసినట్టు రాశారు. చాలా చాలా బాగుంది.

మనసు పలికే said...

నా మొదటి కథని ఓపిగ్గా చదివి వ్యాఖ్యానించిన ప్రియ మిత్రులందరికీ ధన్యవాదాలు:) అన్ని భాగాలు పూర్తి అయిన తరువాత రిప్లై ఇద్దామని కాస్త ఆలస్యం చేశాను, క్షమించండి. చాలా సంతోషంగా ఉంది మీ వ్యాఖ్యలు చదువుతూ ఉంటే. పేరు పేరునా ధన్యవాదాలు చెబుతాను:)

Praveena said...

chala bagundi..Flow is good..

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఒక సమస్య, ముగ్గురు స్పందించిన విధానం, మూడు మనస్తత్వాలు గురించి చాలా బాగా వ్రాసారు. చిన్న చిన్న అపోహలు జీవితాలని ఎంతగా కలచి వేస్తాయో కదా.

ఈ గొడవల్లో నలిగిపోయేది మగవాడే. అయ్యో పాపం.:):)

kiran said...

ఆహా...ఓహో ....అప్పూ..కేవ్వ్వ్వవ్వ్వ్..
చాలా చాలా బాగుంది..
మొదటి para చదివి మళ్ళి ఇంకో 2 సార్లు దాన్నే చదివి కిందకి వచ్చాను.. :)
ఆ para నేను కొట్టేస్తున్నా..:D :P

nagarjuna gari comment double like.. :D

ఇందు said...

అప్పు చాలా టచింగ్ గా ఉంది నీ స్టోరీ! ఇవాళ ఆది,శృతి రెండు భాగాలు చదివేసా! రెండిటికి ఇక్కడే కామెంటుతున్నా!

ఏం రాస్తున్నవ్ అప్పూ!ఆదీ స్టోరీ చదివితే ఆదీ చెప్పేదీ నిజమే అనిపిస్తుంది..ఇప్పుడు శృతి వైపు ఆలోచిస్తుంటే ఇదీ నిజమే అనిపిస్తోందీ..ఒక విషయానిక్కి భిన్న పార్శ్వాలు ఉంటాయి కదా..నువ్వు అవన్నీ టచ్ చేస్తూ వ్రాస్తున్నావ్! చాలా బాగుంది.మొదటి స్టోరీ లాగా అనిపించట్లేదు ;)

మొత్తమ్మీద...చాలాచాలా బాగుంది :))

శారద said...

నిజానికి ఇది అంత పెద్ద సమస్య కాదండీ! కొంచెం మనసు పెట్టి నిజాయితీగా ఆలోచించి ఇద్దరు ఆడవాళ్ళూ వాళ్ళ ఎమోషన్స్ నీ ఆలోచనలనీ నియంత్రించుకుంటే చాలా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు.
శారద

Unknown said...

అప్పు అంతర్మధనం అనేది ప్రతి మనిషిలోను ఉంటుంది ..
కాని చూసావా .. ఒకరిది చదువుతున్నప్పుడు మిగతా వారిది తప్పు అనిపిస్తుంది .. చాల బాగా రాసావు ..
కాని అలా అందరు బాధ పడే బదులు ఒక సారి ఓపెన్ గా మాతడుకుంటే బాగుంటుంది కదా .. నేను కధ గురించి చెప్పడం లేదు .. జనరల్ గా .. నా అభిప్రాయం ..
ఇలా ఎవరికీ వారే యమునా తీరే అని విడిపోయి విలువైన బంధాల్ని వదులుకునే పిచ్చి వాళ్ళని చుస్తే జాలి వేస్తుంది .. హ్మ్ కాని .. ఎవరు ఎవరి మాట వినరు :) కదా ..
సరేలే కామెంటులో ఇంత సోది ఏంట్రా బాబు అనుకునేలగా చెయ్యను
నువ్వు రాసిన దానికి అద్భుతం అనే పదం సరిపోదురా .. నీ ఫ్రెండ్ అయినందుకు .. నేను చాల హాపి గా ఫీల్ అవుతున్న ..

