Tuesday, July 13, 2010

నా ప్రియ నేస్తం..

నా మనసు మీ అందరితో నేను రాసిన ఒక చిన్ని కవితని పంచుకుంటానని ఉవ్విళ్లూరుతూ ఉంది.. అయ్యయ్యో అలా పరిగెడుతున్నారేంటి..? భయపడకండి,నేను చెప్పేది "నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తా.. నేను రచయిత్రిని కానన్న వాడిని రాయెత్తి కొడతా" కవిత కాదులెండి. ఏదో.. నేను చదువుకునే రోజుల్లో నా ఒకానొక ప్రాణ స్నేహితురాలికి అంకితమిచ్చిన కవిత. ఇలా ఈ రోజు మీ ముందుంచుదామని అనిపించింది. ఇక కాచుకోండి మరి.. :)

చిరునవ్వుల సంద్రం లో ఎగిసే అల నీవైతే..
నీ స్నేహం పొందేందుకు పరిగెత్తే నది నేను.
నా కోసం నువ్వు కరిగి మేఘం లా మారావు.
నింగంతా తిరిగి తిరిగి నాకోసం వెతికావు.
మన్ను పై నన్ను చూసి సంకేతంగా గర్జించావు.
నీ చినుకుల స్పర్శతో మధురానుభూతినిచ్చావు.
నీ రాకతో ఆనందం నిండిన ఈ హృదయం తో,
వేదం లా.. నాదం లా.. రాళ్లల్లో నడిచాను.
నిను చేరే కాంక్ష లో అది కూడా మధురమే.
దారిలో మనసులకు నీ ఊసులు తెలిపాను.
విని తరించారని సంతసించి, నీ కోసం వచ్చాను.
నా స్నేహం అందించి.. పాత కథలు విన్నవించి..
బాధలనే మరచిపోయి..అలసటనే అధిగమించి..
నీతోపాటెగిరాను.. ఆ నింగిని తాకాను..
అపుడే మరి తెలిసింది, ఆ విశ్వమే స్నేహమని..
స్నేహం అనంతమని..
మన బంధం అదేనని..

ఎలా ఉంది నా చిన్ని కవిత.. :) చాలా కష్టపడి చదివి నాకు మీ సలహాలను ఇవ్వబోతున్నందుకు ధన్యవాదాలు.. :)

8 comments:

అశోక్ పాపాయి said...

chaala bagudandi

సిరివెన్నెల said...

@అశోక్ : మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

మధురవాణి said...

మీ స్నేహితురాలి కోసం ఎంతందంగా చెప్పారు! బాగుంది అప్పూ! :)

మనసు పలికే said...

ధన్యవాదాలు మధురవాణి గారూ..

Sai Praveen said...

చాలా బాగుంది.

మనసు పలికే said...

@సాయి ప్రవీణ్.. ధన్యవాదాలు. :)

Arun Kumar said...

చాలా బాగుంది.

మనసు పలికే said...

Thank you Arun garuu:)