Saturday, August 6, 2011

నా కాళ్లకి చక్రాలొచ్చాయోచ్..ఓచ్..

కాళ్లకి చక్రాలంటే స్కేటింగ్ అనుకుని చక్రాల చెప్పుల్లో కాళ్లెయ్యొద్దు. మరేమో.. మరేమో.. మరేమో.. 6 సంవత్సరాల నా కల ఒక రెండు రోజుల క్రితం తీరింది. పట్టలేని సంతోషంతో కాళ్లకి చక్రాలతో రెక్కల చేతులతో అలా గాల్లో తేలియాడుతూ ఉన్నాను:) ఇంతకీ విషయమేంటంటే, నాకు వాహన యోగం పట్టేసింది, ద్విచక్ర వాహన యోగం. ఎన్నాళ్లుగా.. సారీ ఎన్నేళ్లుగానో ఎదురు చూసిన యోగం ఈరోజు నన్ను వరించింది.

7 సంవత్సరాల క్రితం నా డిగ్రీ చదువు కోసం హైదరాబాదు వచ్చి, కాలేజీలో తోటి విద్యార్థులు చాలా మంది బండి మీద కాలేజీకి వస్తూ ఉంటే చూసినప్పుడు కలిగిన ఇష్టం అది. ఎంతగా అంటే, బస్‌స్టాప్‌లో స్నేహితురాళ్లతో నుంచున్నప్పుడు అటుగా బండి మీద వెళ్లే అమ్మాయిలని అలా నోరు తెరుచుకుని చూసేంతగా. ఎప్పటికైనా మనం కూడా కొనుక్కోవాలే అని గట్టిగా తీర్మానించేసుకున్నాం అప్పుడే. నా ఇష్టాన్ని గమనించిన మా నాన్న, ఇంటికెళ్లినప్పుడు ఓసారి అడిగారు కూడా.."ఏమ్మా, స్కూటీ కొనివ్వనా??"అని. "లేదు నాన్నా.. నేను సంపాదిస్తాను కదా, అప్పుడు కొనుక్కుంటా" అని గర్వంగా చెప్పాను. అలా అలా డిగ్రీ అయిపోయింది. జాబ్ కూడా వచ్చేసింది, హమ్మయ్య ఇక బండి కొనుక్కునే సమయం ఆసన్నమైంది అని మనసు ఫీల్ అయ్యే లోగా, బండి ఉన్న అబ్బాయితో పెళ్లయిపోయింది...;)

భర్త అనగా భరించువాడు అని ఎప్పుడో సంస్కృతంలో చెప్పగా విని, నిజమనుకుని, నా బండి భారాన్ని భరించగలరా అని అడిగాను. అంతే.."బండినా? ఏం బండి ? ఎందుకు బండి? అసలేం భరించాలి? బండంటే తెలుసా నీకు??" అని క్లాసు పీకాడు:( . నేను బండి కావాలి అని అడగడం, ఆయన వద్దు అనడం. ఇలా కొన్నాళ్లు గడిచాక, "నువ్వు ముందు ఫిఫ్టీ కేజిలు అవ్వు అప్పుడు చూద్దాం" అన్నారు. ఆహా, కనీసం ఒక్క అవకాశం ఇస్తున్నారు అని సంబరపడిపోయి, తినీ తినీ తినీ.. ఎంత తిన్నా 50 ని తాకలేకపోయా ప్చ్:(

