Monday, July 18, 2011

అనగనగా ఒక ప్రయాణం

జీవితమంటే ఒక ప్రయాణమట. మజిలీ మజిలీ కి కలిసేవారెందరో, విడిపోయే వారెందరో.. తియ్యని అనుభవాల్ని పంచే ప్రయాణం ఒకటైతే, చేదు ఙ్ఞాపకాల్ని మిగిల్చే ప్రయాణం మరొకటి. అసలే భావాన్నీ నిద్ర లేపకుండా తాను నిద్రపోయే ప్రయాణం ఒకటైతే, ఆలోచనల్ని రేకెత్తించే ప్రయాణం మరొకటి. కానీ, మొన్న వారాంతం నేను చేసిన ప్రయాణం మాత్రం నాకు నాలుగు ప్రశ్నల్ని మిగిల్చి వెళ్లిపోయింది.

ఆ ప్రయాణం కథా కమామీషు ఏంటంటే, నేను మావారు హైదరాబాదుకు 100 కిలోమీటర్లలో ఉన్న ఒక ఊరికి వెళ్లాల్సొచ్చింది. అబ్బా, దొరక్క దొరక అయిదు రోజులకోసారి వచ్చే శెలవల్ని ఇలా వృధా చెయ్యాలా అని ఓ ఇరవై ఐదు సార్లు అనుకుంటూ......... వెళ్లడం అయింది. తిరిగి ప్రయాణమవడం కూడా అయింది. ఆదివారం సాయంత్రం కారణంగా అసలు బస్సుల్లో సీట్లు దొరకట్లేదు. అలా బస్ స్టాండ్ లో నిలబడి.. నిలబడి.. ఓ నాలుగైదు బసుల్ని వదిలేసి, ఇక తప్పదని ఒక బస్సు ఎక్కేసాం. అదృష్టం ఈ బస్సు అంత రద్దీగా లేదు.. నిజ్జంగా, నించోడానికి స్థలం ఉంది :).

ఇక చేసేది లేక, మధ్యలో ఎవరైనా దిగాపోతారా, సీట్ దొరక్క పోతుందా అన్న దూ..రాశతో అలాగే బస్సులో ఉండిపోయాం. డ్రైవర్ వెనగ్గా మా ఆయన, ఆయనకి వెనగ్గా మరియు బస్సులో మిగిలి పెజానీకానికంతటికీ ముందుగా నేను నుంచున్నాం. ఎవరి హడావిడిలో వాళ్లు. ఒక పెద్దాయన పుస్తకంలో దించిన తల ఎత్తడం లేదు. ఒక కొత్తగా పెళ్లైన జంట వేరే ప్రపంచాన్ని పట్టించుకోడం లేదు. ఒక ఫోను ప్రియుడు ప్రపంచానికంతటికీ వినిపించేలా, ఫోను అవసరం లేదు అనిపించేలా అవతల వ్యక్తికి విషయాన్ని అందిస్తున్నాడు. కండక్టరు టికెట్లు కొట్టడం మొదలెట్టాడు. బస్సు ఇలా స్టార్ట్ అయిందో లేదో అలా ఎవరో ఇద్దరు ఆపించి ఎక్కి, సీట్లు ఉన్నాయా అని కండక్టర్ ని అడిగారు. కండక్టరు సమాధానం చెప్పకముందే నిలబడి ఉన్న మా పరిస్థితిని చూసి అర్థం చేసుకుని, మేము బ్యానట్(గేర్ ఉంటుంది కదా.. అక్కడ) మీద కుర్చుంటాం అనడంతో కండక్టరు "లేదు లేదు. బ్యానట్ మీద కూర్చోవద్దు అని అక్కడ రాసుంది కదా, అయినా ఎలా అడుగుతున్నారు?" అన్నాడు.

