Thursday, June 23, 2011

బల్లి దోశ కావాలా..??

బల్లి అంటే ఎంతమందికి ఇష్టం..???

తమరి ముఖారవిందాల్ని ఎందుకలా మా(డ్చే)ర్చేసారు? బొత్తిగా తోటిజీవుల మీద ప్రేమ లేకుండా పోతుంది మీ అందరికీ;)

సరే సరే మీరు నన్ను కర్ర పుచ్చుకుని తరిమి తరిమి కొట్టక ముందే అసలు విషయానికొస్తాను. పోయిన వారాంతం మా ఇంటికి మా ఆయన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. అందులో ఒక పెళ్లైన జంట మాధవి, రాజేష్... వాళ్ల ఏకైక సంతానం రెండేళ్ల అభి:) ఈ జనరేషన్ పిల్లల గురించి నేను కొత్తగా చెప్పడానికి ఏముంది.? మీలో చాలా మందికి ఏదో ఒక విధంగా పరిచయమే అని అనుకుంటున్నాను:) పేరుకి రెండేళ్లు.. మాటల పుట్ట అల్లరి బుట్ట (ప్రాస కోసం వాడా అంతే;))

అసలు విషయం ఏంటంటే, వాడు వచ్చీ రాగానే ఇల్లంతా తిరుగుతూ అరుస్తూ గంతులేసాడు. దాంతో ఆకలేసింది.ఇక కేకలు మొదలెట్టాడు. నాకు బల్లి దోశ కావాలి అని... అవును మీరు విన్నది నిజమే, వాడు అడిగింది బల్లి దోశే.. చిన్న పిల్లోడు కదా, ఉల్లిని బల్లి అంటున్నాడని "మాధవి ఇప్పుడు ఉల్లి దోశ ఎక్కడి నుండి తేను..? కావాలంటే మామిడి పళ్లు, పపయా ఉన్నాయి, ముక్కలు కోసిస్తా.." అన్నాను. "అయ్యో వాడు అడిగేది ఉల్లి దోశ కాదప్పూ... అది బల్లి దోశే.. వాడికి బల్లి అంటే చాలా ఇష్టం ఎందుకో మరి" అన్నది. కళ్ళు తిరిగి ఢాం అని పడబోయి తమాయించుకున్నాను;) అంతలో మళ్లీ తనే "మా ఇంట్లో కొద్ది రోజులు ఒక బల్లి ఉంది, షూ స్టాండ్ దగ్గర. వాడికి అది బాగా నచ్చి దాని తోక పట్టుకోడానికి వెంటపడుతూ ఉంటే వాడిని ఆపడానికి మా తాతలు దిగొచ్చేవారు:(. ఎలాగో ఆ బల్లిని తరిమేసి, మొన్న 5 రకాల బల్లి బొమ్మల్ని తెచ్చాం వాడికోసం. ఇంక వాటికి ఒకటే ముద్దులు. వాడు పెద్దయ్యాక నేషనల్ జాగ్రఫీ లో బల్లుల బొమ్మల్ని తీసి పెడతాడేమొ అని భయమేస్తుంది అప్పూ " అంది నేను ఆ సీన్ ఉహించుకుంటూ ఉండగా;) . "అది సరే మరి ఈ బల్లి దోశ కథేంటి..?" అని అడిగాను ఆశ్చర్యంగా, అయోమయంగా..."హ్మ్.. ఏమో మరి వాడికే తెలియాలి. వాడికిష్టమైన అన్ని వంటలకీ బల్లి ని యాడ్ చేస్తాడు. బల్లి దోశ, బల్లి కితెన్ (చికెన్) ఇలా అనమాట." పడీ పడీ నవ్వాను వాడి తెలివితేటలకి.:))))