ఇలా అయితే లాభం లేదు, మనం ఇంకాస్త పోరు పెడితే ఇంకేదైనా కన్సెషన్ ఇవ్వచ్చు అని, ఆయన మనస్సుని ప్రసన్నం చేసుకోగల శక్తి ఒక్క టి.వి.యస్. స్కూటీకి మాత్రమే ఉందని తలచి, స్కూటీ మంత్ర జపం చేసి, స్కూటీకోటి రాసాను.. నేను "స్కూటీ" అనడం ఆయన "ఫిఫ్టీ" అ(రవ)నడం. ఇలా ఇంకొన్నాళ్లు సాగాక..
ఛి.. ఈ స్కూటీ మనకి అచ్చిరాలేదు, ఛిఛి.. అని నా భారాన్ని హీరోహోండా ప్లెషర్‌కి తగిలిద్దాం అని ట్రై చేశా..;);) ఇక అప్పుడు మా ఆయన కూడా రూట్ మార్చేసి, "నువ్వు ఏ కలర్ కావాలో ఎంచుకో. వచ్చే నెలలోగా మనింట్లో బండి ఉంటుంది. నువ్వు కలర్ ఎంచుకోడమే ఆలస్యం" అని అంటే మొదట్లో సంతోష పడీ పడీ చివరికి నేనే కింద పడ్డా అని తెలుసుకున్నా :(( ఆ వచ్చే నెల రెండు సంవత్సరాలకి వస్తుంది అప్పుడు తెలుసుకోలేకపోయా...

చిరాకొచ్చిన అప్పు ఏడవలేక నవ్వుతూ నవ్వలేక ఏడుస్తూ ప్లీజ్ కొనివ్వు బండి అని ప్రాధేయ పడగా, ఏమాత్రం కనికరం లేని వెంకట్ "ఫలానా వెంకట్ వైఫ్ బండి నడుపుతుంది అని నలుగురూ అంటే ఎంత అవమానం" అని నన్ను ఇంకాస్త ఏడిపించేవాడు. ఇలా ఒక సాకు కాదు, నాకు బండి కొనివ్వకుండా ఉండడానికి సవాలక్ష సాకులు దొరికాయి ఇన్నేళ్లుగా.

ఇంకొన్ని సార్లైతే, "మనం కార్ కొనేద్దాం అప్పు. నాలు చక్రాలు ఇస్తా అంటే రెండే కావాలంటావేంటి???" అనేవాడు. మరి నాకేమో కార్ కన్నా బండే ఇష్టం:) "కావాలంటే కార్ నువ్వు కొనుక్కో, నాకు మాత్రం బండి కొనివ్వు చాలు" అనేదాన్ని. నా వాహన యోగానికి అడ్డంకి ఒక్క మా ఆయనేనా, ఎంత మంది అన్నలకి తమ్ముళ్లకి రాఖీలు కట్టి నాకు బండి కొనిచ్చే అదృష్టాన్ని ఎవరు సొంతం చేసుకుంటున్నారహో అని చాటింపేస్తే, అందరూ క్యూలో నిలబడి కొనిస్తారు అన్న నా ఆశని అడియాశ చేస్తూ అందరూ క్యూలో పరిగెట్టి పారిపోయారు..ప్చ్.. ఒక తమ్ముడైతే "అక్కా నువ్వు పెద్ద దానివి కదా, నీకు రోడ్డు రోలర్ కొనిస్తా అక్కా" అని నా రాఖీ దొబ్బేసాడు దొంగమొహం.

అలా ఎన్నో కష్టాలకోర్చిన అప్పు, నిన్ననే.. సరిగ్గా నిన్ననే మహింద్రా వాడిని కనికరిస్తూ రోడియో కొనుక్కుంది:))))  ఫోటో చూసి ఎలా ఉందో చెప్పండేం :)))










దీన్ని చూసాక మీకేం అర్థమయింది..? ఉదయం నుండి నేను అస్సలు దీని మీద ఎక్కి నడపలేదు అని మీరు అనుకున్నారు అంటే మీరు చాలా తెలివైన వాళ్లన్నమాట:)))) ఈ రంగు చూసి నలుపు అనుకుంటున్నారేమో.. కాదు కాదు.. అదేదో పలకడానికి రాని బ్రౌన్.. షో రూం వాడిని ఒక పావుగంట విసిగించి నేర్చుకున్నాలే, కాప్యుచ్చినో బ్రౌన్ అని:)))

నాకు తెలుసు మీ అందరూ ఏం ఆలోచిస్తున్నారో... పార్టీ అనే కదా..
ఇదిగో ఈ స్వీట్స్ చాకోలెట్స్ మీకోసం:))


36 comments:

ఇందు said...