"అలా ఎలా కుదురుతుంది? నేనిప్పుడు అర్జెంట్ గా హైదరాబాదు వెళ్లాలి. నాకు సీట్లు లేవు,అందుకే నేను అక్కడే కుర్చుంటా" అన్నాడు ఆ ఇద్దర్లో ఒకడు కాస్త గొడవ ధోరణిలో.
"ఇది లగ్షరీ బస్సు బాబూ. అక్కడ కుర్చోనివ్వరు" అని కండక్టరు తన సమాధానం పూర్తి చెయ్యకముందే, "నాకు తెలుసు ఇది లగ్షరీ బస్సే అని. నీ పేరు ఏంటి చెప్పు. నీ వివరాలు ఏంటి? ఇది ఏ డిపో బస్సు?" అంటూ గట్టి గట్టిగా అరుస్తుంటే అర్థం అయింది, ఆ హేరోలు ఇద్దరూ పీపాలకి పీపాలు కడుపులో పోసి వచ్చారని. ఇక ఓపికలేక కండక్టర్ "బ్యానట్ కీ నాకూ సంబంధం లేదు. అది డ్రైవర్ సొత్తు, ఆయన్నే అడుగు అని వదిలించుకున్నాడు" "ఆపు, బస్సు ఆపు ఇక్కడే" అని డ్రైవర్‌ని బెదిరించి ఆయన వివరాలు కూడా అడుగుతున్నాడు. డ్రైవర్ కి విసుగొచ్చి "అసలొస్తావా రావా నువ్వు? ఏంటి ఈ గోల" అంటూ మళ్లీ స్టార్ట్ చేసాడు బండిని. వాడు మళ్లీ ఆపించడం.. ఇలా ఓ మూడు నాలుగు సార్లు జరిగాక ఇక డ్రైవర్ తన మాట వినకపోవడంతో కండక్టర్ వైపు తిరిగి "నన్ను ఎక్కడి వరకూ తీసుకెళ్తారో తీసుకెళ్లండి, నేను టికెట్ తీసుకోను" అనేసరికి, ఎక్కడో మేరుపర్వతం కండక్టర్ గారి గుండెల్లో బద్దలయ్యింది. ఓ ఆంధ్రప్రదేష్ రాష్ట్ర రవాణా సంస్థ షట్‌చక్ర వాహన చోదకుడా, చైతన్య రథ సారధీ కాస్త ఆపవయ్యా అన్నట్లు హావభావాలు పెట్టి, "ఆపవయ్యా పక్కకి" అన్నాడు.

ఇక సినిమా మొదలు.

"మీ ఇద్దరి వివరాలు చెప్పండి. మీరు రెగ్యులరా? ముందు మీకు కొన్ని పుస్తకాలు ఇస్తారు, వాటిని చదువుకుని డ్యూటీకి రండి" ఇలా ఏదేదో అరుస్తున్నాడు. కాసిన్ని అచ్చ తెలుగు పచ్చి బూతులు కూడా విసిరాడు (నేను వినకూడనివి వాడకూడనివి :(). ఎవరి గోలలో వాళ్లున్న ప్రయాణీకులు మధ్యమధ్యలో అరుస్తున్నారు , ఏంటి గోల వాళ్లని బయటికి తోసేసి బండి స్టార్ట్ చెయ్యండి అని. అయినా ఇలాంటి చిన్న చిన్న గొడవలు బస్సుల్లో మామూలే అని నా పాటికి నేను మాంచిగా ముదిరాక, చక్కగా మాడగొట్టిన మొక్కజొన్న కంకిని తింటూ నుంచున్నా..

"సరే బ్యానట్ మీద కూర్చోవద్దు, అది రూల్. మరి సీట్లు అయిపోయాక కూడా నువ్వు టికెట్లు ఎందుకిస్తున్నావు?" అని తాగుబోతు లాజిక్ ఒకటి తీశాడు కండక్టర్‌ని ఉద్ధేశిస్తూ. "నిజమే కదా" అని కాసేపు అనిపించినా మళ్లీ బస్సు ఫుల్లుగా ఉన్నా కూడా ఎక్కడం మనకి అవసరం, కాబట్టి ఎక్కాం. అంటే అందులో ప్రయాణీకుల అవసరం కూడా ఉంది, కండక్టర్ తప్పెందుకవుతుంది..