Sravya V said...

it is too good Aparna !

Sasidhar Anne said...

mugguri gurunchi chala balanced ga rasavu.. evaridi valla vaipu nunchi tappu lennattu ga vuntundhi.. super ga rasavu aparna.

శివరంజని said...

అపర్ణ ఎంత బాగా రాసావో తెలుసా అది ఇది అని కాదు కాని ప్రతీ లైన్ నచ్చింది............. మొత్తం కాపీ చేసి పేస్ట్ చేద్దామనుకున్నాను .........

ఇంకో విషయం చెప్పనా ఈ కింద లైన్స్ నాకు చాల చాలా చాలా చాలా చాలా చాలా నచ్చాయి ఎందుకో తెలీదు కాని ......

>>>>>>>వసంతం కన్నా హేమంతాన్ని ఎక్కువగా ఇష్టపడే ఒక మామూలు తెలుగమ్మాయిని. దేవుడి కన్నా ఎక్కువగా మనుషుల్ని, మానవత్వాన్ని నమ్మే ఆడపిల్లని. సముద్ర గర్జనలన్నా, సెలయేటి గలగలలన్నా, అరవిరిసిన విరజాజులన్నా, చలి తెరల్లో మంచు పువ్వులన్నా, మొత్తంగా చాలా బ్యాలన్స్డ్‌గా సాగిపోయే ఈ సృష్టి అన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా నలుగురిలో ఎంత కలివిడిగా ఉన్నా నాలోకంలో నేనుండడం చాలా చాలా ఇష్టం .<<<<<<<<<<


ఇంకొక్కసారి ......ఇంకొక్కసారి.... ఇంకొక్కసారి...... ఇందాక నుండి ఈ లైన్స్ నే చదువుతున్నా


నెక్ష్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ మరి

Sasidhar Anne said...

//ఇంకొక్కసారి ......ఇంకొక్కసారి.... ఇంకొక్కసారి...... ఇందాక నుండి ఈ లైన్స్ నే చదువుతున్నా

ardham kaledu emo..!!!

శివరంజని said...

@శశిధర్ గారు Grrrrrrrrrrrrrrrrrrrrrrrr

ఇంకా ఇంకా చదవాలి అనిపించింది అని అర్ధం

Anonymous said...

Wonderful narration....ippatikey 10 times chadivaa..aina bore kottaledu..keep writing more.

హరే కృష్ణ said...

Excellent!
శృతి వెళ్ళి యశోద ని తిడితే ఆది వచ్చి అల్లకల్లోలం చేసాడంట
శారద గారితో నేను ఏకీభవిస్తున్నాను.Well said

Arun Kumar said...

చాలా బాగా రాసారు

మనసు పలికే said...

మధుర, బోలెడన్ని ధన్యవాదాలు:)

నాగార్జున,
చాలా సంతోషంగా అనిపించింది నీ వ్యాఖ్య చదివి:)
>>అంత కాంప్లెక్స్ విషయాలు మా మహరాజులకు అర్ధంకావులే... :)
హమ్మయ్య మొత్తానికి అర్థం చేసుకున్నావు:)))

స్నేహ గారు,
బోలెడన్ని ధన్యవాదాలు:)

మనసు పలికే said...

శిశిర గారు, చాలా చాలా థ్యాంక్స్:)

ప్రవీణ గారు, ధన్యవాదాలు:)

గురూగారూ.. ధన్యోస్మి:)
>>ఈ గొడవల్లో నలిగిపోయేది మగవాడే. అయ్యో పాపం.:):)
ఇది అన్యాయం మాస్టారూ..;)))

మనసు పలికే said...

కిరణ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ..:) ఫస్ట్ కామెంట్ నీదే.. నా పేరా కొట్టేశావా..? ఆయ్.. దాని కాపీ రైట్స్ నావే..;)

ఇందు, బోలెడు ధన్యవాదాలు:) నీ వ్యాఖ్య చదువుతుంటే భలే ఆనందంగా ఉంది:) నా మీద నాకు నమ్మకం కాస్త పెరుగుతుంది:)

శారద గారు, హ్మ్.. నిజమేనేమో మీరన్నది కూడా. ఏదైనా ఆయా మనస్తత్వాల మీద ఆధారపడి ఉంటుంది కదూ. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:)

మనసు పలికే said...