అప్పూఊఊఊఊఊఊఊ! అసలెంత బాగుందో! కలర్ కేక! నాకెప్పుడిస్తావ్వూఊ!!!! నీ కల నెరవేరినందుకు చాల సంతోషంగా ఉంది అప్పుడియర్ :) కంగ్రాట్స్ :)

చాణక్య said...

కంగ్రాట్స్ మేడం. మీరిలా ఫోటోలో చాక్లెట్లిచ్చేసి పార్టీ అంటారనే మీ శ్రీవారు కొననన్నారు మొదట. ఇలా అయితే ఒప్పుకునే సమస్యే లేదు. మాకు నిజమైన ట్రీట్ కావాల్సిందే.

అన్నట్టు బండి మీద ఎంత అభిమానం ఉంటే మాత్రం అన్ని యాంగిల్స్‌లో ఫోటోలు తియ్యాలా? ; )))

Sravya V said...

Superb !Congrats !

Indian Minerva said...

నాకు మీ బండి కన్నా sweets నచ్చాయ్. ముఖ్యంగా క్రిందనుండీ రెండోవి. వీలైతే attach చేసి నాకు పంపించండి.

రాజ్ కుమార్ said...

మనసుపలికే గారూ.. అందుకోండీ అభినందనలూ...
మీ కల నెరవేరినందుకూ ఆనందగా ఉందీ. అయితే రోడియో తో రోడ్ మీద యో..యో..యో అన్నమాట. హెల్మెట్ గట్రా వాడుతూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండీ. పండగ చేయండీ.. నాకు ఈ చాకొలేట్లూ,స్వీట్లూ కాదూ పేద్ద పార్టీకావాలీ..;)

voleti said...

పెళ్ళయిన కొత్తలో బండి నేర్పమని, కొనివ్వమని అడిగిన నా భార్యామణి కోరిక నేను కూడా తీర్చలేదు..(భయమో, ఇగో ప్రాబ్లమో తెలీదు..) ముందు రోడ్డు మీద సరిగ్గా నడవడం నేర్చుకో అని కామెంట్ చేసే వాణ్ణి.. కాలచక్రం తిరిగింది.. పాతికేళ్ళయింది పెళ్ళై.. ఇప్పుడు ఆవిడకి ఓపికా లేదు..మా వైజాగ్ రోడ్లు అనుకూలంగా లేవు.. నాకు మాత్రం రోజూ.. ఈ విషయంలో డెప్పుల్లే.. (ఎత్తిపొడుపులు)..మీ పోస్ట్ ఆవిడ చూసిందా నా పని గోవిందా.. మీ బండి మాత్రం సూపర్..కలర్ చాలా బావుంది...

బులుసు సుబ్రహ్మణ్యం said...

స్వంత వాహన యోగ శుభాభినందనలు. మీ కల / కోరిక సాధించినందుకు కంగ్రాట్యులేషన్స్. మాకు లిఫ్ట్ ఇస్తారా మరి.... చి.న

హరే కృష్ణ said...

ముందు గా బండి దానివైనదుకు బోలెడు ఆభినందనలు
నువ్వు కచ్చ కర్ణుడి లా స్వీట్లు మాకిచ్చేస్తే నీకేటి మిగిలేది ఖాళీ బొచ్చే..బరువు ఎలా పెరిగేది
ఆ పసుపు రంగు ఏంటి నెంబర్ ప్లేట్ మీద
ప్రైవేట్ టాక్సీ లా ప్రైవేట్ బైక్ షేరింగ్ బైక్ అని అనుకోగలరు కాస్త పసుపు వాడడం తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించ గలరు
బండి రంగు పింక్ అయితే ఇంకా బావుండేది
హైదరాబాద్ కాలుష్యానికి ఇదే కరెక్ట్ సంవత్సరాలు కలాన్ చెయ్యకపోయినా తేడా తెలియదు
మంచి సెలెక్షన్ :)

రవికిరణ్ పంచాగ్నుల said...