ఉన్నట్టుండి ఆ తాగుబోతు లెజెండ్‌కి మా ఆయన దొరికాడు. "మీరే చెప్పండి. మీరు డబ్బులు కట్టారు కానీ నుంచుని ఉన్నారు. ఈ లెక్క పైకి వెళ్లదు, ఇదంతా కండక్టరు దొబ్బేస్తాడు. నష్టపోయేది మీరే" అని ఏదో క్లాస్ పీకుతున్నాడు. మా ఆయనకి చిరాకొచ్చి "ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు బస్సులో వస్తే స్టార్ట్ చేయిద్దాం. లేకపోతే దిగిపోండి, మా టైం వేస్ట్ చెయ్యొద్దు" అని కాస్త గట్టిగానే అరిచాడు. ఇంకా ఏదేదో వాగుతూ పెద్దగొడవే చేశాడు డ్రైవర్‌తో కండక్టర్‌తో ఆ తాగుబోతు మహానుభావుడు. ఉన్నట్టుండి బ్యానట్ మీద కూర్చుని షూ లేస్ విప్పుతూ "నాకు తెలుసు మీరు నా మాట వినరు. మీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు" అంటూ షూ తీసి ఒక్క ఉదుటున డ్రైవర్ చెంప మీద కొట్టాడు వాడి షూతో.. అప్పుడు అర్థం అయింది వీడు మామూలుగా గొడవ పెట్టే రకం కాదు పెద్ద వెధవలా ఉన్నాడు అని. కోపమొచ్చి డ్రైవర్ సీట్లోంచి లేచి గొడవకొచ్చాడు. మా ఆయన ఇంకా ఓ నలుగురు వాడితో గొడవ పడుతూ ఉన్నారు. వాడేమో "మీకు దండం పెడతాను. మీరంతా దేవుళ్లు. నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు, ఈ డ్రైవరు కండక్టరే @$^%$^%**$%$%$" అంటూ ఏదేదో వాగుతూ ఉన్నాడు. నాకేమో పిచ్చి కోపం వచ్చేస్తుంది. బస్సులో ఉన్న నలుగురైదుగురు ఆడాళ్లలో, యంగ్ యూత్ డైనమిక్ నేనే..;) ఎంతకోపమొచ్చిందంటే వాడిని అలా బయటికి నెట్టేయ్యాలన్నంత. కానీ మన పర్సనాలిటీ చూసి వాడు "చిన్న పిల్లలు కూడా చెబుతారా" అని ఒక్క మాటన్నా చాలు, మా ఆయన నన్ను అక్కడికక్కడే చితక్కొట్టేసి డైరెక్ట్‌గా ఆంబులెన్స్‌లో ఇంటికి తీస్కెళ్లిపోగలడు అని నోరు మూసుకుని నుంచున్నా.. మిగిలిన జనాలేమో ఏదో సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉన్నారు, వాడికి నాలుగు తగిలించకుండా. అందుకే, మన APSRTC వాడి ఋణం కాస్తైనా తీర్చుకోవాలని నా వెనకాల ఓ నలుగుర్ని "ఏంటలా చూస్తారు? వెళ్లి నాలుగు పీకి కిందకి నెట్టెయ్యండి వాడిని " అని అరుంధతిలో జేజెమ్మ స్టైలో అందామనుకుని మామూలుగా చెప్పి ఎంకరేజ్ చేశాను. అంతే.. ఓ పది మంది ముందుకెళ్లి కొట్టారు వాడిని. ఏంటో.. అసలు జనాలు ఇలా ఎందుకు తప్ప తాగుతారో.. తాగినా నోర్మూసుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా.. ఇలా రోడ్లమీద పడి జనాల్ని ఎందుకు హింసించడం..???

అక్కడే ఇంకో సన్నివేశం కూడా.. అలా గొడవ జరుగుతూ ఉంటే ఒకతను తొంగి తొంగి చూస్తూ ఉన్నడు, నా ముందు నుంచుని. ఆ పక్క సీట్లోనే అతని అమ్మ ఉంది. ఒక 60 సంవత్సరాలు ఉంటాయేమో, ఊరికే నిలబడడం కొడుకుని తట్టి పిలవడం "కొడకా నువ్వు అటు పోకు" అని చెప్పడం. ఇలా ఓ పది సార్లు చేసుంటుంది. నిజానికి అతను కనీసం ఒక్క మాట కూడ మాట్లాడలేదు. అతనేమన్నా నూనూగు మీసాల నూత్న ప్రాయమా అంటే ఒక 35 సంవత్సరాలుంటాయి. పోనీ నిజం సినిమా మొదటి సగం మహేష్ బాబులాగా మిల్కీ బోయ్ యా అంటే అలాకూడా కాదు, చూడ్డానికి రఫ్‌గానే కనిపించాడు. ఎంతైనా తల్లి హృదయం అంటారా????