కావ్య, నిజమే నువ్వన్నది. ఒక సారి కుర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుందనే అనుకుంటున్నాను. కానీ అందరి ఆలోచన దృక్పథం ఒకలా ఉండదు కదా. అదే ప్రాబ్లం.
>>నువ్వు రాసిన దానికి అద్భుతం అనే పదం సరిపోదురా .. నీ ఫ్రెండ్ అయినందుకు .. నేను చాల హాపి గా ఫీల్ అవుతున్న .
థ్యాంక్ యూ సోఓఓఓఓఓ మచ్:)

శ్రావ్య గారు, ధన్యవాదాలండీ:)

శశిధర్, ధన్యవాదాలు:)

మనసు పలికే said...

రంజనీ.. ఎంత సంతోషంగా ఉందో ఇలా వ్యాఖ్యలు వస్తుంటే:) బోఓఓఓలెడన్ని ధన్యవాదాలు:)
>>ఇంకొక్కసారి ......ఇంకొక్కసారి.... ఇంకొక్కసారి...... ఇందాక నుండి ఈ లైన్స్ నే చదువుతున్నా
అంటే కథ అంతా చదవలేదా..?:(
ఇంకో పార్ట్ కావాలా..? నేను అనుకున్నది ఈ మూడు పాత్రల ఆలోచనలు రాద్దామనే. వీళ్లని కలిపే ఉద్ధేశ్యం అయితే ఇప్పటికి లేదు మరి;)

అఙ్ఞాత గారు,
చాలా చాలా థ్యాంక్స్:)

మనసు పలికే said...

హరే,
>>శృతి వెళ్ళి యశోద ని తిడితే ఆది వచ్చి అల్లకల్లోలం చేసాడంట
హహ్హహ్హా ఏమిటిది..? ధన్యవాదాలు కథ నచ్చినందుకు:)

అరుణ్ కుమార్ గారు, ధన్యవాదాలు:)

David said...

వసంతం కన్నా హేమంతాన్ని ఎక్కువగా ఇష్టపడే ఒక మామూలు తెలుగమ్మాయిని. దేవుడి కన్నా ఎక్కువగా మనుషుల్ని, మానవత్వాన్ని నమ్మే ఆడపిల్లని. సముద్ర గర్జనలన్నా, సెలయేటి గలగలలన్నా, అరవిరిసిన విరజాజులన్నా, చలి తెరల్లో మంచు పువ్వులన్నా,..............exellent...superb..totally చాలా బాగుంది.

గిరీష్ said...

meeru naaku telisi inkoka mettu paikekki kavitalu kooda raseyaccu..

మనసు పలికే said...

డేవిడ్ గారు, బోలెడు ధన్యవాదాలు :)

గిరీష్ గారూ.. అంటే మీరింకా నా తవికల్ని చూడలేదా.??:( వా :( వా:(

గిరీష్ said...

thavikalaa..yedunnai..link idduru.. :)

మనసు పలికే said...

ఇహహ్హహ్హా.. ఇహహ్హహ్హా.. (వికటాట్టహాసం..)
గిరీష్ గారూ పండగ చేసుకోండి..;)

http://manasupalikey.blogspot.com/2010/07/blog-post.html

http://manasupalikey.blogspot.com/2010/07/blog-post_13.html

http://manasupalikey.blogspot.com/2010/09/blog-post.html

http://manasupalikey.blogspot.com/2010/11/blog-post_08.html

http://manasupalikey.blogspot.com/2010/11/blog-post_22.html

http://manasupalikey.blogspot.com/2010/12/%E0%B0%A8-%E0%B0%A8%E0%B0%B8%E0%B0%A4%E0%B0%A8%E0%B0%95-%E0%B0%85%E0%B0%95%E0%B0%A4.html