మీకు నూతన ద్విచక్రవాహనయోగం సందర్భంగా శుభాకాంక్షలు.

కానీ.. మీ రాఖీనీ కొట్టేసీ, మీకు రోడ్డు రోలరుకూడా ఇవ్వకుండా తప్పించుకున్న ఆ తమ్ముడ్ని ఎలా వదిలేసారండీ? :)

శ్రీధర్. దు said...

బావుందండి మీ ద్విచక్రవాహనం, కంగ్రాట్స్

శిశిర said...

చాలా బాగుంది అపర్ణా. Congrats.

జయ said...

చాలా బాగుంది కొత్త బండి. కంగ్రాట్స్. be careful & Happy Friendship Day.

ఆం ఆద్మీ said...

అరె బెహన్ జి, మైలేజ్ కిత్నే దేరహహై ఆప్కి గాడి?

తార said...

@ఆం ఆద్మీ

Kevvvvvvvvvvv

..nagarjuna.. said...

నీ బండికి నువ్వు చాలా నచ్చేసినట్టున్నావ్ అప్పూ అలా ఆ 1-4 , 6 ఫోటోలు చూడు. ఎంత సిగ్గుపడిపోతుందో !!

ఐనా ఈ రోడియో బదులు రోడ్ రోలరే కొనాల్సింది, వెంకట్ గారు కూడా హ్యాపీగా ఫీలయేవారు.

Congrats :) :)

గిరీష్ said...

congrats.. :), chakralocchay kada ani kaallani marachipokandi.. :). appudappudu vatini kuda vadandi, health ki manchidi.. :).Enjoyy..

శేఖర్ (Sekhar) said...

Bandi chaala bagundhandi appu gaaru....and congrats for your happy rides

Sweets keka

:)

మనసు పలికే said...

ఇందు,
థ్యాంక్ యూ సో మచ్:)) నువ్వు పాపికొండలు వస్తావుగా అప్పుడు నీకే ఇచ్చేస్తా బండి.. ఓ.కే నా:)

చాణక్య గారు, హహ్హహ్హా.. గట్టిగా అనకండి.. ఇప్పుడు నిజమైన పార్టీ అంటే మా ఆయన బండి తిరిగి అమ్మేస్తారేమో;);) మరి అభిమానమానాన్ని ఎలా చూపించాలండీ.. అందుకే అన్ని యాంగిల్స్‌లో ఫోటోలు తీసేశా;)

శ్రావ్య గారు, ధన్యవాదాలండీ:))

మనసు పలికే said...

ఇండియన్ మినర్వా గారూ.. ఇది అన్యాయం.. నా బండి కన్నా ఆ స్వీట్లు నచ్చాయా?? అలా అంటే మీకు ఎలా కొరియర్ చేస్తా అనుకున్నారు స్వీట్లు;) నే చెయ్యను గాక చెయ్యను:))

వేణూరాం, ధన్యవాదాలు మీ కన్సర్న్ కి:)) తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తా..

వోలేటి గారూ.. హహ్హహ్హా.. అయితే తప్పకుండా మీ ఆవిడగారికి చూపించాలి ఈ టపా. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:))

మనసు పలికే said...

గురూ గారూ, ధన్యవాదాలు:)) ఏలూరు వస్తా కదా బండి మీద, అప్పుడు లిఫ్ట్ ఇస్తా;);)


హరే, అది టాక్సి కలర్ కాదు. ఇంకా రెజిస్త్రేషన్ అవ్వలేదు కదా, అప్పటి వరకూ ఆ యెల్లో బోర్డే ఉంటుంది. పింక్ అంటే పాపం మా ఆయనకి బాగోదు కదా ఎప్పుడైనా డ్రైవ్ చెయ్యాల్సొస్తే..అందుకే ఈ కలర్ అనమాట:) ధన్యవాదాలు వ్యాఖ్యకి..