నిజమే, కన్నతల్లి హృదయం అంతే.. కొడుక్కి ఏం జరిగినా తల్లడిల్లిపోతుంది.. ఆవిడ అతడికి మాత్రమే కన్నతల్లి; ఒప్పుకుంటాను.. కానీ, కనీసం ఆ డ్రైవర్‌ని కొడుకులా కాకపోయినా ఒక మనిషిగా కూడా చూడలేకపోయిందా? డ్రైవర్ షూతో దెబ్బలు తిన్నది ఒక్కసారి కాదు, చాలా సార్లే, గట్టిగానే... తలుచుకుంటే డిపోలో అప్పజెప్పడమో, స్టేషన్‌లో అప్పజెప్పడమో చెయ్యొచ్చు. ఇద్దరు కలిసి తిరిగి తన్నొచ్చు కూడా..మరి తాగుబోతు వెధవతో గొడవెందుకు అనుకున్నారో, అనవసరంగా టైం వేస్ట్ అనుకున్నారో తెలీదు కానీ, డ్రైవర్, కండక్టర్ చాలా సహనంతో ఉన్నారు...తప్పు తమవైపు ఉన్నా ఒప్పుకోకుండా చుట్టూ మనుషుల్ని హింసించే వాళ్లు కోకొల్లలు. అలాంటి వారికి సహాయం సంగతి పక్కన పెడితే, తిరిగి నాలుగు తన్నాలనిపిస్తుంది. కానీ, కనీసం ఇలాంటి తోటి మనిషికి అవసరం అయినప్పుడు కూడా సహాయం చెయ్యకపోతే ఇంక మనం మనుషులుగా పుట్టి అర్థం ఏముంది? అసలిదంతా కాదు. ఆ డ్రైవర్ స్థానంలో తన కొడుకే ఉండి, వేరే ఎవరూ అతనికి సహాయం చెయ్యడానికి రాకపోతే..??????

కొసమెరుపు:
ఆ విధంగా అందరూ కలిసి వాడిని కొట్టి బస్సులోంచి తోసేసాక, మన డ్రైవర్ ఎక్కడ ఆ గొడవే మనసులో పెట్టుకుని ఏం చేస్తాడో పాపం అని తెగ టెన్షన్ పడిపోయాం నేను మా ఆయన. కానీ చాలా నెమ్మదిగా(ఆర్.టి.సి. స్పీడ్ గురించి ఎవరో మాట్లాడుతున్నారక్కడ) మంచిగా డ్రైవ్ చేస్తూ గమ్యం చేర్చాడు. కానీ పాపం చాలా బాధగా అనిపించింది ఆ డ్రైవర్‌ని చూస్తే.. అసలెటువంటి సంబంధం లేని ఎవడో వ్యక్తి చేత అలా చెప్పు దెబ్బలు తినాల్సి వచ్చింది, అతని తప్పేమీ లేకుండానే. పాపం ఆ ఉద్యోగాలే అంతేమో..

20 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> మొన్న వారాంతం నేను చేసిన ప్రయాణం మాత్రం నాకు నాలుగు ప్రశ్నల్ని మిగిల్చి వెళ్లిపోయింది.

ఆ ప్రశ్నలు ఏమిటి? జవాబులు దొరికాయా ?
(పేరా పేరా కి పెట్టిన ? లు పరిగణలోకి రావు)
నేను నేర్చుకొన్న నీతులు.
1. తాగుబోతులు ఎక్కే అవకాశం ఉన్న బస్ లో ఎక్కరాదు.
2.60 ఏళ్ల అమ్మ 35 ఏళ్ల కొడుకు ఉన్న బస్ లో కూడా ఎక్కరాదు.
ఎందుకంటే మన బుర్ర నిండా ఆలోచనలు నింపేస్తారు వాళ్ళు, మనకి తలనొప్పి తెచ్చిపెడతారు.

>>>కానీ మన పర్సనాలిటీ చూసి వాడు "చిన్న పిల్లలు కూడా చెబుతారా"

ఇది కేక కెవ్వు.

జయ said...