ఫుడ్ తీసుకురాడానికి రాజేష్, రవి అన్నయ్య కలిసి బయటికెళ్లారు, మా ఆయనేమో ఇంకా ఆఫీసు నుండి రాలేదు. మాధవి, వాడికి మా అందరి గ్రూప్ ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉంది, ఇదెవరు అదెవరు అని. వాడు చెబుతూ ఉన్నాడు "రవి మామ, నాగ్ మామ, అప్పు.." ఇలా.. మా ఆయన ఫోటో చూసి "పెంకట్ మామ" అన్నాడు. వాడికి వ పలకదట. భలే పేరు పెట్టాడులే అని నవ్వుకున్నాం. అంతలో మాధవి అడిగింది "వెంకట్ మామ కావాలా" అని. చాలా స్ట్రాంగ్‌గా వెంటనే "వద్దు" అన్నాడు. "మరి అప్పు?" అంటే "అప్పు కావాలి" అన్నాడు :)) మా ఆయన్ని వద్దు అనడానికి వాడికి స్ట్రాంగ్ రీజనే ఉంది;) వాడు పుట్టిన 5 నెలల నుండే మా ఆయన వాడిని ఏడిపిస్తూ ఉన్నాడు;) అది కూడా మామూలుగా ఏడిపించడం కాదు, ఇంతసేపు నవ్వుతున్నాడుగా కాసేపు ఏడిపిద్దాం అని గిల్లి మరీ ఏడిపించేవాడు;) అందుకే ఆయనంటే వాడికి భయం చాలా..అస్సలు దగ్గరికి వెళ్లడు.ఒకవేళ బలవంతంగా ఎత్తుకున్నా ఏడ్చేస్తాడు;)
"వెంకట్ మామ ఎందుకొద్దు..? నీకు కితెన్ వెంకట్ మామే తెస్తాడు. మనం ఇప్పుడుంది వెంకట్ మామ ఇంట్లోనే.." అని మాధవి అనగానే కాస్త అయోమయంలో పడి.. ఇంకాసేపు ఆలోచించుకుని... "అయితే పెంకట్ మామ కావాలి" అన్నాడు. ఒకటే నవ్వులు మాకు..

కాసేపు ఆకలిని మర్చిపోయి ఆటల్లో పడ్డాడు. ఫర్నిచర్ ఎక్కువ లేకపోవడంతో ఇల్లు చాలా స్పేషియస్ గా కనిపించింది వాడికి. ఇక ఒకటే గెంతులు:) గట్టి గట్టిగా అరుస్తూ ఎగురుతున్నాడు. "ఇల్లు నచ్చిందా అభీ" అని మాధవి అడిగితే "ఇల్లు చచ్చింది" అన్నాడు. నేను షాక్. వాడు పుట్టినప్పటి నుండి తెలుసు గానీ, మాటలు బాగా(??) వచ్చాక ఇదే ఫస్ట్ టైం కలవడం. వాడు "న" సరిగ్గా పలకలేడట:)) "చచ్చింది కాదు అభీ.. న..చ్చిన్..దీ, ఇలా అను" అని వాళ్లమ్మ పాపం తెగ నేర్పించేస్తుంది. వాడేమో ఇంకా సీరియస్‌గా ముద్దు ముద్దుగా "న.. చచ్చింది" అన్నాడు. నవ్వు ఆపుకోడం నా వల్ల కాలేదు. మళ్లీ "అప్పు నచ్చిందా" అని అడిగింది..."అప్పు చచ్చింది" అని ఆన్సర్.. కడుపు నొప్పొచ్చేలా నవ్వాను:))))


అంతలో మళ్లీ వాడికి ఆకలి గుర్తొచ్చి బల్లి దోశ గుర్తొచ్చింది;) పాపం ఇంట్లో పాలు కూడా ఉంచలేదు (వీళ్లందరూ వస్తున్నారు కదా అని పెరుగు తోడేసేసా పాలన్నీ). ఫుడ్ తీసుకురాడానికి బయటికెళ్లిన వాళ్లు ఇంకా రాలేదు. ఇంక వాడే ఫ్రిజ్ అంతా వెతికేసుకుని స్వీట్స్ కనిపిస్తే తినేసాడు పాపం.. అవి తింటే అన్నం తినడని వాళ్లమ్మ భయం..:( మొత్తానికి పాలతో వాడి పెంకట్ మామ, ఫుడ్ తో వాడి నాన్న, మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఒకేసారి వచ్చేసారు:) ఇక వాడైతే కితెన్.. బల్లి కితెన్.. అంటూ ఒకటే హడావుడి. నేను డిన్నర్ కి కావాల్సిన డిషెస్, ప్లేట్స్ అన్నీ తెస్తూ ఉంటే మాధవి ఫుడ్‌ని ప్లేట్స్ లో పెడుతూ ఉంది. నేనొచ్చి కూర్చునే సరికి "తీస్కో అప్పు, తిను" అని నా చేతిలో ప్లేట్ పెడుతూ అభి:) "వాడికి నువ్వు వాడి ఏజ్ అమ్మాయిలా కనిపిస్తున్నట్టున్నావు అప్పూ" అని కౌంటర్‌తో మాధవి .. గుర్ర్ర్ర్‌ర్ర్‌ర్ర్...