రవికిరణ్ గారూ, ధన్యవాదాలండీ మీ శుభాకాంక్షలకి:) ఆ తమ్ముడిని నేను వదలడమా?? ఇహహ్హ ఇహహ్హా(వికటాట్టహాసం అనమాట) వాడి పెళ్లి చేసేశా;);)

మధురవాణి said...

ఆహా.. ఇన్నేళ్ళ నీ కల నేరవేరిందన్నమాట.. నీతో పాటు చాలా హ్యాపీగా ఉంది మాక్కూడా.. ఇంకేం మరి.. ఎంచక్కా నీ బండి మీద జాం జామ్మని తిరిగేసేయ్.. బావుంది నీ బండి కలర్ కూడా.. కంగ్రాట్స్ అప్పూ... :))

మనసు పలికే said...

శ్రీ గారు, భాను గారు, శిశిర గారు, జయ గారు బోలెడు ధన్యవాదాలు:)))


ఆం ఆద్మీ గారు, మైలేజా? అంతా మిథ్య అండీ మిథ్య;)


తార గారు:)


నాగార్జునాఆ...... (అరిచాను అన్న సంగతి మీరు గమనించాలి;)) నా బండి బాగుందన్నావు కదా సో బ్రతికిపోయావు;) ధన్యవాదాలు:))

మనసు పలికే said...

గిరీష్ గారు, హహ్హహ్హ చక్రాలొచ్చాయని కాళ్లని మర్చిపోను లెండి:) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:))


శేఖర్ గారు, నా బండి స్వీట్లు నచ్చినందుకు బోలెడు ధన్యవాదాలు:))

Unknown said...

కలర్ కేక
చూసారా నేను బ్లాగ్ వ్రతం మొదలుపెట్టాను మీకు బండి వచ్చేసింది. కాబట్టి నా పేరు చెప్పుకుని బండి నడుపుతూ ఉండండి.

ఆ.సౌమ్య said...

ఆహా,ఒహో మొత్తానికి నీ అడ్డంకులన్నీ తొలిగి వాహనయోగం ప్రాప్తించిందన్నమాట! సెబాసు...జాగ్రత్త గా నడుపు. అసలే ఈ మధ్య హైదరాబాదులో ట్రాఫిక్ దరిద్రంగా ఉంటున్నాదని విన్నాను.

నాకు మాత్రం ఆ స్వీట్లు బలే నచ్చయి...ఓ కేజీ పార్సిల్ కొట్టు నాకు :D

బండి సూపర్...congrats once again!

వేణూశ్రీకాంత్ said...

మీ సంతోషమంతా టపాలో స్పష్టంగా కనపడుతుంది అప్పు :-) ఇన్నాళ్ళ మీ కల నెరవేరినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది.. అభినందనలు.. స్వీట్స్, చాక్లెట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు :-)

మురళి said...

పూజలు బ్రహ్మాండంగా జరిగినట్టున్నాయ్ బండికి.. ఇంతకీ లైసెన్సూ అవీ తీసుకున్నారా లేదా?

kiran said...

అప్పూఊఊఉ......కంగ్రాట్స్ :D
స్కూటీ కోటి...కేక..:)
పలకడానికి రాని బ్రౌను..నీకు నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినా మనం మారం..:p
స్వీట్ నీ చేత్తో చేసి పెట్టమ్మ :)

చాణక్య said...