నిజమేనండి. బస్ డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీస్ ని తలచుకుంటే బాధనిపిస్తుంది. కాని ఎంతో రఫ్ గా బిహేవ్ చేసి, ప్రజల్ని నానా తిప్పలు పెట్టే డ్రైవర్లు కూడా ఉన్నారు. ఇలాంటి తాగుబోతుల్ని కలసి తన్నితగలేసే డ్రైవర్లు, కండక్టర్లు కూడాఉన్నారు. కాకపోతే ప్రయాణీకులే అన్నిరకాల ఇబ్బందులూ ఎదుర్కోవాలి:)

చాణక్య said...

అవునండి. వారి ఉద్యోగాలే అంత. ఈ దేశంలో ప్రభుత్యోద్యోగులని కూడా ఒక గోడ కట్టి విడదీసేశారు. పైనున్నవాళ్లకి అవసరానికి మించి మర్యాదలు, అధికారాలు. కిందున్నవాళ్లకి మాత్రం ఇలా ఎవడొచ్చి ఏం చేసినా వారి పక్షాన అడిగే నాథుడే ఉండడు. కానీ జనం మాత్రం ప్రభుత్వోద్యోగులు సరిగ్గా పనిచెయ్యరు, వాళ్లకి పొగరు అంటూ అందర్నీ ఒకే గాటన కట్టేస్తారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు మరీ చిరాకు తెప్పించే ఉద్యోగం. వాళ్లకి వేరే గత్యంతరం లేక ఎలాగో కష్టపడి ఉద్యోగం చేస్తారు. కానీ బస్సు ఎక్కేవాళ్లకి వాళ్ల బాధలు పట్టవు. మీరు తాగుబోతులు గురించి చెప్తున్నారు. నేను హైదరాబాద్‌లో చాలా సార్లు చూశాను. బాగా చదువుకున్నవాళ్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బట్ట నలగకుండా ఆఫీస్‌కి వెళ్ళి వచ్చేవాళ్లు కూడా వాళ్ల పట్ల అంతె నిర్దయగా ప్రవర్తిస్తారు. వాళ్ల మూర్ఖత్వం చూస్తే వీళ్లకి చదువు చెప్పిందెవడో కనుక్కుని మరీ చంపెయ్యాలనిపిస్తుంది. నేనే కొన్ని సార్లు కోపం ఆపుకోలేక కొంతమందిని తిట్టేశాను కూడా. కష్టపడే వాళ్ల మీద గౌరవం లేకపోయినా కనీసం సింపథీ అయినా ఉండాలి.

BTW మీ పోస్ట్ చాలా చాలా బాగుంది. మీరు కూడా నా అంత కాకపోయినా కొంచెం గొప్ప రచయిత్రి అవుతారు. : p

Sravya V said...

As usual nicely written Aparna !
కానీ, కనీసం ఆ డ్రైవర్‌ని కొడుకులా కాకపోయినా ఒక మనిషిగా కూడా చూడలేకపోయిందా?

-------------------

హ్మ్ ! చాల మంది అంతే మనదాకే వస్తే కాని తెలియదు అంటారు ఆ రకం గా సేఫ్ జోనేలోనే ఉంటారు ;(((((

ఆ డ్రైవర్‌ని చూస్తే.. అసలెటువంటి సంబంధం లేని ఎవడో వ్యక్తి చేత అలా చెప్పు దెబ్బలు తినాల్సి వచ్చింది, అతని తప్పేమీ లేకుండానే. పాపం ఆ ఉద్యోగాలే అంతేమో..
------------------------------------------------------

So sad !

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగా రాశారు అపర్ణ :-)
హ్మ్ నిజమే కొంచెం కష్టమైన ఉద్యొగాలే కానీ పైన ఎవరో అన్నట్లు అందరూ మంచి వాళ్ళు ఉంటారని కూడా చెప్పలేం.. మీరు చెప్పిన సంఘటన మాత్రం బాధాకరమైనది.. తాగుబోతులతో డీల్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలండీ విచక్షణ ఏ మాత్రం ఉండదు కనుక మనం తెలుసుకునే లోపే ఏ కత్తో తీసి పొడిచేస్తే ఏం చేయలేం.. కానీ అందరు కలిసి ఉంటే పర్వాలేదనుకొండి. ఈ సంఘటనలో ఆర్టీసీ స్టాఫ్ ఓర్పును అభినందించాల్సిందే..

రాజ్ కుమార్ said...