ఫస్ట్ వాడికి తినిపించేసి తను భోజనం చేస్తూ, మాధవి అందరి పేర్లూ వరసగా అడుగుతూ ఉంది వాడిని. "అది రవి మామ, ఇది నాగ్ మామ, అది రాం మామ, ఇది డాడీష్ (దాడీ+రాజేష్), (వాడిని వాడు చూపించుకుంటూ) ఇది అభి, నువ్వు మామిడి (మాధవి), ఇది అప్పు" ఇలా చెబుతూ (ఇది చదివి పాపం వాడిని "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" సినిమాలో సునీల్‌తో పోలిస్తే మీ అందరికీ బల్లి దోశ తినిపించేస్తాడు జాగ్రత్త..) మా ఆయన దగ్గరికొచ్చేసరికి "అది పెంకట్, నాకొద్దూ" అన్నాడు మా అందరికీ నవ్వుల విందునందిస్తూ :))) పాపం మా ఆయన;)

అందరం రాత్రంతా అలా మెళకువగానే ఉన్నా కూడా అస్సలు అలసట అనిపించలేదు..అంతగా ఎంజాయ్ చేసాం వాడి అల్లరితో:) పిల్లలంటే దేవుళ్లు అని ఎవరు చెప్పారో కానీ అదెంత గొప్ప సత్యమో కదా.. కాసేపు వాళ్లతో ఉంటే చాలు, మన కష్టాలు, సమస్యలు, చిరాకులు అన్నీ దూరమవుతాయి:) దేవుడు ప్రతి మనిషినీ ఎల్లప్పుడు అంటిపెట్టుకుని ఉండే వీలు లేక అమ్మ రూపంలో ప్రతి ఇంట్లో ఉంటాడట.. అదే దేవుడు, అమ్మ గొప్పది అన్న విషయాన్ని లోకం నలుమూలలా చాటి చెప్పడానికి,జీవితం విలువ అందరికీ తెలియజెప్పడానికి పిల్లల రూపంలో వచ్చాడేమో అనిపిస్తుంటుంది నాకు:) కానీ ప్రతి మనిషికీ తోటి ప్రాణి విలువ చెప్పేది, మనిషి ని మనిషిగా చూడడం నేర్పించేది మాత్రం దేవుళ్ల లాంటి పిల్లలే.. కల్మషపు గాలి కాస్త కూడా సోకని స్వఛ్చమైన ముత్యాలు:)

23 comments:

ఆ.సౌమ్య said...

బావుంది మీ అభి అల్లరి....ముద్దు ముద్దు మాటలు. చివరి వాక్యాలు...అదరగొట్టేసావు. నువ్వు ఏ పోస్టుకైనా బలమైన ముగింపు ఇస్తావు అప్పూ...వి.వి వినాయక్ నీ దగ్గర క్లైమాక్స్ ఎలా తియ్యాలో నేర్చుకోవాలి. :)))

గిరీష్ said...

Really ముగింపు చాలా బాగుంది. ఇంక అభి విషయానికొస్తే.. ఇప్పుడే బల్లులతో ఆడుకుంటున్నాడంటే ఇంక పెద్దయ్యాక రాక్షస బల్లులతో ఆడుతాడు.. :). kids are the purest form of Humans. Nice..

శిశిర said...

కల్మషపు గాలి కాస్త కూడా సోకని స్వఛ్చమైన ముత్యాలు.. నిజం. పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. చాలా బాగా రాసారు.