మీ ఆయన దాకా ఎందుకు? మీరు పార్టీ ఇవ్వనంటే నేనే దొంగతనంగా బండి ఎత్తుకుపోయి అమ్మేస్తాను. ఆ గొడవంతా మనకి అవసరమా చెప్పండి. మీ ప్రియాతిప్రియమైన బండి మీరుంచుకుని, మాకు పార్టీ ఇచ్చెయ్యండి. ఏ రెస్టారెంట్‌కి రమ్మంటారు..?

Jagannadharaju said...

congratulations., vijayawada traffic loki inko bandi cherindannamaata - good luck

మనసు పలికే said...

మధుర, బోలెడు ధన్యవాదాలు నీ కంగ్రాట్స్‌కి కామెంటుకి:)) అవును మరి, ఇన్నేళ్ల కల నెరవేరినందుకు ఎంత సంతోషంగా ఉందో. ఓ రేంజ్‌లో తిరిగేస్తున్నా బండి మీద:))

శైలు గారు,
హహ్హహ్హా.. ఇది బ్లాగ్ వ్రతం మహిమా? అయితే ఈ వ్రతాన్ని అన్ని వ్రతాల్లా సంవత్సరానికోసారి కాకుండా నెలకి రెండు సార్లైనా చెయ్యాలి :)) బోలెడన్ని కోరికలు ఫలిస్తాయి:) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి వ్రత మహిమకి:))

సౌమ్య గారు, నిజమేనండీ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఈ మధ్య:( జాగ్రత్తగా నడుపుతాలే. ధన్యవాదాలు మీ కన్సర్న్‌కి. పార్సిల్ చేసేశా స్వీట్లు:))

మనసు పలికే said...

వేణు గారు:) నిజమండీ చాలా చాలా హ్యాపీ మరి నేను:) బోలెడు ధన్య ధన్యవాదాలు మీ అభినందనలకి వ్యాఖ్యకి :))

మురళి గారు, అవునండీ ఆంజనేయ స్వామి గుడికి తీస్కెళ్లి పూజ చేయించాం:) లైసెన్స్ ఉందండీ. హెల్మెట్ కొనాలి:))

కిరణ్,
"నీకు నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినా మనం మారం" కిక్కిక్కి..;) ఇలాంటి నిజాలు బయటికి చెప్పొద్దు డియర్;);) నా చేతి స్వీటు కావాలా? వచ్చెయ్ ఇంటికి, పంచ భక్ష్య పరవాన్నాలు పెడతాను సంతోషంగా:)

మనసు పలికే said...

చాణక్య గారూ.. ఇది అన్యాయం అక్రమ..:( మీరు నా బండిని దొంగతనంగా అమ్మేస్తారా?????? ఇదేనా ఒక బ్లాగర్‌గా తోటి బ్లాగర్ బండికి మీరిచ్చే గౌరవం అని ప్రశ్నిస్తున్నా అధ్యక్షా;)
సరే, పార్టీ ఎక్కడ కావాలో మీరే చెప్పండి..:))

నాని గారు, అవును ట్రాఫిక్‌లోకి ఒక కొత్త బండి వచ్చి చేరింది.:) కానీ విజయవాడ కాదుగా..:)) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి..

చాణక్య said...

అదీ.. చూశారా ఇలా బెదిరిస్తే గానీ దారిలోకి రాలేదు. అయినా అమ్మాయిల బండి నేనేం చేసుకుంటానండి? సరే.. ఛాయిస్ మీదే. ఎక్కడైనా నేను రెడీ. అలాగని కాకా హోటల్స్‌లోనూ, ఇరానీ కేఫ్‌లోనూ ఇచ్చేస్తానంటే ఒప్పుకోను సుమండీ. తక్కువలో తక్కువ ఏ తాజ్‌కృష్ణావో అయితే అడ్జస్ట్ అయిపోతాను : )))

ramu said...

ammababoi,, bandi venuka intha katha vunda,, pattu vadalani vikramarka... jayaho.........

చాణక్య said...

రామూజీ.. పట్టు వదలని 'విక్రమార్కీ' అనాలేమో..! :p