జయగారూ, చాణక్యగారూ చెప్పినట్టూ వాళ్ల ఉద్యోగాలే అంత. (ప్రయాణీకులని చికాకు పెట్టీ, ర్యాష్ గా మాట్లాడే డ్రయివర్లూ, కండక్ట్రర్లను కూడా చూశాననుకోండీ..)

కాకుంటే మీరు చూసిన వాళ్ళ సహనానికి మెచ్చుకోవాలి.ఆ తాగుబోతు వెధవ తో అంత సంయమనం ఎలా పాటిమ్చారో.. హ్మ్మ్...

ఎప్పటీలాగానే బాగారాశారండీ.. పోస్ట్ ఇంట్రడక్షన్ చాలా నచ్చింది నాకు.. ముఖ్యంగా మూడో పేరా.. (ఎందుకో వంశీ గుర్తొచ్చాడూ.. రైలు ప్రయాణం గురించిన ఒక కధ లో చదివాను)

నైస్ పోస్ట్.

హరే కృష్ణ said...

టచింగ్ పోస్ట్ అప్పూ
వెధవ బతుకింటే కార్ మాట్లాడకుండా గవర్నమెంట్ బస్ లో ప్రయాణించడం అత్య్త్తమం క్షేమం కూడాను అందరికీ అభినందనలు బోల్డు తిట్లు చాక్లెట్ల లా తినేసి,సహనం తో బూతులు మింగేసినందుకు :)
మీరు వీలుచూసుకుని కాస్త తరచుగా రాయాలని డిమాండ్ చేసిన్గ్స్ :)

మనసు పలికే said...

గురూ గారూ,
>>పేరా పేరా కి పెట్టిన ? లు పరిగణలోకి రావు
ఇది అన్యాయం.. నాకు వచ్చిన ప్రశ్నలే అవి మరి:( మీరు నేర్చుకున్న "60 ఏళ్ల అమ్మ 35 ఏళ్ల కొడుకు ఉన్న బస్ లో కూడా ఎక్కరాదు" ఈ నీతి కెవ్వు కేక..:)))
మీరు పెట్టిన కేక నాకు నచ్చలేదంతే.:((

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు గురూ గారూ..:))


జయ గారూ, నిజమే.. అని రంగాల్లోనూ ఉంటారు కదా అలా. ఒక వృత్తిని తీసుకుని ఇది బాగుంటుంది ఇది బాగోదు.. ఇందులో ఉద్యోగస్తులు రఫ్ గా ఉంటారు, ఇందులో సాఫ్ట్‌గా ఉంటారు అని చెప్పలేమేమో.. అదంతా ఆయా వ్యక్తుల మనస్తత్వాల మీదే ఆధారపడి ఉంటుంది. వృత్తికి సంబంధించిన ప్రభావం కాస్త ఉండొచ్చేమో. మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు జయ గారు:)

మనసు పలికే said...

చాణక్య గారు, చాలా బాగా చెప్పారు.నిజమే, ఎవరో ఒకరి ప్రవర్తనని చూసి, మొత్తం ఆ ఉద్యోగస్తుల్ని ఒకే గాటిన కట్టేస్తాం. ప్రతి రంగం లోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది. చెడుని ఖండిస్తూ మంచిని ప్రోత్సహించడం మన ధర్మం. కానీ, ఇలా మంచికి కనీసం సపోర్ట్ చెయ్యకుండా ఉంటే ఎవర్ని ఏమనాలో కూడా అర్థం కాదు.
"వాళ్ల మూర్ఖత్వం చూస్తే వీళ్లకి చదువు చెప్పిందెవడో కనుక్కుని మరీ చంపెయ్యాలనిపిస్తుంది" సంస్కారం పూర్తిగా చదువు వల్ల కూడా రాదు కదా..
అయితే మీరు కూడా "నే చెప్పినట్లుగా" కాస్త మంచిలో పాల్గొన్నారనమాట ;)) ధన్యవాదాలు మీ కాంప్లిమెంట్ కి:))


శ్రావ్య గారు,
నిజమే, ఏదైనా మన దాకా వస్తేనే గానీ తెలీదు:(
ధన్యవాదాలు శ్రావ్య గారు మీ వ్యాఖ్య కి, ఇంకా టపా నచ్చినందుకు :)

చాణక్య said...