హరే కృష్ణ said...

కితెన్.. బల్లి కితెన్
డాడీష్ మామిడి ఇవి కేక :)))
అభి the menace
సూపర్ గా ఉంది అల్లరి :)
ఆ చివర్లో ఏంటి అప్పు ఉల్లి దోస పిండిని పిండేసినట్టు మా గుండెల్ని పిండేసావ్ :(

Anonymous said...

సీరియస్ విషయాలను అంతకన్నా సీరియస్గా అలోచించి బుర్ర బద్దలుకొట్టుకునే నాకు కాసేపు నవ్వుల విందులు ఇచ్చారు....థ్యాంక్స్ అభి! అదేంటి థ్యాంక్సులు వాడికా అనుకుంటున్నారా..అయినా అదంతే!

నా చిన్నప్పుడు చిదంబరంగారని మా నాన్నగారితో బాటు పనిచేసేవారు. మా నాన్న బడికి వాళ్ళ ఇల్లు దగ్గర. అందుకని బడయ్యాక పిచ్చాపాటికి వెళుతూ నన్నూ తీసుకెళ్ళేవాడు. మీవారిలాగే నన్ను బాగా ఏడిపించేవారు. చిదంబరంగారు వచ్చారు అని ఏదో ఏమరపాటుగా విన్నాసరే పారిపోవమో తప్పనిసరి పరిస్థితిలో కయ్యానికి కాలుదువ్వటమో!

geetika said...

పోస్ట్ చాలా చాలా బావుంది. పిల్లల మాటలే కాదు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా ముద్దుగా ఉంటాయి.

అలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ని కొన్ని కలెక్ట్ చేశాను. నేను పోస్ట్ వేద్దామనుకునేంతలో ఈ బల్లి దోశ పోస్ట్..! నిజంగా చాలా బాగుంది అపర్ణా.

ఫీలింగ్స్‌ని క్యాచీగా వ్రాయగలుగుతావు. కథలేమైనా వ్రాయడానికి ట్రై చెయ్యి. ఆల్ ది బెస్ట్.

Tollywood 24 said...

Awesome..

రాజ్ కుమార్ said...

హహ..నాకు బల్లిపూరీ కావాలీఈఈఈఈ.. హహహ్హ
బావున్నాయండీ మీ అభి సంగతులూ.. నిజమే చిన్నపిల్లలతో ఉంటే అస్సలు టైం తెలీదు..
అభి కి నా తరుపున హాయ్ చెప్పండేం..

ఇకపోతే మీ పోస్ట్ మొత్తం ఒకఎత్తయితే చివరి పేరా ఒక ఎత్తు. చాలా బాగా రాశారు. ఇలాంటివి ఇంత టచింగ్ గా రాయగలిగే అతికొద్దిమంది లో మీరూ ఒకరు.
వెరీ నైస్ పోస్ట్.. ;) ;)

వేణూ శ్రీకాంత్ said...

ఆ.సౌమ్య కామెంట్ మళ్ళీ ఓ సారి చదువుకో అప్పూ.. ముగింపు చాలా బాగుంది.. కల్మషపు గాలి కాస్త కూడా సోకని స్వఛ్చమైన ముత్యాలు అంటూ పసిపిల్లల గురించి చాలా కరెక్ట్ గా చెప్పావు.. అభి అల్లరి నన్ను కూడా మనసారా నవ్వించింది.. మరి ఇంతకీ బల్లిదోశ రిసీపీ ఎప్పుడు పెడుతున్నారు బ్లాగ్ లో :-)

kiran said...

"వాడికి నువ్వు వాడి ఏజ్ అమ్మాయిలా కనిపిస్తున్నట్టున్నావు అప్పూ" అని కౌంటర్‌తో మాధవి . - కికికికికికికీకికికికికికికీకికికికిక్ :D

బల్లి అప్పు - మరి నాకు అప్పు అంటే ఇష్టం కదా..:) - నైస్ పోస్ట్

M said...

