Monday, January 30, 2012

మరీచిక

గుండె.. యుగాలపాటుగా శ్వాసిస్తూనే ఉంది..
మనసు.. నిశీధి లోకంలో నిను వెదుకుతూ ఉంది..
పయనం.. ప్రతి మలుపంచున నీ ఉనికిని ఊహిస్తూ,
తరగని దూరాన్ని తనలో కలుపుకుంటుంది.

పాదం వదిలిన ప్రతి గురుతులో
రెప్పలు ఓడిన ఆనవాలు..

తీరాలను కలపలేని ప్రతి జామూ
వారధిగా వదిలే జవాబుల్లేని ప్రశ్నలు..

ఇన్నేళ్ల ఊపిరికి దొరకని నువ్వు
వాస్తవపు తొడుగులో..చేదుగా..

మిత్రమా..!!
చావుపుట్టుకల చక్రం నిజమేనంటావా..??
నీ నమ్మకం.. నాగమ్యం..
అందుకే, మరుజన్మ విల్లు నీ పేరున రాసి
మరుక్షణమే మృత్యువుని ముద్దాడుతా..

ఎందుకంటే, నాకు తెలుసు...
నా ఈ ఒంటరి ఎడారి జీవితానికి నువ్వొక మరీచికవని.

20 comments:

Manasa Chamarthi said...

Nice one, Aparna! :)

SHANKAR.S said...

"పాదం వదిలిన ప్రతి గురుతులో
రెప్పలు ఓడిన ఆనవాలు.."

చాలా బావుంది. మాటల్లేవంతే.అక్షరాలతో ఆడేసుకున్నావ్ అప్పూ.

Padmarpita said...

చాలా బాగారాసారు.

రసజ్ఞ said...

చాలా బాగుందండీ! చిన్న సందేహం గుండె శ్వాసించటం అన్న వాడుక వెనుక ఉన్న అంతరార్థం చెప్పరూ!

చాణక్య said...

అసలు మీకు ఆ కొత్తబండి కొన్న దగ్గర్నుంచి భావుకత పెరిపోయిందండి. మరీ ఇంత బాగా రాసేస్తే ఎలా?

ఇంక లాభం లేదమ్మా.. నేను మీలా రాయలేనుగానీ నా నోటికొచ్చిన తవికలు రాసిపడెయ్యాలి. లేకపోతే నా బ్లాగ్ ఎవడూ చదవట్లేదు. కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నాం.

..nagarjuna.. said...

మొత్తం కవితను quote చేస్తూ, శంకర్ గారి వ్యాఖ్య యథాతథంగా. Magnificent.

But i strongly object you labeling this one under నా *తవికలు*. ఇంత అద్భుతంగా రాసి కూడా నిన్నూ, కవితనూ కించపరిచేలా ఉంది.

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఈ బ్లాగెడారిలో లో మీ కవిత ఒక మరుమధ్యశాద్వలము.

ప్రవీణ said...

ఆర్ద్రతతో నిండిన పదాలు, బావంలో తడిసిన వాక్యాలు అద్బుతంగా వున్నాయి

మధురవాణి said...

బాగుంది.. నీ పదాల అల్లిక, నువ్వు ఎంచుకునే పదబంధాలు చాలా ప్రత్యేకంగా, విలక్షణంగా అనిపిస్తాయి అమ్మాయీ.... :)

రాజ్ కుమార్ said...

"పాదం వదిలిన ప్రతి గురుతులో
రెప్పలు ఓడిన ఆనవాలు.."

వహ్.. వా... సూపరు..

బులుసుగారండీ...మరుమధ్యశాద్వలము అంటే ఏమిటో వివరింపుడీ.. ;)

శేఖర్ (Sekhar) said...

ఏదో రాయాలని రాయటం కాదు కాని.... ప్రతి లైన్ లో చాల ఫీల్ ఉంది ... Excellent

వరుసగా నాలుగు సార్లు చదివితే అద్బుతం అనిపించింది మీ పదాల వెనుక ఉన్న సత్యం తెలుసుకుంటే..