అవునండి. 'మీరు చెప్పినట్లే' బోల్డు మంచిలో పాల్గొంటున్నాను. మీరు చెప్పినదగ్గర్నుంచి రోడ్డు మీదకి వెళ్ళి అందర్నీ కొట్టడం మొదలెట్టాను. ఎందుకంటే మీ పేరు చెప్తున్నాను. రేపో, ఎల్లుండో వాళ్ళందరూ మీ ఇంటికి వస్తారులెండి. ; ))

శోభ said...

Nice post Aparna....

మనసు పలికే said...

వేణు శ్రీకాంత్ గారు, హ్మ్మ్ అవునండీ.. తాగిన మత్తులో ఏమైనా చెయ్యగలరు. అందరం ఉన్నామన్న ధైర్యమే కానీ, లేకపోతే వాళ్ల జోలికి వెళ్లడమంటే కొరివితో తల గోక్కున్నట్లు లెక్క.
ఆ సంఘటనలో మాత్రం నిజంగా డ్రైవర్‌ని కండక్టర్‌ని అభినందించాల్సిందే. అంత ఓర్పుగా వ్యవహరించారు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలండీ:))


వేణూరాం,
వంశితో పోల్చారా??? అమ్మో నేను ఎక్కడో ఎక్కి కుర్చున్నా..:) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.


హరే,
హ్మ్... తిట్లు చాకొలెట్లా??? హహ్హహ్హా..బాగుంది నీ వ్యాఖ్య:) ధన్యవాదాలు నీకు టపా నచ్చినందుకు:))
తరచుగా రాయాలి అంటే మా డామేజరు పర్మిషన్ తీసుకోవాలి;)

మనసు పలికే said...

చాణక్య గారు,
వా వా:'(:'( మంచంటే రోడ్డు మీదకెళ్లి కొట్టడమా? ఇది అన్యాయం అక్రమం..అదా నేను మీకు చెప్పింది? అదా మీరు నా దగ్గర నేర్చుకుంది;);)
ఏ అన్న దానమో, రక్త దానమో, నేత్ర దానమో చెయ్యాలి గానీ..


శొభా రాజు గారు,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:)

చాణక్య said...

వాటన్నిటికీ ఖర్చవుతుంది కదండి. ఇదైతే ఖర్చు లేని పని. కొంచెం రిస్క్ అయినా మీ పేరు చెప్పి తప్పించుకోవచ్చు. అయినా మీకు ఇది నచ్చకపోతే మీ రక్తం, మీ నేత్రాలు దానం చెయ్యడానికి నాకేం అభ్యంతరం లేదు. ;)
పదండి. ఇద్దరం కలిసి చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కి వెళదాం.(అక్కడైతే డబ్బులు ఇస్తారని జీవితారాజశేఖర్ చెప్పారు.) : p

మనసు పలికే said...

చాణక్య గారూ.. నేను చిరంజీవి బ్లడ్ బ్యాంకు దగ్గర వెయిటింగు..:) మీరెక్కడున్నారూ..????

చాణక్య said...

నేను పంజాగుట్టలో ఉన్నానండి. వచ్చేస్తున్నా.. జస్ట్ మూడు రోజుల్లో అక్కడ ఉంటా. అంటే ట్రాఫిక్, వర్షం, బందులు వగైరా వగైరా. మీరు అప్పటిదాకా అక్కడే వెయిట్ చెయ్యండి. ఎక్కడికీ వెళ్లకండేం.

శేఖర్ (Sekhar) said...

Nicely written

Thought provoking

:)

మనసు పలికే said...

చాణక్య గారూ, నేను ఇంకా చిరంజీవి బ్లడ్ బ్యాంకు దగ్గరే వెయిటింగూ.. మీరెక్కడ??? :(

శేఖర్ గారూ, బోలెడు ధన్యవాదాలు:))

చాణక్య said...

చెప్పాను కదండి. మూడు రోజులు పడుతుందని. వెయిట్ చెయ్యండి. అయినా ఇంత తొందర అయితే ఎట్టా? ఎబ్బే.. ఏందిది?(ధర్మవరపు స్టైల్) ; )))

kiran said...

హ్మ్మ్మం..అప్పు....డ్రైవర్ ల బాధ నాకు బాగా తెల్సు..
మా అంకుల్ డ్రైవర్...ఆయన రోజు వచ్చి ఎన్నెన్ని చెప్పేవారో ..