:-))

అభిలానే నాకు చిన్నప్పటి నుండి (అంటే ఇప్పటికీ) బల్లులేంటే విపరీతమయిన ఇస్టం అభిమానం. చిన్నప్పుడు మా ఇంట్లొ ఒక బల్లి ఫ్యామిలీ ఉండేది. ట్యూబ్ లైట్ చుట్టూ తిరుగుతూ... అప్పుడే బద్దకం గా పడుకున్నట్టు ఉండి అంతలొనే చురుగ్గా కదిలి చిన్న చిన్న పురుగులని పట్టుకుని తింటూ, అటు కదులుతుంది అనుకుంటే ఇటు, ఇటు వస్తుంది అనుకుంటే అటు , మనకి ఊహకి అందని విధంగా అటూ ఇటూ కదిలే బల్లుల్ల్ని చూస్తూ తన్మయత్వం చెందిన సంధర్భాలు ఎన్నో ...

ఒకసారి పందెం వేసి బల్లి తోక కొరికాను కానీ... పెద్ద టేస్ట్ తెలీలేదు...

- M

వేణూ శ్రీకాంత్ said...

అబ్బా మీరు అభి కాన్సెప్ట్ సరిగ్గా క్యాచ్ చెయలేదు కిరణ్. మీకు అప్పు బాగా ఇష్టమైతే అన్నిటికి ముందు అప్పు అని చేర్చాలి. అంటే అప్పూ దోశ, అప్పూ కితెన్(చికెన్), అప్పూ బల్లి, అప్పూనల్లి ఇలా :-P (Just kidding అప్పు కోపమొస్తే కామెంట్ పబ్లిష్ చేయకండి)

బులుసు సుబ్రహ్మణ్యం said...

కధ అంతా బ్రహ్మానందం లాగా చెప్పి చివరి పేరా గుమ్మడి తోటి చెప్పించారు. సరదాగా సాగిన కధ గంభీరం గా ముగించారు. నేనూ సౌమ్య గారితో ఏకీభవిస్తున్నాను.

చిన్న పిల్లల అల్లరి, మాటలు ఎప్పుడైనా ముద్దుగాను, ఆహ్లాదం గాను ఉంటాయి. బాగా రాశారు.

pallavi said...

hello andi, mee balli dosa post simply super andi.. heading choodagane okkasari na kallu bairlu kammayi... antha asahyam balli ante... kaani mee post chaduvutunte navvu aapukolekapoyanu... aa pillavadi pada prayogala gurinchi aite.. okate navvuluu... i enjoyed a lot.. pillala gurunchi meeru cheppina chivari vaakyalu maatram nijjamgaa nijamandi...it's really true!!!

మాలా కుమార్ said...

బల్లి అభి అల్లరి ముద్దుగా రాసారు :)

మధురవాణి said...

How Sweet! :)))
Last para lo cheppindi chaalaa true! Agree with you! :)

మనసు పలికే said...

సౌమ్య గారూఊఊ......".వి.వి వినాయక్ నీ దగ్గర క్లైమాక్స్ ఎలా తియ్యాలో నేర్చుకోవాలి" నిజమే నంటారా.!! మీ శిష్యురాలు మీ మెప్పును పొందగలిగే స్థాయికి ఎదిగేసిందంటారా!!:) ఇది కల కాదు కదా..
చాలా చాలా థ్యాంక్స్ మీ వ్యాఖ్యకి:)

గిరీష్ :)
"ఇప్పుడే బల్లులతో ఆడుకుంటున్నాడంటే ఇంక పెద్దయ్యాక రాక్షస బల్లులతో ఆడుతాడు" నిజమే కదా అసలు ఈ అనుమానమే నాకు కానీ మా మాధవికి కానీ రాలేదు. ఇదేదో సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే..ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:)

శిశిర,
బోలెడు ధన్యవాదాలు:)

మనసు పలికే said...

హరే,
హహ్హహ్హ ఉల్లిదోశ పిండినట్లు పిండానా? ఏం పోలిక బాబూ;) చాలా చాలా థ్యాంక్స్ అభి అల్లరి నచ్చినందుకు:))

అచంగ గారు,
మీ థ్యాంకుల్ని చాలా భద్రంగా పువ్వుల్లో పెట్టి మరీ మా అభికి అందజేయడమైనది:) బల్లి థ్యాంకులు అని సంబరపడుతూ ఉన్నాడు మా అభి;)
హహ్హహ్హా చిదంబరం గారు అంతలా ఏడిపించేవారా మిమ్మల్ని! ఇప్పటికీ కలుస్తూ ఉంటారా? ఇలాంటి చిన్నతనం ఙ్ఞాపకాలు భలే ఉంటాయి కదా..