అంతా చదివి అద్బుతం అనిపించి చివర్లో మరీచిక అంటే అర్ధం కాకా ఆముదం తాగినట్లు పేస్ పెట్టాను :-))

కొంచెం అర్ధం చెప్పి అత్యద్బుతం అనిపించరు !! :)

మనసు పలికే said...

మానసా...:) నీ వ్యాఖ్య చాలు నాకు మనసు నిండా సంతోషం నింపుకోడానికి:) ధన్యవాదాలు..

శంకర్ గారూ..ధన్యోస్మి ధన్యోస్మి:) ఎంత ఆడుకుందామన్నా అక్షరాలు దొరకడం లేదని బాధ పడుతున్న నాకు, మీ వ్యాఖ్య ఊరటనిచ్చింది:)

పద్మార్పిత గారు, ధన్యవాదాలు టపా నచ్చినందుకు:)

మనసు పలికే said...

రసఙ్ఞ గారూ.. ధన్యవాదాలు కవిత నచ్చినందుకు:) "గుండె శ్వాసించడం" వెనుక ఉన్న అంతరార్థం :
నేను బ్రతికి ఉన్న (నువ్వు దొరకని కారణంగా యుగాల పాటునా అనిపించిన) కొన్ని సంవత్సరాలు నువ్వు ఎదురవలేదు.. కనీసం మరణిస్తే మరుజన్మలోనైనా దొరుకుతావేమో అని (మరుజన్మ విల్లు నీ పేరున రాసి....)

చాణక్య గారు, అయితే ఈ భావుకత్వపు గాలి నా బండి కారణంగా వీస్తుందా? అసలు మీ అనాలసిస్ ఉంది చూశారూ..;) న భూతో న భవిష్యత్.. మీ ఆత్మకథతో నవ్వుల్ని పంచుతున్నారు కదా, తవికలు కూడా మొదలెట్టండి మరి:)

నాగార్జున:) చాలా చాలా థ్యాంక్స్ నీ వ్యాఖ్యకి.. నిజంగా ఇది కవితే అంటావా??:)

మనసు పలికే said...

గురూ గారూ, ముందుగా మీ వ్యాఖ్యకి బోలెడన్ని ధన్యవాదాలు:) "మరుమధ్యశాద్వలము" అనగానేమి వివరించగలరు:))

ప్రవీణ గారు, మంచి భావుకత్వంతో నిండిన మీ వ్యాఖ్య కి బోలెడన్ని ధన్యవాదాలు:)

మధుర, చాలా చాలా థ్యాంక్స్:) నీ వ్యాఖ్య చాలా సంతోషాన్నిచ్చింది..

మనసు పలికే said...

రాజ్, ధన్యోస్మి.. ధన్యోస్మి:))

శేఖర్ గారు, "ఏదో రాయాలని రాయటం కాదు కాని.... ప్రతి లైన్ లో చాల ఫీల్ ఉంది" చూసి ఎంత సంబరపడ్డానో..:) ధన్యవాదాలు..
మరీచిక అనగా, ఎండమావి (మైరేజ్)

జ్యోతిర్మయి said...

మంచి కవితలు చదివాలనిపించినప్పుడు మీ బ్లాగుకు వస్తుంటాను. నన్నెప్పుడూ నిరాశ పరచేలేదు మీరు. ధన్యవాదాలు.

అజ్ఞాని said...

మరీచిక అంటే అర్ధం ఏటండి!?

ఎటకారాల రామలింగడు said...

"తడిఆరిన గుండె ఎడారిలో..నువ్వు మెరిసావో ఎండమావిలా"
-ఎటకారాల రామలింగడు

pradeep said...

"మరీచిక" అంటే ఏంటో తెలియక గూగుల్ ని అడిగితే మీ బ్లాగ్ చుపించిందండి. మొత్తానికి మరీచిక అంటే అర్థం తెలియడం తో పాటు మంచి కవిత చదివాను.
అసలు కన్నా కొసరు బాగుంటుందని ఎందుకు అంటారో ఇపుడు అర్థం అయింది. :D
ఇంకొక విషయం , మీ బ్లాగ్ లో top లో పెట్టిన ఫోటో కూడా కేకో కేక. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది.

nmrao bandi said...

మళ్ళీ...

ఆసాంతం చాలా బాగుంది...
అభినందనలు...