గీతిక,
ముందు నీ కలెక్షన్ తో టపా పెట్టెయ్యి:) చూడాలని ఉంది:)
చాలా థ్యాంక్స్ గీతిక టపా నచ్చినందుకు:) కథలా.., రాసెయొచ్చంటావా? ;)

Anonymous said...

నాకు ఐదారేళ్ళ వయసప్పటికే ఆయన రిటైర్మెంటుకు దగ్గర వయసు. వ్యార్థక్యము వల్ల వచ్చిన అనారోగ్యముతో ఉన్నారని వినికిడి. చూసి 2 ఏళ్ళవుతోంది. ప్రస్తుత నివాసం ప్రవాసంలో కనుక మళ్ళీ చూసేది దైవాధీనం.

మనసు పలికే said...

Tollywood 24 గారు, ధన్యవాదాలు:)

రాజ్,
బోలెడు ధన్యవాదాలు మీకు:) మీ హాయ్ ని అభికి చేరవేసాను:) మీ "ఇలాంటివి ఇంత టచింగ్ గా రాయగలిగే అతికొద్దిమంది లో మీరూ ఒకరు" వ్యాఖ్య చూసి చాలా సంతోషం అనిపించింది:) చాలా చాలా థ్యాంక్స్:))


వేణు గారు,
సౌమ్య గారికి ఇచ్చిన రిప్లై ఓసారి చూసెయ్యండి;)
ఏంటీ బల్లి దోశ రెసిపీ కావాలా??? అలాంటి ప్రోగ్రాము పెడితే నన్ను బ్లాగ్మహాజనులు తన్ని తరిమేస్తారేమో బ్లాగుల్లోంచి;)
చాలా చాలా థాంక్స్ అండీ మీ వ్యాఖ్యకి:)

మనసు పలికే said...

కిరణ్,
నవ్వకు అలా.. నిన్ను చూసినా అంతే అనుకుంటాడు.. నువ్వు నా కాటగిరీయే అని చెప్పావు మర్చిపోయావా?
నువ్వు రా ఎంచక్కా ఇద్దరం కలిసి బల్లి దోశ చేసి వేణు గారికి తినిపిద్దాం.;) ధన్యవాదాలు నీ కామెంటుకి :)


M గారు,
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు:)
అమ్మో బల్లి తోక కొరికారా??????? బాబోయ్, మళ్లి టేస్ట్ తెలియలేదా:(((((..


వేణు గారు,
"అప్పూ దోశ, అప్పూ కితెన్(చికెన్), అప్పూ బల్లి, అప్పూనల్లి ఇలా" గుర్ర్‌ర్ర్‌ర్ర్.... (ఇది ముమ్మాటికీ నిద్ర కాదు కాదు కానేరదు..)

మనసు పలికే said...

గురూ గారూ,
"కధ అంతా బ్రహ్మానందం లాగా చెప్పి చివరి పేరా గుమ్మడి తోటి చెప్పించారు" హహ్హహ్హా.. చాలా చాలా ధన్యవాదాలండీ నా టపా నచ్చి మీరు వ్యాఖ్య పెట్టినందుకు:)


పల్లవి గారు,
ఇంకా నయం హెడింగ్ మాత్రమే చూసి పారిపోలేదు బల్లిని నా టపాలో పెట్టానేమో అని;)..చాలా చాలా థాంక్స్ అండీ మీ వ్యాఖ్యకి:) చాలా సంతోషంగా అనిపించింది:)


మాలా కుమార్ గారు,
బోలెడన్ని ధన్యవాదాలు:)


మధుర,
చాలా చాలా థ్యాంక్స్ నీ వ్యాఖ్యకి:)

నేస్తం said...

చాలా బాగారాసావ్ బల్లి అప్పు